ఎంబీసీలకు పూర్వవైభవం

సమైక్య పాలనలో నిర్లక్ష్యంతో చేతివృత్తులు నిర్వీర్యం కాగా, సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా అంతరించిపోతున్నాయి. కుల వృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. స్వరాష్ట్రం వస్తే చేతివృత్తులకు పూర్వ వైభవం వస్తుందని సీఎం కేసీఆర్‍ చెప్పిన మాటలు కార్యాచరణలోకి వస్తున్నాయి.గొల్ల, కుర్మలు, నేత, మరనేతన్నలతో పాటు ప్రతి వృత్తిదారుడికి చేతి నిండా పని, పనికి తగ్గ కూలీ చెందాలన్న లక్ష్యంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది.


చేతివృత్తిపై ఆధారపడిన కుమ్మరి, కంచరి, వడ్రంగి, స్వర్ణ కారులు, శిల్పులు ఉపాధి కోల్పోయి ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్నా సమైక్య పాలకులు పట్టించుకోలేదు. గత పాలకుల నిర్లక్ష్యంతో అంతరించిపోతున్న వెనుకబడిన తరగతుల కులాలకు, ఎంబీసీలకు జీవం పోయాలన్న సీఎం కేసీఆర్‍ ఆలోచన శుభ పరిణామం. దేశ చరిత్రలో ఎంబీసీల సంక్షేమం కోసం పాటుపడిన పాలకులు బహు అరుదు. అలాంటివారిలో కరుణానిధి, కర్పూరీ ఠాకూర్‍లు కనిపిస్తారు. ఆ తర్వాత మన రాష్ట్ర సీఎం కేసీఆర్‍ వారి వరుసలో నిలుస్తారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్‍ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నూతన అధ్యాయానికి నాంది పలికినట్లైంది. ఈ కార్పొరేషన్‍కు వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఈ నిధులతో ఒక పద్ధతి ప్రకారం ఎంబీసీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. కులాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. ఎంబీసీ కులాల్లో ఎక్కువమంది కుల వృత్తుల మీదే ఆధారపడ్డారు. రాష్ట్రంలో చాలా కులవృత్తులు దాదాపు నశించిపోయాయి. మళ్లీ వాటికి ప్రాణంపోసి, తద్వారా ఉపాధి కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.


రాష్ట్రంలోని బీసీ కులాల నుంచి అర్ధ సంచార తెగలు, విముక్త జాతులు, సంచార జాతులను ఎంబీసీలుగా (అత్యంత వెనుకబడిన కులాలుగా ) గుర్తించారు. 36 కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చింది. వీటిలో 35 కులాలు కాగా, అనాథలకు కూడా స్థానం కల్పించింది. వెనుకబడిన ఎంబీసీ కులాల్లో బీసీ, ఎంబీసీ, డీఎన్‍టీ (సంచార జాతులు, గంగిరెద్దులు, బుడబుక్కలు, పిచ్చ కుంట్ల) తదితర విభాగా లు న్నాయి. ప్రత్యేకంగా ఎంబీసీ గ్రూప్‍ను ఏర్పాటు చేసి.. ఆ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక సంక్షేమ కార్య క్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రభు త్వం భావించింది. రాష్ట్ర జనాభాలో 53 శాతానికిపైగా బీసీలున్నారు. వీరిలో ఎంబీసీల జనాభా 34 శాతం దాకా ఉంటుందని అంచనా. వీరిలో చాలా మంది కులవృత్తులపై ఆధార పడి జీవిస్తున్నారు.
ఉమ్మడిపాలనలో, గడిచిన అరవయ్యేళ్ల కాలంలో ఎంబీసీల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, తెలంగాణను సాధించుకున్న తర్వాత ఎంబీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించడం చరిత్రాత్మకం. ఎంబీసీ కార్పొరేషన్‍ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్‍ కేటాయించడం గొప్ప విషయమని ఎంబీసీ కార్పొరేషన్‍ సీఈఓ, బీసీ కార్పొరేషన్‍ ఎండీ అలోక్‍ కుమార్‍ దక్కన్‍ల్యాండ్‍తో ముఖాముఖిలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంబీసీ సంక్షేమానికి వేయి కోట్ల రూపాయలను బడ్జెట్‍లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే 250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ నిధులతో దాదాపు 25 వేలమందికి ఎంబీసీ కులస్తులు ఉపాధి చేసుకోవడం జరుగుతుంది. పదివేల మంది వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తూ వీళ్లను ప్రతిభావింతులుగా తీర్చిదిద్దడం జరిగింది.అలాగే కులవృత్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కుమ్మరి కులస్తులకు ఆధునిక యంత్రాలతో మట్టి పాత్రలు, విగ్రహాలు తయారు చేసే అంశంపై శిక్షణ ఇస్తున్నామని, త్రిపుర, గుజరాత్‍లో పర్యటించి అక్కడ ఉన్న కుమ్మరి,చేతివృత్తుల పనిముట్లలపై అవగాహన చేసుకొని, మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు.


త్రిపుర రాష్ట్రం గోమతి జిల్లాలోని పరాతియా అటవీప్రాంతంలో ఉన్న వెదురు పరిశోధన క్షేత్రాన్ని సందర్శించి, ఆస్పర్‍, మోసా, కాటబోరక్‍ వెదురు రకాలను తెలుసుకున్నామన్నారు. వెదురు వినియోగం భారీ ఎత్తున ఉండటంతో పలు రకాల వెదురు జాతులను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో పెరుగుతున్న కాటబోరక్‍ జాతి వెదురు త్రిపుర రాష్ట్రంలోనూ పెంచడాన్ని అధికారులు వివరించారని తెలిపారు. వెదురును ఉపయోగించి ఆధునాతన విధానంతో వివిధ రకాల వెదురు ఉత్పత్తులతో మేదర కులస్తులకు ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వాళ్లు తయారు చేసే పనిముట్లను వ్యాపారంగా మార్చు కునే విధంగా త్రిపురలోని వెనుకబడిన కులస్తులను తయారుచేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇద్దరిని పిలిచించు కుని ఇక్కడ దాదాపు 4 వేలమందికి వృత్తి కళాకారులకు కుమ్మరి మట్టి గణపతి, వాటర్‍ బాటిల్స్, జగ్గులు మరియు దీపారాధులపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే 4 వేలమందికి శిక్షణ అయిపోయిందని, త్వరలో యంత్రాలను కూడా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా కళాకారులు తయారుచేసిన పనిముట్లను అంతర్జాతీయ స్థాయిలో అమ్మడం కూడా జరుగు తుందన్నారు. త్వరలో పదివేలమంది సంచార జాతులకు చెందిన వారికి కేంద్ర,రాష్ట్ర స్థాయి శిక్షణ సంస్థలలో వృత్తి నైపుణ్యశిక్షణ ఇవ్వబో తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కుమ్మరులకు శిక్షణ తయారి కేంద్రాలను కూడా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జులై, ఆగష్టు, సెప్టెంబర్‍లో గణపతి బొమ్మలు, అక్టోబర్‍, నవంబర్‍లో దీపాలకు సంబంధించిన దీపారాధనలు, మార్చి, డిసెంబర్‍లో వాటర్‍ బాటిల్స్ లాంటివి చేయడం జరుగుతుందన్నారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి అని, అందులో భాగంగానే అత్యంత వెనుకబడిన వారిని గుర్తించడం అనేది ఎంతో గొప్ప విషయమన్నారు. ఎంబీసీలు ఆర్థికంగా, అభివృద్ధి చెందాలనేది తన ఆశయమన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‍ ద్వారా చర్చలు జరిపినట్టు, వారి వారి ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరాలు సేకరించి, కార్యాచరణలు రూపొందించామన్నారు. వృత్తి నైపుణ్యశిక్షణ ఇచ్చే కార్యక్రమాలు ఎంబీసీ కార్పొరేషన్‍ ద్వారా చేపట్టామని, వృత్తిని ఆధునీకరించి వారి యొక్క ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అత్యాధునికి యంత్రాలను పరిశీలించేందుకు అధికారులు, కుల సంఘాల నాయకులతో కలిసి వివిధ రాష్ట్రాలలో పర్యటనలు చేసి, కుమ్మరులకు అవసరమయ్యే అధునాతన పరికరాలు తయారు చేయించడం, వాటిని అమ్మించడం జరుగుతుందన్నారు.


కులవృత్తులను ప్రోత్సహించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించి వృత్తులపై ఆధారపడిన వారు తయారుచేసిన వస్తువులకు, ఉత్పత్తులకు ప్రభుత్వపరంగా మార్కెటింగ్‍ సౌలభ్యం కల్పిస్తుంది. ఏ కులంకానీ, ఏ వర్గంకానీ తమను ప్రభుత్వం ఆదుకోలే దన్న భావన కలుగకుండా సమన్యాయంతో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టుతుంది. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి సాంకేతిక పరికరాలు, ఆటోమేటిక్‍ మెషిన్లను అందుబాటులోకి తేవడం ఎంతైనా అవసరం ఉందన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‍ ద్వారా బ్యాంక్‍ లింకేజ్‍ లేకుండా రుణాలు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఎంతోమంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా భవిష్యత్‍ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
యాభై శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా స్థానిక వనరుల ఆధారంగా నివసించే వివిధ సామాజిక వర్గాలకు స్వయం పోషక విలువలు అందిస్తుంది. గంగపుత్ర, ముదిరాజ్‍, బోయ కులస్తులకు చేపల పెంపకం, ఉచిత చేపల విత్తనాల అందజేతతో పాటు పరిశ్రమ హోదాను వర్తింపచేపట్టింది. నాయి బ్రాహ్మణులు, రజకులకు ప్రత్యేక వరాలనిచ్చి బీసీ వర్గాల బతుకుల్లో భరోసా నింపారు. విశ్వకర్మలు, చేనేత, ఔసల, కుమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులు, దర్జీ, మేదర, గౌడ, కమ్మరి వంటి బీసీ కులాలకు ఆర్ధిక చేయూతను అందించాలని బడ్జెట్‍ వేదికగా ప్రకటించింది. సమాజానికి మూలాధారంగా ఉన్న మరెన్నో కులాలు వెనుకబాటు తనాన్ని చవిచూస్తున్నాయని గుర్తించి వారికి ఎంబీసీ కార్పొరేషన్‍ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం.


గత పాలకుల అలసత్వం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. రాష్ట్రంలో చాలా వరకు కులవృత్తులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో కులవృత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి… వాటి సంక్షేమానికి కృషి చేస్తుంది. ఎంబీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‍ నిధులను కేటాయించి, వీళ్ల అభివృద్ధి నిరంతరం కృషి చేయడం చాలా సంతోషం.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *