ఆనాటి నా గొడవ

స్వాతంత్య్ర దినోత్సవం శ్రద్ధలేని తద్దినమని అందరూ అను కుంటున్న మాటే.. దేశోద్ధరణం అంతా వేషాలని, మోసాలని అం దరూ అనుకుంటున్నదే.. సత్తా రాగానే కన్నులు నెత్తికెక్కి పోతాయనీ, త్యాగులు సైతం ఘడియలో భోగులైపోతారని ఇప్పుడు అందరూ అనుకుంటున్నదే.. అలా ఎందుకనుకుంటున్నారో మహాకావి కాళోజీ వృద్ధాప్యంలో సైతం సునిశిత పరిశీలనా వైదుష్యం కొరవడకుండా ఎలా వివరిస్తున్నారంటే..
1947 ఆగస్ట్ 15 నాడొచ్చిన స్వాతంత్య్రం మా కొచ్చిన స్వాతంత్య్రం కాదు. మాకు స్వాతంత్య్రం వచ్చింది 17 సెప్టెంబర్ 194లో నైజాం సరెండర్ అయింతర్వాత, పోలీస్ యాక్షన్ త ర్వాత. కాబట్టి అక్కడ (బ్రిటీష్ ఇండియా) జరిగిన స్వాతంత్య్ర సమరమేదైతే ఉన్నదో అది కాకుండా 193534 నుంచి ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ లాంటి సంస్థల పక్షాన ఆదోళన నడిచింది. అంతే కాదు 1947 ఆగస్ట్ 15 తర్వాత 194 సెప్టెంబర్ వరకూ మా పోరాటం సాగింది. భారతదేశంలోని తక్కిన భాగాలలో జరిగిన పోరాటానికి ఇక్కడి మా పోరాటానికి బేధం ఉన్నది.
అక్కడ కేవలం పోరాటం సాగింది విదేశీ ప్రభుత్వంపైనే. విదేశీ ప్రభుత్వం పోయినట్లయితే స్వాతంత్య్రం వస్తుందన్న అభి ప్రాయంతో అక్కడ ఉద్యమం జరిగింది. అక్కడ పోరాటం చేసిన వారికి తగాగా ప్రభుత్వం తోటే. కానీ ఇక్కడ మా తెలంగాణా పోరాటంఅది పెత్తందార్లతోటి. సనాతన చాదస్తుల తోటి, భాషా పరంగా గ్రంథాలయ పరంగా భాషకు సంబంధించిన పోరాటాన్ని కూడా మేం సాగించినం. మతపరంగా కూడా మా ఆందోళన సాగింది. అలా జీవితానికి సంబంధించి ఎన్ని రంగాలున్నాయో అన్ని రంగాల్లోనూ మాకు పోరాటం చేయవలసి వచ్చింది.
బ్రిటిష్ ఇండియాలో ఉన్నవారి పోరాటం రాజకీయ స్వా తంత్య్రం కోసం. విదేశీయులను బయటికి పంపించటం కోసం. ఇది చాలా గమనించవలసిన విషయం. అక్కడి వాళ్ల ఇబ్బందులు కేవలం ప్రభుత్వం నుంచే అయితే ఇన్ని రకాల వర్గాల నుంచి మాకు విరోధం కలిగింది. ఉదాహరణకి చెప్పదల్చుకుంటే 1934 35లో ఆంధ్రమహాసభ మూడవ వార్షికోత్సవం జరిగింది. ఖమ్మం మెట్టులో జరిగిన ఈ సమావేశంలో బాల్య వివాహాల విషయంలో ఒక తీర్మానం చేయాలని ఉద్దేశం.
అయితే ప్రభుత్వం వారి వైపు నుంచేమో అక్కడ ఏ విధంగా ఉపన్యాసాలిస్తారో ముందే చెప్పాలని, కాపీలివ్వాలని ఆంక్షలు, సనాతనుల వైపు నుంచేమో బాల్య వివాహాలు వద్దని గనక ఉంటే రక్తం పారుతుందని హెచ్చరికలు..
భాష విషయం లోపటా చిక్కులే. ఉర్దూ వాల్లు ఉర్దూనే ఉపయోగించాలన్నారు. పోరాటంలో మా పరిస్థితి ఎట్లు ఉండెనంటే..
ఉర్దూగానిది తెలుగు ఈ తెలుగులో ఏం జరిగిన గాని ఉర్దూకు విరోధమైంది. ఉర్దూకు విరోధమైంది కాబట్టి ముస్లివ్‌‌సుకు విరోధమైంది. కాబట్టి అది స్టేట్‌కు (రాజ్యానికి) విరోధమైంది. మత పాక్షిక దృష్టితోటే భాషాపాక్షిక దృష్టితోటే ఇలా ఉర్దూకానిదల్లా రాజ్యానికి విరుద్ధమైపోయింది.
గ్రంథాలయాల విషయం లోపటా, గుళ్ల విషయం లోపటా, పూజా పునస్కారాల విషయంలోపటా ఇట్లనే జరిగింది.
1939లోపట రాజకీయానికి సంబంధించిన ఆందోళన ‘స్టేట్ కాంగ్రెస్’ వైపునుంచి జరిగితే, మత హక్కులకు సంబంధించిన ఉద్యమం ఆర్యసమాజ్, హిందూ మహాసభల వైపు నుంచి జరిగింది.
192426లో మాడపాటి హనుమంతరావు ద్వారా నడిచిన ఆంధ్రమహాసభ ఆంధ్ర జన కేంద్రసంఘం యాక్టివిటీ ఏమిటంటే, వెట్టి చాకిరీ ఉండకూడదనీ ప్రభుత్వ అధికారులు ‘దౌర’కు పోయి నప్పుడు ధరణచ్చి మాత్రమే వస్తువులను కొనాలన్నా ఆందోళన చేయటం. ఈ వెట్టిచాకిరి మీదనే పెత్తందారితనం ఆధారపడి ఉండేది. ఈ వెట్టిచాకిరిపై ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టులు పోరాటం నడిపారు. చివరికి అది సాయుధ పోరాటం అయ్యింది.
పోరాట క్రమంలో ఆంధ్రమహాసభ మొట్టమొదటిది. ఆ తర్వాత పదేళ్ళకు మహారాష్ర్ట పరిషత్తు ఏర్పడ్డది. నిజాం స్టేట్‌లా! తెలంగాణా, మరాఠ్వాడా, కర్నాటక అని మూడు భాగాలు. కర్నాటక వారి 3 జిల్లాలూ, మహారాష్ర్టవి 5 జిల్లాలూ, తెలంగాణావి 9 జిల్లాలు ఇదంతా నిజాం రాజ్యం.
ఆ రోజుల్లో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో యువకుడిగా ఉన్న రావి నారాయణరెడ్డి పాల్గొన్నారు. మాడపాటి హనుమంతరావు ఆదేశానుసారం. దాన్ని నేను సివిల్ లిబర్టీస్ కోసం కొట్టాడటం అంట. ఇవాళ పౌరహక్కుల కోసం జరుగుతున్న ఆందోళనలాంటిదే అది. అయితే ఏ ఉద్యమం జరిగినా అది పౌర హక్కుల కోసమే జరుగుతుందని గమనించాలి. మొదలు, మానవ హక్కులు ప్రాథమికమైనవి. ఆ తర్వాతే ఏదైనా.
ఇట్లా మానవ హక్కులకోసం పౌర హక్కుల కోసం జరిగిన ఆందోళనల్ల నేను పాల్గొన్న మొదటి స్టూడెంట్స్ యూనియన్ తరుపు నుంచి ఇట్లాంటి ఉద్యమాలు మొదలు పెట్టినం. 193236 వరకూ ఇలా ఆందోళనల్లో పాల్గొన్న.
మొదట వర్కింగ్ కమిటీ మెంబరుగా ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా కూడా ఆ స్టూడెంట్ యూనియన్లలో పని చేసినం. హైస్కూల్ కాలేజి రోజుల్లోనే ఆందోళనలు నడిపినం. వీటిల్లో అన్నిటికంటే ముందు గణపతి ఉత్సవాల సంగతి చెప్పుకోవాలి. ఆ తర్వాత దసరా ఉత్సవాలు.. గ్రంథాలయ సమావేశాలూ..
స్టేట్ కాంగ్రెస్ కంటె ముందు నుంచి ఇక్కడ ఆర్యసమాజం నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ వచ్చింది. అందుకే నేను వరంగల్‌లో ఆర్యసమాజంలో కలసి పని చేసిన. యాక్టివ్‌గా.
ఊరేగింపులు తీయటం లాంటివి చేసినం. అప్పుడు నేను స్టేట్ కాంగ్రెస్ సభ్యుడిని కూడా. ఆ రోజులలో ఆంధ్రమహాసభ, క న్నడ పరిషత్తు, మహారాష్ర్ట పరిషత్తు కలిసి స్టేట్ కాంగ్రెస్‌గా ఫావ్‌ు అయినై. అయితే స్టేట్ కాంగ్రెస్‌ని నిజాం రాజ్యం బ్యాన్ చేసింది. ఆంధ్రమహా సబలో అంతకు ముందు పని చేసిన వాడిని కాబట్టి నేను స్టేట్ కాంగ్రెస్ లోపటనె ఉన్నా.
మొదటి నుంచి నా వ్యహారం ఏంటంటే ఏ ఉద్యమం న డిస్తే దాంతో కలిసి పని చేయటం. అది ఆర్యసమాజం ఉద్యమ మైనా అది గణేశ ఉత్సవ సమితి ఉద్యమమైనా వేరే సామూహిక ఉద్యమమైనా.. వాటితో కలిసి సాగిన. వారూ వీరని లేదు.
వరంగల్లోనే ఆర్యసమాజ మందిరం ఒకటి ఏర్పాటు చేసు కున్నాం. అక్కడ పది పదిహేను మందిమి కూడేవాళ్లం. అప్పుడు శుక్రవారం హాలిడే. ఆ రోజు ఇనుప కుంపటి ఒకటి పెట్టుకుని హననం చేసేది. నిజానికి నాకు హననం మంత్రాలు గానీ ఆ ప ద్ధతి గానీ తెలవదు. కానీ ఒక్కడ్ని కూడా హవనం చేసేటోన్ని. ఆ హుతులిచ్చుకుంట హవనం చేస్తున్నా. ఒకనాడు ఒక సబ్ ఇన్ స్పెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను హననం చేస్తున్నా. ‘‘నేను రావచ్చా లోపటికి’’ అని అడిగిండు. ‘‘రావచ్చు. చెప్పులిడి చిరా’’ అని అన్న. వచ్చి కూర్చున్నాడు.
‘‘ఇదేమిడిది! గణేష్ ఉత్సవాలల్ల నువ్వే ఉంటవు. ఆర్యసమా జంల నువ్వే ఉంటవు. దసరా ఉత్సవంల నువ్వే ఉంటవు. అసలు నువ్వేమిటిది?’ అని అడిగిండు.
‘‘ఏమిడిదేముంది! పౌరహక్కుల కసం నేను పనిజేస్త’’ అని చెప్పిన. ఒకసారి పోచమ్మ గుడికాడ పీర్లెత్తుకుని తిరిగేటోళ్లు అప విత్రం జేసిరంటే అక్కడికి పోయిన. పసుపు, కుంకుమలతో పూజ చేయించిన. నా ధోరణి గురించె చెపుతునాన. పోచమ్మలూ, మైస మ్మలూ ఆర్యసమాజ విశ్వాసాలకి విరుద్దం. అయినా తరుకలొచ్చి పోచమ్మ గుడికాడ అట్ల జేసింరని తెలిసి అక్కడికి పోయిన. హవనం గూడా అంతె! హవనం చేయొద్దన్నది నిజాం రాజ్యం. వద్దన్న దాన్ని చేయటం ద్వారా నిరసన ప్రకటిచండం ఒక ధిక్కారం ఒక ఏజిటేషన్‌గా ఇట్లా చేయటం జరిగింది.
అప్పట్లో ఆర్యసమాజం స్టేట్ కాంగ్రెస్ పని చేస్తున్నట్లే ఇతైె దుల్ ముస్లిమన్ అని ఒక సంస్థ నడిచేది. బహద్దూర్ యార్జంగ్ దీనికి నాయకుడు. వాళ్లొక స్కీవ్‌ు తీసిండ్రు. అదేమిటంటే అణచి వేతకు గురైన షెడ్యూల్డు కులాల వారిని ముస్లిములుగా మార్చటం. ముస్లిం ముస్లిమేతర జనాభాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించటం దీని ఉద్దేశం. హరిజనులు ముస్లింలైతే హిందువుల సంఖ్య తగ్గ టంతో పాటు ముస్లింల సంఖ్య పెరుగుతుంది కదా! అదీ వ్యూహం. దీనికోసం ఒక సీక్రెట్ సర్క్యులర్ కూడా తీసిండ్రు. దీనినే పనిగ పెట్టుకున్నారు కూడా. దానికి విరుద్దంగా ఆర్యసమాజం వైపు నుంచి నేనూ బల్‌దేవ్ పతంగే, పెండ్యాల రాఘవ రావు పనిచేసినం. మేం వెల్లి అలా కన్వర్ట్ అయిన వారిని రీకన్వర్ట్ (శుద్ధి) చేసేటోళ్లం.
అయితే ముస్లిం మతం మారిన ఒక హరిజనుడు దసరా ఉత్సవాలు జరిగే చోటికి గుర్రం ఎక్కి నిజాం జండా చేతుల బట్టుకుని వచ్చిండు. ఊరేగింపులో అక్కడున్నోళ్లు అతడి మీద పడి జండా చించేసిన్రు. ఈ ఘర్షణ మీద పోలీసులు కేసు పెట్టారు. నామీద, మా అన్న గారి (కాళోజీ రామేశ్వరరావు) మీదా మరికొందరి మీదా ఆ కేసు మూడు నాలుగు నెలలు నడిచి కాంప్రమైజ్ అయింది.
నిజాం రాజ్యంలో నాన్ ముస్లిం అనేవాడు యాంటీముస్లిం. యాంటీ ముస్లిం అన్నవాడు యాంటి స్టేట్. ఇవన్నీ సమానార్థకాలై పెయినై. తెలుగు లైబ్రరీకి వెళ్ళినవాడు కూడా యాంటీ స్టేట్. మా హన్మకొండ లైబ్రరీ చాలా పాతది. 1904లో స్థాపించబడింది. అది తెలంగాణా ప్రాంతంలో నెలకొల్పబడిన రెండవ గ్రంథాల యం. మొదటి గ్రంథాలయం హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయ భాషా నియలం. అది 1901లో స్థాపితం.
గ్రంథాలయాల దగ్గర సబలు జరపటం రివాజుగా వుండేది. వార్షికోత్సవాలు చేసుకోవటం జరిగేది. సాంఘిక జాగృతిని కలి గించటానికి ఈ గ్రంథాలయాలు ఎంతో పనిచేసినై. గ్రామాలలో కూడా గ్రంథాలయాల్ని స్థాపించడం జరిగింది ఆరోజుల్లో. అక్కడ కూడా వార్షికోత్సవాలలాంటివి జరిగేవి. ఒక జాగృతి తేవటం కోసం జరిగిన ప్రయత్నం ఇదంతా. ఇలా జాగృతి తేవటం సనాతన వాదులకు ఇష్టంలేదు. అటు నిజాం ప్రభుత్వానికీ ఇష్టంలేదు. ఒక సంఘటన చెపుతా. తొమ్మిదో ఆంధ్ర మహాసభ హనుమకొండ సమీప గ్రామంలోనే జరిగింది. వేలమంది అక్కడ చాపల మీద కూర్చున్నారు. ఖమ్మంలోని హరిజన బాలికల పాఠశాల నుండి విద్యార్థుల్ని పిలిపించి వారితోనే ఈ సబలోనివారికి నీళ్ళు ఇప్పించినం. దానిమీద చాలా గొడవైంది. సనాతన వాదులు దీన్ని వ్యతిరేకించారు. మా పనిలో ఎన్నిరకాల అడ్డంకులుండేవో చెప్ప టానికే ఇది చెపుతున్నా.
ఇక్కడ ఒక విషయం చెప్పుకుని తీరాలి. తెలంగాణాలో ఇంత ప్రతికూల పరిస్థితులు మధ్యన మేం పోరాడుతూ ఉంటే ఆంధ్ర ప్రాంతం వారు రాను రాను మాట వరకసకైనా మా పోరాటంపై సానుభూతి ప్రకటించలేదు. ఏనాడూ వాల్ళు మాకు సహాయం చేయలేదు. అసలు నిజాం రాష్ర్టంలో అడుగుపెట్టాలంటేనే వాళ్ళకి భయం. బ్రిటిష్ దొరతనానిన వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడుపుతున్న వాళ్ళు కూడా హైదరాబాద్‌కి రాగానే కిమ్మనకుండా ఉండేవాళ్ళు. సరోజినీ నాయుడు దీనికి మంచి ఉదాహరణ.
సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాధ్ బెంగాల్‌నుండి ఇక్కడి కొచ్చి మదరసే అలియాకో మరో స్కూలుకో ప్రిన్సిపాల్‌గా ఉం డేవాడు. ఆమె తమ్ముడు హరీంద్ర ఛటోపాధ్యాయుడు కూడా మంచి కవి. సరోజినీదేవి మేజర్ గోవిందరాజులు నాయుడిని పెండ్లాడింది. ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంటుగా గాంధీగారి వెంట తిరిగేది. లెక్చర్లూ ఇచ్చేది. హైదరాబాద్ గనుక వస్తే గోల్డెన్ ట్రెషోల్డ్ బిల్డింగులో కూచుని నవాబుగారితో పొయెట్రీ మాట్లాడుతూ కాలక్షేపం చేసిది. కీట్స్ కవిత్వంతోనో, బైరన్ కవిత్వంతోనో పొద్దుపుచ్చేది తప్ప కాంగ్రెస్ మాటలేం ఉండేవి గావు. అవతలికి పోతే మాత్రం పెద్దలీడరు! తెలంగాణా పట్ల పెద్దపెద్ద లీడర్లనుకేవాళ్ళకి ఉండిన అవగాహనిది. నిజాం స్టేట్ నేటివ్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఏ ఉద్యమాన్నీ ప్రారంభించ లేదనేవాళ్ళు వాళ్ళు.
ఆంధ్రప్రాంతంవారి సంగతి ఎట్లా ఉండేదో చెప్పటానికి రాయప్రోలు సుబ్బారావుని గురించి చెప్పుకోవాలి. ‘‘ఆంధ్రాఫేవ్‌ు’’ రాయప్రోలు పేరుకి జాతీయకవే. బెజవాడ అవతలి సభల్లో తన పద్యాల్ని ధాటిగా చదివెటోడు. ఎర్రుపాలెం దాటి ఇవతలికొస్తే సభలూ లేవు పద్యాలూ లేవు. అసలు తెలంగాణా వాళ్ళతో నిలవడ మే లేదు. తెలంగాణవాళ్ళతో అంటీ ముట్టనట్లు ఉండేటోళ్ళు. ఏళ్ళ కేళ్ళు ఇక్కడ గడిపినా రాయప్రోలు ఏనాడూ ఇక్కడి వాళ్ళ గురించీ, వాళ్ళ పోరాటం గురించీ ఒక్క మంచి మాట అనలేదు. పైగా నవాబులతోటే పెద్ద పెద్ద వాళ్ళతోటే తిరిగేటోడు. ఇదీ వాళ్ళ దోరణి. అందుకే రాయప్రోలుమీద నేను ఒక కవిత రాసి దాన్ని ఆనాడు సభాముఖంగా వినిపించాను.
‘‘లేమావి చివరులను లెస్సగా మేసేవు
రుతురాజు వచ్చెనని అతి సంభ్రముతోడ
మావి కొమ్మలమీద మైమరచి పాడేవు
తిన్న తిండెవ్వారిదే కోకిలా!
పాడు పాటెవ్వారిదే కోకిలా!
పేరు ఊరూలేని పిచ్చుకవు: దయదలచి
చేరదీసి నిన్ను గారవము చేసినా
మావి గున్నల మాట మాటవరసకునైన
ఎన్నాడైనను తలచితె కోకిలా!
ఎప్పుడైనను పాడితే కోకిలా!’’
ఇదీ ఆ కవిత. వీళ్ళ తీరు ఇట్లా ఉన్నా మేం మాత్రం బ్రిటీష్ ఇండియా స్వాతంత్య్ర పోరాటాన్ని సమర్ధించినం. మా దృష్టిలో ని జాం బ్రిటీషువాళ్ళ తొత్తు. అందుకే బ్రిటీష్‌వాళ్ళూ పోవాలని కోరు కున్నాం.
నేనూ, వట్టికోట ఆళ్వారు స్వామీ గుంటూరుకు పోయి అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షతన ఆనాడూ జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్నాం. అప్పట్లో ఆంధ్రప్రాంతంవారి సబలు తమిళ ఆధిపత్యాన్ని నిరసించేవి. తమిళులకి వ్యతిరేకంగా తీర్మానాలు చేసే వాళ్ళు. ఇవాళ మేం అదే అంటున్నాం. తమిళ ఆధిపత్యాన్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళెట్లా నిరసించారో ఇవాళ మేం కూడా తెలంగాణ మీద ఆంధ్ర ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకనాడు నిజాం ఇక్కడ ఐదుశాతం మంది మాట్లాడే ఉర్దూను అధికార భాషచేశాడు. ఇపుడు ఒకటిరెండు కోస్తా జిల్లాల భాషను (ఆ మాటకొస్తే రెండు, మూడు కులాల భాషను) మా మీద రుద్దుతున్నారు. మేం రెండింటినీ వ్యతిరే కిస్తున్నాం.
నా గురించి చెప్పుకోవాలంటే నేను ఎక్కడ అన్యాయం జరి గినా ప్రతిఘటిస్తూ వచిచన. అన్ని ఉద్యమాల్లోపట డైరెక్టుగా పాల్గొన్న. ఎక్కడ అక్రమం జరిగినా దాన్ని ధిక్కరిస్తూ గేయమో, కథో రాసిన. నా గేయాలలో తొభై ఐదు శాతం ఉద్యమాలపై రాసినవే. అవన్నీ గేయరూపంలో వున్న స్టేట్‌మెంట్లే.
అపట్లో నిజాం రాజ్యంలో ‘‘అనల్‌మాలిక్’’ అని ఒక నినాదం బయల్దేరింది. ప్రతి ముస్లిమూ నేనే రాజునని అనుకోవాలని దాని అర్థం. నిజాం రాజ్యం ముస్లిం ఆధిపత్యానికి ప్రతీక అని అనుకు న్నారు. ఆ మాట మళ్ళీ నిజాం ఒప్పుకోడు. అది తన సొంతరాజ్యం అని అతడనుకునేవాడు. అట్లాంటప్పుడు హైదరాబాద్ స్టేట్ తురకల రాజ్యం ఎట్లా అవుతుందీ? ఏదో కొద్ది మంది సెలెక్టెడ్ కుటుంబాలకే అన్నీ సమకూరినవిగాని! అయినప్పటికీ ఈ రాజ్యం తరుకల రాజ్యం అని ప్రతి ముస్లిం మెదడులో జొప్పించిండు. ఈ కారణంగా 1945 లో హిందూ ముస్లిం వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. నిజాం పాలనకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనని ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా చిత్రీకరించిండ్రు. ఆ ఉద్రిక్తతల్లో కొందరు చనిపోయిండ్రు. వరంగల్‌లో అట్లా పట్టుపగలే డాక్టర్ నారాయణ రెడ్డినీ, మొగిలయ్యనీ చంపిండ్రు. 1946లో కాంగ్రెస్ పతాకాన్ని ఎగరేసినందుకు వరంగల్ కోటలో మొగిలయ్య బలయ్యిండు. మ హ్మద్ ఖాసి అనే రజాకార్ యాభై అరవైమంది గూండాలతో వచ్చి మొగిలయ్యను హత్య జేసిండు. అట్లా చంపినాక ఆ నెత్తురు మరకల తోటే వాళ్ళు ఊరంతా తిరిగిండ్రు. అగిడినవాడు లేడు. బల్లెంతో పొడిచి చంపిండ్రు.
అప్పుడు నేను ఒక కవిత రాసిన. అది నా పబ్లిక్ స్టేట్‌మెంటు.
‘‘పట్టపగలె పట్టణములో పెట్టి పౌరుల కొట్టి చంపిన దుష్ట కూటమితో ప్రభుత్వం దొంగబేరము చేసినట్టే’’ అన్నా. అట్లనె..
‘‘రక్ష నాకు ఏర్పడ్డ బలగమే
రక్కసుల పక్షంబు చేరిన రాక్షసుల ఇష్టానుసారం రాజ్యము నడిపించినట్లే…
హత్య దోపిడీ మానభంగాలు
నిత్య కర్మలయినట్టే’’ అని కూడా అన్న.
కోర్టులో ఇత్తైహయల్ ముస్లిమీన్ లాయర్ల నడుమ కూర్చున్న నేను ‘‘పచ్చి నెత్తురు వాసనేస్తున్నది’’ అన్నా. ఆ తర్వాత నన్ను వరంగల్ జిల్లా నుంచి మూడు నెలలపాటు వెళ్లగొట్టింరు. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో మకాం పెట్టిన.
అప్పటి ప్రధాని సర్‌మీర్జా ఇస్మాయిల్ వరంగల్‌లోని పరిస్థితులు విచారించటానికి పోతున్నడని తెల్సింది. అప్పుడు నేనొక లేఖ రాసిన.
‘‘వరంగల్‌ల పరిస్తితి ఉద్రిక్తంగా ఉన్నదని నువ్వుపోతున్నవ్. ఆ పరిస్థితికి నేను కారకుడినని జిల్లానుంచి బహిష్కరించినవు. నేను వరంగల్ వాడిని. నేను లేనప్పుడు అక్కడి పరిస్థితులు విచారించె టందుకు పోతన్నవ్. నన్ను నీవెంట తీసుకపొ. దానికి నేనెట్ల కార కుడినో నాముందే విచారించు. దానిమీద ఏ శిక్ష వేసినా నేను సి ద్దం. కానీ నన్ను తీసకపోకుండ నువ్వు ఒక్కడివె పోయి విచారణ జేస్తె మాత్రం అది బూటకపు విచారణ అవుతుంది’’ అని.
కాని ప్రధానమంత్రి నన్ను రమ్మనలేదు. ఒక్కడే పోయివచ్చిం డు. అట్టా రాంగానే గేయం రాసి కొన్ని ప్రశ్నలడిగిన.
‘‘ఎన్నాళ్ళనుండియో, ఇదిగొ యనుచు
ఈనాటికైనను ఏగివచ్చితివా?
కోటగోడల మధ్య ఖూనీ జరిగిన చోట
గుండాల గుర్తులు గోచరించినవా?
జెండా యెత్తిన యంత జాంబియాలు దూసిన
శిక్ష తప్పదంచు చెప్పవచ్చితివా?
బజార్లొ బాలకుని బల్లెంబుతో పొడుచు
బద్మాషునేమైన పసిగట్టినావ?
సూబాధికారులు జో హుకుం అనువారు
చుట్టూ చేరి అంత చూపెట్టినరా?
కాలానుగుణ్యమౌ కాలోజీ ప్రశ్నలకు
కళ్ళెర్రజేసి ఖామోషీ అంటవా?
ఖామోష్ వుంటవా?’’
ఈ కవిత ‘గోల్కొండ’ పత్రికలో అచ్చయ్యింది.
‘‘బాధ్యతలేని ప్రభుత్వ భటులు
పెట్టిన బాధలు చాలింక
బాధ్యతగల పరిపాలన లేక
బతికిన బతుకులు చాలింక
పల్లెపల్లెలో పాలన పేరిట
జరిగే పాపం చాలిక
రాజుపేరిట అరాజకమునకు
జరిగిన పూజలు చాలింక
పేదల సర్వస్వముతో
ధనికులు చేసిన బేరము చాలింక
లంచము దొరికిన యంతనే
న్యాయము తలను వంచడం చాలింక’’
అని ఆ రోజుల్లోనే గేయం రాసిన. ఇది ఇప్పటి పరిస్థితికి కూడా వర్తిస్తది.
ఆకునూరు, మాచిరెడ్డి పల్లెల్ల జరిగిన రజాకారీ దురంతాలూ పోలీసుల అరాచకాలమీద కూడా గేయాలు రాసిన.
జైలు జీవితం గురించి..
నేను మొత్తం మూడు మార్లు జైలుకు పోయిన.
193లో నాలుగంటె నాలుగు రోజులపాటు శిక్ష అనుభవిస్తే 1943లో రెండేండ్ల ఆరునెలల శిక్ష పడింది. అయితే నా అనారోగ్యం కారణంగా నన్ను ఐదు నెలల తర్వాత విడిచిపెట్టిండ్రు.
చివరగా 1947 సెప్టెంబర్ 3 నుంచి 194 సెప్టెంబర్ 26 వరకూ జైలు జీవితం గడిపిన.
1943 జనవరి 3 నాడు ‘క్విట్ ఇండియా’ ఉద్యమంల భాగం గా వరంగల్ చౌరస్తాలో సత్యాగ్రహం చేసినం. హయగ్రీవాచారి ఎక్కడ్నుంచో కాని ఒక సైక్లోస్టైల్ మిషన్ తెచ్చిండు. దాంతో తెలుగుల ఒకటీ, ఉర్దూల ఒకటీ ప్రకటనలు తయారుచేసినం. చౌరస్తల ఆ ప్రకటనలన్నీ పంచినం. దీనికి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. అక్కడే కోర్టుపెట్టి శిక్ష వేసిండ్రు.
1947 సెప్టెంబర్‌ల శిక్ష పడ్డప్పుడు జైలులో ఎక్కువ కాలం వున్న. మా అన్ననే నా బాగోగులన్నీ చూసెటోడు. ఆయన నన్ను ముసలితనంల కూడ పిల్లగాని లెక్క సాదిండు. ఆయన ఉన్నాడు కాబట్టే నేను ఇదంతా చేయగలిగిన.
నా గర్వభంగానికి సంబంధించిన సంఘటన చెప్పుకుని తీ రాలి.
నాకు కాంగ్రెస్‌తో సంబంధం ఉన్నదన్న ‘అనుమానం’మీద పోలీసులు (194లో) మా ఇంటిని (అది రామేశ్వరరావుగారి ఇల్లు) సోదా చేసింరు. రాత్రి 10.30 గంటలకి వచ్చి అర్థరాత్రి 2 గంటల దాకా సోదా సాగింది. వారికి ఏమీ దొరకకున్నా నన్ను అరెస్టు చేసింరు.
అక్కడికెళ్లి హన్మకొండ వీధుల్లోంచి నన్ను పోలీస్ స్టేషన్‌కి తీ సుకుపోయిండ్రు. పోలీస్ స్టేషన్ల నన్నూ నాతో పాటు అరెస్టు చేసిన ఆంజనేయులునూ లాకప్‌లో పెట్టిండ్రు. అయితే అంతకుముందు నుంచీ ఆ లాకప్‌లో ఒక దొమ్మరాయన ఉన్నాడు. అట్లా ఒక హాబిచ్యువల్ క్రిమినల్‌తో నన్నూ ఉంచినందుకు అవమానంగ తోచింది నాకు. ఆ దొమ్మరాయన చెవిలో సగం కాలిన ఆకు చుట్టతీసి కొరికి అక్కడే ఉమ్మివేసి ‘‘అగ్గిపుల్ల ఉన్నదా’’ అని అడిగిండు. నేను చీదరించుకున్న. అయితే దర్బాజ దగ్గరుండే సెంట్రీ చుట్ట అంటించిండు. అక్కడికెల్లి ఆ దొమ్మరాయన నేనే బేరం చేసిననో ఆరాతీసుడు మొదలుపెట్టిండు. రాజకీయాల గురించి వాడికి ఏం చెప్పినా ఏం తెలుస్తదన్న చిన్న చూపుతో ఏం సమాధానం చెప్పకుండ ఊరుకున్న.
‘‘చోరీ చేస్తివా? ఎవడి తలన్న పగలగొడితివా? ఎవడినన్న సంపినవా, ఎవని పెళ్ళానన్న ఎత్కచ్చనవా?’’ ఇట్లా సాగినయి వాడి ప్రశ్నలు. అన్నిటికీ ‘‘కాదు కాదు’’ అనుఖుంట జవాబిచ్చిన.
చివరికి అతడు ఒక ప్రశ్న అడిగిండు. ‘‘గాంధీ మహరాజ్‌కీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతున్నదంట, దాంట్లగిన రాలేకద నువ్వు!’’ అన్నాడు. ఈ ప్రశ్నతో నేను నిశ్చేష్టుడ్నే అయిన. ‘‘వీడికి ఏం తెలుస్తుందిలే’’ అని నేననుకుంటే గాంధీగారి ఉద్యమం అతడి దాకా చేరిందని నాకర్థమయింది. నేను అహంకరించి జనానికి దూరమైపోయిన గాని గాంధీ మాస్‌కాంటాక్ట్ సాధించిండని తెలిసొ చ్చింది. అట్లా నాకు గర్వభంగం జరిగింది. (ఈ సంగతి చెబుతూ కాళోజీ ఒక్కసారిగా కదలిపోయి కన్నీరు కార్చారు).
ఏమైతేం. కాశీంరజ్వీ అరెస్టయినంకనే నేను జైలు నుంచి విడుదల అయన. మిలెట్రీ యాక్షన్‌తో హైదరాబాద్ రాష్ర్టం విముక్త మయింది. అట్లా మేం 1949 ఆగస్ట్ 15నే తొలి స్వాతంత్య్రదినంగా చూసినం. అయితే పీడన, పేదరికం, లంచగొండితనం పోలే. అందుకని..
‘‘స్వాతంత్య్రదినోత్సవం
శ్రద్ధలేని తద్తినమని
దేశోద్ధారణం అంతయు
వేషాలని మోసాలని ఎవరనుకున్నారు..!
సత్తారాగానే కన్నులు నెత్తికెక్కి పోతాయని
త్యాగులు సమితం ఘడియలో
భోగులైపోతారని ఎవరనుకున్నారు..!
కంట్రోలు అనగానె సరుకులు
కనబడకుండ పోతాయని
నిండిన గోదాముల ముందట
తిండిలేక చస్తామని
ఎవరనుకున్నారు..!’’ అని రాసిన.
ఇప్పటిదాకా అధికారం వెలగబెట్టిన అన్ని ప్రభుత్వాలమీద నా నిరసన ఇది.
స్వాతంత్య్రానంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళూ అధికారానికి దూరంగా కళ్ళు మూసుకు వుండిపోయిన స్వాతంత్య్ర సమరయోధులూ ఈ దుర్భర పరిస్థితికి కారకులు.
ఇప్పటికైనా అధికార రాజకీయాలకు దూరంగా ఉండి పో యిన వాళ్ళు నడుంబిగించాలె. లేనిదే ఆడంబరాలతో స్వర్ణోత్సవాలు జరుపుకోవటం బూటకం అయితది.
అన్యాయాన్ని ఎదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి.

ఇంటర్వ్యూ: వై.శ్రీనివాసరావు
(సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా…
ఆంధ్రప్రభ స్వాతంత్య్ర స్వర్ణోత్సవ విశేష సంచిక స్వర్ణప్రభ సౌజన్యంతో)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *