హైదరాబాద్ రెవెన్యూ రభస

తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు నిర్ణయాన్ని అమలు కాకుండా చేయడంలో భాగంగా పలు అనవసర వివాదాలను రేకెత్తిస్తున్నారు. అలాంటి వాటిలో ఒటి హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎలా పంచుకోవాలనే అంశం. ఈ నేపథ్యంలో ఈ రభస పూర్వాపరాలను, పరిష్కారాలను వివరిస్తున్నారు తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రతినిధి తడకమళ్ళ వివేక్

రాష్ర్ట ప్రస్తుత సంక్షోభానికి తెర వేస్తూ కేంద్ర క్యాబినెట్ తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడి నప్పటికీ, హైదరాబాద్ అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. దాని స్థాయి, అది అందించే ఆదాయం ప్రాధాన్యం పై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ హోదాపై ఊహా గానాలకు తెర వేస్తూ, రెండు లేక మూడు ఆప్షన్లు తమ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి షిండే తెలిపారు. అందులో ఒకటి ఢిల్లీ నమూ నా. పదేళ్ళ పాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ రాజధానిగా ఉం టుందని సీడబ్ల్యూసీ చెబుతున్నందున, ఆదాయం పంచుకోవాల్సి వస్తే ఆ రెండు రాష్ట్రాలూ ఏ నిష్పత్తిలో ఆదాయాన్ని పంచుకుంటాయనేది మన ముందున్న ప్రశ్న. దాన్ని పరిశీలించేందుకు ముందుగా రెవెన్యూ, టాక్సేషన్‌కు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్ ఆదాయం ఎంత అనే అంశంపై మీడియాలో భిన్న కథనాలు వస్తు న్నాయి. ఇక్కడ అవి పరిశీలించని అంశం ఒకటుంది. అవేవీ కూడా హైదరాబాద్‌ను రెవెన్యూ రికార్డుల్లో ఉన్న విధంగా అర్బన్ జిల్లాగా చూడడం లేదు. రంగారెడ్డిలో అధిక భాగాన్ని, మహబూబ్‌నగర్, న్గండ జిల్లాల్లోని కొంతభాగాన్ని కూడా ఆ కథనాలు లెక్కిస్తు న్నాయి. ఒకముక్కలో చెప్పాలంటే అర్బన్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ కోసం హెచ్‌ఎం డీఏకు కేటాయించిన పరిధిని అవి లెక్కిస్తున్నాయి. రెవిన్యూ జిల్లా పరిధిలో చూసినప్పుడు ఈ విధమైన దృక్పథం సరైంది కాదు. అలా చేస్తే చట్ట బద్దంగా గుర్తించిన పరిధులను అతిక్ర మించి లెక్కలు వేసినట్లవుతుంది. భౌగోళిక సామీప్యత, వాణిజ్యపరమైన కార్యకలాపాలు లాంటివి అర్బన్ రెవెన్యూ జిల్లా నిర్వచనానికి ఆధారం కాజాలవు.
రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాలు తమవైన పాలనాయంత్రాంగాన్ని, భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నాయి. ఆయా జిల్లాల్లో నమోదైన సంస్థలు ఆ జిల్లాల అధికారయంత్రాంగానికే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాట్ యాక్ట్ లాంటివాటిని ఇందుకు ఉదా హరణగా చెప్పవచ్చు. అలాగే ఈ జిల్లాల్లో నెలకొన్ని ఉన్న భూములకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ ఆయా జిల్లాల అధికారయంత్రాంగానికే చేరు తుంది. అదే విధంగా మోటారు వాహనాల రిజిస్ట్రేషన్, సంబంధిత పన్నులు ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి చేరుతాయి. ఖనిజాలపై రాయల్టీ తదితరాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
ఒక్కముక్కలో చెప్పాలంటే, రెవెన్యూకు సంబంధించిన భారీ వన రులు అన్నీ కూడా ఉనికి నిర్దేశితమై ఉంటాయి. అవి నమోదై ఉన్న పా లన / రాజకీయ భూభాగానికి చెందుతాయి. అందుకే ఈ విషయాలన్నిం టినీ విస్మరించి, ఆయా సంస్థలపై వచ్చే ఆదాయాల న్నింటినీ నగరంతో ముడిపెట్టడం, హైదరాబాద్‌ను జెయింట్ ఎకనామిక్‌గా హబ్‌గా ప్రొజెక్ట్ చేయడం, దాని కాంట్రిబ్యూషన్ లేనిదే రాష్ర్టం మనుగడ సాధించలేదని చెప్పడం అనేది సబబు కాదు.
2013కు సంబంధించి అధికారిక సమాచారం మేరకు, జీహెచ్ ఎంసీ ఏరియా నుంచి రెవెన్యూ నాలుగు ప్రధాన వనరుల నుంచి లభ్య మవుతుంది. అవేమిటంటే, వ్యాట్, లిక్కర్‌పై ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ మరియు మోటారు వాహనాల పన్ను. ఇవి వరుసగా రూ.960కోట్లు, రూ.941 కోట్లు, రూ.651 కోట్లు, రూ.117 కోట్లుగా ఉన్నాయి. ఆ విధంగా మొత్తం రెవెన్యూ రూ.11,730 కోట్లు. (హైదరాబాద్ అర్బన్ రెవెన్యూ జిల్లాను మాత్రమే లెక్కిస్తే ఈ మొత్తం మరింత తగ్గే అవకాశం ఉంది). మిగతా రాష్ర్టం నుంచి అందే ఆదాయం రూ.39,711 కోట్లు. ఆ విధంగా చూస్తే రాష్ర్ట విభజనలో హైదరాబాద్ కీలకమనో లేదా హైదరాబాద్ స్థాయి అంశం పై తేల్చడం ముఖ్యమనో భావించలేం.
రాష్ర్ట విభజనకు హైదరాబాద్ కీలకమని నిరూపించేందుకు శ్రమిస్తున్న వారు గమనించాల్సిన అంశం ఒకటుంది. హైదరాబాద్ నుంచి వ్యాట్ కింద అందే మొత్తంలో అధిక భాగం ప్రధానంగా ఐఒసి, హెచ్‌పీసీ ఎల్, బీపీసీఎల్ వంటి చమురు కంపెనీలు మరియు రాష్ర్టంలో మద్యం విక్రయాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యం కలిగిన ఏపీ బీవరేజెస్ కార్పోరేషన్ (ఏపీబీసీఎల్) నుంచి వస్తున్నదే. రాష్ర్ట విభజన జరిగి రెండు రాష్ట్రాలుగా మారిన తరువాత భారీగా పన్నులు చెల్లిస్తున్న ఈ సంస్థలు రెండు రాష్ట్ల్రాల్లోనూ నమోదు కావాల్సిందే. ఆయా రాష్ట్రాలో జరిగే విక్రయాల ఆధారంగా ఆయా కంపెనీలు ఆ రాష్ట్రాలకు వ్యాట్ చెల్లిస్తా యి. ఆ విధంగా చూస్తే హైదరాబాద్ నుంచి ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అంతే గాకుండా, కొత్త రాష్ర్టం ఏర్పడితే, తెలంగాణకు ఆవల తయారీ యూనిట్లు కలిగి, హైదరా బాద్‌లో నమోదైన కంపెనీలు తమ రిజిస్ట్రేష న్లను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు అవి తెలంగాణ రాష్ట్రానికి గాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పన్నులు చెల్లిస్తాయి. అలాంటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ మరింత తగ్గిపోతుంది.
వాణిజ్య రవాణా వాహనాల యజమానులు తమ వ్యాపార కార్య కలాపాలను మార్చుకుంటే వారు తమ వాహనాల పన్నులను సీమాంధ్ర ప్రాంతంలోనే చెల్లిస్తారు. అదనంగా, తెలంగాణ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో చోటు చేసుకునే మౌలిక వసతుల కల్పన, సేవా రంగంలో కాంట్రాక్టు ఒప్పందాల కారణంగా అక్కడి ప్రభుత్వానికి భారీగా స్టాంప్ డ్యూటీ ఆదాయం వస్తుంది. అవన్నీ వదిలిపెట్టి హైదరాబాద్ పైనే మంకుపట్టు పట్టడం ఎందుకో అందరికీ తెలుసు.
వినియోగం ఆధారంగా పన్నులు ఉన్నంత కాలం కూడా ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న వినియోగం లేదా వ్యాపారలావాదేవీల ఆధా రంగా ఆ రాష్ట్రాలకు పన్నులు సమకూరుతాయి. అందువల్ల హైదరాబాద్ నుంచి రాష్ర్ట ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందనే వాదన అర్థరహి తమైంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని పంచుకోవాలనే వాదన కూడా అర్థరహితమైంది. టాక్సేషన్ సూత్రాల ప్రకారం చూసినా ఈ వాదన విలువలేనిది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తాను ఏ రాష్ట్రానికి చెం దిన వ్యక్తో తేల్చుకొని ఆ రాష్ట్రానికి పన్నులు ఎలా చెల్లించగలుగుతాడు?
హైదరాబాద్ అర్బన్ రెవెన్యూ జిల్లాకు ప్రత్యేక హోదా ఇస్తే, దాని పాలనా వ్యయాన్ని కేంద్రం భరించాల్సి ఉంటుంది. విధాన నిర్ణేతలు గనుక హైదరాబాద్ అర్బన్ జిల్లా సరిహద్దులను విస్తరించి యావత్ హెచ్‌ఎండీఏ పరిధిని గనుక నిర్ణయిస్తే, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ నుంచి అత్యధిక సంఖ్యలో మండలాలు హెచ్‌ఎండీఏలో కలుస్తాయి. దీనికి తెలంగాణ రాష్ర్టం నుంచి, తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు. దీంతో ఆ జిల్లాలు కుంచించుకుపోవడంతో పాటుగా నగరవాసుల జీవితం భయంకరంగా మారుతుంది.


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *