మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!

అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష, పోరాటం, ఒక వేదన. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి జూలై 30వ తేదీన పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటిస్తూ.. పది సంవత్సరాలు ఉమ్మడిరాజధానిగా ప్రకటించారు. దానినే యూపీఏ కోర్ కమిటీ ఆమోదంతో సెప్టెంబర్ 3వ తేదిన క్యాబినెట్ నోట్ ఆమోదం చేశారు.
ఇక్కడి సీమాంధ్రులతో కలసిమెలసి తెలంగాణ రాష్ర్టం సిద్ధించిన సంతోషంలో మేం ఉంటే మా ఆకాంక్షను అడ్డుకుంటాం అని యుద్ధాలకు ఆహ్వానిస్తున్న ఈ పరిస్థితులలో తెలంగాణ వాళ్లను బానిసలుగా చూస్తున్న వాళ్లతో శత్రువులుగా ప్రవర్తిస్తున్న సీమాంధ్ర పెట్టుబడి రాజకీయ నాయకులతో మేం ఉండలేం. తొందరగా రాజధానిని నిర్మించుకొని వెళ్ళి పొమ్మనాలి. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్‌ను ఆంధ్రులకు అప్పజెప్పడమే అనే వాదన మొదలైంది. ఆ సందర్భంలో వచ్చిన క్యాబినెట్ నోట్ తెలంగాణ ప్రజలను ఇంకా కలవర పరుస్తుంది. కేంద్రపాలిత ప్రాంతం గా చెయ్యం అంటూనే కిరాయిదారునికి హక్కులుంటాయి అనడం, 10 సంవత్సరాల పాటు న్యాయవ్యవస్థ, పబ్లిక్ సర్విస్ కమిషన్ ఉమ్మ డిగా ఉంటుందని చెప్పడం తెలంగాణా రాష్ట్రానికి సరిపోను ఉద్యోగులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఉద్యోగులను వాడుకోవాలి అని చెప్పడం లాంటివి చూస్తే చాలా ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి. ఈ ఆందో ళనలోంచి తేరుకోక ముందే కేంద్రం 10 సంవత్సరాల కాలం గవర్నర్ లేదా కేంద్ర పాలనలో హైదరాబాద్ ఉంటుంది అనడం, సీమాంధ్రు ల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం అంటూ శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన వంటి కీలక విభాగాలను కేంద్రమే పర్యవేక్షిస్తుందని ప్రకటించడం చూస్తుంటే తెలంగాణ ఇస్తున్నాం అని చెప్తూ ఇక్కడ ఉద్యోగావకాశాలు రాకుండా చేస్తూ హైదరాబాద్‌ను కేంద్రం కప్పంగా అడుగుతున్నట్టు ఉంది. మరోవైపు రెండు ప్రతిపక్ష పార్టీ నాయకులు దీక్షలు చేస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేస్తామనడం చూస్తుంటే 175 చదరపు కిలోమీటర్ల నగరాన్ని 2007లో శివారు మున్సిపాలిటీలను ఏకం చేసి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చెయ్యడం వెనుక ఉన్న కుట్ర అర్థమవుతుంది.
ఇప్పుడు రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల లో పలు ప్రాంతాలను కలుపుతూ రూపుదిద్దుకున్న మహా హైదరాబాద్ ను తెలంగాణకు కాకుండా చేసే కుట్ర నడుస్తుంది. హైదరాబాద్‌ను ఒక వ్యాపారవస్తువుగా చూసే వాళ్ళకు, హైదరాబాద్ నిర్మాణ చరిత్ర కన పడదు. అదే తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో నిర్మాణమైన నగరాన్ని కేవలం రాజధానిగా చూస్తున్నారు తప్ప ఇదొక నగరం, ఈ నగరంలో ఉండే ప్రజల ఆకాంక్షలను కాలరాస్తూ పది సంవత్సరాలు బిక్కుబిక్కుమంటూ బ్రతికే అవసరం ఆ నగర వాసులకేంటో అర్థంకావడం లేదు.
ఒకవేళ వాస్తవంగా సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వాలు నడుపు కోవడానికే ఉమ్మడి రాజధాని అయితే కేవలం అసెంబ్లీ, సచివాలయం, న్యాయవ్యవస్థ మరికొన్ని కార్యాలయాలు మాత్రమే ఒక ప్రాంగణంలో ఉంటాయి తప్ప నగరాన్ని, దాని నుండి వచ్చే రెవెన్యూను ఉమ్మడిగా ఉంచేలా కేంద్రం తీసుకోవాలె అనే ఆలోచనతో కేంద్రం మాట మారు స్తుంది. మడమ తిప్పుతుంది. నేనే కట్టిన పన్ను నేనే తీసుకుపోతా అంటే నేరమయమవుతుంది తప్పా న్యాయం కాదు. దాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించి 10 సంవత్సరాలు మీది గాని ప్రాంతంలోనికి, మీదిగాని పట్టణం లోకి వచ్చి ఇక్కడి ెటల్స్‌కు అద్దెలు, ఇక్కడి ప్రభుత్వానికి పన్నులు కడతాం అనుకుంటే అది వారి ఇష్టం.
ఇక ఈ ఉమ్మడి రాజధాని వల్ల రేపు తెలంగాణ ప్రభుత్వం భూ సంస్కరణలు చేయాలన్న భూ అక్రమాలు తొలగించే శాసనాలు తేవాలన్నా గవర్నర్, ఢిల్లీ చక్రవర్తుల అనుమతి అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉమ్మడి రాజధాని అనేది అర్థరహితమైనది. దీనివల్ల తెలంగాణ ప్రజలు మరింత నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల పెనం మీద నుంచి పోయిలోబడ్డట్టుగా ఉంటుంది తెలంగాణ ప్రజల పరిస్థితి.
ఒక రాజధానికి కావాల్సింది పేపర్లు, ఐమాక్స్‌లు, బృందావ నాలు కాదుగదా. అందమైన లేక్ సిటీ మాకు కాకుండా చేసిన నీకు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సరిపోతాయిగదా. ఈ మధ్య ఏర్పాటు చేసిన రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఆలోచనే లేదు. చిన్న పట్టణంలోనైనా రాజధాని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఢిల్లీ తరహా, చండీగఢ్ తరహా రాజధానులు కాదు. మాకు రాజాజీ ఏర్పాటుచేసిన మద్రాస్ లాంటి రాజధాని కావాలి. జీవితాలను ధ్వంసం చేసే దోపిడిదారులతో, పూటకో మాట మార్చే నాయకులతో, ఎందుకు దీక్ష చేస్తున్నారో తెలవని రెండుకళ్ళు, రెండు నాలుకల ధోరణితో మేం ఉండలేం… అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటానని, ఆ మాటను ప్రక్కనపెట్టి యుద్ధాలొస్తాయని చెప్తున్న ఈ నాయకుల ముఖాలను మేం చూడలేం.
అందుకే మద్రాస్‌ను మేం అభివృద్ధి చేశామని, అది తమకే చెందా లని సీమాంధ్ర నేతలు అన్నప్పుడు ఏ మాటలయితే రాజాజీ అన్నాడో వాటిని మళ్ళీ పునరావృతం చెయ్యకండి. 24 గంటల సిద్ధాంతాన్ని మళ్ళీ తెచ్చుకోకండి. ఓ కేంద్రప్రభుత్వమా! మానవీయ విలువలతో ఇంకా బతికే ఉన్న తెలంగాణను మళ్ళీ మోసం చెయ్యకు.
ఎ.కవిత


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *