ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ

పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు
పవేశపెట్టాలని భద్రాచలం, మునగాల, హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలన్న ఏకైక డిమాండ్‌తో ముంబైలో తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక ఆధ్వర్యాన గొరేగావ్ ఆజాద్ మైదాన్‌లో నవంబర్ 30న వేలాది జనం మధ్య భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా టిజేఏసి ఛైర్మన్ ప్రొ॥ కోదండరాం, టిఎన్‌జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రముఖ మేధావి, రచయిత, సంపాదకుడు ఎన్.వేణుగోపాల్, ప్రముఖ మహిళా నాయకు రాలు సంధ్య, కళాకారుడు, రచయిత, విద్యార్థి జేఏసీ నాయకుడు దరువు ఎల్లన్న, అ.భా.తెరవే అధ్యక్షులు నలిమెల భాస్కర్, దళిత సంఘర్ష సమితి రాష్ర్ట అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, కరీంనగర్ సాహితీ సోపతి తెరవే నాయకులు నగునూరు శేఖర్, గాజోజు నాగభూషణం, బూర వెంకటేశ్వర్లు, కందుకూరి అంజయ్యతో బాటు కరీంనగర్ పద్మకళా బృందం హాజరైనారు.
సంఘభావ వేదిక కన్వీనర్లు గ్యార శేఖర్, గొండ్యాల రమేష్, పొట్ట వెంకటేశ్ ముంబైలో వేదిక తెలంగాణపై చేసిన ఉద్యమకార్యక్రమ రిపోర్ట్‌ను, ముంబై వలస తెలంగాణ ప్రజల సమస్యలు – పరిష్కారాలపై నివేదికను సభలో చదివి వినిపించారు. ఆ తర్వాత కరీంనగర్ పద్మ, దరువు ఎల్లన్న, మహారాష్ర్ట ప్రజాగాయకుడు సంబాజీభగత్, మరాఠీలో వ్రాసిన తెలంంగాణ గీతాన్ని వినిపించి జనాన్ని ఉర్రూతలూగించి నినాదాలతో దద్దరిల్లేలా ఉత్తేజపరిచారు. సంధ్య తెలంగాణ బిల్లు ఏర్పాటుపై సీమాంధ్రుల తీరును ఎండగట్టుతూ అటు సమైక్యవాదుల వాదనను ఖండిస్తూ యూపీఏ సర్కారును వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌చేశారు. సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు ఖాయమని దానినెవరూ ఏ శక్తీ ఆపలేదని అన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక భావాలను ఎండ గట్టారు. అ.భా.తెరవే అధ్యక్షులు నలిమెలి భాస్కర్, మన తెలంగాణ సంస్కృతి భాష ఎంత గొప్పదో సోదాహరణంగా వివరించారు. దరువు, నల్లా రాధాకృష్ణ, టి.జె.ఏసి చేస్తున్న కృషిని ఉద్యమకారుల త్యాగాలను గుర్తుచేస్తూ అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ వచ్చిందని తెలిపారు. అ.భా. తెరవే కార్యదర్శి మచ్చప్రభాకర్ సభకు అధ్యక్ష బాధ్యతలు తీసుకొని సభను సజావుగా జరిగేలా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కనపెల్లి దుర్గేశ్ వ్రాసిన సంచలనం, మచ్చ ప్రభాకర్ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ఎందుకు అత్యవసరం? అన్న మరాఠీ గ్రంథాన్ని ప్రొ.కోదండరాం ఆవిష్కరించారు. దేవీప్రసాద్ కోదండరాం తొలుత ప్రెస్‌మీట్‌లో ప్రసంగిస్తూ ఉమ్మడి రాజధానికై పదేళ్ళ అవసరం లేదని నాలుగేళ్ళు చాలని, ఆంధ్రలో కొత్త రాజధాని త్వరగా ఏర్పాటు చేయాలని అన్నారు.
బహిరంగ సభలోదేవీప్రసాద్ మాట్లాడుతూ, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపెట్టేలా ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రొ.కోదండరాం సుదీర్ఘ ఉపన్యాసంలో భద్రాచలం, మునగాల, హైదరాబాద్ యుటి అంశాలతో పాటు రాయల తెలంగాణ లాంటి అంశాలను ప్రస్తావించి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలకు గట్టిగా సమాధానమిచ్చారు. ముంబైలో సంఘీభావ వేదిక గత 4 ఏళ్ల నుంచి చేస్తున్న కృషి మరువలేనిదని, ఇక్కడి తెలంగాణ ప్రజలు చూపిన పోరాటస్ఫూర్తి తెలంగాణలో చూపిఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి ఉండేదన్నారు. రచయిత మచ్చప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారుల కృషిక ముంబై తెలంగాణ కార్మికులు, రచయితలు చూపిన ధైర్యాన్ని వివరించారు.
-దక్కన్ న్యూస్


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *