కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి

అటు ఉత్తర భారతదేశం నుంచి, ఇటు దక్షిణ భారతదేశం నుంచి హైదరాబాద్ నగరానికి భిన్న జాతులు, కులాల వారు వలస వచ్చారు. కుతుబ్‌షాహీల కాలంలో మొదలైన వలసలు అసఫ్‌జాహీల కాలం నాటికి ఊపందుకున్నాయి. మొదటి అసఫ్ జా కాలంలో ఎన్నో వందల కుటుంబాలు నగర బాట పట్టాయి. వచ్చిన వారిలో సమర్థులైన హిందువులను ఉన్నతోద్యోగాల్లో నియమించారు తొలి నిజాం ప్రభువులు. నైజాం కుటుంబీకులతో సమానమైన ెదాను వారు అనుభవించారు. ఆ మాటకొస్తే చివరి కుతుబ్‌షా పాలనలో అక్కన్న మాదన్నలు ప్రధాన మంత్రి, సైన్యాధక్ష్య పదువులను పొందారు. అలాగే అసఫ్‌జాహీల పాలనలో మహరాజా చందూలాల్, సర్ కిషన్ పెర్షాద్‌లు ప్రధానమంత్రులుగా చాలా కాలం కొనసాగిన సంగతి కూడా తెలిసిందే.
వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకొని మైత్రీభావంతో కొనసాగిన ఘనత నగర సంస్కృతిలో భాగమే. కలసి మెలసి ఉంటూ భిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో నగర సంస్కృతి దక్కన్ సంస్కృతిగాను, గంగా జమున సంస్కృతి గానూ పేరుగాంచి మత సామరస్యానికి, సామాజిక సౌభ్రాతృత్వానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఒక్కసారి చరిత్ర లోకి తొంగిచూస్తే, నగరానికి గత నాలుగొందల ఏళ్ళకు పైగా ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో జా తులు, మతాలు, భాషల వాళ్ళు వలసలు రాగా, నగరం ఆప్యాయంగా ఆహ్వానించి అనూహ్యమైన ఆదరణను, ఆతిథ్యాన్ని పంచి, సామరస్యా న్ని పెంచి పోషించింది. ఇలా వలస వచ్చిన వారిలో కాయస్తులు, తమిళులు, మార్వాడీలున్నారు. పార్సీలు, ఇరానీయన్లు, ఖత్రీయులు, బ్రహ్మ క్షత్రియులు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే, నగరానికి వలస వచ్చిన వారిలో మొదటి వరుసలో ఇరానీలుంటారు.
క్రీ.శ. 1591 92లో నగర నిర్మాణంలో కూడా పాలు పంచు కున్న ఇరానీయులు తరువాత ఇక్కడి సంస్కృతిలో భాగమైనారు. నగర సంస్థాపకులైన కుతుబ్ షాహీల మూలాలు ఇరాన్‌లో ఉన్నందున ఇరానీయుల వలస తేలికైంది. ఎంతో మంది ఇరానీలు కుతుబ్‌షాహీల కొలువులో ఉన్నతోద్యోగాలుగా నియమింపబడటాన, నగర సంస్కృతి లో భాగమైన కళలు, కట్టడాలు, వేషభాషలు, ఆహారపుటలవాట్లపై ఇరానీ సంస్కృతి విశేష ప్రభావాన్ని చూపించింది. ఈ ప్రభావం నగర ఆవిర్భావం నుంచి రెండు శతాబ్దాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. వలస వచ్చిన ఇరానీయన్లు ఎక్కువ మంది షియా తెగకు చెందటాన నగర సంస్కృతిలో వారి ప్రభావమే ఎక్కువని చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాలు ఇరానీ గల్లీలుగా కూడా పిలువబడినాయి. షియాలు పాటించే మొహర్రంను నగరవాసులంతా మూకుమ్మడిగా జరుపుకునే వారు.
నగర కట్టడాలపై ఇరానియన్ల ప్రభావం చాలా ప్రస్ఫుటంగా కన బడుతోంది. కట్టడాలను నాలుగు ద్వారాలతో నిర్మించే ఆచారం ఇరాన్ నుంచి వచ్చిందే. జామీ మసీదు, మక్కా మసీదు, కుతుబ్ షాహీ మసీదులను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, చార్‌భాగ్ (నాలుగు విభాగాలుగా వికసించిన ఉద్యానవనాలు) కూడా ఇరానియన్ సంస్కృతికి ఇక్కడ అద్దం పడుతున్నాయి. గోల్కొండ లోని కుతుబ్‌షాహీ సమాధుల వద్ద గల చార్ భాగ్ ఇందుకు ఉదాహరణ. ఆర్చీలు, మెరిసే కప్పు పలకలను మనం చార్‌మినార్, బాద్‌షాహీ, ఆషూర్ ఖానాలలో చూడవచ్చు. కట్టడాలపై చక్కటి డిజైన్లతో చూపరులను ఇట్టే ఆకట్టుకునే సున్నపు పని కూడా ఇరాన్ నుంచి వచ్చిందే. ఇందుకు ముషీరాబాద్ మసీదును ఉదాహరణగా పేర్కొన వచ్చు. ఇంతేగాక జామె మసీదు, మియాన్ ముష్క్ మసీదుల దగ్గరున్న స్నానవాటికలు ముమ్మూర్తులా టర్కిష్ బాత్‌లను తలపింపజేస్తాయి. పాఠశాలలతో పాటు దారుషిఫా లాంటి ఆసుపత్రుల నిర్మాణం కూడా ఇరానీ సంప్రదాయంలోనే చేపట్టడమైంది.
కుతుబ్‌షాహీల కాలంలో ప్రముఖ ఇరానియన్ మీర్ మహమ్మద్ ముమిన్ అస్త్రబాదీ నగర నిర్మాణ పథక రచయిత. మొహర్రం సంద ర్భంగా మౌనం పాటించడం, పీర్లను నిలబెట్టడం ఇతను ప్రారంభిం చిందే. యాకుత్‌పురాలోని బీబీకా ఆలం నుంచి వెండి, ముత్యాలతో పొదిగిన పీర్లను చాదర్‌ఘాట్ వరకూ ఊరేగింపుగా తీసుకొచ్చే సంప్ర దాయాన్ని ప్రవేశపెట్టింది కూడా మీర్ ముమీనే. అతని సేవలకు గుర్తింపుగా మీర్‌పేట్, మోమిన్ పూర్, మోమిన్ పేట్, దైరెమీర్ మొమిన్, మీర్‌చౌక్‌లు వెలిశాయి.
అసఫ్‌జాహీల కాలంలో కూడా ఇరానియన్ ప్రముఖులు నగర విస్తరణలో పాలు పంచుకున్నారు. నగర శివారులోని సరూర్‌నగర్‌ను, అక్కడి రాజప్రసాదం, చెరువులను ఇరానియన్ అయిన అరస్తు జా నిర్మించాడు. నగరంలో తరచూ నీటికొరత ఏర్పడగా, మీర్ ఆలం చెరువు దగ్గర నవాబ్ మీర్ మూసాఖాన్, రుక్నుద్దౌలాలు జలాశయాన్ని నిర్మించారు.
గొప్ప రాజకీయ చతురుడు, పరిపాలనాదక్షుడు, పండితుడు అయిన మీర్ ఆలం (క్రీ.శ 104 ప్రాంతం) గొప్ప కట్టడాల నిర్మాత కూడా. మీరాలం చెరువు, మీరాలం మండి, కొత్త ఈద్గా, బారాదరి, ఇంకా హైదరాబాద్ మచిలీపట్నం, పూనా ఔరంగాబాద్ రహ దారుల్లో విశ్రమణ శాలలు నిర్మించారు.
అసఫ్‌జాహీలకు అరుదైన సేవలను అందించిన సాలార్‌జంగ్ కుటుంబసభ్యులు మీర్ ఆలం సంబంధీకులే. క్రీ.శ. 129లో పుట్టిన మొదటి సాలార్‌జంగ్ నిజాం ప్రధాని. ఎన్నో పాలనా సంస్కరణల్లో పాలు పంచుకున్నారు. జిల్లాబందీ విధానాన్ని ప్రవేశపెట్టి హైదరాబాద్ రాజ్యాన్ని ఐదు జిల్లాలుగా విభజించాడు. అంతేకాదు. మొట్ట మొదటి సారిగా ఆర్థిక శాఖను ఏర్పాటు చేశాడు. విద్యాభివృద్ధికి మదర్సా ఇఆలియాను స్థాపించాడు. అదే తరువాత నిజాం కాలేజీగా రూపొం దింది. మొదటి సాలార్ జంగ్ కాలంలోనే దివాన్ దేవిడి, ముక్తర్ పుర, ముక్తర్ గంజ్ నిర్మించబడినాయి.
అటు తరువాత క్రీ.శ. 19లో పుట్టిన మూడో సాలార్‌జంగ్ ప్రీతితో అరుదైన దేశీ, విదేశీ కళాఖండాలను సేకరించారు. సాలార్ జంగ్ మ్యూజియం రూపంలో ఆయన కీర్తి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇరానీయులు ఎక్కువగా మదీనా భవనం, పత్తర్‌ఘట్, హిమాయత్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నివసిస్తూ నగరజనుల్లో భాగమైపోయారే తప్ప వేరు పాయగా ఉండాలని ఏనాడూ అనుకోలేదు. ఇరానీ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీగా పేరుగాంచింది. ఇరానీ చాయ్ (ఇస్ఫమాన్ చాయ్) ఇరానీయులు హైదరాబాద్‌వాసులకు ఇచ్చిన మరో కానుక. ఇలా చెప్పుకుంటూ పోతే దక్కన్ సంస్కృతి పరిపుష్టం కావడానికి ఇరానీలు చేసిన సేవలకు కుతుబ్‌షాషీలను, అసఫ్‌జాహీలను కొనియాడవలసిందే. అలాంటి ఇరానీయులను మనం మరచిపోతున్నాం.
ఈమని శివనాగిరెడ్డి


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *