రాచకొండలో ఆదిమానవుల చిత్రలేఖనాలు

తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైందని మరోసారి రుజువైంది. చరిత్ర పూర్వయుగానికి చెందిన.. అంటే రాత కనిపెట్టక ముందు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆదిమానవులు నివసించేవారనడానికి నిదర్శ నంగా వారు వేసిన ఎరుపు రంగు చిత్రలేఖనాలు, రాతి గోడలపై చెక్కిన రేఖాచిత్రాలు, అర్ధరంధ్రాలు రాచకొండ గుట్టలపైనున్న పెద్ద పెద్ద రాతి గుండ్లు ఏర్పరచిన గుహల్లో కనిపించాయి.
కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజ ధానిగా వర్ధిల్లిన రాచకొండ చరిత్ర పైన ఒక పుస్తకం రాయాలని రాచకొండ గుట్టల్లో కన్పించే చారిత్రిక నిర్మాణాలు, ఆధారాలను స్వయంగా చూడాలని నేను 9.11.2014 నాడు రాచకొండ గుట్టల సముదాయంలోని గుఱ్ఱాల గుట్టను ఎక్కి పరిశీలించినప్పుడు అదృష్టవశాత్తు చరిత్ర పూర్వ యుగానికి చెందిన చిత్రలేఖనాలు కన్పిం చాయి. ఇవి తెలంగాణ చారిత్రక వైభవాన్ని మరింత ఇనుమడింప జేస్తాయి.
ఇలాంటి చిత్రలేఖనాలు తెలంగాణలో ఇప్పటి వరకు 19 ప్రభు త్వం దృష్టికి వచ్చాయి. మధ్యరాతి యుగానికి.. అంటే క్రీ.పూ. 10వేల సంవత్సరాల నుండి క్రీ.పూ. 3వేల సంవత్సరాల మధ్య యుగ కా లంలో తెలంగాణలో ఇలాంటి చిత్రలేఖనాలు రాతి గుహవాసాల్లో చిత్రించడం ప్రారంభమైందని నిర్ధారించారు. ఈ యుగానికి చెందిన చిత్రలేఖనాల్లో ఆనాటి మానవులు వేటాడిన జంతువులు భగవంతునికి ప్రతిరూపంగా భావించే పటం (జియోమెట్రిక్ డిజైన్) ప్రముఖంగా కన్పిస్తాయి. రాచకొండలోని గుర్రాల గుట్టపైన గుహలో కూడా ఇ లాంటి చిత్రలేఖనాలే కన్పిస్తాయి. ఈ చిత్రలేఖన సముదాయం ఉన్న గుహ చాళుక్య యుగపు వైష్ణవాలయానికి సమీపంలోనే ఉంది.
త్రిభుజాకారంలో ఉన్న ఈ చిత్రలేఖన గుహ సుమారు రెండు వందల మంది కూర్చునేంత వైశాల్యంలో ఉంది. గుహలో తూర్పు పడమరలుగా సహజ ద్వారాలుండగా ఉత్తర పడమర గోడలు ఏటవాలుగా ఉన్నాయి. ఉత్తరం వైపు చూస్తున్న గోడ ఏటవాలు ఉపరితలానికి చిత్రలేఖనాలున్నాయి. తూర్పు నుంచి పడమర వైపు కొనసాగుతున్న ఈ గోడకు మొదట మనుషుల బొమ్మలున్నాయి. తరువాత దీర్ఘ చతురస్రాకారంలో పటం బొమ్మ ఉంది. సుమారు గజం పొడవు, అర గజం వెడల్పు పరిమాణాలతో ఉన్న ఈ పటం బొమ్మనే ఇక్కడి చిత్రలేఖనాల్లో అతిపెద్ద చిత్రలేఖనం.
పటం బొమ్మకు పడమటి దిక్కున కొందరు మనుషుల బొమ్మలు న్నాయి. వాటి తరువాత వరుసగా సుమారు ఆరేడు గజాల పొడవున ఎర్రగీతలు గీసి ఉన్నాయి. సుమారు ఫీటు పొడవు, రెండు అంగుళాల వెడల్పులతో ఉన్న గీతల మధ్య దూరం అరఫీటుంటుంది. నిజానికి ఈ గీతలు మనుషులు.. భక్తుల ప్రతిరూపాలు. ఇతర చోట్ల ఇలాంటి గీతలు దండ ఎముక (మోచేతి నుండి భుజం వరకు ఉండే బొక్క) లాగా చిత్రించబడ్డాయి.
రాతి చిత్ర శాం ప్రకారం ఈ చిత్రలేఖనాల్లో క్రూర జంతువులు. వేట జంతువులు, ఆయుధాలు లేకుండా పటం, మనుషులు మాత్రమే చిత్రించబడ్డారు. కాబట్టి ఇవి మధ్యరాతి యుగానికి ముందువి కావచ్చు. తరువాత వచ్చిన కొత్త రతి యుగానికి చెందినవి కూడా కావచ్చు. ప్రామాణిక పరిశోధన జరగవలసి ఉంది.
గుర్రాల గుట్ట ప్రవేశ ద్వారంలో నుండి కుడివైపున కన్పించే పెద్ద గుండ్ల కింద ఉన్న గుహలోనేమో రేఖాచిత్రాలు, అర్ధ రంధ్రాలు న్నాయి. తెలంగాణలో వీటిని చెక్కిన మానవులు సుమారు క్రీ.పూ. 3వేల సంవత్సరాల నుండి క్రీ.పూ. 1 వేయి సంవత్సరాల నడిమి కాలంలో జీవించారు.
ఈ పెట్రోగ్లిప్స్‌లో చాలా విశేషాలు చిత్రించబడ్డాయి. మొదటి చిత్రంలో ముగ్గురు మనుషులు, వారి కింది వరుసలో కూడా ముగ్గురు మనుషులు. కర్రలు, ఉర్ల సహాయంతో తమకు ఎదురుగా వస్తున్న పులిని ఎదుర్కొంటున్నట్లు చిత్రించడింది. ఈ ఆరుగురు మనుషుల మీద లింగాన్ని లేదా గుడిని పోలిన రేఖా చిత్రముంది. వీరి మధ్య పిరమిడ్ లేదా త్రిభుజాకారంలో 6 కప్యూల్స్ ఉన్నాయి. మనుషుల నుండి ప్రారంభమై వరుసగా పులి కింది నుండి వెనుక వైపుకు కప్యూల్స్ సుమారు 20 చిత్రించబడ్డాయి. ఈ కప్యూల్స్‌కు, పులికి మధ్య ఒక అడ్డుగీత నుండి కిందికి నాలుగైదు గీతలు వేలాడుతున్నట్లుగా చిత్రమొకటి ఉంది. పై రేఖా చిత్రాలన్నింటి పొడవు సుమారు 6 అంగుళాలుండగా, వెడల్పు సుమారు 2 అంగుళాలుంటుంది.
పై చిత్రాలను బట్టి కొత్తరాతి యుగం నాటికి తెలంగాణ ప్రజలు లోహ ఆయుధాలను వాడుతున్నారని, వేట వారి ప్రధాన జీవనాధారం అని, దైవాన్ని పూజిస్తున్నారని, వారికి ఒక క్రమ సమాజం ఏర్పడిందని చెప్పవచ్చు. వీటిపై ప్రామాణిక పరిశోధన చేస్తే మరెన్నో విషయాలు బయటికి వచ్చే అవకాశముంది.
కాబట్టి వెంటనే ప్రభుత్వం.. ముఖ్యంగా రాష్ర్ట పురావస్తు శాఖ ఈ రెండు గుహల చుట్టూ కంచె వేయించి ఈ అరుదైన చిత్రలేఖనాలను పరిరక్షించాలి. ఇప్పటికే చిత్రలేఖనాల గుహ సమీపంలో రెండు చోట్ల గుప్తనిధుల దొంగలు తవ్వకాలు జరిపారు. రాచకొండ పరిసరాల పర్యాటక అభివృద్ధి కోసం 201415 సంవత్సరానికి గాను ప్రభుత్వం విడుదల చేసిన 5 కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని, పురావస్తు శాఖ విడుదల చేసిన 25 లక్షల రూపాయల్లో కొంత మొత్తాన్ని ఈ చిత్రలేఖనాలు, పెట్రోగ్లిఫ్స్, కప్యూల్స్ రక్షణ కోసం కేటాయించాలని, నిపుణులతో రాచకొండ గుట్టల్లో ఉన్న చారిత్రక ఆధారాల కోసం సమగ్ర సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ, సెల్: 949095707


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *