సినిమా గారడి చేయడానికి ఉద్దేశింపబడలేదు. నిజానికి సినిమా కొత్త ఆలోచనలు ఆవిష్కృతం కావడానికి, సరికొత్త భావాలు పెల్లుబుకడానికి, కళాత్మకమైన సంతోషం కలిగించడానికి నిర్దేశింపబడింది. ఈ సినిమాలలో ప్రజా జీవితం ప్రతిబింబించాలి. వారి కష్టాలు, కడగండ్లు యథాతథంగా తెరకెక్కించాలి. శక్తివంతమైన ఈ సినిమా మాధ్యమాన్ని ప్రయోజనాత్మకంగా వినియోగించాలి.
భారతీయ నవ్య సినిమా ఉద్యమ వైతాళికుల్లో, పంచరత్నాలనదగిన బెంగాలీ దిగ్దర్శకుల్లో ఒకరు మృణాల్‍సేన్ (మిగతా నలుగురు రిత్విక్ ఘటక్, సత్యజిత్‍రే, తపన్‍దా, బుద్దదేవ్ దాస్‍గుప్త) 50 వసంతాలపాటు సమాంతర సినిమా రంగాన్ని తమ విభిన్న చలనచిత్రాలతో చకచ్ఛకితం చేసిన దర్శక మేధావి మృణాల్‍సేన్ గత డిసెంబర్ 30న కాలం చేయడంతో న్యూ సినిమా చరిత్రలో ఒక శకం అంతరించింది.
నేడు మనం పిలుచుకుంటున్న నవ్య, వాస్తవిక, సమాంతర సినిమాలు తొలుత ఆవిర్భవించినది బెంగాల్‍లోనే. రిత్విక్‍ఘటక్, సత్యజిత్ రేల పరంపరను తనదైన విలక్షణ ముద్రతో ముందుకు తీసుకువెళ్ళి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన దర్శకులు మృణాల్‍సేన్. ఆయన సినీ జీవితం ప్రారంభమైంది 1950 దశకంలోనే. రే, చిదానంద్ దాస్ గుప్తాల ఫిలిం సొసైటీలో చేరి దేశ విదేశాల సినిమాలు చూసేవారు. చార్లీచాప్లిన్ సినిమాలంటే అభిమానం పెంచుకున్నారు. 1952లో దేశంలో జరిగిన తొలి ఫిలిం ఫెస్టివల్‍లో ప్రదర్శితమైన బైసికిల్ థీవ్స్ (డిసికా), రాషోమన్, ఓపెన్‍సిటీ లాంటి సినిమాలు ఆయనను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో గెడల్ఫ్ అర్నిహిమ్ రాసిన ‘‘ఫిలిం’’ అనే పుస్తకం చదివి తన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకొని సినీరంగ ప్రవేశం చేశారు.
మృణాల్‍సేన్ కెమెరా వెనక్కి వచ్చి దర్శకుడిగా తొలిసారి 1956లో ‘రాత్‍బోరే’ సినిమా తీశారు. అయితే వేసిన తొలి అడుగే తడబడినట్లుగా ఈ సినిమా పరాజయం పొందింది. ఈ చేదు అనుభవాన్ని ఆయనే సందర్భంలోనూ ప్రస్తావించలేదు. కాని ఆ వెంటనే మరో అవకాశం రాలేదు. ఆలస్యంగా వచ్చిన అవకాశంతో తీసిన సినిమా ‘నీల్ ఆకాశేత్ నీచే’ (1959) ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలే కాదు లాభాలు కూడా తెచ్చిపెట్టింది. అప్పటి ప్రధాని నెహ్రూ ఈ చిత్రాన్ని చూసి ‘‘మృణాల్ నీవు దేశానికి గొప్ప సేవ చేశావు. చూడు…నీ సినిమాలో ఇండియా-చైనా సంబంధాలను గొప్పగా చర్చించావు’’ అని అభినం దించారు. అయితే ఆ తర్వాత చైనా యుద్ధ సమయంలో ఈ చిత్రాన్ని కొన్ని నెలల పాటు నిషేధించారు.
మృణాల్ తీసిన మూడవ సినిమా ‘బైషే శ్రావణ్’ 1960 అయితే ఆయన సినీ జీవితం మహత్తర మలుపు తిరిగింది. ‘భువన్‍తోమ్’తో 1969లో వచ్చిన ఈ అత్యుత్తమ చిత్రం జాతీయ స్థాయిలో సేన్ పేరును మారుమ్రోగించింది. ఇది ఆయన తొలి హిందీ చిత్రం కావడం వలన బెంగాల్ బయటి ప్రాంతాల వారికి సేన్ ప్రతిభావ్యుత్పత్తులు నిరూపితమయ్యాయి. ‘వనపూల్’’ అనే వంగ రచయిత రాసిన చిన్న కథ ఈ సినిమాకు ఆధారం. బాక్సాఫీస్ సూత్రాలపై నిర్మితం కాని చిత్రమే అయినా ఇందులో భువన్ శోమ్‍గా నటించిన ఉత్పల్‍దత్‍కి జాతీయ ఉత్తమ నటునిగా, సేన్‍కు ఉత్తమ దర్శకునితోపాటు ఈ సినిమాకు ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు రావడం నాడు గొప్ప సంగతి. ఈ చిత్రం తరువాత చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ వారికోసం హిందీ, బెంగాలీ, భాషల్లో సేన్ ‘ఇచ్చాపూరణ్(1970) నిర్మిం చారు. 1971లో ‘ఏక్ అధూరి కహానీ’ తీశారు.
విశ్వఖ్యాతి గాంచిన సత్యజిత్‍రే ‘అపూ’ ట్రయాలజీకి భిన్నంగా ఆధునిక సమాజంలో యువతరాన్ని కుదిపేస్తున్న సమస్యలతో సోషియో పొలిటికల్ టచ్‍తో మృణాల్‍సేన్ ‘కలకత్తా’ ట్రయాలజీని తీశారు. ఈ ట్రయా లజీలో తీసిన మొదటి సినిమా ‘ఇంటర్యూ’ (1971). ఇది అప్పటిదాకా వచ్చిన న్యూ సినిమాల ఒరవడిలోని పద్ధతులను కాదని కొత్త శైలిని ఆవిష్కరించింది. కలకత్తాలో ‘ఇంటర్యూ’ చిత్రం మొదటి షో చూసి బయటికి వస్తూ కొందరు ‘మృణాల్‍సేన్ జిందాబాద్’, కమ్యూనిజం జిందాబాద్’ అనే నినాదాలు చేశారు. ట్రయాలజీలోని 2వ చిత్రం ‘కలకత్తా-71’(1972) సమాజం పేదరికం, దారిద్య్రం, అవినీతి, ఆకలి, దోపిడీల మధ్య నలుగుతున్న వైనాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. ఈ క్రమంలోని మూడవ చిత్రం ‘పధాతిక్’ (గెరిల్లా యోధుడు) 1973లో వచ్చింది. ఈ మూడు చిత్రాలు ప్రధానంగా నాడు కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన విభజన, ఉవ్వెత్తున ఎగిసిన నక్సలైటు ఉద్యమాల ప్రస్తావనతో రూపొందినవి. నక్సలైటు ఉద్యమ పోకడలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా చూపిన చిత్రం ‘పధాతిక్’. ఈ మూడు చిత్రాలు నాటి రాజకీయ పరిణామాల పట్ల సేన్ చేసిన ప్రకటనలుగా విమర్శకులు చెప్పుకున్నారు. మృణాల్‍సేన్ తీసిన మరో అద్భుత దృశ్యకావ్యం ‘కోరస్’ (1974). ఇది జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం అందుకున్న చిత్రం. స్వాతంత్య్రం వచ్చి పాతికేళ్ళు గడచినా దేశంలోని విద్యావంతులకు ఉపాధి, లేక పేదరికం, నిరుద్యోగ సమస్యల వికృత రూపాన్ని కళ్ళకు కట్టిస్తారు సేన్. చివరికి యువతరం పాలకవర్గాలపై తిరగబడుతూ ‘మీ పాలకుల మోసాలు మేము గుర్తించాం. మీ కుతంత్రాలు ఇక చెల్లవు’ అంటూ అంతా కలసి ఒకరికొకరు గళం కలిపి చేసిన సమూహ గానం (కోరస్) అది.
అధికారగణం ఒక్కసారిగా ఉలిక్కిపడి ‘శాంతి, అహింస’ అని ఉపదేశాలు చేసినా లెక్కచేయని సమూహ గానం ముందుకు సాగి వెళుతూనే ఉంటుంది. ‘ధనస్వామ్యం చేసే దోపిడీ-తత్ఫలితంగా ఏర్పడే పరిణామాలు, ఈనాటి దారిద్య్రానికి, అశాంతికి కారణాలని, కళల ద్వారా ప్రజా చైతన్యానికి కృషి చేయడమే మనందరి ధ్యేయం కావాలని సేన్ అభిప్రాయపడతారు. అందుకే ఆయన చిత్రాలన్నీ సామాన్య జనం ‘అలజడి మా జీవితం-ఆందోళన మా ఊపిరి-తిరుగుబాటు మా వేదాంతం’ అన్న ధోరణిలో కోరస్ పాడుతూ ఉంటాయి. కోరస్‍లో ఆయన వాడిన హరీంధ్రనాథ్ ఛటోపాధ్యాయ గీతం ఇటలీ, రష్యాలలో చాలామందికి అభిమాన గీతమైంది. కానీ ఇటలీలో కోరస్ చూసిన కొందరు మాత్రం ‘ఇది సంఘ వ్యతిరేక చిత్రమని’ కూడా వ్యాఖ్యానించారు.
మృణాల్‍సేన్ తీసిన మొదటి రంగుల చిత్రం ‘మృగయా’ (1976). ఒరియా ఆదివాసీ జీవనాన్ని ప్రతిబింబించే ఈ చిత్రంలోని కథాంశం 1930 నాటిది. అడవిలో మనుషుల్ని చంపుకు తింటున్న మృగాన్ని చంపితే బహుమతి ఇచ్చి ప్రశంసించినవారే, మానవ సమాజంలో మనుషుల్ని పీక్కుతినే ‘మానవ మృగాన్నీ’ చంపినందుకు అదే యువకునికి మరణ శిక్ష విధించడాన్ని దర్శకుడిగా సేన్ ప్రశ్నిస్తాడు. ఆయన ఆలోచనలోంచి తయారైన సినిమా ఇది. ఇందులో నటించి తొలిసారిగా సినిమాకు పరిచయమైన మిథున్ చక్రవర్తి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకుని సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం ఆయేటి స్వర్ణ కమలం కూడా అందుకుంది.
‘మృగయా’(1976) రూపొందించిన కాలంలోనే మృణాల్‍దా తెలంగాణ సాయుధ పోరాట గాథను తెరకెక్కించే ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించిన సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశారు. కానీ ఆయన దర్శకత్వంలో తొలిసారిగా ప్రేమ్‍చంద్ ‘కఫన్’ ఆధారంగా ‘‘ఒక ఊరి కథ’’(1977) తెలుగు సినిమా తీశారు. ఈ సినిమా తీస్తున్న సమయంలో పేద కుటుంబ జీవన విధానం గురించి తెలుసుకునేందుకు ఇబ్రహీంపట్నం, బీదేడు గ్రామాలలో పేదవారి మధ్య గడిపారాయన. షూటింగ్ కోసం వారు వాడే గిన్నె, ముంత లాంటి వస్తువులు తీసుకుని వారికి కొత్తవి కొనిచ్చి షూటింగ్‍కి వాడుకున్నారు. అలా తన చిత్రాలలో వాస్తవికతను ప్రతిబింబింప చేస్తారాయన. ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా అందుకుంది. అనంతరం బి. నరసింగరావు ‘మాభూమి’ తీస్తూ మృణాల్‍ని దాన్ని డైరెక్ట్ చేయమన్నారు. కానీ తాను బెంగాలీ సినిమా తీస్తున్నందున గౌతం ఘోష్‍ను ఆ సినిమాకు దర్శకునిగా తీసుకోమని సిఫారసు చేశారు.
ఈ నేపథ్యంలో మృణాల్‍సేన్ తీసిన ‘పునశ్చ’, ‘అభిషేక్’, ‘ప్రతినిధి (బెంగాలీ)’, ‘మథిర మనిష (ఒరియా)’, ‘పరశురాం’, ‘ఏక్‍దిన్ ప్రతిదిన్’, ‘అకాలే సంధానే’, ‘చాల్‍చిత్ర(బెంగాలీ)’, ‘ఖరీజ్’, ‘ఖాన్‍దాహార్’, ‘జెనిసిస’, ‘ఏక్‍దిన్ అచానక్(హిందీ)’, ‘అంత్‍వేన్దీ’, ‘మహాపృథ్వీ’, ‘అంతరేన్ (బెంగాలీ)’, ‘అండ్ ది షో గోస్ ఆన్’, ‘స్వదేశ్’, ‘అమార్ భువన్’…వంటి చిత్రాలన్నీ ఆయన కీర్తిని అంతర్జాతీయం చేసినవే. ఇంకా ఫిలింస్ డివిజన్ వారికి మూవింగ్ పర్‍స్పెక్టివ్ డాక్యుమెంటరీ, టి.వి.సీరియల్స్, పలు టెలీఫిల్మ్లు తీశారాయన. మృణాల్‍దా సినిమాలన్నీ సమకాలీనమైనవి. మారుతున్న కాలమాన పరిస్థితులకు తన ఆలోచనలకు అద్దంపడుతూ, వాస్తవికతతోపాటు నర్మగర్భంగా నేటి సమాజంలోని అక్రమాలను బట్టబయలు చేసేవిగా, తిరుగుబాటు ప్రకటించేవిగా ఉంటాయి. మధ్యతరగతి జీవితాలకు తెర రూపం కల్పించారు. వీటన్నిటికీ గల ప్రధాన కారణం సేన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి కావడమే. ఆయన 1923, మే 14న నేటి బంగ్లాదేశ్ లోని ఫరీద్‍పూర్ జిల్లాలో పుట్టారు. విద్యార్థి దశలోనే విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. ఫిజిక్స్లో డిగ్రీ పొందారు. రాజకీయ చర్చలు, సాహిత్య సమ్మేళనాల మధ్య తనను తాను రూపొందించుకున్నారు. మెడికల్ రిప్రజెంటిటివ్‍గా, బడిపంతులుగా జీవితం ప్రారంభించారు. సినిమా సామాజిక చైతన్యానికి దోహదపడాలన్న దృఢమైన భావనతో చిత్రసీమలోకి ప్రవేశించారు. ఆయన తొలుత సౌండ్ రికార్డింగ్ శాఖలోను, కొన్నాళ్ళు జర్నలిస్టుగానూ పనిచేశారు. చాప్లిన్‍పై అభిమానంతో బెంగాలీలో ఆయన జీవిత చరిత్రను రాశారు. ఒక జెక్ నవలను అనువాదం చేశారు.
మృణాల్‍సేన్ సినీరంగ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’, 1980లో ‘పద్మభూషణ్’ బిరుదలను ఇచ్చింది. ఆయన సినీ జీవిత రజతోత్సవం సందర్భంగా ‘ఇఫీ’లో రెట్రాస్పెక్టివ్ నిర్వహించారు. 1995లో యునెస్కో సినిమా- 100 ఉత్సవాల కమిటీలో సభ్యత్వం ఇచ్చారు. 1998లో ఇటలీ నేఫెల్స్ చిత్రోత్సవంలో లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు, అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ సన్మానం, బెంగాల్ ప్రభుత్వ రే మెమోరియల్ అవార్డు, రష్యా ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్ ఫ్రండ్‍షిప్ అవార్డు (2001), పూనే చిత్రోత్సవ లైఫ్‍టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు(2002), 2003లో ‘ఫాల్కే’ అవార్డు, పలు యూనివర్సిటీలలో గౌరవ డాక్టరేట్‍లు ఆయనను వరించాయి. 1978లో చైనా, 1979లో జపాన్ దేశాలు ఆహ్వానించి సన్మానించాయి. ఇంకా ఆయన తీసిన చాలా చిత్రాలు జాతీయ అవార్డులను అందుకున్నాయి. ఇండియన్ పనోరమలో ఆయన చిత్రాలన్నీ ప్రదర్శితమయ్యాయి. మృణాల్‍దా తన సినిమాలలో ప్రజల జీవితాన్ని, సమాజాన్ని తనదైన భిన్నశైలిలో చూపించిన ప్రతిభాశాలి. ఆయన మరణంతో భారతీయ సినీ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది.
- హెచ్.రమేష్‍బాబు, ఎ: 7780736386