మాకొద్దీ రాక్షస ప్రేమ…

తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదనే రాక్షస పట్టుదల బహుముఖాలుగా విజృంభిస్తున్నది. యాసిడ్ దాడుల మనస్తత్వం రాజ కీయమై విస్తరిస్తున్నది. ఆదరించిన ప్రాంతం, అందివచ్చిందికదా అని సొంతం చేసుకునే సంస్కృతి వేయి పడగలై విషం చిమ్ముతున్నది. అది శకుని కుట్రల రూపం దాల్చి హైదరాబాద్‌ను కబళింపజేస్తున్నది. మనది కాని ప్రాంతాన్ని పరిచయం చేసుకోవడం మానవ సహజం. ‘‘అటు చూస్తే చార్మినారు, ఇటుచూస్తే జుమా మసీదు, క్యా భాయ్ అని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు’’ అని పాడుకుంటూ, ఇక్కడి చారిత్రక వారసత్వ సంపదను, జీవనవిధానాన్ని అక్కడి ప్రజలకు తెలియజేశాడొక సినిమా నటుడు. ఆనాడు అమాయకంగా, ఆనందం గా ఈ పాటను ఇక్కడివారు పాడుకున్నారు. కానీ పాట రూపంలో పెట్టుబడి వచ్చి చేరిందనే విషయం వెనకబడ్డ మనం గ్రహించలేక పోయాం. అలా వారి చేతిలో పావులమయ్యాం. అనధికారికంగా వారు హైదరాబాద్ అంబాసిడర్‌లయ్యారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కీలుబొమ్మలై, అధిష్ఠానం చేతిలో తోలుబొమ్మలైన వేళ తెలుగుపౌరుషం బుసలుకొట్టింది. తెలుగు నేలపై కొత్త రాజకీయ వాతావరణం పసుపురంగు దాల్చి అవతరించింది. దేశ భాషలందు తెలుగులెస్స అనే వాదం మారుమోగింది. ఆంధ్రుల ఆత్మగౌరవం చైతన్యరథమై నేల నాలుగు చెరగులా నాట్యమాడింది. తెలంగాణ ఎర్ర తివాచీగా మారి నాట్యానికి వేదికగా నిలిచింది. సినీ ఆకర్షణకు తెలంగాణ మరోసారి బలి అయ్యింది. ఈసారి ఆంధ్రత్వం మరింత చిక్కనై, రాజ్యాధికారంగా మారింది. తెలంగాణ పరాయీకరణకు తెరలేచింది.
హుస్సేన్‌సాగర్‌లో అద్భుతమైన బుద్ధిని నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ పులకించి మైమరచినవేళ, ట్యాంక్‌బండ్‌పై బుద్ధునికి అభిముఖంగా ఆంధ్రమూర్తులు వెలిసారు. చాపకింది నీరులా జరిగిన సాంస్కృతిక దాడిని గమనించలేకపోయాము. నమ్మినందుకు అందిన ఫలితమిది. తెలుగుతల్లి చేతిలో తెలంగాణ రతనాల వీణ మూగ బోయింది. సంస్కృత భూయిష్టమైన తెలుగుభాష అనర్గళంగా, ఆకర్షణీ యమైన మాటగా మారి విస్తరించింది. నిలువెత్తు నట విశ్వ రూపం తెలుగు తేజంగా భాసించిన సమయంలో రాయలసీమ కృష్ణదేవ రాయల మూర్తిమత్వం దానికి చోదకశక్తిగా అవతరించింది.
ఈ తతంగానికి హైదరాబాద్ రంగస్థలమయింది. ఆ థియేటర్ లో తెలంగాణ పలుకుబడుల భాషకు చోటు దక్కలేదు. స్థానిక కుతుబ్ షాషీ, ఆసఫ్ జాహీల జాడ కనుమరుగయింది. తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని అందుకున్న సినీమాయ, తెలంగాణను మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ను కబ్జా చేసింది. ఇప్పటికీ ఆ నీడ పరోక్షంగా తన ప్ర భావం చూపుతూనే ఉంది. తెరమీది నాయకుడు హైదరాబాద్ తెహ జీబ్‌ను నాశనం చేశాడు. తిరిగి దాన్ని నెలకొల్పడానికి పోరాటమే చేయాల్సివస్తుంది.
ప్రపంచీకరణ పుణ్యమో! నూతన ఆర్థిక విధానాల ఫలితమో! కర్ణుని చావుకు కారణాలు అనేకం అన్నట్లు సమాజంలో అసమానతలు పెరిగాయి. వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలో అవి మరింత స్పష్టంగా కనపడుచున్నవి. అధికార పాలక పక్షాల అభివృద్ధి వ్యూహ ఫలితం హైదరాబాద్‌కు, ఆదిలాబాద్‌కు మధ్య అంతరం పూడ్చలేనం తగా ఉంది. ఇలాంటి అంతరాలు ప్రాంతాలమధ్యే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా వచ్చి చేరాయి. దాని ప్రభావ ఫలితంగా ఆయా సామాజిక వర్గాల, ప్రాంతాల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆయా ప్రజారాసులు ఆకలితో, అణచివేతతో కునారిల్లుతున్న వేళ ‘సామాజిక న్యాయం’ సమరనాదంగా ప్రభవించిందొక సినీ గొంతు. రాజకీయ యవనికపై ప్రజారాజ్య కేతనం, రాయలసీమలో రెపరెపలాడింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, తెలుగుజాతి ఆత్మగౌరవం అనే వజ్రా యుధ ఘాతాలతో దెబ్బతిన్న తెలంగాణా ప్రజలు అస్తిత్వ స్పృహ అనే రక్షణ కవచంలో ఉన్నారు గనుక ఈ పరిణామాన్ని అనుమానిం చాక ప్రశ్నించారు. ఆత్మీయంగా చోటు కూడా ఇచ్చారు. అతని మాటను, చేష్టను ఎప్పటిలాగే వల్లమాలిన అభిమానంతో ఆదరించారు. కానీ వేయిమంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలు చూసి కూడా, అనునయించడానికి ఆ చేయి ముందుకు రాలేదు. వెండితెరపై గొప్పలు పలికిన గొంతు, నిజక్షేత్రంలో బాధితులను పరామర్శించడంలో మూగ పోయింది. అందరివాడినని నమ్మబలికిన మెగాస్టార్ కొందరి వాడ య్యాడు. సింహాసనాన్ని అధిష్టించాలనుకున్న వ్యక్తి చిన్న కుర్చీకి పరి మితమయ్యాడు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలనే ప్రతి పాదనతో ఈ మంత్రివర్యులు ముందుకొచ్చారు. యూటీ ప్రతిపాదన సాధ్యాసాధ్యాల చర్చను కాసేపు పక్కనపెట్టి ఈ మాటను గురించి ఆలోచిద్దాం. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదనే ఆలోచన ఇందులో ఇమిడి ఉంది. సామాజిక న్యాయం అన్న నోరు, సామాజిక ద్రోహాన్ని జపించింది. అలా ఈ ఇంద్రుడు, స్వయంకృషి తోనే పిపీలికం గా మారిపోయాడు. ఆ విధంగా తెలంగాణలో సినీ మాయా జిమ్మిక్కు లకు తెరపడింది.
కోడి పందాలు పెట్టి పక్షుల రక్తాన్ని కళ్ళజూస్తూ ఆనందించే కోస్తా సంస్కృతి, సినీమాయా జలతార ముసుగు వేసుకొని ఇన్నేండ్లు ద్రోహం చేసింది. పూలరాసిని సైతం దేవతగా కొలిచే తెలంగాణ ప్రజా సంస్కృతి ఆ ముసుగును తన ఉద్యమాలతో ఛేదించింది. ప్రజా సంస్కృతి వెలుగులో సమానత్వ సాధనకు, తెలంగాణ రాష్ర్టంలో చోటు లభిస్తుంది. ఆ దిశగా పునర్నిర్మాణానికి తెర లేచింది.
బి.వి.ఎన్.స్వామి


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *