తెలంగాణ సంస్కృతిలో… ఇప్పచెట్టు భాగమే!

తెలంగాణ రాష్ర్ట అధికారిక వృక్షంగా జమ్మిచెట్టును తాజాగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రజల జీవన సంస్కృతిలో అంతర్భాగమైన ఇప్పచెట్టును అధికారికంగా గుర్తించడమే సముచితం గా ఉంటుందని తెలంగాణ ఆదివాసీల పక్షాన కోరుతున్నాను.
స్వరాష్ర్టంలో ఇటీవల తెలంగాణ ప్రజలు, విదేశాల్లో ప్రవాస తెలంగాణీయులు సైతం అత్యంత వైభవంగా పూలపండుగ ‘బతుకమ్మ’ ను జరుపుకున్నారు. బతుకమ్మలో పేర్చుతున్న గుమ్మడి, గునుగు, తంగేడు, తామర, అల్లి, రేల, మోదుగు, బంతి, టేకు, మందార వంటి పూలను స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. ఈ కోవలోంచి తంగేడు పువ్వును ‘అధికారిక పుష్పం’గా గుర్తించడం ఆనందదాయకం. పక్షులు, జంతు జాతులు అంతరించి పోతున్న నేటి తరుణంలో తెలంగాణాలో విజయ దశమి రోజున ప్రజలకు పాలపిట్ట దర్శన భాగ్యం ఒక శుభ సూచకమని భావించే పాలపిట్టను ‘రాష్ర్ట పక్షి’, అడవుల్లో అరుదైన, అమాయకత్వ జంతువైన జింకను ‘రాష్ర్ట జంతువు’గా ఆమోదించడం మంచి విష యమే! అలాగే జమ్మిచెట్టు విషయంలో పాండవులు పవిత్ర జమ్మి చెట్టుపై భద్రపరిచిన ఆయుధాలతోనే కౌరవులు విజయం సాధించిన పౌరాణిక(థ)త అంగీకరించదగినదే! కాని చెట్టును గుర్తించే విషయం లో ప్రజల అస్థిత్వ కోణం, ఆత్మీయబంధం, బహుళ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపుపొందిన ‘వేపచెట్టు’లో ఉన్న అనేక ఔషధ గుణాలు అందరికీ తెలిసిందే.
ఇప్ప చెట్టుకు అధికారిక ెదా లభిస్తే ఆదివాసీల జీవనం లోంచి తెలంగాణ ప్రజల సంస్కృతికి కూడా దగ్గరవుతుందనడంలో అతిశయోక్తిలేదు. తెలంగాణప్రజల సాంస్కృతిక జీవనానికి, ప్రత్యేకించి ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు అనువైన ఇప్పచెట్టు గురించి పలు ఆసక్తికర విషయలు తెలుసుకోవాల్సిన సందర్భమిది. ఇప్పచెట్లు తెలంగాణలోని అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల్లో, వ్యవసాయ భూముల్లో విరివిగా ఉంటాయి. ఇప్ప శాస్త్రీయనామం మధుకా ఇం డికా. ఇది సపోటియేసి కుటుంబానికి చెందినది. దీనిలో ఔషధ గు ణాలు మెండుగా ఉంటాయి. మూలికా వైద్యంలోనూ ఇది సామాన్య జనానికీ అందుబాటులో ఉండే చెట్టు. కావున దీనిని తెలంగాణ రా ష్ర్ట వృక్షంగా గుర్తిస్తే అంతరించిపోయే ఈ వృక్షజాతికి జీవనం పోసిన ట్టవుతుంది. అనాదిగా అడవుల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరి జనులు ఇప్పచెట్టు ప్రాధాన్యాన్ని తొలిసారి గుర్తించారు. ప్రకృతిలో చెట్ల చరిత్ర ఆదివాసీల జీవనంతో ముడిపడి వుంది. ఆదివాసీలు అ నాది కాలంగా చెట్లు, పుట్టలు, ప్రాణులు, కొండలు, బండలను పవి త్రంగా పూజిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 10 తెగల ఆదివాసీ ప్రజల సంబంధ బాంధవ్యాలు గోత్రాలతో ముడిపడి ఉంటాయి. ఆదివాసీలు ముఖ్యంగా కోయలు, కొండరెడ్లు, గోండి, కోలాం, పర్థాన్, మన్నే వార్లు, అంథ్, తోటి, నాయక్ పోడ్, చెంచులు తెలం గాణకు చెందిన వారు.
ఆదివాసీలలో ముఖ్యంగా కోయ తెగలో 3,4,5,6,7 గోత్రాలు కలిగిన వారున్నారు. మూడవ గోత్రం (భరద్వాజ) వారి గోత్ర సంకేతం చెట్టు. వీరితో సహా ఇతర గోత్రాల వారు తమ సంస్కృతి ఆరాధనలో భాగంగా చెట్టును పూజించడం ఆనవాయితీగా ఉంది. ఆదివాసీ సంస్కృతిలో లోహవిగ్రహారాధన లేదు. తమ దేవతల ప్రతిమలను కర్ర దుంగలతో ఏర్పరచి రాళ్ళ మధ్యగాని, మట్టిలోగాని ప్రతిష్టించి పూజిస్తారు. వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క, సారక్క జాతరలో వనదేవతల ప్రతిమలు పరిశీలిస్తే ఆదివాసీల ప్రకృతి ఆరాధనను అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీలు గోత్రాలను బట్టి తమ దేవుళ్ళ పండుగ లను చెట్ల కింద జరుపుకొని, వాటి ప్రతిమలను (పడిగెలు, గజ్జెలు, పూజా సామాగ్రి) చెట్ల కిందనే బడితెలతో అమర్చిన పందిరిలో దాచి పెడతారు. వీరి సంప్రదాయాల్లో ఇప్పచెట్టుకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం విశేషం.
తెలంగాణలోని ఆదివాసీలలో (చింతూరు, కూనవరం, పోచా రం (ఖమ్మం జిల్లా పరిసరాల్లో) సంప్రదాయంగా చింతచెట్టు మొదలు వద్ద పసుపు కుంకుమలతో ముత్యాలమ్మను తీర్చిదిద్దుతారు. స్త్రీలు, పురుషులు జట్టుగా ఆ చెట్టు చుట్టూర తిరుగుతూ పాటలు పాడుతారు. దీనిని ‘ముత్యాలమ్మ’ పండుగగా పేర్కొంటారు. వీరికి ముత్యాలమ్మ అతి ప్రధాన దేవత. ప్ళ్ళైన ప్రతీ కొత్త జంటను వేప / చింత / ఇప్ప ఏదైనా చెట్టు కింద ముత్యాలమ్మను నిలిపి, వారిని చెట్టు చుట్టు తి ప్పటం ఆచారంగా వుంది. అలాగే అటవీ ఉత్పత్తుల సేకరణకు ముం దుగా ‘మామిడి కొత్త’ పండుగ చేస్తారు. కొత్త సీజన్ (ఉగాది) ఆరంభం లో మామిడి పిందెలను కులపెద్దల సమక్షంలో సమిష్టిగా తిన్న తర్వాత నే అడవి నుండి తక్కిన ఉత్పత్తులను తెచ్చుకోవడం సంప్రదాయం. ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు వారి కుల దేవత ‘పేర్సాపేన్’ పం డుగ సందర్భంలో గ్రామదర్శనం అనంతరం రాత్రి పూట ఇప్పచెట్టు క్రింద జాగారం చేయించడం ఇప్ప చెట్టు పవిత్రకు సంకేతం. అది వారి సంస్కృతిలో భాగం కూడా.
తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ఇప్పచెట్లు ఊరి చివర ఉంటాయి. అవి గ్రామ దేవతలుగా వెలిసి ప్రజలను వ్యాధుల నుండి రక్షిస్తాయని జమానా కాలం నమ్మకం ఉంది. ఇప్పచెట్లు సహజంగా వైశాఖ మాసం (మార్చిఏప్రిల్)లో పూతకు వస్తాయి. ఆదివాసీలు రెండో పంటగా భావించే తునికాకు సేకరణ పూర్తయ్యాక అనగా మే నెలలో కాయలు, పండ్లు, గింజలను రాలుస్తాయి. పూత పరిమళం వాతావరణంలో సుగంధ భరితంగా మత్తుగొలిపే విధంగా ఉంటుంది. ఇప్ప పండ్లు తీపిగా ఉంటాయి. ఆదివాసీలు ప్రత్యేకంగా వీటన్నింటినీ సేకరించడం సంప్రదాయం. ఆదివాసీ గిరిజన మహిళలు ‘ఇప్పపూత’ నుంచి ప్రకృతి సిద్ధమైన పానీయం (సారా) తయారు చేస్తారు. దీనిని తమ వనదేవతలకు తొలుత నైవేద్యంగా సమర్పించిన తర్వాత గిరిజనులు సంప్రదాయ పండుగలు, శుభకార్యాలో సేవించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. తాటిచెట్ల కంటే ఇప్పచెట్లు అతి పురాతనమైనవి. తాటికల్లు (నీరా) సహజ సిద్ధమైనది. ఇప్ప సారా కూడా ప్రకృతి సిద్ధమైనది. ఆరోగ్యానికి హాని కల్గించని సహజమైన ఆల్కహాలు ఉంది. పూర్వం నుండి తెలంగాణలో స్థానిక దేవుళ్ళకు తొలి ప్రాధాన్యంగా సమర్పిస్తారు. తాటికల్లు లాగే ఇప్పసారాను కూడా సురాపానంగా పరిగణించడం సమంజసం. కాకపోతే సారా కాపు కాయడం కష్టతరమైనది. కాబట్టి కొంత అస్థిత్వం కోల్పోయి ఉండ వచ్చు. కల్లు దుకాణాల తరహాలో ఇప్పసారాను కూడా ప్రభుత్వమే విక్రయిస్తే ఆదివాసీలకు ఆర్థిక లబ్ధి సమకూరుతుంది. మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ గుడుంబాను నియంత్రించే చర్యలకు ప్రభు త్వం పూనుకోవచ్చు.
ఇప్పచెట్టు ఔషధ, పోషక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ఆదివాసీలు తొలిసారిగా గుర్తించారు. అనాది నుంచి ఇప్పచెట్లు వారి నిత్య జీవితానికి కల్పతరువు. వారి ఆచార సంప్రదాయాలను ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరులు ఆసక్తిగా పరిశీలిస్తూ అనుసరించడం విశేషం. పూర్వం ఆదివాసీలు వ్యవసాయం, పంటల దిగుబడి వంటి విషయాలు తెలుసుకొనుటకు పంచాంగం అందుబాటులో లేని కాలం లో ఇప్పపువ్వు ద్వారా వర్షం పడే కార్తెలను గుర్తించారు. సమీప అడవిలోకి వెళ్ళి ఏఏ కార్తెలలో వర్షాలు పడతాయో తెలుసుకోవడానికి నీటిగుంటలో ఒక్కొక్క కార్తె పేరు చదువుతుండగా ఇప్ప పువ్వు వేస్తారు. ఏ కార్తె చెప్పినప్పుడు పువ్వు మునుగుతుందో అదే కార్తెలో వర్షాలు పడతాయని నమ్మకం. ఇలాంటి విషయాలపై అధ్యయనం జరగాల్సి ఉంది.
ఇప్పచెట్టు కలప వృక్షంగా ఉపయోగపడకపోయినా ఇది అనేక ఆహార పదార్థాల తయారీలో కూడా ఆదివాసీ, దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తోంది. అప్పుడే రాలిడిన పూత తీపిగానే ఉంటుంది. ఎండిన పూత నుండి పేలాలు, గుడాలు చేస్తారు. ఆదివాసీలకు చక్కెర, బెల్లం లభించని పూర్వకాలంలో తీపికి ప్రత్యా మ్నాయంగా రొట్టెల తయారికి ఇప్పపువ్వునే వాడేవారు. తొలకరి జల్లుల సీజన్‌లో పుట్ట / గోడల నుండి వచ్చే ఊసిళ్ళను, ఇప్పపువ్వుతో కలిపి వేపుడు చేసి రుచిని ఆస్వాదించడం మధురమైనది. ఇప్పపూతను ఉలవలతో కలిపితే బలమైన పోషక పదార్థం అవుతుంది. మొక్కజొన్న పిండి, నువ్వుల పిండిలో ఇప్పపూత కలిపి కుడుములు చేస్తారు. వీటిని మట్టి కుండలో చేయడం విశేషం. ఇది ఆకలిని దహించివేసి, రక్తహీనతను నిరోధించే బలవర్థకమైన పోషక పదార్థం.
ఇప్పచెట్టు గింజల సేకరణ ఆదివాసీల ఆహార సేకరణ విధానం లో మరోభాగం. వీరు ఎండబెట్టిన గింజల నుండి పూర్వం గానుక పట్టించి నూనె తీసేవారు. ఇప్పుడు నూనె మిల్లుల ద్వారా సులభతరమ యింది. నూనె తీయగా ఏర్పడిన అధస్థ పదార్థం పిండిని పాడిపశువులు పుష్టిగా ఉండడానికి దాణాగా వాడతారు. ఇప్పనూనె పూజలకు పవిత్ర తైలంగా వాడుతున్నారు. నిత్యపూజలలో ఆవునెయ్యి ఎంత పవిత్రమైనదో ఆదివాసీలకు, దళిత, బడుగు వర్గాల వారికి ఈ నూనె అంత పవిత్రమైనది. ెమాలలో ఆవునెయ్యి దొరకని సందర్భంలో ఇప్పనూనె వాడుతున్నారు. వాస్తవంగా ఇప్పనూనెను అన్ని విధాలుగా వాడేలా చర్యలు తీసుకుంటేనే జీవ వైవిధ్యానికి దోహదకారి కాగలదు. తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళితే భద్రాచలంలోని శ్రీరాముని చెంతకు ఇప్పపూతను నైవేద్యంగా సమర్పించడం గమ నార్హం. దీపావళి రోజున దీపాల వరుసకు ఈ నూనె వాడటం శ్రేయ స్కరం. అయ్యప్ప భక్తులు సైతం దీపారాధనకు దీనినే వాడతున్నారు.
ప్రాకృతిక జీవనంలో ఆదివాసీలు ఆదినుంచి ఇప్పనూనెను వంటనూనెగా వాడటం ఆరోగ్యదాయక విషయం. ఇప్పనూనెలో కొవ్వు గాని, కొలెస్ట్రాల్ గానీ తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్, అధిక బీపీతో బాధపడుతున్న వారికి, హృద్రోగులకు ఇప్పనూనె వాడకం మంచిదని అంటారు. చెట్టు నుంచి వచ్చే పాల ద్రవం (లేటెక్స్)ను పసిపిల్లలకు జలుబు నిరోధకంగా వాడతారు. ఇప్పచెట్టు ఆకులను గ్రామీణులు శుభ, అశుభ కార్యక్రమాలలో నేటికి వాడుతున్నారు. పురాతన సాంప్రదాయక పంటలకు, చీడ, పీడలు సంభవించినప్పుడు జీవనియంత్రణగా, క్రిమిసంహారిణిగా వేపపిండి వలే, ఇప్పగింజల పిండిని పంటలపై చల్లేవారు. అలాగే దీనిని ఇటి లోపల చల్లితే దో మలు, క్రిమి కీటకాలు ఇంటిదరిచేరవు.
ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ, పోషక విలువలు, ఔషధ గుణాలు మెండుగా కలిగిన ఇప్పచెట్టు గ్రామీణులకు ఆరోగ్య ప్రదాయిని. పైగా తెలంగాణ ప్రజల జీవన రీతులు, పండుగలు, ఆ చార సంప్రదాయాలు, కర్మలలోనూ ఇప్పచెట్టు ఆత్మీయబంధం అనన్యమైనది. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపాదించిన రాష్ర్ట చిహ్నాలలో ఇప్పచెట్టు ప్రాధాన్యాన్ని సంతరించుకోవాలి. తెలం గాణ సాంస్కృతిక, జీవన, అస్తిత్వ మూలాలనుంచి ఇప్పచెట్టుకున్న బహుళ ప్రయోజనాల దృష్ట్యా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ర్ట అధికారిక వృక్షంగా ఇప్పచెట్టును గుర్తించాల్సిన సమయమిది. గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీల రచయితల సంఘం,
సెల్: 9951430476


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *