తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య

తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఒక సాధారణ కుటుంబంలో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామంలో పుట్టినాడు. అప్పట్లో అక్కడి ప్రజలు విసునూర్ దేశ్‌ముఖ్‌లు, నిజాం నవాబు కాళ్లకింద నలిగి పోయారు. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య వాదంలో భాగమైపోయినా హైదరాబాద్ రాష్ర్టం మాత్రం నిజాం పాలనలోనే ఉండింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా వందలాది మంది తమ ప్రాణాలు త్యాగాలు చేశారు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం అంటూ ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వన మె ్వల సాయుధ పోరాటం ప్రారంభమయింది. రజాకార్లు, విసునూర్ దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీల దోపిడీలు అంతులేకుడా పెరిగిపోయి నాయి. స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. గ్రామాలకు గ్రామాలకు తగులబెట్టినారు. నిజాం సిబ్బంది దాడులకు, రజాకార్ల దుర్మార్గాలకు తట్టుకోలేక వేలాది మంది సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు.
విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొర సాని. ఆమె కడివెండిలో వుంటుంది. వీరు ప్రజల పట్ల అతి క్రూరం గా వ్యవహరించేవారు. మనషులను వెట్టిచారికి చేయించడంలో వడ్డీ నాగులు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు వేయడంలో, జరిమానాలు వసూలు చేయడంలో పేరుగాంచింది. వెట్టి చాకిరికి దోపిడికి వ్యతి రేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రామచంద్రా రెడ్డి కడివెండి వెళ్లి ఆంధ్రమహాసభ సందేశాన్ని ప్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. అందులో చేరేందుకు ఉత్సాహాంగా యువతి యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలపడింది. గ్రామంలో వెట్టి చాకిరిని నిరూల్మించారు. విసునూర్ దొరలు ఆటలను అరికట్టారు. 1946 జులై 2న విసునూర్‌కు నైజాం అల్లరి మూకలు వచ్చాయి. ప్రజలంతా ఏకమై కర్రలు, వడిశెలలు, గుతుపలు అందుకుని రజాకార్లను తరిమికొట్టారు.
కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి, విసునూర్ దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ మరింత ముందుకు సాగుతున్నా రు. అశేష ప్రజానీకమంతా ధైర్య సాహసాలతో ప్రాణాలకు బరి తెగించి రజాకార్లను ఎదుర్కోవడానికి బొడ్రాయి వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసిన నైజాం అల్లరి మూకలు ఏకపక్షంగా కాల్పులు జరిపాయి. ఊరేగింపులో అగ్రభాగంలో ఉన్న దొడ్డి కొమరయ్యకు తుపాకి తూటాలు కడుపులో దిగడంతో కమ్యూనిస్టులు నాయకత్వం వర్దిల్లాలి, జై ఆంధ్రమహాసభ అంటూ కుప్పకూలినాడు. తోటి కార్యకర్తలు నైజాం అల్లరి మూకలపై దాడులకు పూనుకుంటు న్నారు. భూస్వామి విసునూర్‌లపై అణిగిమణిగున్న ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. ప్రజలంతా మూకుమ్మడిగా విసనూర్ భూస్వా ముల గడీలపై దాడులు చేసి రజాకార్ల గుండాలను తరిమి తరిమి కొట్టినారు. నైజాం అల్లరి మూకల తుపాకి తూటాలకు దొడ్డి కొము రయ్య నేలరాలినా తెలంగాణ వీరపోరాటంలో చెరగని ముద్ర వేసుకున్నాడు. దొడ్డి కొమరయ్య మరణవార్త జనగామ ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరికీ విషాదకరమయిన వార్తయింది. దేశ్‌ముఖ్ విసునూర్ ఆగడాలను ఎదుర్కొనడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు నిర్మల్ కృష్ణమూర్తి నాయకత్వంలో 6వేల మంది ప్రజాసైన్యం బరిసెలు కర్రలలతో కడివెండికి వచ్చారు. అదేరోజు జనగామలో దొడ్డి కొమరయ్య మృత దేహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయ కత్వంలో అంతిమ యాత్ర జరుపుతు..
అమరజీవి నీవు కొమరయ్య
అందుకో విప్లవ జోహార్లు కొమరయ్య
న్యాయాన్ని పాతరేసినా నైజామోడు
విశ్వాస ఘాతకుడైనా విసునూర్ దొరోడు
భూమికోసం భూ విముక్తి కోసం
విసునూర్ దేశ్‌ముఖ్‌ల ఆగడాల నెదిరించి
సర్వ మానవ సమతకై అసువులు బాసినా
దొడ్డి కొమరయ్య
నైజాంను తరిమి తరిమి కొట్టా
చీమల దండై కదిలినావా
వీర తెలంగాణ విప్లవ పోరాటంలో
గుండెకు గుండెనిచ్చి రక్తాన్ని ధారపోస్తివా
తరతరాలుగా నీ త్యాగం శాశ్వతంగా వెలుగొందును
అందుకో లాల్ సలాం దొడ్డి కొమరయ్య అంటూ గేయాలు ఆలపించారు. ఊరేగింపు వాడ వాడల సాగింది.దొడ్డి కొమరయ్య వీరమరణంతో సాయుధ పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న పానుగంటి సీతా రామారావు, అనిరెడ్డి రామిరెడ్డి, చలసాని శ్రీనివాసరావు, గాదే మాధవరెడ్డి, గంగసాని తిరుమలరెడ్డి, గంగవరపు శ్రీనివాసరావులు సాయుధ పోరాటంలో చేరారు.
వందలాది మంది విద్యార్థులు ప్రజా ఉద్యమాలకు నాయ కత్వం వహిస్తూ తెలంగాణ ప్రజానీకానికి అండగా నిలిచారు. శత్రు దాడులను ఎదుర్కొనేందుకు ప్రజలు ఎప్పుడు తమ చేతుల్లో కారంపొడి, రోకలి బండలు, కర్రలు పట్టుకుని సిద్ధంగా ఉండేవారు. దొడ్డి కొమరయ్య త్యాగ స్ఫూర్తితో వేలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నాలుగువేల ఐదొందల మంది నేలరాలి నారు. ఆ అమరవీరులు చిందించిన ఎర్రని నెత్తుటి ధారలు మరెందరో పోరాటంలో చేరేందుకు స్ఫూర్తినిచ్చాయి. మృత వీరుల ఆశయాలతో తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచమంతా పరచయమైంది. 1944లో కడివెండిలో నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దొడ్డి మల్లయ్య, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వట్టికోట ఆళ్లురాస్వామిలు ఆంధ్రమహాసభను ప్రారంభించారు. ఒకప్పుడు జనగామ తాలుకా నల్గొండ జిల్లాలో వుండేది. నేడు వరంగల్లు జిల్లాలో కలిపారు. అయ్య. నీ బాంచన్ దొర అంటూ అణిగి మణిగి వున్నోళ్ళే నిప్పురవ్వలై బందూకులు బట్టి నిజాం నవాబు గద్దెను సాయుధ పోరాటం ద్వారా కూల్చి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారు.
దొడ్డి కొమరయ్య హంతకులెవ్వరికీ శిక్షబడలేదు. పైగా రామవరం పోలీస్‌పటేల్ బండిని తగులబెట్టారనే నెపంతో కమ్యూ నిస్టు నతేలు కట్కూరి రామచంద్రారెడ్డి, మర్రి రామిరెడ్డి, కృష్ణమూర్తి, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డిలపై తప్పుడు కేసులు బనా యించారు. ఇవన్నీ తప్పుడు కేసులుగా భావించి న్యాయస్థానాలు కొట్టివేశాయి. నాటి పోరాటం స్ఫూర్తిగా ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకునేందుకు ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
త్యాగాల చిరునామ తెలంగాణ. దొడ్డి కొమరయ్య త్యాగ స్ఫూర్తిని వెలిగించి దోపిడిని నిర్మూలించడమే ఆయనకు అసలైన అశ్రునివాళి. ఆ దిశలో ముందుకు సాగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతో పాటుగా సమసమాజంతో కూడిన తెలంగాణ రూపు దిద్దుకునేందుకు అంతా కృషి చేయాలి. అలా చేసిన నాడే తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఫలించినట్లవుతుంది.
దామరపల్లి నర్సింహారెడ్డి


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *