మానవాళికి పెనుముప్పు

కాలుష్యం – సమస్యలు

భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువులను పంచ భూతా లంటారు. ఇవి కన్నెర్ర చేస్తే మానవుని మనుగడ ప్రశ్నార్ధకరంగా మారనుంది. కాలుష్యం నేడు మానవాళికి పెనుముప్పుగా మారింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి క్రమ క్రమంగా తప్పుకుంటున్నాయి. 2013లో భారతదేశ జనాభా వంద కోట్లను దాటింది. దినదినంగా జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెద్ద పెట్టున పెరిగిపోయినాయి. దీంతో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు పెరిగినాయి. వాతావరణ మార్పుల మూలంగా మానవాళికి కాకుండా మెత్తం భూమి మీదున్న జీవరాశులు కనుమరుగవుతున్నాయి. అడవులు నరకడం, కాలుష్యం సమస్యలు, కొండలు, గుట్టలు తవ్వుతున్నారు. హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి.
హైదరాబాద్, బెంగుళూర్, కోయంబత్తూర్, ముంబయి, చెన్నై వంటి మహానగరాలలో కాలుష్యం బారిన పడి ఎంతో మంది మృత్యు వాత పడుతున్నారు. జీవనదులు, మహాసముద్రా లలో మురికి నీరు వదలడంతో అవి కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. పవిత్రంగా భావించే గంగానది శవాలతో నిండుతున్నది. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలను పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతో హాని కలిగిస్తోంది. ఒకప్పుడు ఇళ్లలో వివిధ లోహాలతో చేసిన బిందెలు, బకెట్లు, ప్లేట్లు వాడేవారు. కాలం మారిపోయింది. ఇవన్నీ బరువని, తోమడం కష్టమని, వాటిని మానేసి ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు ఎక్కువగా వాడుతున్నారు.
పెట్టుబడిదారీ అభివృద్ది పర్యవసానాలను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. ఆదివాసులుడే అడవుల్లో ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు చేపట్టడం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటున్నది. ఇంతే కాదు ఆదివాసులను క్యాన్సర్ వంటి వ్యాధులు వెంటాడుతాయి. పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యాలు, వ్యర్ధ పదార్ధాలు, మురికి నీటి కారణంగా ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో రోజుకు 300 బస్సులు లక్షా నలభైవేల కి.మీ. పొడవునా తిరుగుతాయి. 1.25 లక్షల ఇతర వాహనాలు తిరుగుతు న్నాయి. నగరమంతా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. కేరళలో ఎండోసల్ఫాన్ క్రిమిసంహారకాన్ని నియంత్రణ లేకుంగా ఇష్టం వచ్చినట్లుగా వాడడం వల్ల వికలాంగులైన పిల్లలు పుడుతున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎండోసల్ఫాన్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని, వారికి చికిత్స చేయించాలనీ ఇంతవరకు పెడచెవిన పెట్టలేదు పాలకులు.
భోపాల్ గ్యాస్ లీకై విషవాయువుల ప్రభావం మూలంగా లక్ష మందికి పైగా ప్రజలు మరణించడం, వ్యాధులకు గురవడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు వందల చెరువులు వాడుకలో ఉన్నప్పటికీ నేటికీ అసలు రూపులో మిగిలినవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. మిగతా చెరువులు అన్యాక్రాంతానికి గురయినవి. రియల్‌ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో మౌలిక వసతుల కల్పన సమస్య తీవ్రమవుతోంది. చర్లపల్లి, జీడిమెట్ల, పాశమైలారం, ఇస్నాపూర్, నాచారం, బొల్లారం తదితర పారిశ్రామిక వాడల్లో కెమికల్ పరిశ్రమలు నుంచి విడుదలవుతున్న విషవాయువులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కెమికల్ పరిశ్రమలో తరచు ప్రమాదాలు ఎక్కువే. అడవులు నాశనం కావడంతో వర్షాలు పడటం లేదు. భూగర్భ జలవనరులు వేగంగా తరిగిపోతున్నాయి. పులికాట్ సరస్సు కుదించుకుపోతోంది. జీవరాశులతోనే ప్రకృతికి అందం. మంజీర, మానేరు, గోదావరి, కృష్ణ నదులలో ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేయడంతో తీవ్ర దుష్ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి.
వివిధ రంగాల్లో ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరంగా మారినది. హోటళ్ళలో తినుబండారాలు ప్లాస్టిక్ కవరులో పెట్టి దారాలు కట్టి పంపిస్తున్నారు. వేడి వేడి ఆహార పదార్ధాలు ప్లాస్టిక్ కవరులో పెట్టడం వల్ల ప్లాస్టిక్ కరిగి ఆహార పదార్ధాలలో కలిసిపోతుంది. ప్లాస్టిక్ 1500 సంవత్సరాలయినా భూమిలో కలిసిపోదు. భూమిపొరల్లో ఉండి పర్యావరణ ముప్పు తెస్తుంది.
మన రాష్ర్టం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ ఎరుగనంత పర్యావరణ విధ్వంసం జరిగింది. గ్రామాల్లో జనం ఎక్కువ ఉన్న చోట తరచు పంట నష్టం, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి. పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇళ్లలోనూ నీటివాడకం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీగా మార్పులు సంభవించాయి. దీంతో మానవాళికి కాకుండా మొత్తం భూమిమీదున్న జీవరాశుల మనుగడకు ప్రమాదం పొంచివుంది. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్ధాలను నదుల్లోకి వదలడం ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అధికంగా విద్యుత్ వాడటం, చెత్త అధికం కావడం సమస్య తీవ్రతను పెంచుతున్నాయి. మనం ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. మనకి మనం ఒకరినొకరు మేలు చేసుకుందాం. కాలుష్య నిర్మూలనకు ప్రతి ఒక్కరు నడుంబిగించుదాం. పర్యావరణాన్ని మనమందరం కాపాడుకుందాం!!
– డి.ఎన్.


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *