తాత్విక రచనలతో

ఔన్నత్వాన్ని చాటిన సిద్ధ్దప్ప వరకవి
దక్షిణ భారతానికి చెందిన వరకవులలో కవి, యోగవంద్యులు సిద్దప్పవరకవి తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నత స్థానంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇతని పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినా, తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా, కాలము భూతకాలంలో కలిసిపోయినా కాని ప్రజల మనోఫలకాలపై రూపు దిద్దుకున్న సిద్దప్పవరకవి అనే మహనీయుని రూపం ఎన్నటికీ చెరిగిపోదు. కులమత భేదాలు, సాంఘిక మూఢ నమ్మకాలు, మానవ నైతిక విలువలు కనుమరుగవుతున్న దశలో కలాన్ని ఆయుధంగా ఎంచుకొని సాహిత్య యుద్ధం ప్రకటించి సిద్దప్ప వరకవి ప్రజాహితం కోసం తాత్విక సాహిత్యం సృజించి బోధించిన ఘనుడు.
ఆధునిక నాగరికత శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి మూలం కుమ్మరి చక్రం రసాయనశాస్త్రానికి మూలం బంకమన్ను. చక్రమే యాంత్రిక యుగాన్ని నడిపిస్తుంది. మానవ విలువలను, శ్రమ, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పి తరతరాల వృత్తి నైపుణ్యం గొప్ప సాంస్కృతిక వైభవం కలబోసుకుని మట్టిని నమ్ముకొనే మట్టికి మానవునికి అవినాభావ సంబంధాన్ని చాటిన కుమ్మరకుల నిరుపేద కుటుంబంలో కోహెడ మండలం గుండారెడ్డి పల్లెలో పెద్దరాజయ్యలక్ష్మి దంపతులకు క్రీ.శ. 1903లో జన్మించారు.
సిద్దప్పవరకవి బహుముఖ ప్రజ్ఞశాలి. పామరులను, పండితులను సహితం తన కవిత్వం ద్వారా రంజింపజేశారు, ఆశ్చర్యపరిచారు.
‘‘గొప్పవాడను కాదు కోవిదుడను కాను
తప్పులున్నను దిద్దుడు తండ్రలారా’’ అంటూ..
వినయంగా చెప్పుకున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఓ ఆణిముత్యం. తన గూర్చి తేట తెలుగులో ఒక పద్యంలో చెప్పుకున్నారు.
‘‘నైజాము రాష్ర్టము నదిపునుస్మనలీ
పాదుషాగారి పట్టణము క్రింద
సూబె వరంగల్లు సొంపైన గ్రామము
జిల్లా కరీంనగర్ చెలిగి వినుడి
శాలివాహన వంశ సమహితుండు
జనకుండు రాజయ్య జనని లక్ష్మమ్మకు
తనయుడు సిద్దప్ప తగిన మతుడు’’.
నిజం పాలనలో శూద్రులకు చదువు అంతంత మాత్రమే. సిద్దప్ప ఉర్ధూ మీడియంలో 7వ తరగతి వరకు చదివారు. తెలుగు, హింది,ఉర్ధూ, పార్శీ, ఇంగ్లీష్, సంసృ్కత భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఉపాధ్యాయునిగా పనిచేశారు. సిద్దప్పవరకవి పదిహేనవయేటనే రామా యణం, అమరశాస్త్రములను పుక్కిటపట్టారు. సరస్వతీ దేవి ఇష్టదేవత కటాక్షం వల్ల స్వతహాగా సాహిత్య రచన చేసి సిద్దప్పవరకవిగా ప్రసిద్ధి చెందారు. సాహిత్యంతోపాటు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేద సేవలు కొనసాగిస్తూ మానసిక రుగ్మతలకు సలహాలు ఇస్తుండేవారు. తన స్వగ్రామంలో గల ప్రసిద్ద ఆశ్రమానికి వచ్చిపోయే వారి వద్ద చిల్లి గవ్వ తీసుకునేవారు కారు. నిరాడంబర జీవితాన్ని గడిపారు. తన కలం ద్వారా శ్రామికుల కండ్లు తెరిపించారు. తన సాహిత్యంలో కులాలకు, మతాలకు అతీతంగా మానవత్వానికి ప్రాధాన్యమిచ్చారు. మంచికి ప్రాధాన్యమిస్తూ కులవ్యవస్థ, మూఢనమ్మకాలను ఖండించారు. పామ రుల నోళ్లలో సహితం ‘‘యేకులంబని’’పద్యం నాట్యం చేస్తుంది.
‘‘యేకులంబని నను యెరుకతో నడిగేరు
నాకులంబును జెప్ప నాకు సిగ్గు
మా తాత మాలోడు మరియు వినుడు
మా యత్త మాదిగది మామ ఎరుకలవాడు
మా బావ బలంజతడు మానవతుడు
కాపువారి పడుచు కాంత దొమ్మరి వేశ్య
భార్యగావలె నాకు ప్రణయ కాంత’’ అంటూ…
మానవత చాటారు. ఈ పద్యంలో ‘యెరుక’ అడిగేరు మానవతు డు, పడుచులాంటి ఎన్నో తెలుగుపదాలను వాడి సామన్యులకు సహితం అర్థమయ్యే విధంగా రాశారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గాంధీజీ అహింస సిద్దాంతాలను నమ్మి ఆనాడు గాంధీజీ సమావేశాలకు హాజరైన ఆయన ప్రభావంతో స్వదేశీ వస్త్రాలను వాడాలని సూచించారు. స్వయంగా ఖద్దరు వస్త్రాలను ధరించి అదే విధంగా నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి చేయాలని తలిచారు.
సిద్దప్పవరకవి ఒకవైపు ప్రజలకు బోధన చేస్తూనే మరొకవైపు 50 గ్రంథాలు రచించారు. 1. సిద్దప్పకవి జ్ఞానబోధిని (నాలుగుభాగాలు) 2. వర్ణమాల కందార్థములు, 3. కాలజ్ఞాన వర్ధమాన కందార్థములు, 4. యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, 5. విష్ణుభజనావళి, 6. శివభజనావళి, 7. నీతిమంతుడు, . గోవ్యాఘ్ర సంభాషణ, 9. కాకి హంసోపాఖ్యానం, 10. అర్చకుల సుబోధిని, 11. అశోక సామ్రాజ్యము యక్షగానము, 12. జీవ నరేంద్ర నాటకము, 13. నక్షత్రకుల ప్రభావం తో చార్మినార్ చెరిగిపోతుంది.’’ అని పరోక్షంగా తన కలం ద్వారా నిజాం ప్రభుత్వం గద్దె కూలిపోతుంది. తెలంగాణ విముక్తి అవుతుందని సూచించారు. ఆనాడు నాణాలపై చార్మినార్ బొమ్మను ముద్రించేవారు. ప్రభుత్వం కూలిపోయి నాణాలు మరుగున పడిపోతాయని తెలిపారు. దీంతో కోపోద్రిక్తులయిన నైజాం రాజులు సిద్దప్పవరకవి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఊడబెరికారు. అయినా బెదరలేదు ముందుకుసాగారు. అలాగే సమాజంలో రుగ్మతలను తూర్పారబడుతూ…
‘‘పంచమ జాతి లోపల పతివ్రత లేద
గొప్పజాతిలో లేడ?’’ అని మానవత్వం కోరుతాడు.
అలాగే బుద్ధిమంతుల గూర్చి చెపుతూ… ‘‘బుద్ధిమంతులు పుణ్య పురుషార్తులైన వారు. పదిమందిలో ప్రజ్ఞ పలుకబోరు’’ అంటారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ గొప్పది బతుకమ్మ గూర్చి చక్కగా తెలిపారు. ‘‘ఆశ్వయుజ శుద్దమనగా స్త్రీలంత తిరిగి పువ్వులు తెచ్చి తేగల మలర నాసందు నీసందు నానాడె పాసెనని కంటె రంగనివుండు గూసెననుచు వైనమను సిబ్బులన్ వదుల బదులుండుకొని యెవరెవ్వరి చద్దివారుగుడాబి’’ అనింసారు. అదే విధంగా మహనీయుల గురించి యేమరెడ్డివంటి యోగ గురుడులేడని, కాళిదాసువంటి కవిలేడని, తల్లి దండ్రులవంటి ధనము లేదని అంటూనే..
‘‘ఘటముకంటె వేరైన మఠము లేదు
ఆత్మకంటె వేరైన హరియు లేడు’’ అని చెప్పారు.
సిద్దప్పవరకవి బహుముఖ ‘‘శ్రీప్రతాపసింగరాయ నృసింహస్వామి వర్ణమాల’’ పుస్తకంలో అ నుండి క్ష వరకు సీసపద్యాలలో స్తుతించారు. ఈయన కీర్తన మంగళహారతులు, పద్యాలు వివిధ ప్రక్రియలలో రచించారు. సిద్దప్ప బోధించిన జ్ఞాన బోధలో ముఖ్య హితవులు.
‘‘1. ప్రపంచ జీవనరీతిని విడువరాదు.
2. సంసారమే చేయవలె
3. రాజయోగికి సన్యాసము కూడదు
4. సజ్జన సాంగత్యము విడువరాదు
5. జీవించడానికి కష్టఫలమే మంచిది
6. నేను అనే అహం వీడాలి.
7. ఉన్నంతలో ధానధర్మం ఉండవలె.
. ఆత్మలో గురువును స్మరించవలె.
9. పరమతం పట్ల అసహనం వలదు.
10. నీవు నేను అనే బేధ భావం వీడవలె.
11. శాంతబుద్ధి వీడకు’’ మొదలగునవి ఎన్నెన్నో…
సిద్దప్ప వరకవి కాలజ్ఞాని. నైజాం ప్రభుత్వం కూలుతుందని, కరీం నగర్‌కు దక్షిణాన పెద్ద జలాశయం (మానేరు) ఏర్పడుతుందని ముందే ఊహించి చెప్పారు. ఆయన జ్ఞానబోధనలతో మన రాష్ర్టంలోనే కాకుం డా పొరుగు రాష్ట్రాలలో కూడ భక్తాభిమానులు తయారయ్యారు. ప్రతి సంవత్సర కార్తీక పౌర్ణమి గురుపూజోత్సవం సందర్భంగా గుండారెడ్డి పల్లెలో సమారాధానోత్సవం జరుపుతారు. ఈయన సమాధి వద్ద సాహి తి గౌతమీ కవి సమ్మేళనం నిర్వహించింది. పరిశోధకుడు జయధీర్ తిరుమల్‌రావు సిద్దప్పను వేమనతో పోల్చాడు. బిరుదు రామరాజు యెగుల పుస్తకంలో సిద్దప్ప గూర్చి సమీక్షించారు. సురవరం ప్రతాపరెడ్డి ‘గోలుకొండ కవులు’ సంచికలో 10వ స్థానం కల్పించారు. 2012 కార్తీక పౌర్ణమి రోజున తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యం లో ‘‘సిద్దప్ప వరకవి జీవితంసాహిత్యం’’ అను అంశంపై సదస్సు నిర్వహించారు. పెద్దింటి అశోక్ కుమార్, జనపాల శంకరయ్య, తైదల అంజయ్య, వెంగళి నాగరాజు, సిద్దెంకి, పొన్నాలలు పాల్గొన్నారు.
సిద్దప్ప కుమారులు వీరేశలింగం బిక్కనూర్‌లో ఆశ్రమం నడుపు తుండగా చిన్నకుమారుడు మాణిక్యలింగం ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ గుండారెడ్డిపల్లెలో తండ్రి ఆశయం కొనసాగిస్తున్నారు. సిద్దప్ప వరకవి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ప్రజాకవి.. మట్టిలో మాణిక్యం.
వాసరవేణి పరశురాం


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *