చిన్న రమణయ్య

గామె బస్సుకోసం సూర్యపేట బస్టాండ్ల దీనంగ ఎదురు జూసుకుంట గూసున్నది. అసలే గామె మొకమెప్పుడూ పాలిపోయినట్టు ఉంటది. అసుంటిది ఇయ్యాల మరింకింత పాలిపోయి వున్నది. గామె సదువుకున్నదేంగాదుగద, ఏ బస్సెక్కడి పోతదో దెల్వది-అడిగి దెలుసుకుంటెదప్ప.
గామె పేరు సారమ్మ. పుట్టి పెర్గిందేమొ మహదండి -పేదింట్ల! గామె అసలు కులమేందో గామెకే దెల్వది. గామె భర్తకు సుతాదెల్వది. ఇగామె తలిదండ్రులు రాళ్ళుగొట్టుకుంట, రాళ్ళళ్ళ రాళ్ళై, రాళ్ళబతుకులీడ్సుకుంట, ఎండలకెండి, వానల్ల నాని, మొండి బతుకలల్లనే మునిగిదేలుకుంట, అప్పులాకళ్ళకు గిల-గిల గొట్టుకుంటనే వొచ్చినాళ్ళయెపాడై! గందుకే, గాళ్ళ బతుకులాసాంతం బండలసుంటివాటికే శెల్లిపోయినవాయె. ఇగే కులమైతేందోని, గా వడ్డెర వృత్తికే అంకితమై, ఆదెరువుకోసమే అంగలార్సుకుంట, గాయెనే ఆసాంతం కుటుంబం కుటుంబానికీ- నరకమసుంటి కాలానికే అర్పించుకుంటొచ్చిన్నామె!
సారమ్మకిప్పుడు యిరువై రొండేండ్లు. భర్తకు యిరువైయైదేమొ… ఎవరు లెక్కవెట్టుకున్నరని గట్టిగ? ఈడు సొప్పున పెండిండ్లా గప్పుడు పాడై? సమర్తయిందంటె, ‘‘పెండ్లీడుకొచ్చింది పిల్ల’’ అనేటోళ్ళాయె! మీసం ముదిర్తె మొగోడైండు- వీణ్ణొక యింటోన్ని జెయ్యవల్సిందే ననేటోళ్ళాయె! గప్పటికాలంల పెండ్లిసూపులూ, గిండ్లిసూపులూ వుండేటియా-పాడా? ‘‘పక్కింటి పార్వతమ్మ బిడ్డె గీ పోరగానికి ఈడైతది గాదుర?’’ అని అడిగేటోండ్లాయె పెద్దమనుసులు. అవునింతకూ, పిలగానిపేరు జెప్పనేలేదుగదా..‘‘విష్ణుమూర్తి..!’’ ఐతే, గంత సక్కదనంగ ఎవలు పిలుస్తరు? – ‘‘ఇష్నుమూరో’’ంటరు. గటనే యిష్టంగ పిలుస్తరు. ఒగోపాలి, నోరు సక్కంగ దిరిగి నోల్లు – ‘‘విష్ణుమూర్తి’’ అని సక్కంగ పిలిశెటోల్లు సుతా వుంటరు. ఏమాట కామాటే, ఎట్ల పిల్శినా యిష్టంగనే పల్కుతుంటడు. సంబూరంగ జవాబు సుతాయిస్తుంటడు!


గాకాలంల, ప్రధానమైన వృత్తంటే, ఊళ్ళల్ల, ఎవుసంగాకుంట యింగేమైతది? – గదేనాయె! కానీ, దిన-దినం ఎవుసం బరువై, పిరెంగాలే! కొందరు మోతుబర్లకుదప్ప, ఎవుసం, కండ్లపొంటి నెత్తుర్లుగార్పిచ్చి, పట్టపగులు సుక్కలు జూపిస్తలేదా? ఊల్లెపాలిటి ఫలసాయం గావల్శిన ఎవుసం ఎవలకూ, యిసుమంత సాయపడ కుంటొచ్చిందాయె! ఏకాలంలనైనా, ఎవుసం గలిసొస్తదా పాడై? అంతా దైవాదీనమేనాయె! ఎట్లెట్ల భూతల్లికి దూరమై, వృత్తులు భారమైకుం టొచ్నియో, గట్లట్ల వొలసబాట పట్టిండ్రాయె జనాలు-గట్టిగజెప్పాల్నంటె గరీబోల్లు…!
ఖమ్మం వలసబొయ్యేటందుకు సిద్ధమైంది-విష్ణుమూర్తి కుటుంబం. గంతట్లనే లగ్గమనిగూడ అనుకుండ్రు యింట్ల. గప్పటిగ్గప్పుడు లగ్గమనుకుంటెట్ల? బతుకంత అరకొరేనాయె. తక్కిడిబిక్కిడేనాయె! నిత్తెం, నిలువునిస్తారం, ఉప్పిడుపాసమేనాయె. తిండి తిప్పలతోనే కొసెల్ల ఈదుడైపాయె..కుదుర్తదా..అని అంగలార్సవట్టిండ్రు జనాలు. ఇంకొకపక్కంగ- ‘‘భగవంతుడా’’ అని మొరపెట్టుకుంటున్నరు.
విషయం ఊరిపెద్దల శెవుల్ల వడ్డది. తలావొక శెయ్యనుకున్నరు. ఏందక్కువ నున్నూర్రూపాలే జమైనై. రెక్కల్ని కుసింతైన పైకి లేపగలుగుతమన్న ధైర్యం శిక్కవట్టుకున్నరు. రొండు శేతులను జోడిచ్చి, ఊరి పెద్దలకు, మాట సాయంజేశి తమనాదుకున్నోళ్ళకు, కండ్లల్ల నీల్లువెట్టుకుంట శణార్తులు వేడుకున్నడు విష్ణుమూర్తి.
ఇంగేంది – వారంలోపట్నే, లగ్గంగానే అయ్యింది. బిరాన పైనం గానే అయ్యిండ్రు. ఉన్న వూరికీ, నేల తల్లికీ, పెద్దమనుషులకూ మల్లొక్కపాలి శణార్తులు జెప్పుకుంట, బతుకు శేతవట్టుకోని బైలెల్లింది విష్ణుమూర్తి కుటుంబం. ఎక్కడికో దెలువదు. తోల్కపోనొచ్చిన మేస్త్రికి సుతా, కనీసం వూరుపేరు దెల్వదు. ఏదైతేంది? అది వూరుగాకుంట వోదుగద!… గదిసాలు.. పని దొరుకుడే పదివేలు అనుకున్నరు. ఖమ్మం దగ్గర్నేనో, యింకొంజం దూరాన్నెనో అనుకున్నరు. ఎక్కడ్నెనా గదే కష్టం – ఎంతెంత రెక్కల కష్టం జేసినా, గదే ముదునష్టం అనుకొచ్చిన్రు.
గాకాలంల, పలు-పలు సోట్లల్ల ఎంతో యిష్టంగ బిల్సుకునే పేర్లకంటెక్కువ, వరుసలు-బంధాలు, బంధుత్వాలుండేటివి. అక్కా, శెల్లె, అన్నా, తమ్మి, అమ్మా-నాయిన… అనుకుంట. ఒకవేళ జనాలు పేర్లతోటి• బిల్సుకున్నా, రామయ్యకు బదులుగా ‘‘రామిగా’’, లక్ష్మయ్యకు బదులుగా ‘‘లచ్చిగా’’ అనుకునేటోళ్ళు. ఆడవాళ్ళ విషయంలో, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ‘‘పిల్ల’’, ‘‘పోరి’’ (ఇప్పుడు నాజూకుగా ‘బుజ్జి’) అని, మగపిల్లల విషయంలో ‘‘పోరడు’’, ‘‘పోరగాడు’’ అనీ పిల్సుకునే టోళ్ళు. అయితే,గా పలకరింపు లేమాత్రమూ నిందాత్మకమైనవిగావు. అట్లా కాకపోవడమేగాకుండా, ఎంతో గొప్పగా, దీన్ని మించింది లేదన్నట్టుగా వ్యక్తమయ్యేవి.
సుట్టుముట్టు పదిమైళ్ళ దూరందాకనైనా, ఊరి జాడే గనిపించని ప్రాంతమది. ఇంకా జెప్పాల్నంటే, రాళ్ళ-గుట్టల ప్రాంతమది, పైపెచ్చు, పెద్ద రాతి అడవిగా పరుచుకుపోయిందది. పనోళ్ళంటే అక్కడ బండరాళ్ళను పగులగొట్టెటోళ్ళే. వాళ్ళే పది గుడిసెలు వేసుకున్నారక్కడ. కారడివి, చిట్టడివికి భిన్నంగా అది రాతి అడివి. మనిషి దూపతోని నోరుదెరిసేకొద్దీ, బ్రెహ్మరాక్షసులోలె ఏకంగా మనుషులనే మింగెతట్టుగ సిద్దంగున్నయి. ఆఖర్న వొగనాడు పనోళ్ళు ప్రయత్నం జేసినకాడ నీళ్ళువారుకుంట ఒక శెలిమె గానొచ్చింది. గదేందో కూలి, నాలి జేసుకుంటోల్లు బాయికోసం తొవ్విన జాగనే అయ్యుంటది. ఇంగేంది, గంగవ్వ కరుణిచ్చిందని ఒగ సంబురంగాదు పనోళ్ళది. పండుగను మించిన పండుగైంది వాళ్ళకు…!


గానాటిసంది వాళ్ళకింక నీళ్ళగోస తీరింది. వంటగ్గూడ అనుకూలమైంది. పనిభారమెంతగానో తగ్గినట్లయింది. పగలల్లా రాళ్ళుగొట్టి-కొట్టి, శ్రామికుల శేతులు బొగ్గలెక్కి, రక్తం-రక్తమైనా, రాత్రికి గుడెసెలల్ల దూరి, కుసింత దిని పంతెనాయినా….. సొర్గం దాని ముందు బలాదూరనిపిచ్చకుండ యింగేమైతది? గట్ల కొన్నాళ్ళు గడిసేతలికి సారమ్మ నెలదప్పింది. ఇంగేంది? గుడిసెల సంబూరమేగాదు… వార్త యినుడే ఆల్శెం, అందరూ గుడెసెలల్లకెల్లి బైటికొచ్చి సారమ్మను ఆటపట్టిచ్చుడేగాదు… మురిసి ముద్దాడుడేగాదు… ఇగ ఆగేడిది లేదనుకుంట పండుగ జేసుకోనే జేసుకుండ్రు!
కాలంగూడ ఎట్లాగుతది? ఒకటాయె, రొండాయె..నెలలే సూడంగ సూడంగనే సారమ్మ నిండు సూలాలాయె! అక్కడేమన్న డాక్టరా, పాడా? కనీసం నర్సమ్మకన్న దిక్కులేకపాయె. దావుకానకు బొయ్యే బిశాతంత కన్నలేకపాయె. గసుంటప్పుడు దేనికోసమనో దేవులాడుకునే దెందుకనుకుంట…. దడిగట్టనే గట్టిండ్రమ్మలక్కలు – సారమ్మ సుట్టుజేరి – గా తల్లి నొప్పులకు యేడ్సుకుంట, గోస దీస్తున్నంతట్లనే కాన్పుగానే అయ్యింది. ‘‘మగపిల్లగాడు- మగపిల్లగాడ’’ని అందరినోళ్ళు ఆనందంగ పల్కవట్టినై. గుడిసెలబైట గూసున్న మొగోల్లు – విష్ణుమూర్తిని అలయ్‍-బలయ్‍ దీసుకుంటనే, ‘‘సీసమూతదిప్పేడిదున్నదా లేదా?’’ అని అడిగేదాల్శెం, సర్కారు బాటిల్లు దిగనే దిగినై. ఆడోళ్ళ కోసమని కొన్ని కల్లుకుండలు గూడ జేరినై. కారపప్పలు, ఉడుకవెట్టిన గుడాలు, కోడిగుడ్లు ఏర్పాట గానే ఆయినై, అందరూ తమ-తమ శక్తికొద్ది గొంతులు దడుపుకునుడే, ఆల్శెంగాకుంట…!


పురుడు, యిరువైయొకటి గూడ అయినైగని, విష్ణుమూర్తి తన గుడెసెలకు జేరుకునుడే కొంచెం అజ్జెం-మజ్జెం అయ్యింది. ఎప్పుడడిగినా, పనిమీద పని వెడుతున్నరు-పనెక్కువైందని ఉల్టా జెప్తున్నడు. తొందరగ పోవాలె టైం లేదనుకుంట, వొంటగ్గావల్సిందేందో దబ్బున అడుగమంటున్నడు సారమ్మను. అన్నీ దెచ్చిపెడుతున్నడుగని రాత్రి యాల్లకు గుడిసెలకు జేరుడు మాత్రం టప్కీయిస్తున్నడు. సారమ్మ అనుమానం కాస్తా పెనుభూతమే అయికూసున్నది.
ఒకనాడు గట్టిగనే నిలదీసింది విష్ణుమూర్తిని-యిల్లాలు. ‘‘ఏందా తొందర? నిన్నగాక మొన్న కొడుకును గన్నవో లేదోగని, లావు బెదిరిస్తున్నవేంది?… గింతకూ నామీద నీపెత్తనమేంది? అని కసిరిచ్చుకుండు విష్ణుమూర్తి.
పెత్తనమేంద•య్యా?! ఏరోజుకారోజు యింటికి రాకుంటెక్కడికి వోతున్నవో? ఒక్కదాన్ని, సంటిపోరగాన్నేసుకోని ఏంగావాల్నేను? యాత్రలకనివొయిన మీ నాయిన అయిపు లేకుంటవాయె! దింపబోతె, వూపిరాడకుంట ఒక్కపాలి పొల్లగాడేడుస్తుంటె నాకెంతభయమైతది? అయినాగని, నన్నూ, పోరగాన్ని గాదని, గంతపనేం మునిగి పోతుందని?… అసలు రాకుంటనేవోతున్నవ్‍? వొచ్చినప్పుడు గూడ, ఆగమేగాలమీద, తిన్న శెయి సుతాకడిగి తుడుసుకోకుంటనే వోతున్నవ్‍? అని నిలదీస్తున్నా దుల్పాయించుకోని బైటికెల్లిండు విష్ణుమూర్తి.
‘‘అవునూ ఇష్ణుమూర్తి సామికి యిద్దరున్నట్టు నీకింకొగామె గల్సిందా యేంది?’’ అని నిలదీశింది యింగొకనాడు సారమ్మ. తన భార్యని యింతకు మున్పటిలెక్క కొంచెం అనుమానంగాదు, నిజమేందో, ఎవ్వరి ద్వారానో తెలిసిందనిపించింది విష్ణుమూర్తికి. అదిగూడ ఒగందుకు మంచిదే అయిం దనుకున్నడు. ‘‘అయితే ఏందట?’’ అన్నడు, గంత దాంక వచ్చినప్పుడు…
‘‘అంటే, ఎవరో గూడిం డ్రన్న మాట… ఎవతది? మనిషేనా? నాకు దెల్శిందేనా? ఆలి వుండంగ అమిరిచ్చుకునేది మగువా? ఎవతో ముండరాలు మోపైందా?’’ అని అరుసు కుంట నిలదీయవోయింది. ‘‘ఎవరైతేంది? ఆమెగూడ వుంటది మనవెంట-వుండనిస్తె, లేకుంటె ఆమెవొక్కతే వుంటది గీ గుడిసెల నావెంట’’ అని ఖరాఖండిగ తేల్చిజెప్పిండు విష్ణుమూర్తి.


కుప్పగూలిపోయినంత పనైంది సారమ్మకు. కండ్లముందు ఎడార్లూ, సముద్రాలుదప్ప యింగేమీ అగుపించలేదు. తానున్న గుడెసె తనమీదనే గూలిపోయినట్లనిపిచ్చింది. పసివాడు నవ్వుతూ, తన పుస్తెలతాడును పట్టుకొని లాగుతూవున్నాడు. వానికి చేతనైనంత బలంగా. ‘‘నీకూ యిష్టం లేదా నాయినా- నా గుండెల మీద నా పుస్తె వేళ్ళాడటం?’’ అని అడుక్కున్నదా తల్లి కొడుకును- కండ్లల్ల నీళ్ళు కండ్లల్లనే గుక్కుకుంట. అది వింటూ, అమ్మను చూసి మరింత మురిపెంగా నవ్వుతున్నాడు పసివాడు. అదేదో, భర్తతోపాటైతే, ఆమె ఆనందానికి మేరలేనంత వివశురాలైపోయేదేమోగాని-వెక్కి వెక్కి ఏడ్వకుంట వుండజాలకపోయింది.
తెల్లారేతలికి, యాత్రలకు వొయ్యి తిరిగొచ్చిన మామగారు యింటి ముందు ప్రతెక్షమైండ్రు. సాంప్రదాయికంగా కాళ్ళకు నీళ్ళిచ్చింది.
కాళ్ళు గడుక్కోని గుడిసెలకు చేరీ చేరంగానే, మనువన్నెత్తుకోని నీళ్ళ చెంబుతో నిలవడ్డ కోడల్ని ఎంతోసేపటికిగాని గమనించలేకపోయినాడు. నీళ్లుదాగడం ఆల్శెం, మనువనితోని ఆటకు దిగినాడు. ఆనాడు రాలేదు విష్ణుమూర్తి, రెండోనాడూ రాలేదు గుడిశెలకు. తన కొడుకు రాకుంట బొయ్యిండేందని కోడల్ని అడుక్కుంట, ‘‘గొడువలేమైనా జరిగినయా’’? అని తెలుసుకోబోయినాడు.
చాలమట్టుకు తనను తాను సంభాళించుకొని, చివరికా విషయం చెప్పింది తన మామగారికి సారమ్మ. అంతా అర్ధమైందాయనకు. పని జరిగేకాడికి తానే స్వయంగా చేరుకున్నాడు. మధ్యాహ్న సమయమప్పుడు – కొడుకు, యింకో ఆడమనిషి, ఒకటే విస్తరాకుల దింటున్నారన్నం. తమా యించుకొని వెనుకకు తగ్గినాడు ముసలాయన. పనిమీంచి శ్రామికులు దిగకముందే వెళ్ళి కొడుకును కలుసు కున్నాడు. కొడుకు మాటల్ల అన్నీ అబద్దాలే. అంతకన్న అయిష్టాలే దొర్లినై. ఆఖరికి తండ్రిని సుతా కాదనుకునేటంత దాకా పోయినాడు- కొడుకు. ఏమీ చేయజాలకనన్నట్లు, ఎన్కకు మర్లినాడు తండ్రి.


ఓడిపోయిన సైనికునోలె, అవమాన భారంతోని- మామగారు గుడిసెను సమీపిస్తుండటం దూరాన్నించే గమనించి, గుడిశెనుకకు మర్లి నిలవడింది కోడలు. ముందుకూ, వెనుకకూ అన్నట్టుగా, గుడిశెలనించి చూస్తుండంగనే, తాతయ్య ధోవతిని పట్టుకొని నవ్వుతున్న మనుమడు. ఇంక అది సాలన్నట్టు అక్కణ్ణించి ఎటో ఎల్లిపోయింది సారమ్మ. ఆరోజూ, పగలూ-రాత్రి అన్నట్టుగా కోడలు సారమ్మ కోసం చూస్తూ, ఆరా తీస్తూ, గుడిసెలన్నీ కలియదిరిగినాడు ముసలాయన. అందరినీ కలిసి ఆరా తీయబోయినాడు. కానీ, సారమ్మ జాడ తెలియనేలేదు.
‘ఏమి జరగివుంటుందా?’ అని ఆరా తీసే ప్రయత్నం చేస్తూనే వచ్చినాడు రమణయ్య. కండ్ల నీళ్ళువెట్టుకుంట, గుడిశెల్లోని
ఆడవాళ్ళు అసలు విషయం తెలిపినారు ముసలాయనకు – నీ కొడుక్కు నీకోడలు మీద అనుమానమట… ఆపిల్లవాడు తనరక్తం కాదన్నాడట’’ అని! అదీ సంగతి, నీ కోడలు నిష్క్ర మణకు అసలు కారణమని అనుకుంట….
ఎంతటి మానధనురాలు నా కోడలు.. అని ప్రకటితా ప్రకటితం గానే మరల మరల గొణుక్కుంటూ, మ్లానంగా, హృదయభారంతో-తనకే తెలియని విధంగా కదులుతూ, ఎటు బోవాల్నో తోచని అగమ్యం దిశగా సాగినాడు రమణయ్య.
‘‘అయ్యా! గింతకూ ‘‘రమణయ్య’’ ఎవరి పేరు? అని అడిగేటందుకు సాహసించినారు-అక్కడి గుడిసెవాసులు. ‘‘నాపేరే’’ అన్నాడతను. ‘‘అదేపేరు పెట్టుకుంది నీ మనుమనికి సారమ్మ’’ అన్నారు గుడిసెవాసులు. సారమ్మ మీది కృతజ్ఞతాభావంతో రమణయ్య కళ్లు చెమరుస్తూ -ధారలు కట్టినై.
ఇంకొక అమ్మాయిని తన జీవితంలోనికి చేర్చుకునే ఉద్దేశంతోని తనకు వంశాంకురాన్నిచ్చిన తన కోడలు మీదనే నిందమోపిన సొంత కొడుకు యొక్క రాతి గుండెను తలచుకుంటూ దు:ఖమూ, అవమానభారంతో ఒక అనాధ శరణాలయం దిశగా సాగినాడు రమణయ్య-అనాథగాని ఒక అనాధగా మిగిలిన మనుమణ్ణెత్తుకొని.

అనాధాశ్రమం పేరుకేగాని ఊహించనంత గొప్పగా అగుపించింది రమణయ్యకు. అక్కడ పసిపిల్లలతో బాటుగా బడీడుపిల్లలు, పంతుళ్ళు- పంతులమ్మలతోబాటు కొందరు ఆయాలు గూడ అగుపిస్తున్నారు. ఆశ్రమంలోనివారు సహకరిస్తుండగా ప్రిన్సిపాల్‍గారి గదిలోనికి బెరుకు-బెరుకుగానే వెళ్లినాడు రమణయ్య.
‘తాతయ్య వుండగా మనవడు అనాథ కాడుగదా?’ అంటున్నాడు అధికారి. కాని, తానిప్పుడు ఈ వయస్సులో పెద్దగా ఏమీ చేయలేనని, అవకాశం కల్పిస్తే అదే ఆశ్రమంలోనే ఒక్క పైసా కూడా జీతభత్యాల కింద ఆశించకుండా, ఏపని చేయటానికైనా సిద్ధమేనని, బట్టలు ఉతికిపెడతానని, మరుగుదొడ్లను కూడా శుభ్రం చేస్తానని బ్రతిమిలాడుకున్నాడు.
అటువంటి అవసరం తమవద్ద ప్రస్తుతానికి లేదని, తమకిప్పుడు ఏదోవొక రూపంగా, తమ శరణాలయంలోని అనాథలను ఆదుకోగల ఉదారులూ, వసతులను కల్పించగల వదాన్యులూ కావాలంటుండగానే ఏపనిమీదనో గబుక్కున యజమాని గదిలోనికి ప్రవేశించింది సారమ్మ. అక్కడ తన మామగారిని చూసి, ముందుగా తడబడి, తరువాత ఆశ్చర్యంలోనికి జారిపోయింది. సంగతి తెలుసుకున్నమీదట, పిల్లలను ఆడించే పనిని తన మామగారికి అప్పజెప్పి, కొడుకుని ఆశ్రమంలో వుండనిస్తేచాలని, వేడుకుంటూ, తను మరింకెక్కడైనా బతుకుతెరువు చూసుకుంటానని ప్రాధేయ పడసాగింది సారమ్మ.
యజమానికి ఆశ్చర్య పడటమూ, ఆలోనచల్లో మునిగిపోవడమే పనులైనై. ఏమైతేనేం, పసివాడితోపాటు తల్లీ- తాతయ్య-ఆశ్రమంలోనే వుందురుగాని అన్నారు అధికారిగారు. తల్లిని గుర్తుపడుతూ అంతదాకా అధికారి చేతుల్లో వున్న పసివాడు చటుక్కున్న తల్లి సారమ్మ వొడిలోకి వాలినాడు – ‘చిన్నరమణయ్య’’!

వేణు సంకోజు
ఎ : 9948419881

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *