బహుభాషల భాస్కర్ | తెలంగాణ సిగలో బంతిపూవు

పద్నాలుగు బారతీయ భాషలు తెల్సినవారు బహుశా తెలుగు నేల మీద నలిమెల భాస్కర్ తప్ప ఇంకెవరూ లేరు కావచ్చు. తమిళం, కన్న డం, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, పంజాబీ, తెలుగు, సంస్కృ తం, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, ఓరియా, మరాఠి భాషలు ఆయన కు కొట్టిన పిండి. ఈ పద్నాలుగు భాషల నుంచి కథలను తెలుగు లోకి అనువదించారు. మన సాహిత్యాన్ని ఆ భాషలకు అనువదిస్తున్నారు. అయితె ఈ భాషలు వచ్చుడు అనువదిచ్చుడు ఒకెత్తు ‘తెలంగాణ డిక్ష నరీ’ రూపొందించుడు మరొక ఎత్తు. తెలంగాణ భాషనే అసలు సిసలైన తెలుగని ఆంధ్ర భాష వేరు వేరని బల్లగుద్ది మరీ చెప్పుతున్నారు భాస్కర్. ఆంధ్రప్రదేశ్ అనే బద్మాశ్ కలయిక తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడికి గురై తమ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వం కోల్పో యింది. అందులో భాషకూడా ప్రధానమైంది. పాఠ్యపుస్తకాలు, సిని మాలు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ఆంధ్రవంకర యాంటండీ భాష వచ్చి చేరిం తర్వాత తెలంగాణభాష పల్లెలో విద్యాగంధం అంటనివారికే పరిమితమైంది. చాలా పదాలు దాదాపు కనుమరుగు అయిపోతున్నా యి. ఈ సందర్భంలోనే నలిమెలభాస్కర్ 2003లో 000ల పదాలతో లెంగాణ పదకోశం రూపొందించారు. ఆ తర్వాత మరో 2000 పదాలు కలుపుకొని 10,000 పదాలతో 2010లో పునర్ముద్రించారు. 60 ఏండ్ల తర్వాత తెలంగాణ వారికి దూరమైన తమ పదాలకు ఈ డిక్షనరీ చాలా ఉపయోగపడ్డది. ఆ తర్వాత తెలంగాణ పదకోశం అన్ని పత్రికల కార్యా లయాల్లో తెలంగాణ భాషకు ఉపయోగిస్తున్నారు. నలిమెల భాస్కర్‌కు మ్తొం 14 భాషలతో పాటు తెలంగాణ భాషకూడా స్వతహాగవచ్చు. కాబట్టి పదిహేను భాషలు వచ్చిన కింద లెక్క అని ఆయన మిత్రులు అంటు ఉంటారు.
పద్నాలుగు భారతీయ భాషలు నేర్చిన భాస్కర్ తెలంగాణ గడ్డమీద గాకుండ ఇంకే బెంగాల్‌లోనో తమిళ కన్నడంలోనో పుట్టి ఉంటె ఇంక జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేవారనడంలో అతిశయోక్తిలేదు. కోస్తాం ధ్రలో పుట్టినా కాని ఆకాశానికి ఎత్తుకుందురు. కాని ఆయన ఈ ఎత్తు కునుడు గుర్తింపులను ప్టనట్టుగ ఉంటారు.
డాక్టర్ నలిమెల భాస్కర్ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని నారాయణపురంకు చెందిన వారు. ఆయన 1970 నుంచి సాహి త్యం పట్ల ఆసక్తి పెంపొదించుకున్నారు. 1977లో ‘మంద’ అనే కథ వల్ల ఊరి దొరల మీద రాసిన కథ ఆ కాలంలోనే సంచలనం సృష్టించిం ది. ఆతర్వాత 1974లో మానవుడా!(గేయసంపుటి) 1977లో కిరణాలు (వచనకవితాసంపుటి) 197లో ఈతరంపాటలు, 1993లో నూరేళ్ళు పది ఉత్తమ మలయాళ కథలు, 1996లో అద్దంలో గాంధారి మరి పదకొండు కథలు, 2000లో ‘సాహితీసుమాలు’ 2003లో తెలంగాణ పదకోశం, 2005 ‘మంద’ కథల సంపుటి, 2006 మట్టిముత్యాలు, 200 ‘బాణం’ తెలంగాణ వ్యాసాలు, 200 ‘సుద్ద ముక్క’ కవితా సంకలనం, 2010లో భారతీయవ్యాసాలు, భారతీయకథలు, భారతీయ సామెతలు, దేశదేశాల కవిత్వ, 2010లో ‘స్మారక శిలలు’ ‘మలయాళం’ అనువాద నవల వెలువరించారు. ఇవి గాకుండా కొన్ని వందల వ్యాసా లు వివిధ పత్రికల్లో ప్రచురించారు. ‘బాణం’ సంకలనంలో తెలంగాణ భాషకు సంబంధించిన వ్యుత్పత్తి పదాలు పుట్టుక వివరించారు. తనకు తెలిసిన ద్రావిడ భాషల మేళవింపులో తెలంగాణ భాషకు శాస్త్రీయతను ప్రతిపాదించారు. 2001లో తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భంలో తెలంగాణ భాష సంస్కృతిక విషయాలపట్ల నలిమెలభాస్కర్ ఆలోచనను పెంపొందించి ఆయా సదస్సుల్లో తెలంగాణ భాష గూర్చి ప్రసంగిం చాడు. 2001లో సిద్దిపేట, వరంగల్‌లో జరిగిన ఆవిర్భావ ప్రధమ తెలంగాణ రచయితల వేదికల్లో భాష గూర్చి పదాల పుట్టుక గూర్చి మన మూల భాష గూర్చి సవివరంగా ప్రసంగించడంతో తెలంగాణ సాహిత్యకారుల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన స్పృహ పెరిగింది. ఆతర్వాత చాలా విషయాలలో పత్రికల్లో వచ్చిన వ్యాసాలలో మన భాష మనదే అన్న రీతిలో తెలంగాణ కవితాసంకలనాలు కథ సంకలనాలు వెలువడ్డా యి. ఈ క్రమంలో నలిమెలభాస్కర్ తెలంగాణ భాషకు సంబంధించిన వ్యాకరణ అంశాలను శాస్త్ర బద్దత చేశారు.
‘మంద’ కథల సంకలనంలో 14 భాషలకు చెందిన కథలు ఉన్నాయి. ‘మంద’ మాత్రమే తెలుగు కథ. ఇవే గాకూండా గోపి నానీల సంకలనంను తమిళంలోకి అనువదించారు. అలిశెట్టి ప్రభాకర్ కవి త్వాన్ని తమిళంలోకి అనువదించారు. అవి ఇంకా అచ్చుకాలేదు. నలి మెల భాస్కర్ ఇంట్లోకి వివిధ భాషలకు సంబంధించిన సాహిత్యపత్రి కలు, మాస పత్రికలు వస్తాయి. ఆయన ఇంటికి పోతె పెద్ద రైలేే్వస్టేషన్ బుక్ స్టాల్‌ను చూసినట్లు అన్ని భాషల పత్రికలు కన్పిస్తాయి. అన్ని భాషల డిక్షనరీలు కూడ కన్పిస్తాయి.
భాషలకు మూల సుక్కలా తెలంగాణ నుంచి బహుభాషల భాస్కర్ గా వెలుగొందుతున్న నలిమెల భాస్కర్ తెలంగాణ రచయితల వేదిక నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. 2011 నుంచి అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. 2012లో తెలంగాణ ఉద్యమ కవిత్వాన్ని అన్నవరం దేవేందర్ సహ సంపాదకత్వంలో ‘ఉడాన్’ పేర హిందీలోకి అనువాదం వెలువరించా రు. యన్.ఆర్.శ్యాం హిందీ అనువాద ‘ఉడాన్’ ఉత్తరాది సాహిత్య కారులకు తెలంగాణ ఉద్యమం గూర్చి తెలుసుకోగలిగారు. 2013లో కరీంనగర్‌లో నగునూర్ శేఖర్, నాగభూషణం, జూకంటి జగన్నాథం, సూరేపల్లి సుజాత, వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్‌లు మరికొందరు సాహిత్య మిత్రులు కలిసి కరీంనగర్ అఖిల భారత తెలంగాణ రచయి తల వేదిక మహాసభను నిర్వహించారు.
ఈసభలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులని ఎలుగెత్తి చాటారు.
రచయితగ కవిగా అనువాదకుడిగానే గాకుండా నలిమెల భాస్కర్ మంచి ఆదర్శ అధ్యాపకుడిగా కీర్తి గడించారు. లెక్కల ఉప్యాధాయునిగా ఉద్యోగంలో చేరిన భాస్కర్ తర్వాత స్వయం కృషితో ఎంఎ, ఎంఫిల్, పిహెచ్‌డి పూర్తి చేసి కరీంనగర్ యస్.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాలలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆధ్యాపక వృత్తిలో నిక్కచ్చి పద్దతి. భాస్కర్‌సార్ పాఠం చెప్పిండంటే ఆ విద్యార్థికి మనసుకు ఎక్కల్సిందే. అట్లా ఆయనకు వేలాదిమంది ఆత్మీయ శిష్యులు మిత్రులయ్యారు. అయితె నలిమెలభాస్కర్‌కు కొంచెం అనారోగ్యంతో ఇంకా చేయాల్సిన కృషి చేయలేక పోతున్నారు.
ఇన్ని భాషలు తెల్సిన అనువాదకుడిగా రచయితగా విసృత అధ్యయనం చేస్తున్న నలిమెలభాస్కర్ ప్రస్తుతం తెలంగాణ సందర్భంలో ఆయనతో పంచుకున్న నాలుగు మాటలు.
తెలంగాణ సాహిత్యాన్ని జాతీయస్థాయిలో నిలబెట్టాలెష్టం
ప్రశ్న: తెలుగు సాహిత్యం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం ఏ స్థాయిలో అవుతుంది. ఇందులో తెలంగాణ సాహిత్యస్థాయి ఎంత?
జవాబు: ఇతర భాషల్లోకి తెలుగు సాహిత్య చాలా తక్కువగా అనువాదం అవుతోంది. కారణం అనువాదాల మీద మనకున్న చిన్న చూపు, పలుచతక్కువతనం. మనం అనువాదకుల్ని గుర్తించి పొరుగు భాషల్లోకి తీసుకొనిపోవాలె. ఈ పని సీరియస్‌గా జరుగతలేదు. ఎవరికి వారు విడిగా అనువాదం చేయించుకుంటున్నరు. అది వేరే సంగతి. తెలుగు సాహిత్య సమగ్ర స్వరూప స్వభావాలు మాత్రం ఇతరులకు తెలవవల్సినంతగా తెలుస్తలేవు. ఇంక తెలంగాణ సాహిత్య స్థాయిని అనువాదంలో చూపించుడు మరీ తక్కువైపోయింది. కాకపోతే ఈ మధ్య మూల భాషా రచయితలకు అనువాదాల మీద మునుపటికన్నా కొంత సోయి పెరిగింది. ఇది ప్రతిఫలాపేక్ష లేకుండా జరగవల్సిన పని.
ప్రశ్న: బహుభాషల సాహిత్య పరిచయంతో పాటు అన్ని భాషల కథలను అనువాదం చేశారు కదా. ఆ సాహిత్యాన్ని పోల్చుకుంటే తెలుగు సాహిత్య పరిణామాలు ఎలా ఉన్నాయి..?
జవాబు: ఏ సాహాత్యాన్ని తీసుకున్నా ఆ సాహిత్యంలో ఆనాటి సమాజంలోని మంచిచెడులు, ఆటుపోట్లు, ఆచార వ్యవహారాలు మొదలైన అంశాలుంటై. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాలు, దేశ వ్యాప్తంగా జరిగిన పరిణామాలు అన్నీ ఆయా సాహిత్యాల్లో కొంచెం ముందువెనుకా కనిపిస్తై. ఉదాహరణకు బెంగాలీ సాహిత్యం ముందు వరుసల ఉండేది. కారణాలు అక్కడికి ఇంగ్లోషోళ్లు వచ్చుడు, ప్రింటింగ్ ప్రెస్‌లు, పేపర్లు మొదలైనవన్నీ పెట్టుడు. ఇటీవల దళిత ఉద్యమం చూడుండ్రి. మహారాష్ర్టలో, గుజరాత్, కన్నడంలో ఆ ఉద్యమాలు ముందొచ్చినై. కనుక మనకన్నా దళిత సాహిత్యంలో వాళ్లు ముందు న్నరు. అయితే విప్లవ సాహిత్యంలో మనం ఇతరులకన్నా ముందున్నం. తెలుగుల కవిత్వం, కథ, నవలలు పేరు తెచ్చుకున్నంత ఇతర ప్రక్రి యలు నిలబడలేదు. కన్నడంలో హాస్యం, వ్యంగ్యం, మినీ కవితలు ఇప్పటికి కూడా ఉన్నాయి. తమిళం చారిత్రక నవలల్ని సీరియల్‌గా చదువుతారు. గుజరాతీ బెంగాలీల్లో ఇప్పటికి గూడ డిటెక్టివ్ సాహిత్యం ఉన్నది. మరాఠీల హాస్యం, వ్యంగ్యం చాలా ఉన్నది. హిందీల హరి శంకర్ పర్సాయి వంటి రచయితలు ఎంతో వ్యంగాన్ని సృష్టించిన్రు. మలయాళంల నవలల్ని, కథల్ని సినిమాలుగా నిర్మిస్తున్నారు. ఏదేమైన దళిత స్త్రీ మైనార్టీ విప్లవ సాహిత్యాలు అన్ని భాషలోకి కొంచెం అటోఇటో వచ్చినై. ఆదివాసీ సాహిత్యం అస్సామిన్, బెంగాలీల్లో వచ్చి నంత మన దగ్గర రాలేదు. మరాఠీలో వచ్చినట్టు మనకు ఆత్మకథలు లేవు. తెలుగు వాళ్లు కొంచెం మూసల జీవిస్తున్నరు అనిపిస్తుంది. కాని ప్రాంతీయ సాహిత్యం విషయంలో తెలంగాణ ముందుంది.
ప్రశ్న: తెలంగాణ సాహిత్య వ్యాప్తి ఉద్యమకాలంలోనే ఎక్కువగా జరిగిందా.. దాని తీరుతెన్నులు తెలుపండి
జవాబు: తెలంగాణ సాహిత్యమైనా, ఏ సాహిత్యమైనా సమాజ ప్రతిఫలమే. సమాజ ఉద్యమం ఉంటే సాహిత్యం ఉంటది. తెలంగాణల కడుపుమండిన సాహిత్యం ఉన్నదంటే ఇక్కడి పరిస్థితులు అట్లనే ఉన్నయి మరి. ఇతర ప్రాంతంల కడుపునిండిన సాహిత్యం ఉన్నదంటే కారణం అక్కడి సమాజమే. తెలంగాణ ఉద్యమం ఎంతో మందిని కవు ల్ని, రచయితల్ని, గాయకుల్ని, కళాకారుల్ని తయారుచేసింది. ఉద్యమ మే ఊపిరి. ఈ ప్రభావం అసర్ తెలంగాణ సాహిత్యమ్మీద పడ్డది. చిత్రం ఏందంటే భాష మీద కూడ పడ్డది. తెలంగాణ భాషల కవిత్వం రాసుడు, కథలు రచించుడు, నవలలు నడిపించుడు, పాటలు అల్లు కొనుడు.. ఇవన్ని జరిగినై. ఇది చిన్న మార్పు కాదు. సరే… ఇందులో గట్టియి నిలుస్తయి వట్టియి పోతయి. అది ఎప్పడుండేదే..తెలంగాణ రచయితల వేదిక పుట్టినంక తెలంగాణ భాషల సాహిత్య సృజన చేసుడు మరింత ఎక్కువైంది. పిల్లలు కూడా పాటలు రాసుడంటే ఎంత సంబుర మైన ముచ్చట.
ప్రశ్న: తెలుగు భాష, తెలంగాణ వేరు కాదా ..అయితే ఎట్లా…?
జవాబు: తెలుగు భాష అన్నా, తెలంగాణ భాష అన్నా ఒక్కటే. ఆంధ్ర భాష వేరు. ఎందుకంటే… ఆంధ్ర అన్న పదంలో ‘ధ’కు ఒత్తు ఉన్నది. ఈ ఒత్తక్షరాలు (మహాప్రాణాలు) తెలుగులో లేవు. ఇవ్వి సంస్కృత అక్షరాలు. క్రమంగా మన భాషలోకి వచ్చి చేరినై. ఇప్పుడు తెలుగు వర్ణమాలలో ఉన్న ఒత్తు అక్షరాలన్నీ సంస్కృతానివే. కావాలను కుంటే చిన్నయసూరి, బహుజనపల్లి సీతారామాచార్యుల బాల ప్రౌడ వ్యాకరణాలు చూడుండ్రి. తెలుగు భాషకు అక్షరాలు ఇన్ని అన్ని, ఆంధ్ర భాషకు అక్షరాలు ఇన్ని అని వాళ్లిదరు ఎన్నడో సూత్రాలు రాసిండ్రు. ఖండవల్లి సోదరులు రాసిన ‘ఆంధ్రుల చరిత్రసంస్కృతి’ చదివినా.. గంటి జోగి సోమయాజి ‘ఆంధ్ర భాష వికాసం’ చూసిన, సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణము పదానికి తెలుంగు ఆణెము అంటే తెలుగు స్థానము అని వివరించి చెప్పినా ఈ విషయం అర్థమైతది. అంతెందుకు పదాలు, పదబంధాలు, సామెతలు, వాక్య నిర్మాణ పద్దతి, విభక్తి ప్రత్యయాలు, వ్యాకరణం ఇ్వన్నీ రెండు భాషలకు వేరువేరుగా ఉన్నై. మనం నాలికె సందుల ముల్లు ఇరిగినట్లయింది నాబతుకు అంటం… వాళ్ళు ఇదెక్కడి ధర్మసంకట పరిస్థితిరా నాయనా… అని వగరుస్తారు. మనం జెర్ర చెయ్యి తిరుగంగననే నీబాకి కడుత తియ్యి అంటుంటాం. వాళ్లు ఈయన చేయి తిరిగిన రచయిత అంటున్నారు. అక్కడా ఇక్కడా చేయి తిరుగుడు అంటే అర్థం ఒక్కటేనా లేదు.. అట్ల లక్ష ఉదాహరణలు చెపొచ్చు. రెండు ప్రాంతాలు వేరైనప్పుడు, రెండు ప్రాంతాల సంస్కృతులు వేరైనప్పుడు రెండు ప్రాంతాల్లో ఉన్న భాష కూడా వేరుగనే ఉంటది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు రెండింటిని కృష్ణా, గోదా వరులు వేరుచేసినై. అటువంటప్పుడు ఆ భాషలు కూడా వేరుగా ఉన్నె.
ప్రశ్న: తెలంగాణలో పాట, కవిత్వం విస్తరించినట్టు కథ విస్తరించలేదు.. ఎందుకు?
జవాబు: తెలంగాణల్నే కాదు… మొత్తం తెలుగుల ఇదే పరిస్థితి. అయితే పాట వెంటనే హృదయానికి హత్తుకుంటది. ఉద్యమం నుంచి పాటకు ఊపిరి దొరికింది. పైగా పాట ప్రజల భాషల ప్రజల గోసను వినిపిస్తది. సంగీత ప్రధానమైంది కనుక పాట ఎవలపైనా ఆకర్షిస్తది. ఇగ… కవిత్వం గూడ అటువంటిదే. అప్పటికప్పుడు ఆవేశంగా, కొత్తగ సహజంగా ఊహాశాలీనతతోటి వచ్చేది కవిత్వం. పాఠకులు వెంటనే చార్జ్ అవుతరు. సమయం కూడా ఎక్కువ తీసుకోదు. కథకు ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. కథకు ఒక ప్లాన్ ఉంటది. అదంతా చదివితే గాని కథల ఉన్న సారం దొరకదు. చదివినంక ఆ కదలించే గుణం ఉంటే ఆ కథ బతుకతది.
ప్రశ్న: పస్తుత తెలంగాణ సాహిత్య వాతావరణం గురించి చెప్పండి..?
జవాబు: ఆశాజనకంగానే ఉంది. అయితే తెలంగాణ సాహిత్యంల ఇంకా కొన్ని గ్యాపులు ఉన్నై. తెలంగాణ భాష చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర (సుంకిరెడ్డి కొంతవరకు చేశాడు) తెలంగాణ నిఘంటు నిర్మాణం (రవ్వా శ్రీహరి మొదటి వ్యక్తి), తెలంగాణ చరిత్ర, తెలంగాణ వ్యాకరణం, తెలంగాణ ప్రాచీన కవుల పదప్రయోగ సూచికలు (పోతన, పోమనాథులకు) తెలంగాణ ప్రామాణిక భాష (ముత్యం నిర్వహించిన శాతవాహన తెలుగు విభాగపు రెండో సెమినార్‌లో నా ప్రసంగ వ్యాసం బహుశ మొదటిదై ఉండాలి) మొదలైన ఖాళీలన్నీ పూరించాలె. కవిత్వం, కథలు, నవలలతోపాటు ఆత్మకథలు సజీవమైన భాషల రాయాలె.
ప్రశ్న: తెలంగాణ నిఘంటువు రూపొందించారు కదా…దాని అనుభవాలు..?
జవాబు: తెలంగాణ ఉద్యమం, సిద్దిపేట మరసం సభలు, మా ఆమె సావిత్రి ఎత్తిపొడుపు మాటలు (నీకు తెలంగాణ భాష వస్తదా వంటివి…) తెలంగాణ నిఘంటువు రంగంలో ఉన్న ఖాళీ… ఇటువం టివి అన్ని కల్సి నన్ను నిఘంటువు నిర్మాణ రంగంలోకి దింపినై. అయితే ఒక్క ఆరు నెలలు అదే పనిమీద ఉన్న ఆంధ్ర భాషల ఉన్న ప్రతిమాటకు తెలంగాణల ఎట్ల ఉంది అని ఆలోచించి రాసుకునేటోన్ని. నా చిన్నప్పటి మాటలు,ఆటలు అన్ని గుర్తు చేసుకునేటోన్ని. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలల్ల ఒకే రకంగా ఉన్న పదాలను చెట్టు, పుట్ట, ఆకు, ఇల్లు..ఇటువంటి వాటిని నిఘంటువుల చేర్చలే. దాదాపు అక్కడ, ఇక్కడ వేరువేరుగా ఉన్న పదాలను సేకరించిన. రెండో ముద్రణకు ఇంకొక మూడు వేల పదాలు కల్పిన. అది దాదాపు తొమ్మిది వేల పదాల నిఘంటువు. ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది.
ప్రశ్న: తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కదా. రానున్న రోజుల్లో ప్రధానంగా ఏయే కార్యక్రమాలు చెపట్టబోతున్నారు.
జవాబు:అఖిల భారత అధ్యక్ష పదవికి ఎన్నుకున్నందుకు సంతో షంగా ఉంది. ఇది ఏనాడూ ఆశించని పదవి ఊహించనిది కూడా. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకన్నా ఢిల్లీ నేషనల్ బుక్‌ట్రస్టు ప్రెసిడెంట్, చైర్మన్ పదవుల కన్నా ఉచితమైన, సమున్నతమైన స్థానంల్ని దక్కినంత ఆనందంగా ఉంది. అయితే పదవి లో ఉండగా చేయాల్సిన పనులు చాలా ఉన్నయ్. ముందుగా తెలంగాణ సాహిత్య తీరుతెన్నులను, విశిష్టతలను జాతీయ స్థాయిలో తెలియజేయా ల్సిన అవసరం, బాధ్యత రెండూ మామీద ఉన్నయ్. తెలంగాణ కవిత్వాన్ని హిందీ, ఇంగ్లీష్‌లోకి తీసుకుపోవాలె…కథా సాహిత్యాన్ని కూడా ఇతర భాషల్లోకి అనువాదం చెయ్యాలె లేక చేయించాలె. దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు, సెమి నార్లు నిర్వహించాలె. త్వరలోఏ పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు చేసు కొని ఇరుగుపొరుగు భాషల వారికి తెలంగాణ సాహిత్యపు ‘దమ్ము’ ఏమిటో చెప్పాలె.
ప్రశ్న:తెలంగాణలో మాట్లాడుతున్నది భాషనా..? మాండలిక మా?
జవాబు: మనం మాట్లాడేది భాష వాళ్లది మాండలికం. నిజానికి ఏ భాష అయిన అది ముందు మాండలికం. అయితే మరి మాండలికం భాష ఎప్పుడు అయితది అంటే ఆ మాండలికంల ఉన్న ఎలైట్ వర్గాలు అంటే చదువుకున్న శిష్టశ్రేణులు సాహిత్య సృజన చేసినప్పుడు, కోస్తాలోని రెండున్నర జిల్లా విద్యావంతుల మాండలికం భాషగా మారి పెత్తనం చేస్తున్నది. వాస్తవానికి విద్యావంతులు మాట్లాడంగనే సాహిత్య సృజన చేయంగనే ఆ మాండలికం భాషగా మారకూడదు. ఆ మాండలి కాన్ని భాషగా మార్చకూడదు. కాని ఇక్కడ మార్చారు. మరి తెలంగాణల మాట్లాడుతున్నది ‘భాష’ అని ఎందుకంటున్నామంటే.. అసలు సిసలు తెలుగు పదాలు ఈ భాషలో చాలా ఉన్నై, వెనుకబాటుతనం కారణం గానో, మార్పును అంత తొందరగా స్వీకరించని మనస్త్వంతోనో తెలం గాణల పాతమాటలు అట్లనే ఉన్నై. అంటే కాపు, మేర, చల్ల, మెత్త, ఎర్ర, తొక్కు, వాగు, ఇటువంటి అచ్చ తెలుగు పదాలకు లెక్కనే లేదు. ఇప్పటి కోస్తా భాషను చదివినంక మనం ప్రాచీన గ్రంథాలను దగ్గర బెట్టుకున్నామనుకోండి. ఒక్కముక్క అర్థంకాదు. అర్థమైనా పదస్వరూపం చాలా మారిపోయి ఉంటది. తెలంగాణ భాష అటువంటిది కాదు. అది మూల ద్రావిడానికి, ప్రాచీన భాషకు, కావ్య భాషకు, గ్రాంధిక భాషకు దగ్గర. తర్వాత ఏ లెక్కల చూసినా తెలంగాణది భాషనే. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంల తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు మూడున్నై. తెలంగాణల 10, రాయలసీమ4, కోస్తాల 9జిల్లాలున్నై. కనీస ప్రజాస్వా మిక సూత్రం లేదా న్యాయం ప్రకారం ఏ ప్రాంతపు మాండలికం ప్రామాణిక భాష కావాలె? తెలంగాణలో పది జిల్లాల భాషనే ప్రామా ణకం కావాలె.
ప్రశ్న: కొత్త సాహిత్యకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి…?
జవాబు: బాగ చదువాలె. అధ్యయనం చేయాలె. నిరాశపడవద్దు. తెలుగు చక్కగ తప్పులు పోకుండ రాయగలుగాలె. తెలంగాణ వాతావర ణాన్ని జీవద్భాష అయిన తెలంగాణ భాషల రాసి చూపించాలె. ఇక్కడి ప్రజల సుఖదుఖాలు, కష్టానష్టాలు వాళ్ల భాషలో నిజాయితీగా రాయాలె. కదిలిపోయేటట్లు కలకాలం ఉండేటట్లు రాయాలె. ఇతర సాహిత్యాలు చదివితే మంచిది. మంచి రచయిత కన్నా మంచి మనిషై ఉండాలె.
ప్రశ్న: అఖిల భారత తెరవే అధ్యక్షులుగా మీరు చేసిన కార్యక్రమాలు?
జవాబు: గతపన్నెండేళ్ళ తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన 52, కవితల్ని హిందీలోకి ఎన్.ఆర్.శ్యావ్‌ుతో హిందీలోకి అనువదింపచేసి ‘ఉడాన్’ సంకలనం తెచ్చాం మా అఖిల భారత తెరవే కార్యదర్శి వేరు తెలంగాణ ఎందుకావాలి అని మరాఠీలో ఒక పుస్తకం తెచ్చారు. అఖిల భారత తెరవే ఆధ్వర్యంలో కరీంనగర్‌లో 2వ మహా సభలు గొప్పగా నిర్వహించాం.
అన్నవరం దేవేందర్


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *