తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా.నందిని సిధారెడ్డి
తెలంగాణ వివక్షతకు గురైనప్పుడు తెలంగాణ చరిత్రను నిర్భయంగా, నిరంతరంగా చెప్పిన ధీశాలి బి.ఎన్.శాస్త్రి అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా.నందిని సిధారెడ్డి కొనియాడారు. ఉన్నదాన్ని ఒప్పుకోక ఘర్షణ పడి చరిత్రను రచించిన వారే చరిత్రకారులని, ఈ కోవలోకే చెందినవారు బి.ఎన్.శాస్త్రి అని ఆయన చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, మూసీ సాహిత్య ధార సంయుక్తాధ్వర్యంలో బి.ఎన్.శాస్త్రి సాహిత్యం, సమాలోచన అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఓయూ ప్రాంగణంలోని సురభారతిలో డిసెంబర్ 10, 11 తేదీల్లో జరిగింది. శాస్త్రిగారి సాహిత్య వ్యాసాల సమాహారమైన ‘శిలాక్షరం’ పుస్తకాన్ని సిధారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా.సిధారెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సు శాస్త్రి గారిని తెలంగాణ లోకానికి తిరిగి కొత్తగా పరిచయం చేసిందన్నారు. నవలా సాహిత్యాన్ని, శాసనాలను ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన అమోఘమైన, ఆయనదైన బాట వేశారన్నారు. ఒక చరిత్రకారుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ నూటికి నూరుశాతం శాస్త్రిగారికి ఉన్నాయని చెప్పారు. చరిత్ర ఖాళీగా ఉన్న పేజీలను కొత్త పరిశోధనలు చేసి చరిత్ర లోకాన్ని ఆశ్చర్య పరిచారన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కసిరెడ్డి వెంకట్‍రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పరిశోధకులకు తన సొంత డబ్బులతో పుస్తకాలను అచ్చువేయించారని తెలిపారు. ఎన్నో కష్టాలు పడి జిల్లా సర్వస్వాలను రచించారని అన్నారు. ఆత్మీయ అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో పరిశోధక సంస్థ నెలకొల్పాలని, దానికి బి.ఎన్.శాస్త్రి పేరు పెట్టాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిశోధన సంస్థ లేదని, ఆ దిశగా కృషి జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాస్త్రి గారు చరస్మరణీయులైనారని తెలిపారు. మూసి మాస పత్రిక సంపాదకులు సాగి కమలాకరశర్మ మాట్లాడుతూ రాబోయే తరాలవారికి శాస్త్రి గారి రచనలను పరిచయం చేయడమే తమ ఉద్దేశ్యమన్నారు. ఈ సమావేశంలో శ్రీరంగాచార్యులు, ఓయూ పూర్వ రిజిస్ట్రార్ కిషన్‍రావు, పల్లెర్ల రామ్మోహన్, శభిన్నూరి గోపాలకృష్ణ, శాస్త్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రపాలనలో తెలంగాణ వ్యక్తులను పట్టించుకోలేదు : తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి
విష్ణుకుండినుల రాజధాని తుమ్మల గూడెం అని నిరూపించిన మహానీయుడు బి.ఎన్.శాస్త్రి అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. రెండో రోజు ముగింపు సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్యావంతుల కుటుంబానికి చెందిన శాస్త్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని కొనియాడారు.ఆంధ్రపాలనలో తెలంగాణ వ్యక్తులను సరిగ్గా పట్టించుకోలేదని, తెలియకుండానే ఈ లోపం జరిగిందన్నారు. శాస్త్రి గారిని చూస్తే సవరించుకోవాలనిపిస్తుందన్నారు. చైతన్యవంతమైన శాస్త్రి గురించి రెండు రోజుల సదస్సు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. శాసన చరిత్రకు శాస్త్రి చేసిన కృషి మరువలేనిదన్నారు. తెలంగాణలో మరుగునపడ్డ సాహితీకారులు చాలా మంది ఉన్నారని, వారిని వెలికితీయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ సాహితీ మూలాలను వెలికితీయడానికి సాహిత్య అకాడమీ ప్రయత్నిస్తోందన్నారు. దానికి సాహితీ సమాజం సహకరించాలన్నారు. ఈ సంవత్సరానికిగానూ బి.ఎన్.శాస్త్రి పురస్కారాన్ని మహామహోపధ్యాయ, సంస్కృత పండితులు శ్రీమాన్ శ్రీభాష్యం విజయసారథికి ప్రదానం చేశారు. తెలంగాణ పత్రిక సంపాదకులు అష్టకాల రామ్మోహన్‍రావు బి.ఎన్.శాస్త్రిని పత్రికలు విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత శాస్త్రి గారి అమూల్య సాహిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. చిన్నతనం నుండే సంస్కృత సాహిత్యంలో ఉండటం గర్వకారణం అన్నారు. సర్వవైదిక సంస్థానం ద్వారా శ్రీభాష్యం వారు సనాతన ధర్మానికి సేవ చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు రోజుల సదస్సుకు సంబంధించిన నివేదికను మూసీ సాహిత్య ధార కార్యదర్శి అట్టెం దత్తయ్య సమర్పించారు. ఈ సమావేశంలో మూసీ పత్రిక సంపాదకులు సాగి కమలాకరశర్మ, సాహితీవేత్త గిరిజా మనోహరబాబు, భిన్నూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
– దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88