కొత్త కోర్కెలు

సత్యంకు పెద్ద కోర్కెలంటూ లేవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త కోర్కెలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పదో తరగతి అయినంక ఇంటర్మీడియేట్‍ చదవాలనుకున్నాడు. ఇంటర్‍ అయ్యాక, డిగ్రీ చేయాలనుకున్నాడు. డిగ్రీ అయ్యాక, యూనివర్శిటీలో పీజీ చేయాలనుకున్నాడు. పీజీ అయ్యాక, పిహెచ్‍డి చేయాలనుకున్నాడు. పిహెచ్‍డి అయ్యాక యూనివర్శిటీ ప్రొఫెసర్‍ కావాలనుకున్నాడు. ప్రొఫెసర్‍ అయ్యాక, జాతీయ, అంతర్జాతీయ సెమినార్‍లు తిరగాలనుకున్నాడు. సెమినార్‍లు తిరిగాక పుస్తకాలు వేయాలనుకున్నాడు. అలా కొత్త కోర్కెలు పెరుగుతూ పోయాయి.


సత్యం చిన్నప్పుడు సైకిల్‍ తొక్కడం వస్తే చాలనుకున్నాడు. తర్వాత సైకిల్‍ కొనుక్కుంటే బాగుండు అనుకున్నాడు. సైకిల్‍మీద ఊరికి పోతే మంచిగుండు అనుకున్నాడు. సత్యం ఐదో తరగతికి చేరేసరికి కొత్త కోర్కెలు పుట్టుకొచ్చాయి. మంచి పెన్ను, పెన్సిల్‍ కావాలనుకున్నాడు. మంచి నోట్‍బుక్‍ కావాలనుకున్నాడు. కొత్త పుస్తకాలు కొనాలనుకున్నాడు. కొత్త డ్రెస్సులు కావాలనుకున్నాడు. ఆటల్లో ఫస్ట్ రావాలనుకున్నాడు. క్లాస్‍లో అందరు మెచ్చుకోవాలనుకున్నాడు. మొదటి బెంచిలో కూర్చొని సారు మెచ్చుకోలు పొందాలనుకున్నాడు. చివరి బెంచీలో కూర్చొని ముంగట ఉన్నోళ్ళ అంగీకి తోకలు పెట్టాలనుకున్నాడు. పెన్నుతో సిరా ముందున్నవాళ్ళ వీపుమీద దులపాలనుకున్నాడు.


సత్యంకు ఇంటర్‍ అయ్యాక పెళ్ళి చేసుకోవాలనిపించింది. డిగ్రీ అయ్యాక పెళ్ళి అయింది. పీహెచ్‍డీ అయ్యేసరికి పిల్లలయ్యారు. అలా వయస్సు పెరిగినకొద్దీ అందమైన భార్య కావాలనిపించింది. భార్య వచ్చాక, ఒక ఇళ్ళు కట్టుకుంటే బాగుండు అనిపించింది. భార్య జానకి కూడా ఇంకా చదువుకుంటే బాగుండు అనుకున్నాడు. భార్యను చదివించాడు. ఆమె కూడా ఉద్యోగం చేస్తే బాగుండు అనుకున్నాడు. ఆమె కూడా ఉద్యోగంలో చేరింది. జానకి సత్యానికి ముద్దుల చెల్లెల్లా మురిపెంగా ఉంటుంది. సత్యంకు చీకూ చింత లేదు. చక్కనైన భార్య.అందమైన ఇల్లు,చక్కని ఉద్యోగం, పదిమందిలో గౌరవం.
ఎందుకో సత్యానికి కోర్కెలు తగ్గించుకోవాలనిపించింది. అన్నం తినడం కూడా కోర్కే కదా!. కోర్కెలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి. కొత్త కోర్కెలు ఎలా పుట్టుకొస్తాయి. చెలిమె ఊరినట్టు కోర్కెలు రోజురోజుకు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొత్త కోర్కెల మూలమెక్కడుందో!.
సత్యం జానకితో చర్చించి బుద్ధుని తత్వంలో బైరాగి తత్వం ఉందా! తాత్విక చింతన ఉందా! అని చర్చించుకున్నారు. అప్పటికే పిల్లలు హైస్కూలుకు వచ్చారు. పిల్లలు బాగా చదువుకోవాలి. ఎదగాలి. తనంత ఎదగాలి. తమకన్నా బాగా ఎదగాలి అనుకున్నారు. మరి ఈ కొత్త కోర్కెలేమిటి? అని భార్యాభర్తలు చర్చించుకున్నారు. విత్తు మొక్క అవుతున్నది. మొక్క చెట్టు అవుతున్నది. చెట్టుకు మళ్ళీ ఎన్నో విత్తనాలు. మళ్ళీ కొత్త విత్తులు. కొత్త మొక్కలు. కొత్త కోర్కెలు కూడా ఇలాగే ఒకటి నుంచి మరొకటి పుట్టుకొస్తున్నాయి.


సత్యం ఇంటర్‍ చదివేటప్పుడు సైకిల్‍ ఉంటే చాలు అనుకున్నాడు. డిగ్రీ అయ్యాక భార్యతోపాటు సైకిల్‍, గడియారం, రేడియో తెస్తే బాగుండు అనుకున్నాడు. భార్యతోపాటు సైకిల్‍ వచ్చింది. గడియారం వచ్చింది. రేడియో వచ్చింది. ఫ్యాన్‍ కూడా వచ్చింది. అడిగిన దానికన్నా ఎక్కువ వచ్చింది. సంతోషపడ్డాడు. పీహెచ్‍డి అయ్యేసరికి స్కూటర్‍ ఉంటే బాగుండు అనుకున్నాడు. స్కాలర్‍షిప్‍తో స్కూటర్‍ కొందామనుకున్నాడు. జానకి కూడా తల్లిగారింటి నుంచి కొన్ని వసూలు చేసుకొని తెచ్చింది. స్కూటర్‍ కొన్నారు. పిల్లల్ని వెంటేసుకొని స్కూటర్‍మీద చట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారానికో సినిమా చూడాలని పించింది. సినిమాల గురించి మంచి చెడ్డలు మాట్లాడాలనిపించింది. ఫిల్మ్ సొసైటి పెట్టారు. మంచి సినిమాలు చూడాలి. చూపించాలి అనుకున్నారు. పదిమంది కలిసి ఫిల్మ్ సొసైటీలో మంచి సినిమాలు చూశారు. ఎంతో తెలుసుకున్నట్టు అనిపించింది.


జానకి చెల్లెలు టీచర్‍గా పని చేస్తుంది. బావ సత్యంలాగా లెక్చరర్‍ కావాలని ఆరాటం. జానకి తమ్ముడు హోల్‍సేల్‍ వ్యాపారం పెట్టాడు. బాగా ఎదగాలని ఆరాటం. సత్యం చెల్లెలు శ్రావ్య భర్తతో అమెరికా వెళ్ళింది. అమెరికాలో ఇల్లు కొనుక్కున్నారు. శ్రావ్యకు కాలిఫోర్నియాలో ఉద్యోగం చేయాలని ఆరాటం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ లు అయితే హాయిగా ఉంటుందని చిన్న కోర్కె. సత్యంకు అమెరికా చూడాలని, అంతర్జాతీయ సెమినార్‍లో రెండుసార్లు వెళ్ళి వచ్చాడు. అట్లాగే జపాన్‍ చూడాలని, రెండు సెమినార్లలో పాల్గొని వచ్చాడు.


సత్యం మంచి పుస్తకాలు చదవాలనుకున్నాడు. మంచి పుస్తకాలు కొనాలనుకున్నాడు. ఇంట్లో ఒక లైబ్రరీ తయారు చేసుకోవాలనుకున్నాడు. మంచి మంచి పుస్తకాలు కొన్నాడు. కొని ఊరుకోలేదు. వాటిని చదవాలనుకున్నాడు. చదివి ఊరుకోలేదు. వాటిని విశ్లేషించాడు. విశ్లేషించి ఊరుకోలేదు. ఆ విశ్లేషణలను పుస్తకాలుగా వేశాడు. పుస్తకాలు వేసి ఊరుకోలేదు. మంచి సమీక్ష రావాలనుకున్నాడు. మంచి సమీక్షలు వచ్చాయి. మళ్ళా కొత్త పుస్తకం వేశాడు. మళ్ళీ ప్రశంసలు వచ్చాయి. తన విద్యార్ధులు ఎదిగారు. టీచర్లయ్యారు. లెక్చరర్లు అయ్యారు. అప్పుడప్పుడు ఎదురుపడతారు. నమస్కరిస్తారు. మీరే మా గురువులు అంటారు. ఆనందం వేస్తుంది. తృప్తితో గుండె ఉబ్బిపోతుంది.


సత్యంను ఇరుగుపొరుగు, స్నేహితులు మంచి జీవితం గెలుచుకున్నారు అంటుంటే పొంగిపోయిన ఆనందం. మంచి స్నేహ బృందం. బంధువులు కూడా మంచివారే. అప్పు అడగనంత కాలం, అప్పు ఇవ్వనంత కాలం అందరూ మంచివారే. మాట సాయం మాత్రం మరువలేదు. ఎందరికో హాస్టల్లో సీట్లు ఇప్పించాడు. స్కూళ్ళో, కాలేజీల్లో సీట్లు ఇప్పించాడు. ఏ చదువు ఎలా చదువుకోవాలో, ఏ కోర్సు చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చక్కగా వివరించేవాడు. అలా ఎందరో ఎదిగారు. అదో తృప్తి. జీవితంలో విద్యార్ధులు ఇచ్చే గౌరవం కన్నా మించింది లేదనుకున్నాడు. విద్యార్ధులు పెరిగి పెరిగి, ఎదిగి ఎదిగి స్నేహితులయ్యారు. అయినా వారు గురుభావం వదలలేదు. గురువుగానే గౌరవించారు. అది చాలు తనకు అనుకున్నాడు.


ఎందుకో కొత్త కోర్కెలు పుట్టుకు వచ్చాయి. స్కూటర్‍ పాతపడింది. పిల్లలకు పనికి వచ్చింది. కారు కొనాలనుకున్నాడు. అనుకున్నాక కొనడం ఆగలేదు. డ్రైవింగ్‍ నేర్చుకున్నాడు. జనకికి కూడా డ్రైవింగ్‍ నేర్పాడు. కారులో జానకి పిల్లలను తీసుకొని చుట్టాల మార్గం వెళ్ళాడు. స్నేహితుల మార్గం వెళ్ళాడు. ఫంక్షన్లకు, పండుగలకు కారులోనే వెళ్ళేవాడు. పదిమందిలో గౌరవం.
ఏ వయస్సుకు ఆ ముచ్చట. ఏ హోదాకు ఆ ముచ్చట ఉండాలనుకున్నాడు సత్యం. సూటుబూటు వేసుకున్నాడు. టై కట్టుకున్నాడు. మాట తీరు మార్చుకున్నాడు. మంచివాడు అనిపించుకున్నాడు. ఎవరు పిలిచినా వెళ్తాడు. తృణమో పణమో చదివిస్తాడు. ప్రెజెంటేషన్లు ఇస్తాడు. ఏ సంస్థవారు పిలిస్తే ఆ సంస్థలో సభ్యుడయ్యాడు. బుద్ధుడు బోధనలు చదివాడు. వ్యాసుని భగవద్గీత చదివాడు. అంబేడ్కర్‍ రచనలు చదివాడు. గాంధీ జీవితాన్ని చదివాడు. నెహ్రూ పరిపాలనను అధ్యయనం చేశాడు. చైనా గురించి తెలుసుకున్నాడు. జపాన్‍ గురించి తెలుసుకున్నాడు. జర్మన్‍ గురించి తెలుసుకున్నాడు. అమెరికా గురించి తెలుసుకున్నాడు. సోవియట్‍ యూనియన్‍ గురించి తెలుసుకున్నాడు. రెండు ప్రపంచ యుద్ధాల గురించి తెలుసుకున్నాడు. భారత జాతీయోద్యమం గురించి తెలుసుకున్నాడు. సోక్రటీస్‍ గురించి తెలుసుకున్నాడు. ప్లేటో గురించి తెలుసుకున్నాడు. అరిస్టాటిల్‍ గురించి తెలుసుకున్నాడు. కణాదుడ్ని తెలుసుకున్నాడు. సాంఖ్యం చదివాడు. ఉపనిషత్తులు చదివాడు. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస చదివాడు. వేదసారం చదివాడు. మహాభారత సారం అధ్యయనం చేశాడు. రామాయణ సారం పిండుకున్నాడు. నాగార్జునుడిని చదివాడు. అద్వైతం చదివాడు. హెగెల్‍ను చదివాడు. కౌటిల్యుడిని చదివాడు. రికార్డోను చదివాడు. అధ్యయనం దాహం తీరేది కాదు. ఏది కనపడితే అది చదివాడు. సారం లేనిది పక్కకు పడేశాడు. సారాన్ని స్వీకరించాడు.


సత్యంకు పెద్దగ కోర్కెలంటూ లేవు. అందరూ తనలాగ బాగుండాలనుకున్నాడు. అందరూ బాగుపడాలనుకున్నాడు. సత్యంకు చిన్నప్పటి జ్ఞాపకాలు అప్పుడప్పుడు మెదులుతుంటాయి. చిన్నప్పుడు మంచి బలపం కోసం ఏడ్చాడు. ఇప్పుడు మంచి సమాజం కోసం మాట్లాడతాడు. కోర్కెలు తగ్గలేదు. పెరుగుతూ పోయాయి.
ఆ మధ్య ఆయనెవరో పదకొండు వేల కోట్లు సంపాదించాక పోతూ పోతూ చెక్కు రాసుకొని పక్కన పెట్టుకున్నాడు. గంధపు చెక్కల్లో కాల్చేశారు. చెక్కు పైన చెల్లదట. అంత ఈ భూమిమీదే చెల్లుబాటు. బతికున్నంత కాలమే చెల్లుబాటు. పాపం ఆయన అందరితో తిట్లు తిన్నాడు. బాగా సంపాదించాలని పేరు సంపాదించాడు. మందిని ముంచాడని, బ్యాంకులను ముంచాడని ప్రతిష్ఠ మూట గట్టుకున్నాడు. ఏమైతేనేమి వేలాదిమంది ఊరేగింపుతో అట్టహాసంగా అంత్యక్రియలు జరిగాయి. అతడు పోయాడు. అతని సంపద మిగిలింది. అతను పోయాడు. అతని పాపం అతనితోనే పోయింది. అతని సంపద మిగిలింది. వారసులు మరింత సంపాదించారు. పేర్లు మార్చారు. ఊర్లు మార్చారు. బ్యాంకులు మార్చారు.షేర్లు మార్చారు. వ్యాపారం మార్చారు. పరిశ్రమలు మార్చారు. రకరకాల రూపాల్లోకి చేరిపోయారు. వినపడ్డమే తప్ప కనపడకుండా బతుకుతుంటారు. ఏదో పొరపొచ్చాలు వచ్చాయి. పరిశ్రమల నుంచి ఒకరు రాజకీయ పరిశ్రమలోకి ప్రవేశించారు. రాజకీయాల్లో నిలిచారు. గెలిచారు. బ్యాంకులు తలవంచాయి. ప్రభుత్వాలు తల వంచాయి. వందల వేల కోట్లు ఇంకా ఇంకా రకరకాల రూపాల్లో అధికారం సంపద పోగుపడుతూ పోయింది. గుండెపోటు అన్నారు. మందిపోటు అన్నారు కొందరు. అతడు పోయినా, ఆ సంపద మిగిలే ఉంది.


సత్యంకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం తీసుకుపోయారు అని బైరాగితత్వం ఆలోచనలు. ఎక్కువ ఆలోచించి మెదడు పాడుచేసుకోకు అని జానకి హితబోధ. జానకి వాస్తవికవాది. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు. ఇంతకన్నా కావల్సింది ఏముంది? ఇంట్లో ఓ పని మనిషి. ఇస్త్రీ బట్టలకు వేరే. అన్నీ హాయిగానే గడిచిపోతున్నాయి. పెద్ద కోర్కెలంటూ లేవు. ఓ ఇరవై తులాల బంగారు నగలు, గాజులు ఉంటే చాలు అనుకుంది. ఒక్కటొక్కటి కొన్నాక కాపాడ్డం ఎలాగో తోచలేదు. బ్యాంకు లాకరు తీసుకుంది. లాకరులో పెట్టింది. అప్పుడప్పుడు ఫంక్షన్లకు వెళ్తూ వేసుకొని మురిసిపోతుంది. జానకికి ఇంతకన్నా పెద్ద కోర్కెలు లేవు.


సత్యానికి పెద్ద కోర్కెలంటూ ఏమీ లేవు. కొత్త కోర్కెలంటూ ఏమీ లేవు. కారు సతాయిస్తున్నది. పాత పడిపోయింది. షోరూమ్‍లో ఇచ్చేసి కొత్త కారు తీసుకున్నాడు. పార్ట్టైమ్‍ డ్రైవర్‍ని పెట్టుకున్నాడు. పిలిచినప్పుడు వస్తాడు. గంటకింతని తీసుకుంటాడు. మినిమం అంటూ కొంత తీసుకొని వెళ్తాడు. పాత ఇల్లు అమ్మాడు. ఎందుకో గేటెడ్‍ కమ్యూనిటీలో విల్లా బాగుంటుంది అనుకున్నాడు. బ్యాంకులో కలిశాడు. అప్పులు చేశాడు. విల్లా తీసుకున్నాడు. ప్రశాంత వాతావరణం, చక్కని చెట్లు అందరూ తీరైన మనుషులు. ఎంతో హాయిగా ఉంది. రోజూ వాకింగ్‍, ఉదయాన్నే చల్లని వాతావరణం.
సత్యానికి కోర్కెలు అదుపు చేసుకోవాలని ఆరాటం. కొన్ని జీవితావసరాలు. వాటిని కోర్కెలు అని త్యజించకూడదు అని అనుకున్నాడు. మూడు పూటలా తినడం కోరిక అనుకుంటే ఎలా? మంచి ఇల్లు కావాలనుకోవడం పెద్ద కోరిక అనుకుంటే ఎలా? మంచి ఉద్యోగం ఉండాలనుకోవడం పెద్ద కోరిక అనుకుంటే ఎలా? మంచి ఆరోగ్యం ఉండాలనుకోవడం పెద్ద కోరికనా? మంచి కుటుంబం పెద్ద కోరికనా? ఇవన్నీ జీవితావసరాలు. సైకిల్‍ జీవితావసరమే. కారు కూడా జీవితావసరమే. గేటెడ్‍ కమ్యూనిటీలో విల్లా కూడా ఇప్పుడు సత్యానికి జీవితావసరమే.


సత్యానికి పుట్టినప్పుడు పెద్ద కోర్కెలంటూ ఏమీ లేవు. మంచి బలపం, మంచి పలక ఉంటే చాలనుకున్నాడు. ఇప్పుడు కూడా పెద్ద కోర్కెలంటూ ఏమీ లేవు. మంచి కారు. మంచి విల్లా, పిల్లలకు మంచి ఉద్యోగం. ఇంతకన్నా కొత్త కోరికెలంటూ లేవు. అందరూ ఇలా కనీస కోర్కెలతో బతకాలనే ఆరాటం. సత్యానికి కోరికలు తీరాయి. ఇతరులకు ఆ కోర్కెలు తీరాలని కోరుకుంటాడు. పరోపకారం జీవితావసరం అంటాడు. సత్యానికి రోజురోజుకు కొత్త కోర్కెలు…ఎందుకు పుట్టుకొస్తుంటాయో… ఆలోచిస్తుంటే సత్యానికి ఆశ్చర్యం వేస్తుంది.


– బి.ఎస్‍.రాములు
ఎ :8331966987

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *