‘‘అంకమరాజు’’ కోలాటం

అధ్బుత కథాగేయ రచయిత బలిజె వీరన్న రచించిన

ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతాన్ని జనగామగా పిలిచేవారు. గోదావరి చంబల్ లోయ ప్రాంతాన్ని గోండురాజులు పాలించారు. గోండ్యానా ప్రాంతంగా పిలిచే ఈ ప్రాంతం గురించి మేజర్ లూసీస్మిత్ తను రచించిన ‘‘గెజిటీర్ ఆఫ్ ఇండియా’’, ఆంధ్ర ప్రదేశ్ పుస్తకంలో (పే.నెం.23) గోండురాజులు క్రీ.శ. 70 ఉండి క్రీ.శ.1750 వరకు పాలించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గెజిట్ ఆధారంగా క్రీ.శ.1240 నుండి 1751 వరకు ఇరవై మంది రాజులు గోండ్యానా ప్రాంతాన్ని పాలించినట్లు పొందు పర్చినారు.
గోండు జాతి వారి ప్రస్థావన ఐతరేయ బ్రాహ్మణంలో తెలియ వస్తుంది. ఆంధ్రజాతితో పాటు పులిందులు ఉన్నారు. వీరినే గోండు లుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఉండే బస్తర్, మహారాష్ర్టతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూరు, ఆసిఫాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ, చెన్నూర్ తదితరాలు గోండ్యానా రాజ్యంలో అంతర్భాగంగా ఉండేవి.
గోండ్యానా రాజులల్లో ‘అంకమరాజు’ కథ ద్వారా కొన్ని వివ రాలు తెలియవస్తున్నాయి. ‘‘అంకమరాజు’’ పేరిట వేరువేరు ప్రాం తాలలో అక్కడి స్థానిక నాయకులు, వీరులను కూడా ఇదే పేరుతో పిలిచి అల్లిన కథాగేయాలు లేకపోలేదు. స్థానికంగా ప్రజలు అల్లు కున్న పాటలు, మౌఖికంగా ప్రజల్లో నానుతున్న అంశాలు గోండ్యానా ప్రాంత చారిత్రక విశిష్టతను తెలియపరుస్తాయి. భౌగోళికంగా ఈ ప్రాంతంలో విస్తరించిన సాంస్కృతిక మూలాలు గోండ్యానా చరిత్రకు అద్ధం పడుతాయి.
గోండు రాజుల చరిత్రను అనుశీలన చేయడానికి బలిజ వీరన్న కై గట్టిన గేయం అంకమరాజు కథ. ఈ కథ ద్వారా క్రీ.శ.1240 నుండి 1750 వరకు జరిగిన గోండ్యానా పరిపాలన వివరాలను, గోండుల సంస్కృతి, భాషావేశాలు, దేవతలు, వారు ఉపయోగించిన ఆయుధాలు, ఆచారవ్యవహారాలు, గ్రామనామాలు సమన్వయించి వేయి పంక్తులతో, కోలాట బాణీలో రాసిన అద్భుత కథాగేయం అంకమరాజు కథ.
అంకమరాజు అనే యువరాజు బాబాజీ బల్లాల్‌షా చిన్న కొడు కు. జనగామ ప్రాంతాన్ని (ఆసిఫాబాదు) ఏలుతున్న కాలంలో తన మరదలైన గంగుబాయి పట్ల ఆకర్షితుడైతాడు. కామతురుడైన అంకమరాజు గంగుబాయిని లోబర్చుకోవడానికి తన భార్య వీరు బాయిని గంగుబాయితో జోడు చెయ్యమని వేడుకుంటాడు. గంగు బాయిని ప్రలోభపెట్టి భాలేశ్వరుడి గుడికి పంపించమని కోరుతాడు. భాలేశ్వరుడి గుడికి వచ్చిన గంగుబాయి అంకుబావను (అంకమ రాజు) పరిపరి విధాల వేడుకుంటుంది.
‘‘నన్ను విడిచి పెట్టావుర నాగుబావా
నీకు నయము కాదు, జయము గాదు నాగుబావా
బాసలిచ్చి నమ్మించి ప్రాణాలు తింటావా
చిక్కితీర నాగుబావ నీ చేతులా
అవుసూలు వుడిగినావి అన్నములు వాడిచినావి’’ అంటూ గంగుబాయి హృదయవిదారకంగా ప్రాధేయపడుతుంది. తనపట్ల వలపు కల్గి ఉండటం సమ్మతం కాదంటుంది. ‘ముందార వచ్చేది కానలేవు నాగుబావా నేను జచ్చినంకరా నీకు వెతలున్నాయిరా’ అంటూ హెచ్చరిస్తుంది. తన్ను అవమానపర్చి అనుభవించడం వల్ల నీకు వినాశనం తప్పదంటుంది. గంగుబాయి బలాత్కారానికి గురైం దన్న వార్త తెలిసిన మున్నూరు దుర్గాజీ వాంజీడులు కోపోద్రిక్తులై కటికెవాళ్ళను పిలిపించి అంకుమరాజు కళ్ళు పెరికిస్తారు. గంగు బాయి అవమాన భారంతో తనువు చాలిస్తుంది. గుడ్డివాడయిన అంక మరాజు పశ్చాత్తాపం చెందుతాడు.
పెద్దల్లి పద్మబాయి నీకుదండమూ
నల్గురన్నదమ్ములార మీకు దండమూ
చాందా మాంకాలిదేవి నీకు దండమూ
చచ్చీన బతికీన నీవూళ్ళనేనుండ
తండ్రీ బాజీరావు నీకుదండమూ
గోడాల చాలూన ఘోరాలు బెట్టంగ
చిత్తారు అరుగల్ల మీద జీవమిడిచెనా
అచ్చమైన కొలువుమీద ముత్యాల తివాసిమీద
చిత్తముగ అంకుబావ జీవమిడిచేనా.. అని రోదించిన తీరు అతనిలో కల్గిన పరివర్తనను తెలియజేస్తుంది. పుణ్యశాలి వీరుబాయికి ఈ వార్త తెలియగానే నిర్వేదంతో వెంట్రుకల ముడులు విప్పి పకపక నవ్వుతుంది.
అంకమరాజు తండ్రి బాబాజీ అక్రమంగా పన్నులు విధించి ప్రజలను బాధలకు గురిచేస్తున్నాడు. రాజ్యకాంక్షతో విర్రవీగుతున్న తండ్రిని వారించడానికి వెళ్తాడు అంకమరాజు. గుడ్డివాడైన అంకమ రాజు మాటలు అర్థంలేనివని, రాజ్యం నడుపడానికి పన్నులు అని వార్యమని దుర్గాజీ వాదిస్తాడు. ప్రజల్లో అనవసర అపోహాలకు భయాందోళనలకు కారణమైతున్న అంకమరాజును వధించాలని, అందుకు రాజు అనుమతించాలని కోరగానే రాజు అందుకు సమ్మ తించాడు. దాంతో అంకమరాజును చిత్రహింసలకు గురిచేసి చంపు తారు. వీరుబాయికి ఈ వార్త తెలియగానే హృదయవిదారకంగా రోదిస్తుంది.
‘‘తాను ఏకంగా స్థానము జేసే వీరుబాయి
ముత్యాపు గుండెక్కి వీరుబాయి
తాను ముఖ జలక మాడింది వీరుబాయి
మదనూడు కొన్నాది మాదవెల్లి పట్టుచీర
చింగుళ్ళు జీరాడ కట్టినాదా / జలతారు పట్టురవికె వీరుబాయి..
తన దగ్గర వున్న సొమ్మంతా దానధర్మాలు చేసింది. బంగారం, వెండి నగలు చెల్లెలు సామదాతకిచ్చింది. తన పెనిమిటి అంకమ రాజు లేని బతుకు తనకు నొప్పదని భావించి గుండంలో దిగి ప్రాణ త్యాగం చేస్తుంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మను స్ఫురణకు తెస్తుంది. గురజాడ సృష్టించిన ‘పూర్ణమ్మ’ గేయం 20వ శతాబ్ధంలో వస్తే యిది 1వ శతాబ్దంలో రావడం రచయిత బలిజ వీరన్న సృజనకు మచ్చు తునక. బహుశా గురజాడకు ఈ రచన ప్రేరణగా నిలిచియుండ వచ్చు.
అన్యాయంగా అంకమరాజును కుట్రతో హత్యచేశారని గ్రహిం చిన బాబాజీ తుదకు దుర్గాజీని, అతనికి సహకరించిన వారిని ఉరి తీయాలని హుకూం జారీ చేస్తాడు. ఈ విషయం తెలుసుకొని వారు ఆత్మహత్య చేసుకుంటారు. అంకమ రాజు (అంకుబావ), ధర్మపత్ని వీరుబాయి శక్తులై (గోండుదేవతలై) నిత్యం జనగామాలో పూజలందు కుంటున్నారు. ఇపుడీ ఆలయం ఆసిఫాబాద్ సెంటర్లో గాంధీ చౌక్ దగ్గరగల బస్‌స్టేషన్‌ను ఆనుకుని ప్రజలచే ఆరాధనలను మొక్కులను అందుకుంటున్నది.
ఈ వీరగాథలో 1వ శతాబ్దంలో ఉన్న అనేక రాజ్యాలు, సామం త రాజరికాల ప్రస్తావన ఉంది. మొవడాం, కవ్వాం, వాంకీడి మాలె మొ, చాంద, ఉట్నూరు, మంగి, చేడువాడయి, తిర్మాణి, చిక్రుంట, దేవుగడ మొదలైన డెబ్బయి యేడు దుర్గాలను కథలో ప్రస్తావిస్తారు. ఆ దుర్గాలన్ని కూడా జనగామకు 50. కి.మీ.ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ కథ ఆధారంగా ఆయా దుర్గాలను ఏలిన రాజుల చరిత్రను పరిశీలన చేయాల్సి వుంది.
సాధారణంగా వీరగాథలు అనగానే ఒక ఆశ్రిత కులవ్యవస్థ గుర్తుకు వస్తుంది. ఒక కులం, దాని ఉపకులాలు వాటి మధ్య అల్లుకున్న ఒక సామాజిక చట్రం కూర్చబడి ఉంటుంది. ఆశ్రిత కులా లు తమ పోషక కులాల వీరగాథల్ని పాటులగా పాడి, ప్రదర్శనల రూపంలో దృశ్యరూపకంగా ప్రదర్శించి తమకు కావల్సిన ‘సీద’ ను ధాన్యం రూపేణా, నగదురూపేణా పుచ్చుకుంటారు.
ఇందుకు భిన్నంగా అంకమరాజుకథను ఆశ్రిత కులాల వారు కాకుండా అన్ని కులాల వారు పాడుకుంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి రోజుల్లో కోలాట ప్రదర్శన గావిస్తూ మూడు, నాల్గు రోజుల పాటు వేసి, చివరి రోజు జంతుబలిని యిచ్చి మంగళం పాడి ముగి స్తారు.
అన్ని కులాల వారు ఈ కథను ఆదరించి వీరుణ్ణి ఆరాధించడం వెనుక అంకమరాజు ప్రజలకోసం కన్నతండ్రిని సైతం ధిక్కరించి పన్నులు తగ్గించాలని పోరాడటం, పరస్త్రీ వ్యామోహంవల్ల ఎంతటి వాడయిన పతనమైతాడనే సందేశముండటం, వీరబాయి ఆదర్శ మహిళాగా పతిపట్ల, సమాజంపట్ల స్పష్టమైన అవగాహన కల్గి ఉండి భర్తకోసం తన జీవితాన్ని అర్పించడం వంటి త్యాగం ఉండటం వల్లనే ఈ కథ అన్ని సమూహాలను అలరిస్తు ఉంటుంది.
కథాగేయంలో గోండుల రాజధాని సూర్యపురం (సిర్పూర్‌టి) చంద్రాపురం (చందా) బల్హార్షా (భల్హార్‌పూర్)లను స్తుతిస్తాడు. వీటితో పాటు ఈసుగాము శివమల్లన్న (కాగజ్‌నగర్ సమీపాన), గంగాపురం ఎంకటేసు, గోలేటి భీమన్న, జనగామ బాలేసుడు తదితర దేవాల యాలను, దేవతలను ప్రస్తావిస్తాడు. గోండుల దేవతలైన భీమన్న దేవర, జంగుబాయి, మహాదేవుళ్ళను ప్రస్తావిస్తాడు.
గోండుల సాంస్కృతిక ప్రతీకలైన తుడుము కొమ్ము, ఏనుగు, గుర్రం, సూర్యపటం వంటివి కథాగేయంలో యుద్ధఘట్టంలో తెలియ వస్తాయి. యుద్ధానికి వాడే ఆయుధాలు బాకు, గుజ్జు, కంజేరు, కత్తి, ఈతకర్ర, బల్లెం, బాలకర్ర, తుపాకి, తోపువంటివి గేయంలో ఉటంకిస్తారు. గోండుల పాలన కాలం నాటికే తుపాకి, తోపు వంటి ఆధునిక ఆయుధాలు వచ్చేశాయనడానికి ఇది తార్కాణం.
పులికుంట బలిజేవీరన్న
పులికుంట గ్రామానికి చెందిన బలిజెవీరయ్య ‘అంకమరాజు’ కథాగేయం కోలాట రూపకంగా రచించాడని ఆచార్య బిరుదురాజు రామరాజు తన పరిశోధనలో ప్రస్తావిస్తూ ‘జానపదగేయ సాహిత్యం’ పుట 636లో పేర్కొన్నారు. మొఘల్ రాజుల ప్రబావంతోగాని, నిజాం రాజుల ప్రభావంతోగాని స్థానికులు అంకమరాజును ‘‘అక్బర్ షా’’ అని పిలుస్తారని కరీంనగర్‌కు చెందిన ప్రముఖ పరిశోధకులు, ఉపన్యాసకులు ఆదిలాబాద్‌జిల్లా జానపద గేయాలను సేకరించిన మందాడి నారాయణరెడ్డిగారు 1979లో ప్రస్తావించారు.
పులికుంట గ్రామానికి చెందినవాడు కనుకనే గ్రామనామ ఇంటి పేరుగా చేసుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో గ్రామనామం తన పేరు ముందు నిలుపుకునే ఆచారముంది. ఈ గ్రామం బెల్లంపల్లి ప్రధాన రహదారి పక్కన ఉంది. ‘బలిజ’ కులస్థులు వీరశైవం విజృం భిస్తున్న కాలంలో తెలంగాణ ప్రాంతమంతట తిరుగుతూ లింగ ధారులై శైవదీక్షలిచ్చేవారు. ఆదిలాబాద్ జిల్లాలో లోహిస్రా బాసర్, ఆసిఫాబాద్; వాంకిడి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట తదితర ప్రాంతాల్లో అధికంగా వున్నారు. రచయిత స్వయంగా చివరన తన ప్రస్తావన యిలా వెల్లడిస్తాడు.
‘‘ ఈ పదము కట్టిన వాడురా అన్నా వీరన్నా
బలిజా వీరన్నారా పుణ్యుడు పులికుంట నుండి కట్టినా’’ అంటు స్వస్థల వివరాలు సమాచారం తెలుపుతాడు. ఫలశ్రుతిగా జనగామకు సిరిసంపదలు కలుగాలని ధర్మపురి నరసింహుని, వేములవాడ రాజన్నను, ఈసుగామ మల్లన్నను, గోలేటి భీమన్నను, మహంకాళిని, జనగామ బాళేశ్వరుణ్ణి, కేశనాథుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రజల నాలుకల మీద సజీవంగా ఉండేలా కథాగేయ రచించిన బలిజ వీరన్న ధన్యుడు. ఇటువంటి కథాగేయాలను మట్టిపొరల నుండి, ప్రజాకళల అమ్ముల పొది నుండి వెలికి తీసి చరిత్ర ఎదుట నిలుపవల్సి ఉంది. తుమ్మలదేవరావ్


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *