ఎందుకీ వివక్ష అంటున్న ‘వై’

పురుషుడుగానే పుట్టినా క్రమంగా లోన విచ్చుకుంటున్న స్త్రీత్వాన్ని అణచుకోలేక, బహిరంగపరచి కుటుంబం, సమాజం ఛీత్కారాన్ని భరించలేక సతమతమవుతున్న అటు ఇటు గాని బతుకులు ప్రపంచం నిండా ఉన్నాయి. తమదికాని దోషానికి జీవన కాలం శిక్ష అనుభవిస్తున్న జాతి వారు. ఇప్పుడిప్పుడే విడి జాతి గుర్తింపుతో, చట్టం ఆసరాతో తలెత్తుకుంటున్నారు. సమాజంలో దొరికిన ఆకాస్త చోటును విస్త•తపరచుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ సత్తా నిరూపిస్తున్నారు. వారి మానసిక, శారీరక వ్యధలను విప్పిచెప్పేందుకు గుండెలను, గొంతులను సవరించుకుంటున్నారు. కవులుగా, కథకులుగా తమ గాథల్ని తామే అక్షరబద్ధం చేస్తున్నారు.
—అంటోంది దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్జండర్‍ కవయిత్రి లీమొకోబె.
‘నీవు నా పేరెందుకు మార్చుకున్నావని అడుగుతావు, నీ తీరు మారిందెందుకని ప్రశ్నిస్తావు, నీ ఛాతినెందుకు దాచుకుంటావని అడుగుతావు, ఎందుకో నాకే తెలియదు, నీకెలా చెప్పను?’ అని సెరెన్‍ డిప్టీ అనే మరో మూడోజాతి గొంతు పలుకుతుంది.
వారి గోడును వారు చెప్పుకుంటున్నా, వారి బాధలకు స్పందించి కవిత్వీకరించిన మగ, ఆడ కవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగులో సైతం ఈనాడు, సాక్షిలో ఇదివరకే పడింది. ఇదే అంశంపై వచ్చిన మరో దీర్ఘ కవిత ‘వై…’ యువకవి జానీ బాషా చరణ్‍ తక్కెడశిల దీని రచయిత. ఎందుకు వీరిలా బతకాలి, సమాజపు హింసల్ని ఎందుకు భరించాలి అన్న వేదనలోంచి ఈ కావ్యం పుట్టింది. వారి బాధల్ని వారే చెప్పుకుంటున్నట్లు రచన ప్రధమ పురుషలో సాగుతుంది. రచన యావత్తూ ఒకే స్వరధునిలో వినిపిస్తుంది.
‘ఈ అతుకుల రాజ్యాంగం కూడా / మాకు మూడో అంకె కేటాయించింది / అంకెలు కాదు / ఆత్మీయ సుమాలు కావాలి’ అని సమాజాన్ని ‘మీలో మమ్మల్ని ఇంకిపోయేలా చేసుకోండి’ కోరుతుంది. ‘మీ ఆపన్న హస్తాలను అందుకున్న మేము / ఈ విశ్వ పుస్తకంలో కొన్ని పేజీలై నిలుస్తాము’ అని ధీమా ఇస్తుంది. వారి శారీరక లోపాల్ని సవరించేందుకు ‘ఇప్పుడు మాకొక శిల్పి కావాలి / అవును రాయిలోని / అనవసర ముక్కలను కోసేసి / శిల్పన్ని చేయాలి, ‘ ఇంకా ఈ పురుష సంకెళ్ళు / తెంచుకుని / ఆడతనాన్ని విడుదల చేసి / పావురాలమై ఎగరాలనుకుంటున్నారు.’
‘ మా జీవితాలను / పలకరింపుల తోడుతో / పైకి లాగేవారు కావాలి…’, అనేవారి ఆకాంక్షలు కవి అక్షరాల్లో ప్రస్ఫుటమవుతున్నాయి.
అంశప్రధానంగా ఆహ్వానించదగిన రచన ఇది. సమాజంలో నపుంసకులు వారివారి సామాజిక హోదాల ఆధారంగా సర్దుకు బతుకుతున్నా, హిజ్రాల పేరిట రోడ్డునపడి పలు హింసలకు నెలవైనవారి పక్షాన కవి నిలిచి వారి గొంతుకలో తన పలుకుల్ని ధారగా పోసినాడు.
రచనపరంగా చూస్తే ‘వై…’ కవిత ఎత్తుగడ, ముక్తాయింపులు లేకుండా ఒకే రీతిలో సాగిపోతుంది. వ్యక్తీకరణలో పదాల గాంభీర్యత కోసం, కవిత్వీకరణ పెంచే క్రమంలో వాడిన పదాల మధ్య అనుబంధం అక్కడక్కడా కొరవడింది. ఉదాహరణకు ఓచోట ‘మేము అంధకార సముద్రంలో / నిటారుగ వెలాడుతున్న గబ్బిలాలం’ అంటారు కవి. నిజానికి సముద్రానికి, గబ్బిలాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అదేవిధంగా ‘నిరక్షరాస్యత దీపం వెలిగించార’ని మరో పంక్తి ఉంది. బాధ చెపుతూ ‘వేదనల తోరణాలు / ఎప్పుడూ పరిమళిస్తూనే ఉంటాయి.’ ఆనందంలో విరోధాబాసముంది. పుస్తకం చివరిదాకా వచ్చేసరికి – ఒకే విషయాన్ని పదాలు మారుస్తూ చదివిన విషయాన్నే మళ్ళీ చదివినట్లనిపిస్తుంది. సమాజ ఛీత్కారాన్ని వివరించే క్రమంలో లైంగిక దాడి వర్ణన వేశ్య జీవన వ్యధను తలపిస్తుంది.
అయితే కవి తనను తాను తన ప్రపంచం నుండి దూరం చేసుకొని ఈ కావ్యం రాశారనిపిస్తుంది. ఇలాంటి కావ్యం రాయడానికి ఓ విశిష్ట మానవత్వం ఉండాలి అనే రాచపాళెం చంద్రశేఖర్‍ రెడ్డి మాటల్లో నిజముంది. నేడో, రేపో / గె లు+ / మా నెత్తిపై / తాండవిస్తున్నట్లుంది’ అన్న కల నిజం కావాలి.


‘వై….’ (దీర్ఘ కవిత)
రచయిత: జాని బాషా చరణ్‍ తక్కెడశిల

పేజీలు: 67, వెల : రూ।। 150/-
ప్రతులకు: రచయిత-జెవి ప్రచురణలు,
హైదరాబాదు
మొబైల్‍: 9491977190
-బి.నర్సన్‍, ఎ : 9440128169

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *