తెలంగాణలో కొత్త లోకాలకు తెరతీసిన క్రైస్తవం

మొత్తం దక్కన్‍లో మొట్టమొదటి చర్చి కుతుబ్‍షాహీ కాలంలో ఏర్పాటయింది. 1620 ఆ ప్రాంతంలో ఈ చర్చ్ ప్రారంభమయింది. పోర్చుగీస్‍, ఫ్రెంచ్‍ నుంచి వచ్చిన కాథలిక్‍ అధికారులు గోలకొండలో కుతుబ్‍షాహీ సైన్యానికి శిక్షణ ఇచ్చేవారు. ఈ అధికారులు కట్టడాల నిర్మాణంలో, వ్యవసాయరంగంలోనూ మెలుకువలు నేర్పించేవారు. దీంతో కుతుబ్‍షాహీ రాజులతో పాటు వారి అధికారులకు కూడా వీరిపట్ల గౌరవ భావముండేది. ఈ చర్చ్కి సంబంధించి ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో తెలంగాణలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఈ సమయంలో జహనుమా ప్రాంతంలోని కొండపైన గల ఒక గుహలో నివాసం ఏర్పర్చుకొని, ఉపవాసాలు చేస్తూ ఫ్రాన్స్కు చెందిన ఒక మిషనరీ ఉండేవాడు. దీంతో కుతుబ్‍షాహీ రాజు వర్షం పడేలా ప్రార్థనలు చేయాలని ఫ్రెంచ్‍ మిషనరీని నిజాం కోరిండు. అయితే తాను ప్రార్థన చేస్తాను కాని అందుకు ప్రతిఫలంగా ఇక్కడ ‘లేడీ ఆఫ్‍ సారోస్‍’ పేరిట ఒక చర్చ్ నిర్మించుకునేందుకు అనుమతి వ్వాలని అడిగినాడు. దీనికి కుతుబ్‍షాహీ రాజు సమ్మతించడంతో ఫ్రెంచ్‍ మిషనరీ ఉపవాస దీక్షలో ఉండి ప్రార్థనలు చేసిండు. దాంతో ఆ రోజు రాత్రే నగరంలో కుంభవృష్టి కురిసింది. ఇట్లా ఈ చర్చ్ నిర్మాణానికి అనుమతి దొరికింది. ఇప్పటికీ జహనుమాలోని ‘బాయ్స్ టౌన్‍’లో ఈ చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. ఇట్లా హైదరాబాద్‍లో మొట్టమొదటి చర్చ్ జహనుమాలో ఏర్పడింది. ఆతర్వాత 1810లో సికింద్రాబాద్‍లో ఒక చర్చి నిర్మితమయ్యింది. హైదరబాద్‍లో మొట్టమొదటి చాపెల్‍ (చిన్న చర్చ్) 1817లో ఆరంభమయ్యింది. తొలి దశలో ఈ చర్చ్లో హైదరాబాద్‍లో నివాసం ఏర్పర్చుకున్న యూరోపియన్లు మాత్రమే ప్రార్థనాలు చేసుకునేవారు. రాను రాను ఇది దళితులకు ఎక్కువగా దగ్గరయింది. ఆ తర్వాత 50 యేండ్లకు ఆబిడ్స్లోని సెయింట్‍ జార్జ్ చర్చ్ ప్రారంభమయింది.


వీటితో పాటు దేశంలోనే మొట్టమొదటి దేశీయ బిషప్‍ అజరయ్య డోర్నకల్‍ కేంద్రంగా ఎంతోమంది దళితులకు సేవ జేసిండు. డిచ్‍పల్లిలో క్రైస్తవ డాక్టర్లు కుష్టు రోగులకు ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పి సేవ జేసినారు.
ఆంధప్రాంతంలో ధవళేశ్వరం ఆనకట్ట కట్టించిన ఆర్థర్‍ కాటన్‍ మరో ఇద్దరు ఇంజనీర్లు ఇ.ఇ. జెంకిన్స్, జార్జ్ ఫ్రయర్‍తో కలిసి 1863లో సిరొంచ (ఆదిలాబాద్‍)లో గోదావరి నదిపై ఇంజనీరింగ్‍ కార్యకలాపాలు చేపట్టారు. అప్పటికే ఔరంగాబాద్‍ (హైదరాబాద్‍ రాష్ట్రంలో భాగం) కేంద్రంగా నడుస్తున్న చర్చ్ మిషన్‍ సొసైటీ కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఇదే కాలంలో అప్పటి వరకు మెథడిస్ట్ మిషనరీ సొసైటీ పేరుతో మత ప్రచారాన్ని చేస్తూ వచ్చిన సంస్థ ‘గోదావరి మిషన్‍’ (నది పేరిట)గా పేరు మార్చుకుంది. ఆ తర్వాతి కాలంలో 1872-74 సంవత్సరాల్లో విలియమ్‍ టేలర్‍ అనే అతను ‘హిందుస్తాని మిషన్‍’ పేరిట హైదరబాద్‍లో క్రైస్తవ మత కార్యక్రమాలు చేపట్టారు. 1873లో హెన్రీ లిటిల్‍, విలియం బర్జెస్‍ అనే ఇద్దరు మత ప్రచారకులు సికింద్రాబాద్‍లోని క్లాక్‍టవర్‍ వద్ద చర్చిని నిర్మించారు. వీరిలో విలియమ్‍ అనే అతను హైదరాబాద్‍లో వెస్లియన్‍ మిషన్‍ని స్థాపించాడు. వీరితో బాటుగా హైదరాబాద్‍కు చెందిన స్థానికుడు బెంజమన్‍ అనే అతను తెలుగులో 1879లో రామ్‍కోట్‍లో ప్రార్థనలు ప్రారంభించాడు. తెలుగులో ప్రార్థనలు చేయడమంటే అవి స్థానికంగా మతం మార్చుకున్న దళితుల కోసమే అని అర్థం చేసుకోవాలి. జోసెఫ్‍ కార్నిలియస్‍ అనే అతను కూడా తెలుగులో ప్రార్థనలు నిర్వహించేవాడు. బెంజమిన్‍ అనే పాస్టర్‍ కరీంనగర్‍లో చర్చిని స్థాపించాడు. ఇదే సమయంలో కాంప్‍బెల్‍ అనే అతను హైదరాబాద్‍లో క్రైస్తవ మత ప్రచారానికి శ్రీకారం చుట్టిండు. ఈయన ప్రచారానికి వెళ్ళినపుడు గ్రామాల్లో ప్రజలు తలుపులు మూసుకునేవారు. వీళ్ళను దోచుకునే వాళ్ళుగా చూసేవారు. అయితే క్రమంగా గ్రామాల్లోని దళితులకు వైద్య సదుపాయాలు కల్పించి వారికి దగ్గరయ్యారు. అయినప్పటికీ తాము అప్పటి వరకు ఆచరిస్తున్న హిందూమతాన్ని విడిచి క్రైస్తవాన్ని స్వీకరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. సంవత్సరానికి నలుగురైదుగురికి బాప్టిజం ఇస్తూ తొలి దశలో కాంప్‍బెల్‍ ఆయన భార్య క్రైస్తవాన్ని తెలంగాణలో ప్రచారం చేసిండ్రు.


తెలంగాణ జిల్లాల్లో మొదటి చర్చి 1880 జనవరి నాలుగున హన్మకొండలోని సుబేదారిలో ప్రారంభమయింది. అతి కొద్ది కాలంలోనే హన్మకొండ పరిసర ప్రాంతాలైన భీమారం, వడ్డేపల్లి, గుండ్ల సింగారం, పెద్దమ్మ గడ్డ తదితర ప్రాంతాల్లో క్రైస్తవ మతావలంబకులు పెరిగారు. వీరి కోసం అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఎలిజబెత్‍ తో పాటు నెల్లూరు నుంచి మత ప్రచారం కోసం వచ్చిన దీనమ్మ ఒక పాఠశాలను స్థాపించి నడిపించారు.
తెలంగాణలోని జిల్లాల్లో బహుశా రెండో మిషనరీ మహబూబ్‍నగర్‍లో ప్రారంభ మయింది. ఈ మిషనరీని 1885లో డాక్టర్‍ ఎల్బర్ట్ చూట్‍ ఆరంభించాడు. చూట్‍ భార్య, సోదరి స్కాట్‍ చూట్‍ కూడా ఈ మిషనరీ తరపున సేవలందించారు. 1895లో బాలబాలికల కోసం వసతి గృహాలను నిర్మించారు. 1892-1897 ప్రాంతంలో పాలమూరు ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఈ కరువును ఎదుర్కొనే ఉద్దేశ్యంతో చూట్‍ ప్రభుత్వాన్ని ఒప్పించి 200ల ఎకరాలను సేకరించాడు. వీటిని పేద క్రైస్తవులకు పంచియిచ్చి సాగు యోగ్యం చేయించాడు. దీనికి బెత్లెహామ్‍పురము పేరు పెట్టాడు. 1901 లో ఇక్కడ నివాస గృహాలనేర్పర్చుకున్నారు. చూట్‍ పూనుకొని కొర్విపాడు, తక్కశిల, వెల్టూరు, గద్వాల తదితర ప్రాంతాల్లో మిషనరీలను ఏర్పాటు చేయడమే గాకుండా పాఠశాలలను స్థాపించాడు. చూట్‍ కేవలం పదేండ్లు మాత్రమే ఇక్కడున్నారు. 1885లో మహబూబ్‍నగర్‍కు వచ్చిన ఆయన 1894లో చనిపోయాడు. ఆయన బతికున్న కాలంలో ఏర్పాటు చేసిన పాఠశాల జిల్లాలోనే పేరెన్నికగన్నది. మొదట నిర్మించిన వసతి గృహంలో 15 మంది విద్యార్థులు ఉండేవారు. వారందరూ క్రైస్తవాన్ని స్వీకరించిన వారే! ఈ పాఠశాల తొలి ప్రధానో పాధ్యాయుడిగా శాంసన్‍ రంగయ్య పనిచేశారు. అనంతరం 1904లో బేతము బెంజమిన్‍, 1907లో బొప్పూరు శాంసన్‍, 1910లో సి.సి.సాలమన్‍ ప్రధానో పాధ్యాయు లుగా పనిచేశారు. యల్‍.డేవిడ్‍ కాలంలో పాఠశాల కొన్ని రోజులు మూత పడింది. 1924లో పునఃప్రారంభమైన తర్వాత బొప్పూరు శాంసన్‍, రెబ్బమ్మల కుమారులు బి.ఎస్‍.జ్ఞాన ప్రకాశము, బి.ఎస్‍.దీనదయాలు, బి.ఎస్‍. కృపాదానము వరుసగా ప్రధానోపాధ్యా యులుగా పనిచేశారు.


1901లో పాలమూరులో వైద్యా లయము నిర్మితమైంది. పాలమూరులో మిషనరీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ చూట్‍ గద్వాలలో కూడా మత ప్రచారాన్ని చేసేవాడు. అయితే 1893లో గద్వాలలో మత ప్రచారం కోసం జి.జె.హైజింగ్‍ దంపతులు అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ మత ప్రచారాన్ని దేశీయుడైన భూంపాంగ్‍ చిన్నకిష్టయ్య నిర్వహించాడు. పూడూరుకు చెందిన చిన్నకిష్టయ్య (1841-1941) 1870లోనే క్రైస్తవమతాన్ని స్వీకరించాడు. చూట్‍తో కలిసి కరువు కాలంలో అన్నార్తులను ఆదుకున్నాడు. వారికి పని కల్పించాడు.
తెలంగాణలో అమెరికన్‍ మిషనరీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దశలోనే మెన్నొనైట్‍ బ్రదరన్‍ సంఘం తరపున మత ప్రచారం కోసం అబ్రహం ప్రీజన్‍ దంపతులు పనిచేశారు. అబ్రహాం జర్మనీలో హాంబర్గ్ వేదాంత (మత బోధన) కళాశాలలో చదువుకున్నాడు. అమెరికన్‍ మిషనరీలతో కలిసి పనిచేసే ఒప్పందం మీద ఈ దంపతులు తెలంగాణకు వచ్చారు. మొదట 1889 నల్గొండలో తమ కార్యకలాపాలు చేపట్టారు. ఆ తర్వాత 1891 లో మొత్తం 129 మంది సభ్యులతో బాప్టిస్టు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సంఘం. ఈ దంపతులు 1899లో స్వదేశం వెళ్ళిపోయారు. వీరి అనంతరం 1904లో కార్నిలియస్‍ హెచ్‍. ఉన్రు ఇక్కడ సంఘ కార్యకలాపాలు నిర్వహించాడు. నల్గొండ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న జె.లెవీ పంతులు, ఆయన భార్య రెబకమ్మ, సూధర్మన్‍, న్యూఫీల్డ్ అనే అతను తర్వాతి కాలంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మత ప్రచారాన్ని కొనసాగించి సేవలందించారు. ఈ సమయంలో లెవీ పంతులు భార్య మరణించడంతో కనిగిరికుంటకు చెందిన సత్యవేదమ్మను వివాహమాడాడు. వీరు కొంత కాలం హైదరాబాద్‍లో తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నించారు కానీ ఇక్కడి పరిస్థితులు అనుకూలించక పోవడంతో తిరిగి నల్లగొండకు చేరుకున్నారు.
1896లో చార్లెస్‍ వాకర్‍ పొస్నెట్‍ అనే అతను తాను అంతవరకు తిరుమలగిరి (సికింద్రాబాద్‍)లో బ్రిటీష్‍ సైన్యం కోసం నడిపిస్తున్న చర్చి బాధ్యతలను వదులుకొని మెదక్‍లో మత ప్రచారాన్ని చేపట్టాడు.


నల్లగొండ తరవాత వరుసగా 1898లో హ్యూబర్ట్ దంపతులు సూర్యాపేటలో, హెన్రిక్స్ ఉన్రు దంపతులు 1902లో జనగామలో, జాన్‍. జి వీన్స్ దంపతులు 1904లో రామాయం పేటలో, జె.ఎ.పెన్నర్‍ మహబూబ్‍నగర్‍లో బాప్టిస్టు మిషనరీలు స్థాపించి, ఆరోగ్య, విద్య విషయాల్లో శ్రద్ధ చూపించి స్థానికులకు, ముఖ్యంగా దళితులకు దగ్గరయ్యారు.
గతంలో హైదరాబాద్‍లో కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నించి విఫలం కావడంతో అమెరికన్‍ మెన్నొనైట్‍ బ్రదర్‍ సంఘం వారు జాన్‍ హెచ్‍.పాంక్రాట్జుని మత ప్రచారం కోసం పంపించారు. ఈయన 1903లో హైదరాబాద్‍కు వచ్చినప్పుడు కనీసం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. అంతకు ముందు నల్లగొండ మిషనరీలో పనిచేసిన న్యూఫీల్డ్ సహకారంతో 1904లో అమెరికన్‍ మెన్నొనైట్‍ బ్రదరన్‍ సంఘాన్ని స్థాపించాడు. ఇది హైదరాబాద్‍లోని మలక్‍పేటలో ఏర్పాటయ్యింది. ఈ సంఘం (చర్చ్) స్థాపించిన కాలంలో కేవలం 13 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇదే తెలంగాణలో స్థాపించబడ్డ మొట్టమొదటి అమెరికన్‍ మెన్నొనైట్‍ చర్చ్. ఈయన చుట్టు పక్కల గ్రామాల్లో విస్తృతంగా ప్రయాణించి మత ప్రచారం చేశాడు. దీంతో తూర్పున శివన్న గూడెం నుంచి పడమట పాలమాకుల (శంషాబాద్‍ పక్కనే ఉన్న ఊరు) వరకు ఎంతో మంది సంఘ సభ్యులుగా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇట్లా స్వీకరించిన తొలి వారిలో జాన్‍ లెవీ దంపతులు, టి.ఆర్‍. రత్నము, వి.కోటయ్య, గౌడిపేరి యాకోబు, వి. అబ్రహాము, కటికల సాధు, జి.ఎన్‍.డగ్లస్‍, కందుల ఇస్సాకు, వేశపోగు సమూయేలు, తాపుడి తిమోతి, గొంగడి కొండయ్య, రావూరి దేవదాసు, గురుమూర్తి రావు, మైనము నతానియేలు, పాలేటి యాకోబు, అద్దంకి నతానియేలు, కందుల దావీదు, బెక్కము జాన్‍, కొండ్రి పోచయ్య, బి.సుదర్శనము, ఎం.ఎనోకు తదితరులున్నారు. 1835లో ఏర్పడ్డ అమెరికన్‍ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్‍ గద్వాల, సికింద్రాబాద్‍, హనుమకొండ, నల్లగొండ, జనగామ, సూర్యాపేట, మధిర మొదలైన పట్టణాల్లో పాఠశాలలు, దేవాలయాలు (చర్చ్లు) ఏర్పాటు చేశారు.


వెస్లియన్‍ మెథడిస్ట్ మిషన్‍ 1879లో ఏర్పడింది. ఈ సంస్థ తరపున విలియం బర్గస్, హెన్రీ లిటిల్‍ అనే మిషనరీలు హైదరాబాద్‍ కేంద్రంగా తమ మత ప్రచారాన్ని 1879లో ప్రారంభించారు. 1880లో బర్గస్ చాదర్‍ఘాట్‍లో ఒక చర్చ్ని, పాఠశాలను ఏర్పాటు చేసిండు. 1884లో బెంజమిన్‍ ఫ్రాంట్‍ దంపతులు కరీంనగర్‍కు వెళ్ళి అక్కడ మత ప్రచారం చేసిండ్రు. జోసఫ్‍ మంగయ్య అనే దేశీయుడు బోధకుడిగా ఉండేవాడు. ఈయన ప్రోత్సాహంతో ఎక్కువగా మాలలు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. వీరి మత ప్రచారం తర్వాతి కాలంలో ఆలేరు, సిద్దిపేటలకు విస్తరించింది. అలాగే 1886లో ఏర్పాటైన ఎపిస్కోపల్‍ మెథడిస్ట్ సంఘం తరపున 1905లో హైదరాబాద్‍కు వచ్చిన సి.ఇ. పార్కర్‍ 1906లో వికారాబాద్‍లో ఒక పాఠశాలను, ఆ తర్వాత 1910లో మెదక్‍ జిల్లా జహీరాబాద్‍లో మరొక పాఠశాలను స్థాపించారు.
దళితుల విద్యాభివృద్ధికి మెన్నొనైట్‍ సంఘం కూడా కృషి చేసింది. 1904లో మలక్‍పేటలోని సంఘం ఆవరణలో ఒక పాఠశాల ప్రారం భించింది. ప్రారంభ సమయంలో ఏడుగురు విద్యార్థులుండే వారు. మాడుగు ఇనోకు, రాహేలమ్మ, విజయమ్మ, గండమల్ల సలోమి, కొత్లపల్లి సమూయేలు, వంగూరి అప్పయ్య, వి.ఎల్‍. బెంజమిన్‍లే ఆ విద్యార్థులు. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా కనుమాల నారయప్య, బండారు రెంసన్‍, గౌడిపేరు యిస్సాకు, జె.సత్యవేదమ్మ, జె.జె.మిత్ర, గంధము సమూయేలు డగ్లస్‍, ఎం.ఎన్‍.పిళ్లె, మేకల ఫిలిప్‍, బండారు అలీసమ్మ, కనుమాల శారమ్మ, పంది నరసయ్య, వి.ఎల్‍. బెంజమిన్‍ తదితరులు వివిధ కాలాల్లో పనిచేశారు.
1913లో ప్రతికూల పరిస్థితుల్లో మలక్‍పేట స్థలాన్ని ఖాళీ చేయాల్సి రావడంలో సంఘాన్ని ఇసామియ బజార్‍కు మార్చారు. ఇక్కడ మిడిల్‍ స్కూల్‍ వరకు బోధన జరిగేది. ఈ సమయంలో కాథరిన్‍ లోహర్జన్‍ అనే ప్రచారకురాలు విషజ్వరం కారణంగా 1915లో చనిపోయింది. ఆమె 1908 నుంచి మలక్‍పేట చర్చి ప్రచారకురాలిగా వచ్చింది. లోహర్జన్‍ స్థానంలో వచ్చిన ఆన హనేమాన్‍ దళితుల వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపించింది. నల్లగొండ చర్చి స్థాపన నాటి నుంచి సంఘ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఆనసూదర్మన్‍ ఇంటింటికి తిరిగి వైద్యం అందించేది. ఈమె మొదట 1898లో బొంబాయికి వచ్చింది. అనసూదర్మన్‍ అంతకు ముందు నర్సారావుపేట, గురజాలలో కొంత కాలం పనిచేసింది. ఈమె తర్వాతి కాలంలో డి.ఎఫ్‍.బర్గుతోల్డుని వివాహమాడింది.


బర్గుతోల్డు అంతకు ముందు 1904-1906 మధ్యన తెలుగు నేర్చుకొని మలక్‍పేట కేంద్రంగా పనిచేశాడు. తాను హైదరాబాద్‍కు వచ్చిన ఆరు వారాలకే ఆయన భార్య మశూచితో సూర్యాపేట మిషనరీ హాస్పిటల్‍లో చనిపోయింది. అయినప్పటికీ ఈయన ధైర్యం చెడకుండా 1909లో నాగర్‍కర్నూల్‍లో చర్చ్ని ప్రారంభించాడు. 50 ఎకరాల స్థలంలో మొదట 1908లో మిషనరీ బంగ్లాను, 1909లో బాలికల వసతి గృహాన్ని, 1910లో పాఠశాలను, అందులోని ఉపాధ్యాయుల కోసం వసతిగృహాన్ని నిర్మించాడు. అయితే బర్గుతోల్డు రెండో భార్య ఆనసఫ్‍ ప్రసవ సమయంలో 1915లో చనిపోయింది. దీంతో 1916లో మలక్‍పేటలో వైద్యసేవలందిస్తున్న అనసూదర్మన్‍ని పెళ్లి చేసుకున్నారు.
1908లో ఇండియాకు వచ్చిన జె.హెచ్‍.ఓత్‍, మేరీ ఎఫ్‍. ఓత్‍ దంపతులు నల్లగొండ మిషనరీ నిర్వాహకులు సి.ఉన్రు సలహాపై దేవరకొండలో తొలి మిషనరీని ఏర్పాటు చేసిండ్రు. వీరిద్దరూ అంతకు ముందు మలక్‍పేట మిషనరీలో తమ సేవలందించారు.
నాగర్‍ కర్నూల్‍ పాఠశాల తొలి విద్యార్థుల్లో పెరికె మార్కు, జె.యోహను, కె.మోజస్‍, సిరిగూరి దీవెనమ్మ, సిరిగూరి ఎస్తేరమ్మ, టి.గ్రేసమ్మ, టి.మిన్నెమ్మ, టి.డైనమ్మ, వి.సైమన్‍ కొర్నెలియస్‍, ఎ. సమూయేలు తదితరులున్నారు.


బర్గుతోల్డు చేసిన మత వ్యాప్తి, సేవలు, విద్యా, వైద్య సేవల కారణంగా చాలామంది మతం మార్చుకున్నారు. క్రైస్తవాన్ని స్వీకరించారు. ఇందులో కోళ్ళ యోహను (తూడుకుర్తి), టి.ఎజ్ర (తెలకపల్లి), బెజవాడ మార్కు (అచ్చంపేట) తగరము సాధు (కల్వకుర్తి), జి.సి.పౌలు, చింతయ్య, కె.నరసింహులు, సి.యాకోబు, ఎం. అమ్రాము, ఈ. ఆమోసు జాన్‍ (తిరుమలాపురము), జె.సి.స్టీవెన్‍ (రఘుపతిపేట), అట్లూరి రామయ్య, బి.లక్ష్మయ్య, డి.నారయ్య, టి.నాగయప్ప, బి.మోషె, టి.పౌలు, కె.అబ్రహాము, కె.రత్నము, ఆర్‍. డేవిడ్‍ రాము, ఎ.సి.సముయేలు, వి.పేతురు, ఎం.నతానియేలు, జాన్‍ పాపయప్య, బీ.పీటర్‍ (గట్టిపలపల్లి), బి.సోమసుందరం (కొత్తూరు), గోనె యోన (తాండ్ర), యన్‍.యస్‍. అహ్రాము (బైరాపురము)లతో పాటుగా కె.అచ్చమ్మ, బి.మార్తమ్మలు ముఖ్యులు. ఒంగూరు సాయన్న బాప్తిసమ్‍ పొందిన మొదటి వ్యక్తి. బహుశా ఈయన వంగూరు గ్రామస్థుడు కావచ్చు.
నాగర్‍ కర్నూల్‍ శాఖ తరపున సువార్తీకులు ఇప్పకుంట, పోలిశెట్టిపల్లి, చింతపల్లి, తిర్మలాపురము, తూడుకుర్తి, మంగనూరు, దాసర్ల పల్లె, యాదారెడ్డి పల్లె, యన్నచెర్ల, తెలకపల్లె, వడ్డెమాన్‍, కల్వకుర్తి తదితర గ్రామాల్లో ప్రచారం చేసేవారు. కల్వకుర్తిలో తగరము సాధు ఆయన భార్య లిడియమ్మలు మత ప్రచారం చేశారు. సాధు అనంతరం దళవాయి జాషువా ఈ ప్రాంతంలో మత ప్రచారం చేశాడు. ఈయన ఆంధ్రాంగ్ల భాషల్లో నిష్ణాతుడు. మంచి వక్త. నాగర్‍ కర్నూల్‍ పాఠశాలు ప్రధానోపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు.


1912లో నాగర్‍కర్నూల్‍లో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అందరికీ వైద్యాన్ని అందించింది. ఇందులో డాక్టర్‍ షెలన్‍బెర్గుతో పాటుగా పెరికె రామయ్య, ఆర్‍.లూశమ్మలు సహాయకులుగా సేవలందించేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా సేవలందించిన మేరి సి.వాల్‍ కూడా ఈ ఆసుపత్రిలో సేవలందించారు. ఈమె గ్రామాల్లో తిరిగి ప్లేగు వ్యాధి పీడితులకు సేవచేశారు.
1910లో ఏర్పాటైన దేవరకొండ మిషనరీ స్కూల్‍ తొలి విద్యార్థులు దళవాయి నారయ్య, వంకాయలపాటి యాకోబు, మేదరి గురువయ్య, గోన గమలియేలు, గందమాల పౌలు తదితరులు. బొప్పూరి శాంసన్‍ దేవరకొండ మిషనరీ స్కూల్‍కు బీజం వేసినాడు. తర్వాత డి.జి.శాంసన్‍ అనే అతను 1918లో ప్రధానోపాధ్యాయుడిగా ఉండి మాధ్యమిక తరగతి వరకు పాఠశాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ జి.దేవసహాయము, జి.రెబ్బమ్మ, నామ ప్రకాశము, ఎలీషబేతమ్మ, జి.ఆల్‍బర్టు సమూయేలు తదితరులు ఉపాధ్యాయులుగా ఇక్కడ పనిజేశారు. మొదట కనిగిరి నుండి మత ప్రచారానికి వచ్చిన గంధము సమూయేలు, ఆయన కుమారులు సోమసుందరము, ఆల్‍బర్టు, పౌలు, రాబర్టు కూడా దేవరకొండలో సేవజేశారు. సమూయేలు దేవరకొండ చర్చికి పాస్టర్‍గ పనిచేశారు. ఇక్కడి ఆస్పత్రి కోసం 14 గదులు కట్టించి ఉచితంగా ఇచ్చింది దేవరకొండకు చెందిన పద్మశాలీ వితరణశీలి పగిడిమర్రి రామన్న.
1912లోనే వరంగల్‍ జిల్లా డోర్నకల్‍లో చర్చ్ ప్రారంభ మయింది. ఈ చర్చి దిద్దిన ఖ్యాతి పాస్టర్‍ వేదనాయక్‍ సామ్యూల్‍ అజరయ్య (1874-1945)కు దక్కుతుంది. ఈయన భారతీయ సంతతికి చెందిన వారిలో తొలి బిషప్‍. తొలితరం ఫాదరీలలో ఈయనకు మంచి పేరుంది. ఆ తర్వాత దుమ్ముగూడెంలో కూడా ఒక చర్చి ప్రారంభమయింది. దోర్నకల్‍ చర్చ్ తరపున సువార్త సభలు ఏర్పాటు చేస్తూ మత ప్రచారం కోసం ఇంగ్లాండ్‍ జెనానా మిషన్‍కు చెందిన 11 మంది మహిళలు తొలినాళ్లలోనే కార్యకలాపాలు చేపట్టారు. స్థానికులకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. డోర్నకల్‍ డయోసిస్‍ తరపున ఖమ్మంలో ప్రచారం చేశారు. వీరి ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది క్రైస్తవం స్వీకరించారు. దళితులకు విద్యాబోధన ఈ సంస్థ ప్రధానాశయంగా ఉండింది. స్వాతంత్య్రానికి పూర్వమే ఒక దశలో 1200 మంది స్త్రీ, పురుషులు ఈ సంస్థ నడిపించే వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవారంటే వారు ఆనాటి దళిత సమాజంపై వేసిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. బాలికల కోసం ప్రత్యేకంగా డోర్నకల్‍, ఖమ్మంలో హాస్టల్స్ నిర్మించి నిర్వహించారు. ఇక్కడ పనిచేసిన దళితుల్లో ఆత్మకూరి రంగయ్య (1855-1942), దళవాయి నారయ్య, వేశపోగు జాన్‍, దాసరి ప్రసంగి (?-1967) వేశపోగు అంబ్రోస్‍లు 1910కి ముందే చర్చిల్లో పాస్టర్లుగా పనిచేశారు.


1913లో ఎఫ్‍.ఎ.జాన్‍ జన్‍ అనే అతను వనపర్తిలో మిషనరీని స్థాపించాడు. అంతకు ముందు ఇక్కడ బాప్టిస్టు మిషనరీ చూట్‍ మహబూబ్‍నగర్‍ కేంద్రంగా మత ప్రచారం, సేవలు అందించేవాడు. జాన్‍జన్‍ కొంత కాలం నాగర్‍కర్నూల్‍ మిషనరీలో పనిచేశాడు. 1916లో తొలి సంఘాన్ని 57 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన జాన్‍జన్‍ 1918-1920 మధ్య కాలంలో కరువు బారిన పడిన వారిని ఆదుకున్నాడు. ఆ కరువులో పనిగల్పించుటకై మిషనరీ భవనాన్ని నిర్మించారు. ఈ మిషనరీ ద్వారా ఏదుట్ల, సూగూరు, బుద్దావరము, చాగపురము, వనపర్తి, పామిరెడ్డి పల్లె, గోపాలపేట తదితర గ్రామాల్లో క్రైస్తవ మత ప్రచారం చేసేవారు. 1916 సంవత్సరంలోనే ఇక్కడ పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల తొలి విద్యార్థులు జి.దేవదాసు, ఎం.సి.కేటమ్మ, ఎం.సి.రత్నము, పి.బి.ఎలియ, కమలమ్మ, దేవసహాయము, జమియమ్మ, విక్లిఫ్‍, వైడూర్యమ్మ తదితరులు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా జోషి రామాంజులు, ఆయన భార్య నాగమ్మ, బూతపాటి పీటరు, ఆయన భార్య మాణిక్యమ్మ తదితరులు ఉపాధ్యాయులుగా సేవ చేశారు. తర్వాతి కాలంలో జి.ఎం.జాషువా ప్రధానో పాధ్యాయులుగా పనిచేశారు. బహుశా గోలకొండ కవుల సంచికలో పేర్కొన్న జాషువా ఈయనే కావచ్చు. 1929 ప్రాంతంలో వైద్య సదుపాయాలకోసం ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో మార్గరెట్‍ అనసూధర్మన్‍ పనిచేశారు. 1914లో హ్యూస్‍ టౌన్‍ (హైదరాబాద్‍, ముషీరాబాద్‍), 1920లో శంషాబాద్‍లో, 1922లో కల్వకుర్తి ప్రాంతాల్లో ఈ మిషనరీలు తమ కార్యకలాపాలను ప్రారంభించారు. 1903లో తిరునల్వేలి దేశీయ మిషనరీ స్థాపితమయింది. ఈ మిషనరీ నుంచి విడిపోయి 1917లో ములుగు మిషనరీ ఏర్పడింది. దీని స్థాపకుడు కనికెల్ల సుందరం. ఈ సంస్థ తరపున దాదాపు నలభై గ్రామాల్లో దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. 1927లో ఏర్పాటైన వరంగల్‍ జిల్లా పరకాల మిషన్‍ని జి.వి.బి. శ్రీధర్‍ దంపతులు తీర్చి దిద్దిండ్రు. మేరీ జాన్‍, మేరి థామస్‍ అనే సోదరీమణులు స్త్రీల కోసం 1947లో ఒక బోర్డింగ్‍ పాఠశాలను ఏర్పాటు చేసిండ్రు.


ఇండియన్‍ మిషన్‍ సంస్థ తరపున రెవరెండ్‍ బెంజమిన్‍ డేవిడ్‍సన్‍ వరంగల్‍ జిల్లా జనగామ దగ్గరలోని చేర్యాలో క్రైస్తవ మత ప్రచారానికి శ్రీకారం చుట్టిండు. ఈయనకు తోడుగా ఇ.డబ్ల్యు. అర్లాఫ్‍ పనిచేసిండు. ఈ సంస్థ అభ్యున్నతికి ఎస్‍.వి. జాన్‍, బి. జయరాజ్‍, కీ. పీటర్‍ అనే వాళ్ళు పనిచేశారు. చేర్యాలతో పాటుగా, సికింద్రాబాద్‍, పెద్దపల్లి, భువనగిరి, ఆదిలాబాద్‍ తదితర ప్రాంతాల్లో వృత్తి విద్యా కేంద్రాలను నెలకొలిపారు. దీనితో పాటుగా పెంతెకోస్తు సంఘం వాళ్ళు 1930 ఆ ప్రాంతంలో వరంగల్లు, హైదరాబాద్‍, సికింద్రాబాద్‍, నిజామాబాద్‍, తదితర ప్రాంతాల్లో శాఖలు స్థాపించారు. ఈ సంస్థలో ఎ. మనోహరం అనే అతను కీలకంగా పనిచేశాడు.
1937లో బాప్టిస్టు మిషనరీ వ్యవహారా లన్నీ మెన్నొనైట్‍ బ్రదరన్‍ వారికి సంక్ర మించాయి. 1930లోనే పరిమళబాయి అనే మహిళ ఎవాజంలిస్ట్గా మారింది. 1904లో నర్సయ్య, సుందరబాయి దంపతులకు హైదరా బాద్‍లో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగం కారణంగా చాలా కాలం మధ్యప్రదేశ్‍లోని రాయ్‍ పూర్‍లో ఉండింది. అక్కడే బైబిల్‍ ప్రచారకు రాలిగా మారింది. 1922 ఆ ప్రాంతంలో క్రిస్టియన్‍ స్కూల్‍ టీచర్‍ కడార్‍ మాస్టర్‍తో ఆమె వివాహం జరిగింది. 1922లో కల్వకుర్తిలో, 1948లో శంషా బాద్‍లో ఈ మిషనరీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అలాగే జోసఫ్‍ అనే అతను ఆలంపూర్‍లో చర్చిని ఏర్పాటు చేసిండు. నిజానికి తెలంగాణలో 1896లో దళితుల నుంచి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు 3992 మంది ఉండగా, 1920ల నాటికి మొత్తం 37వేల మంది క్రైస్తవులుగా మారిండ్రు. దీని వెనుక అగ్రకులాల వారి ఆధిపత్యం ఒక కారణం కాగా, దళితుల్లో చైతన్యం రావడమనేది రెండో పార్శ్వం. ఆనాడు చర్చ్ ల్లో పనిచేసే వారందరూ అనివార్యంగా క్రైస్తవులే ఉండేవారు. అలా అయితేనే వారికి ఉద్యోగాలిచ్చేవారు.


క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారిలో ఎక్కువగా దళితులే ఉన్నారు. డోర్నకల్‍, మెదక్‍, నాగర్‍ కర్నూల్‍, దేవరకొండ, హైదరాబాద్‍, మహబూబ్‍నగర్‍ తదితర ప్రాంతాల్లో తొలిదశలో దళితులు క్రైస్తవాన్ని స్వీకరించారు. ఇట్లా క్రైస్తవం స్వీకరించిన కుటుంబాల్లోని వారు తర్వాతి కాలంలో మిషనరీ పాఠశాలల్లో చదువుకొని మళ్ళీ తాము విద్యార్జన చేసిన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ప్రధానాచార్యులుగా నియమితు లయ్యారు. మూడ్నాలుగు తరాల వరకు కూడా విద్యారంగంలో సేవలందించారు. తెలంగాణలో క్రైస్తవ మత ప్రచారం కోసం ఆంధ్రా ప్రాంతం నుంచి చాలా మందే వచ్చారు. వారందరూ ఇక్కడే సస్థిరపడ్డారు. ఇట్లా స్థిరపడినవారు ఎంతో క్రైస్తవ సాహిత్యాన్ని సృజించారు. వారిలో నరెళ్ళ సమూయేలు సుబ్బయ్య, మార్తాండ జ్ఞానప్రకాశం, ఈతకోటి ప్రకాశం, బుసమెల్ల బెంజమిన్‍, మొలతాటి విద్యానందం తదితరు లున్నారు. తెలంగాణలోనే పుట్టినవాళ్లలో దళవాయి ఫ్రాన్‍జ్‍ జాషువా, మల్లెల సొలొమన్‍ జార్జి, ఇ.జి. ఆనందం తదితరు లున్నారు. వీరేగాకుండా గోలకొండ కవుల సంచికలో పేర్కొన్న మరెందరో క్రైస్తవ కవులు కూడా ఉన్నారు.


తెలంగాణలో తొలిదశలో ప్రధానంగా దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిండ్రు. హిందూ మతంలో తమను తక్కువగా, హీనంగా చూడడం ఒక కారణం. అలాగే ఆలయాల్లో ప్రవేశానికి వారికి అనుమతి లేకపోవడం కూడా కారణమే! మరోవైపు క్రైస్తవ మత ప్రచారకులు దళితుల వాడల్లోనే నివాసముంటూ వారికి విద్య, వైద్య సదుపాయాలను కల్పించారు. ఇట్లా తెలంగాణలో క్రైస్తవ మతం ప్రచారం కావడానికి విదేశాల నుంచి వచ్చిన వారు కీలక భూమిక పోషించారు. వీరందరి గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరమున్నది. పాఠశాలలు స్థాపించడంలో, ఆధునికతను తెలంగాణకు తీసుకు రావడంలో, ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టడంలో వారు పోషించిన పాత్ర గురించి కూడా వివరంగా చర్చించాలి. అది మరోసారి చేద్దాం!


సంగిశెట్టిశ్రీనివాస్‍, ఎ:98492 20321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *