సంక్షోభంలో గౌడకులస్తులు | ఉద్యమిస్తేనే పురోగతి

 

కల్లు గీత వృత్తి ఎంతో క్రమశిక్షణ గల వృత్తి. కల్లుగీత పనివారు ఎంతో దీక్షతో పనిచేస్తుంటారు. మోకు భుజాన వేసుకోని, కాళ్ళకు గుత్తి తొడిగి, కత్తి వెనక్కిజెక్కి యుద్దానికి వెళ్తున్న వీరునివోలె, ఊపిరి బిగియబట్టి చుక్కలోతు పెరిగిన తాటిగెలలోని కల్లు ఊటను ముంతలోకి తీసి ప్రజలకు అందిస్తుంటారు. నేటి సమాజంలో అన్ని కులవృత్తుల కంటే అతి ప్రమాదకరమైనది కల్లుగీత వృత్తి. పొద్దున లేచిన నుండి పొద్దుమూకే దాక ఒక్కో చెట్టును 3 సార్లు ఎక్కుతూ, దిగుతూ దిన దిన గండమోలె నూేకరళ్ళ ఆయుస్సుగా కాలం ఎల్లదీస్తు న్నారు. నిరంతరం మృత్యువుతో పోరాడుతూ జీవనం కొనసాగిస్తు న్నారు. పండుగైనా పబ్బమైనా,పెండ్లైనా, చావైనా, బ్రతుకైనా ఒక్క పూట తాటి, ఈత చెట్లు ఎక్కకుండా ఉండలేని పరిస్థితితో కూడు కున్నది ఈ కల్లుగీత వృత్తి.
. కల్లుగీత వృత్తి నేడు పాలక వర్గాలు చేస్తున్న కుట్రతో తీవ్ర సంక్షభంలో కొట్టుమిట్టాడుతోంది. కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వాలకు కల్లుగీత కార్మికులు చెల్లిస్తున్నారు. మనం చెల్లించె పన్నులతో జీవిస్తున్న ప్రభుత్వాలు మనపై రవ్వంత కనికరం కూడ చూపడంలేదు. కల్లు గీత వృత్తికి గ్యారంటి లేదు. రక్షణ అంతకంటె లేదు.
గౌడ కులస్తులు నేడు సావుబతుకుల మధ్య జీవన పోరాటం కొనసాగిస్తున్నారు. ఎర్రని ఎండల్లో తాటి ముంజల్ని కోసుకొచ్చి ప్రజలకు అందించి వారి శరీరాలను చల్లబరుస్తున్నారు. కానీ వాళ్ళ బతుకులు మాత్ర అగ్నిగుండంలా తయారవుతున్నాయి.
ఈ రంగాన్ని అభివృద్ధి చేసేదిపోయి కల్తీని నిరోధించె పేరుతో కల్లును రద్దు చేస్తూ, విష పదార్థాలతో ఉన్న బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, చీప్‌లిక్కర్‌లతో పాటుగా బహుళజాతి విదేశీ కంపెనీల వివిధ రకాల పానీయాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. రాజకీయం గా, ఆర్థికంగా ఎదుగుతున్న గౌడకులస్తుల్ని అణగదొక్కడానికి కుట్ర పనుతున్నారు. కల్లును రద్దు చెయడానికి కల్తీని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కల్తీని నిరోధించె పేరుతో కల్లుగీత వృత్తినే కాటికి పంపే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. గతంలో కల్లును నిషేధిస్తా మన్న కాంగ్రెస్‌పార్టీకి గౌడ కులస్తులు ఓట్ల రూపంలో గుణపాఠం నేర్పారు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం బహుళజాతి కంపెనీల వ్యా పార అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కల్లుగీత వృత్తిని రద్దు చేసెందుకు 756,551 జీవోలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.
వాస్తవానికి కల్తీ చేయడం నేరం. అటువంటి నేరాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోని శిక్షించండి. కానీ కల్తీని నిరోధించడంలో విఫలమైన ప్రభుత్వాలు, కల్తీని అడ్డం పెట్టుకొని కల్లుగీత వృత్తి పరి శ్రమను రద్దు చేయాలనడం ఎంతవరకు సమంజసం? రాష్ర్టంలో కల్తీ బీరు, విస్కి, చిప్‌లిక్కర్, తాగి వేలాది మంది మరణిస్తుంటె మద్యం షాపులు మూయించినారా? ఒక్క కేసైనా పెట్టినారా? మద్యం మాఫియాల్లో కొన్ని అగ్రవర్ణాల వారు కేంద్ర బిందువులుగా ఉన్నారు.
మరి కల్లు కుండ ఏం పాపం చేసింది? కల్లుపై ఎందుకింత కక్ష సాధింపు చర్యలు? సామాజికంగా వెనుకబడిన వర్ణాలలో ఉండి, యిప్పుడిప్పుడే ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్న గౌడులపై అణచివేత చర్యలకు పాల్పడటం అగ్రవర్ణాల ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర కాదా? పాలకులు అవినీతికి పాల్పడితె వారిని అరెస్టు చేస్తారా? లేదా ప్రాణాలు తీస్తారా? ప్రమాదాలు జరుగుతున్నాయని బస్సులనే రద్దు చేస్తారా? లేదా నివారణ చర్యలు చేపడుతారా? మేధావులారా మీరే ఆలోచించండి!
ఈ వ్యవస్థలో పనికొచ్చె ప్రతి వస్తువులో, పదార్థంలో కల్తీ ఉం ది. ఉప్పులో కల్తీ, పప్పులో కల్తీ. నెయ్యిలో కల్తీ, నూనెలో కల్తీ. పసుపులో కల్తీ, పాల డబ్బాలలో కల్తీ. ఒకటేమిటి? ప్రజలకు పనికి వచ్చె ప్రతి పదార్థంలో కల్తీ ఉంది. అట్లాని అన్ని పదార్థాలను నిషేధి స్తారా? లేేదా నివారణ చర్యలు గట్టిగా చేపడుతారా? ఒక్కసారి మీరె అలోచించండి. కల్తీ పేరుతో కల్లు గీతను, కల్లు అమ్మకాలను రద్దు చేయాలనడం రాజకీయ, సామాజిక స్పృహ ఉన్నవారు చెసే పని కాదు. కల్లునే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గౌండ్ల బతుకల్లో నిప్పులు పోయకండి. కల్తీ నిరోధించడానికి తగిన చర్యలు తీసుకొని కల్లుగీత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి అని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సమాజంలో మార్పు ఎంతైన అవసరం. వివిధ వృత్తుల్లో ఆధుని కత వచ్చింది. కానీ గీతవృత్తిలో ఆధునికతను ప్రోత్సహించడా నికి ప్రభుత్వాలు ఎందుకో సుముఖంగాలేవు? ఏ ఇతర వృత్తి పనివారలు చెల్లించనంత పన్నులను గీతవృత్తి వారు చెల్లిస్తున్నారు. ఇప్పుడైన ప్రభుత్వాలు స్పందించాలి. కల్లును నిల్వ చేసి ఆధునిక పద్దతులతో దక్షణాఫ్రికా, శ్రీలంక, తమిళనాడు, కేరళ మాదిరిగా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించాలి. హైబ్రిడ్ విత్తనాలను పంచి కల్లును ఉత్పత్తి చేయించి ‘పాలడైరీల’ మాదిరిగా మార్కెట్ కల్పించవచ్చు. ఒక్క సారి ఆలోచించండి. తెలంగాణలో కల్లు మినహా సంపూర్ణ మద్య నిషేధం విధించాలి.
అయిల సదానందం గౌడ్ (సదా)
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, పాలమూరు జిల్లా


Related News

 • ఘనంగా ‘పాతాళ గరిగె’ పుస్తకావిష్కరణ
 • కలిసిపోయే వారిని… అక్కున చేర్చుకున్న దక్కన్ సంస్కృతి
 • ఇక సాగనివ్వం
 • ప్రజాస్వామ్యంలో ‘అభిప్రాయం’
 • మద్రాసు తరహాలో…. ఖాళీ చేసేందుకు గడువు 24 గంటలే!
 • ముంబైలో తెలంగాణ బిల్లు సాధన సభ
 • ‘‘అంకమరాజు’’ కోలాటం
 • తెలంగాణ తొలి విప్లవ వీరుడు | దొడ్డి కొమరయ్య
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *