‘తెలంగాణ తల్లి రూపకర్త’

తోపారపు గంగాధర్

జీవితసాఫల్యపురస్కారం సాధిస్తే ఇక జీవితంలో అంతకు మించింది మరొకటి ఉండదు. తెలంగాణ సమాజంలో అలాంటి ఘనతను సాధిస్తే, తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతే అంతకు మించిన విజయం మరొకటి ఉండదు. అలాంటి ఘనతను సాధించిన కళాకారుడు తోపారపు గంగాధర్. చిత్రకళ, శిల్పం తదితరాల్లో తనదైన ప్రతిభను చాటుకున్న గంగాధర్ ‘తెలంగాణ తల్లి రూపకర్త’గా కేసీఆర్ నుంచి సన్మానం పొందారు. 2007లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ సత్కారాన్ని పొందారు. తెలంగాణ తల్లిని ఆయన చిత్రించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
గంగాధర్ అద్భుత ప్రతిభాపాటవాలకు ‘మెచ్చు’తునకలు ఎన్నో. హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్ వద్ద ఐమాక్స్ చౌరస్తా వద్ద 2009లో నెలకొల్పిన ఇందిరాగాంధీ విగ్రహం ఆయన రూపొందించిందే. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో 2002లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం రూపకర్త కూడా ఆయనే. అదే విధంగా 1996లో ఎన్టీఆర్ గార్డెన్స్‌లో నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన రూపొందించారు. హైదరాబాద్, కాకినాడ, అనంతపూర్‌లలోని జేఎన్‌టీయూ కేంద్రాల్లో 2007లో నెలకొల్పిన జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహాల రూపకర్త కూడా ఆయనే. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మరెన్నో విగ్రహాలు కూడా గంగాధర్ రూపొందించినవే.
గంగాధర్ వేసిన చిత్రాలెన్నో వివిధ ప్రచురణల్లో, పాఠ్యపుస్తకాల్లో, పిల్లల పత్రికల్లో ముద్రితమయ్యాయి. బాలచెలిమి, చెకుముకి, అక్షరదీక్ష లాంటివి వీటిలో ఉన్నాయి. గంగాధర్ ప్రస్తుతం హైదరాబాద్ లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో అప్లయ్‌డ్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
గంగాధర్ పుట్టింది నిజామాబాద్ జిల్లాలో అయినా చిన్నప్పటి నుంచి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు వి.వి. అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో, ఎనిమది నుంచి పదో తరగతి వరకు వి.వి. బాయ్స్ హైస్కూల్‌లో చదివారు. జేఎన్‌టీయు ఫైన్‌ఆర్ట్స్ కాలేజీలో అప్లయ్‌డ్ ఆర్ట్‌లో ఐదేళ్ళ డిప్లొమా కోర్సు చేశారు. ఆ తరువాత అక్కడే పీజీ చేశారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *