వెంటాడుతున్న గత ప్రభుత్వాల పాపం అన్నదాతల మరణ మృదంగం ఆగేదెపుడు?

తెలంగాణ పల్లెలో నిత్య విషాదం. ఎక్కడో ఒక చోట అన్నదాతల ఆత్మహత్యలు. చావు కబురు వినిపిస్తుంది. ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది. పగలనకా, రేయనకా నిత్యం ఆరుగాలం కష్టపడి దేశానికి వెన్నుముకలైన రైతన్నలు తమ ప్రాణాలను బలి తీసుకుంటున్న విషాదం. జనం హృదయాలను కదిలిస్తుంది. రైతన్నలవి అరణ్య రోదనలు. వారి చావులు, ఆకలి కేకలు పాలకులకు పట్టడం లేదు. అమరవీరుల త్యాగాలు, అరవై ఏళ్ళ ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణ వచ్చి ఏడు నెలలు కాలంలో ఇప్పటికి సుమారు మూడు వందల మంది అన్నదాతలు ఆత్మ హత్యకు పాల్పడినారు. ఒకవైపు వ్యవసాయం కార్పొరేటయింది. మరోవైపు కరువు కటకాలు. బ్యాంకులో రుణాలు చేసిన అప్పులు తీర్చలేక, పెట్టు బడులు వెళ్లక రైతాంగం నేడు తీవ్ర దుర్బిక్షంలో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ స్వరాష్ర్టంలోనైనా. తమ బతుకులు మరుగు పడుతాయని, ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని తెలంగాణ ఏర్పడుతుందని తమ స్వప్నం నెర వేరుతుందని రైతులు ఆకాంక్షించారు. ఆ ఆకాంక్ష నేటికీ తీరలేదు. గత ప్రభుత్వాల పాపం ప్రస్తుత ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతాంగాన్ని వెంటాడు తూనే ఉంది.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ర్టం అవతరించింది. దేశవ్యాప్తం గా చూసినట్లయితే గత కొన్నేళ్ళలో మూడు లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడినారు. ఎక్కువగా మహారాష్ర్ట (విదర్భ), కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, హర్యానా, పాండిచ్చేరిలకు చెందినవారే. పంజాబ్ రాష్ర్టంలో హరిత విప్లవం రైతులను మరింత కృంగదీసింది. చావులకు దారితీసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ర్టంలో 37,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. వీరిలో తెలంగాణకు చెందినవారు అత్యధి కంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 19 సంవత్సరాల కాలంలో 37,000 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే ప్రభుత్వం మాత్రం 5,300 మంది మాత్రమే ఆత్మహత్యలకు పాల్పడినారని ప్రకటించింది. అక్టోబర్ 1న ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు మండలం, లింగాపూర్ గ్రామంలో రాథోడ్ సురేష్ వృద్ద రైతు ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యం తెలంగాణ సమాజాన్ని కలచి వేసింది.
వర్షాలు పడక విత్తనాలు మొలకత్తలేదు. రెండోసారి వేసిన విత్తనాలు మొలకత్తాయి. కాని మళ్ళీ వర్షం పడకపోవడంతో మూడు లక్షల అప్పును తీర్చలేక మనస్థాపంతో సురేష్ రాథోడ్ బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. దసర, బతుకమ్మ పండుగలో తలమున్కలవుతున్న సందర్భంలోనే అక్టోబర్ 3, 4 తేదీలలో ఏకంగా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీపావళి పండగ పర్వదినాన ఒక్కరోజు ఏడు మంది అన్నదాతల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా విషాదం అలుముకుంది.
2013లో ఉమ్మడి రాష్ర్టంలో 2500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. 1500 మంది తెలంగాణలోనూ 1000 మంది రాయలసీమ కోస్తాంధ్రలో చనిపోయారు. తెలంగాణ జిల్లాల్లో 295 మంది ఆత్మహత్యలలో పాలమూరు ప్రథమ స్థానంలోఉండగా సీమాంధ్రలో అనంతపురం జిల్లా 294 మంది ఆత్మహత్యలలో మొదటి స్థానంలో ఉంది.
రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు
అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి చావులను క్షుణ్ణంగా పరిశీలించి నట్లయితే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు తరచుగా పెంచడం, విద్యుత్ చార్జీలు పెరగడం, నిత్యం విద్యుత్ కోతలు, నీటి కొరత, కరువు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. రుణాలు సకాలంలో అందక అధిక వడ్డీతో ప్రయివేట్ అప్పులు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరిశీలించినట్లయితే ప్రయివేట్ ఫైనాన్స్‌లో అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరకు ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో ప్రధానంగా చిన్న సన్నకారు, కౌలు రైతులు ఎక్కువగా కనిపిస్తున్నారు. .
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతుల వ్యతిరేక విధానాల వల్ల ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల ధరలు భారీగా పెరిగినాయి. 20122013లో 22% పెరిగి రైతాంగంపై అదనంగా రూ.554 కోట్ల భారం పడింది. గిట్టుబాటు ధరలు లేక అప్పులు మీద అప్పులు పెరిగి నష్టంలోకి కూరకపోయిన రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
ఆత్మహత్యలపై కమిషన్ల సిఫార్సులను పట్టించుకోని ప్రభుత్వాలు
రైతుల ఆత్మహత్యల నివారణకు కమిషన్లు నియమించడం ఆనవా యితీగా మారింది. అవి అందించిన సిఫార్సులను పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసినట్లయితే దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడకుండా బతికేవారు. 2004లో మన్మోహన్‌సింగ్ వ్యవసాయ శావేత్త డా॥ ఎం.ఎస్.స్వామినాథన్ నాయకత్వంలో జాతీయ వ్యవసాయ కమిషన్‌ను నియమించారు. స్వామినాథన్ కమిషన్ 2006లో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో రైతుల ఆత్మహత్యలను నివారించాలంటే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటల కొనుగోలుకు అవసరమయిన నిధులు కేటాయించాలని సిఫారుసు చేసింది. 2009లో అప్పటి వైఎస్.ఆర్. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై డా॥ జయంతీఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జయతీఘోష్ కమిషన్ కూడా రైతుల ఆత్మహత్యల నివారణకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పించాలని, వ్యవ సాయాన్ని సంక్షోభం నుంచి కాపాడాలని, కౌలు రైతులకు రుణాలివ్వాలని పలు సిఫార్సులను చేసింది. ప్రభుత్వమే స్వయంగా రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించింది. వ్యవసాయ రంగాన్ని సం క్షోభం నుంచి కాపాడాడడానికి, రైతుల ఆత్మహత్యల నివారణకు నియ మించిన కమిషన్ల సిఫారుసులను కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేయకుండా గాలికి వదిలేస్తున్నాయి. పంటలకు ధరలు పెంచితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని తప్పుడు వాదనలు చేస్తున్నారు.
వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తూ ప్రపంచ బ్యాంకు విధానాలు తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రయివేటీకరణకు మొగ్గు చూపుతున్నారు. సంస్కరణలు వేగవంతం కావడం వ్యవసాయానికి సబ్జిడీలు తగ్గించడం. అమెరికా దేశంలో 0% రైతాంగానికి సబ్సిడీలు అందిస్తే మన దేశంలో 4 శాతం సబ్సిడీలు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు. సాగునీరు, కరెంటు, బీమా సౌకర్యం కల్పించాలి. దీని నుంచి కొంత మేరకైనా వ్యవసాయ రంగం గట్టెక్కుతుంది. యంత్ర పరికరాలు, ఎరువులు, విత్త నాలు, పురుగు మందులపైన ప్రభుత్వాలు భారీగా సబ్సిడీ ఇవ్వాలి.
రైతులకు భరోసా కల్పించాలి
రైతుల ఆత్మహత్యల నివారించాలంటే కేంద్ర రాష్ర్ట ్పభుత్వాలు రైతులకు భరోసా కల్పించాలి. పాలకులు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు రుణమాఫీలు చేస్తామంటునే దీనికి అనేక రకాల కుంటిసాకులు చూపుతూ 72% రుణాల మాఫీని నిలుపుదల చేయజూస్తున్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి అటు మోడీ ప్రభుత్వం, ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా స్పందించాలి. రైతులు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారంటే వారికి చావు తప్ప మరొక పరిష్కారం లేదు. వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రతి రైతుకు దగ్గరికి చేరుకోవాలి. ఆత్మ హత్యలు వద్దు పోరాడి వ్యవసాయాన్ని పరిరక్షించుకోవాలని ప్రజాసంఘాలు ఉద్యమించాలి. 2014 సంవత్సరం ఖరీఫ్ ప్రారంభం నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో దుర్భిక్షం, కరువు విలయతాండవిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కరువు ప్రాంతాలను ప్రకటించి తగిన సహాయక చర్యలు అందించాలి.
ఆత్మహత్యలు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి
తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. వారి పిల్లలను చదివించాలి. వడ్డీ వ్యాపారుల దోపిడి నుంచి విముక్తి కల్పించాలి. నకిలీ విత్తనాలు, పురుగు మందులను మార్కెట్లోకి రాకుండా చూడాలి. రైతును నష్టాల పాలు చేస్తుంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులే.
అప్పుల ఊబిలో కోట్లాది రైతులు
జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం దేశంలో 9 కోట్ల మంది రైతు కుటుంబాలుంటే 4.4 కోట్ల కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నవి. రుణ గ్రస్తమయిన కుటుంబాలు హర్యానాలో 53.1%, మహారాష్ర్ట 55.9%, కర్ణాటక 62.7%, కేరళ 63.5%, తమిళనాడు 75.6%, ఆంధ్రప్రదేశ్ 5%. దేశవ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు అందించే రుణాలు 50% కూడా లేవు. పెరిగిన పెట్టుబడులకు అవసరాల రీత్యా వడ్డీ వ్యాపారస్థులను ఆశ్రయించక తప్పడం లేదు. వడ్డీ వ్యాపారుల దోపిడీతో రైతులు నిత్యం నలిగిపోతున్నారు.
వ్యవసాయ రంగ పరిరక్షణ
వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి లాభసాటిగా మార్చాలి. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా మనదేశంలో భారీగా సబ్సిడీలివ్వాలి. వ్యవసాయానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. రైతులకు ఆర్థిక భద్రత కల్గించే కేంద్ర చట్టం తేవాలి. దేశ వ్యాప్తంగా 60 సం॥ వయస్సు మీదపడిన రైతులకు నెలకు కనీసం రూ.3500 పెన్షన్ అందించాలి. సేంద్రియ పద్దతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కార్పొరేట్ వ్యవసా యాన్ని నిరోధించాలి. రైతులకు ఆరోగ్యబీమాను వర్తింపచేయాలి. వ్యవసాయానికి 9 గంటల కరెంటును అందించాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు నెలరోజుల వరకు నష్టపరిహారాన్ని అందించాలి. బ్యాంకులో సకాలంలో రైతులకు రుణాలివ్వాలి. వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించాలి. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు రైతుల పిల్లల చదువులకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి చదివించాలి.
శాపంగా మారిన సంస్కరణలు
1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు రైతుల మెడకు ఉరి తాళ్ళయినాయి. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి సబ్సిడీలలో కోత విధించిన దుష్ఫలితమే నేడు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు దారితీసింది దేశంలో అత్యధిక శాతం ప్రజలకు జీవనోపాధి కల్పించే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంది. ప్రయివేటు కార్పొరేటు శక్తులకు అప్పగించింది. దీని మూలంగా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. దేశ వ్యాప్తంగా 0% శాతం మంది ప్రజలు వ్యవసాయ సాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయాన్ని నష్టాల నుంచి గట్టెక్కించి పరిరక్షించాలి. గ్రామీణ ప్రాంతాలలో రైతులు గత్యంతరం లేక హైదరాబాద్, ముంబై, షోలాపూర్ వంటి మహానగరాలకు వలస పోతున్నారు. అప్పులు బాధలు భరించలేక పలువురు బలవంతపు చావులకు పాల్పడుతున్నారు. కరువు వెంటాడుతుంది. సాగుతో పాటు బిడ్డల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అధికులు 25 సం॥ నుంచి 45 ఏళ్ళ లోపు వారే కావడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు విధుల పాలవుతున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
రైతు ఆత్మహత్యలు ప్రపంచ బ్యాంకు హత్యలే
భారతదేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలన్నీ ప్రపంచ బ్యాంకు హత్యలే. ప్రపంచ బ్యాంకు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడంతో రోజుకు వంద మంది రైతులు వ్యవసాయం మానేస్తున్నారు.
421 జీవోను అమలు చేయాలి:
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జీవో 421ని తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ జీవో వచ్చింది. అప్పుల బాధ భరించలేక చనిపోయిన కుటుంబాలకు లక్ష యాభై వేల రూపాయలు చెల్లించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంతో కొంతయినా రైతు కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. తక్షణమే 421 జీవోను అమలు చేసి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి.
బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు బ్యాంక్ రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించి రైతుల ఆత్మహత్యలను నివారించాలి. నేటికీ రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా కొత్త రుణాలు ఇవ్వకుండా రైతులను అయోమయానికి గురి చేస్తున్నారు.
దామరపల్లి నర్సింహారెడ్డి, 9059933253


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *