చెర్విరాల భాగయ్య


యక్ష శబ్దం వేదమంత్ర ప్రమాణంగా చూస్తే దైవానికి అనువర్తిత పదంగా చెప్పబడింది. యక్షుజంటి పరమాత్మ అనే అర్థం కూడా నిఘంటువులు తెలియజేశాయి.
యక్షగానం అంటే యక్షులు పాడే పాట అని, మరొక అర్థంలో దైవాన్ని స్తుతిస్తూ చేసే గానం అని కూడా చెప్పుకోవచ్చు.
ఈ యక్ష గాన పక్రియ 15వ శతాబ్దం ఉత్తరార్థం నుండి కన్పిస్తోంది. ఇది చారిత్రంగా స్పష్టమైన నిజం. దక్షిణాంధ్ర యుగంలో విశ్వవిఖ్యాతమైన ఈ ఆహార్య పక్రియ తెలంగాణ కీర్తి తలమానికంగా స్థిరపడింది. తెలంగాణ యక్షగానం అనగానే వినిపించే పేరు చెర్విరాల భాగయ్య తెలంగాణ సంస్కృతి విఖ్యాతం కావడానికీ, ఉర్దూ ప్రాబల్యంతో ఉర్రూతలూగిన కాలంలో ఆ భాషకు దీటుగా తెలుగు సంస్కృత వైభవానికి మూలకంగా చెర్విరాల భాగయ్య యక్షగాన పక్రియ నెంచుకుని రాసి స్వయంగా ప్రదర్శించారు. నిజాం ప్రభుత్వంపై తన నిరసనను తెలియ జేయడానికి కూడా ఈ పక్రియను వాడుకున్నారు.


చెర్విరాల భాగయ్య పూర్వీకులు మెదక్‍ జిల్లా వారైనా హైదరాబాద్‍ మశూరాబాద్‍లో స్థిరపడ్డారు. భాగయ్య గారు మెదక్‍ జిల్లా నర్సపూర్‍ తాలుకాలోని ‘గుమ్మడిదల’ గ్రామంలో 1904లో జన్మించారు.
చెర్విరాల భాగయ్య జీవితం పుట్టక నుండి మరణం వరకూ గల మధ్య కాలం అంతా పోరాటాల మయం. దురదృష్టం అడుగడుగునా తన ప్రభావం చూపిస్తున్నా మొండి ధైర్యంతో బ్రతుకీదారు.
భాగయ్యగారి జీవితం తెరిచిన పుస్తకం. పరిశీలిస్తే వారి బొంబాయి జీవితం ఒక పార్శ్వమైతే, హైదరాబాద్‍ జీవితం మరొక పార్శ్వంగా పేర్కొనవచ్చు. భాగయ్య గారు నమ్మిన సిద్ధాంతాన్ని జీవితం చివరి వరకూ అనుసరించారు. ఆవేశం, ఆధ్యాత్మికత, హృదయవాద తత్వం, నిరంతర శ్రమ వారికి జీవితంలో కలిగిన కష్టాల కడలిని ఎదురీదేలా చేశాయి.


భాగయ్య గారు నిజామాబాద్‍ జిల్లా ఆర్మూర్‍ తాలూకా కొత్తురు గ్రామంలో తీర్థగిరి అనంతాచార్యులు గారి నుండి దీక్ష తీసుకున్నారు. భాగయ్యగారు సామాజిక జీవితంలో చదివిన దానిని ఒక క్వాలిఫికేషన్‍గా భావిస్తే సమాజాన్ని ఆమూలాగ్రం చదివి అర్థం చేసుకున్న వైనాలు వారు స్వయంకృషితో ఎదిగేలా చేశాయి.
భాగయ్య గారికి బాసర జ్ఞానసర్వతి అనుగ్రహం 14వ ఏటనే కలిగి వారిని కవిగా కవిత్వాన్ని చెప్పేలా చేసింది. బొంబాయిలో మిల్లులో పనిచేసిన రోజుల్లోనే రచనకు పూనుకున్నారు.
పసిప్రాయంలోనే తండ్రి దూరమైతే తల్లితో కలిసి బొంబాయిలో బట్టల మిల్లులో పనిచేశారు. మిల్లు మూత పడినప్పుడు కూలిపని చేయడానికి సైతం వెనుదీయలేదు.
బొంబాయిలో వున్నప్పుడు మారుతి అనుగ్రహం కలిగిందని స్వయంగా స్వామి తమ నాల్కపై బీజాక్షరాలు వ్రాశారని తమ జీవిత చరిత్రలో రాసుకున్నారు.
భాగయ్యగారు బహుభాష కోవిదులు. అందులో ప్రత్యేకంగా మరాఠి, తెలుగు, సంస్కృతం హిందీ భాషల్లో రచనలు చేసే ప్రతిభను అలవరచుకున్నారు. వీరి జీవితంలో ఎదుగుదల, విషాదాలు సమానంగా చోటుచేసుకున్నాయి.


తెలంగాణలో తొలి యక్షగాన కర్త సుగ్రీవ విజయం పేరుతో కందుకూరి రుద్ర కవి కావడం ఒక విశేషమైతే అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని యక్షగానాల ప్రభతో తెలంగాణకు స్థిర, చిర యశస్సు తెచ్చిపెట్టిన వారు చెర్విరాల భాగయ్య గారు కావడం తెలంగాణ ప్రజల అదృష్టంగా పేర్కొనవచ్చు. అలాగే భాగయ్య గారు వ్రాసిన ‘సుగ్రీవ విజయం’ యక్షగానం కూడా అనేక ప్రదర్శనలకు నోచుకోవడంతోపాటు ముద్రితమై ఆకాలంలో లక్ష కాపీలు అమ్ముడుపోవడం విశేషం.
భాగయ్యగారు తెలుగు సాహిత్యంలో యక్షగాన పక్రియకే పరిమితం కాక హరికథలు కూడా చెప్పారు. వీటితోపాటు మంత్ర, తంత్ర, జ్యోతిష్యాలలో నిరుపమాన ప్రతిభ కనబరిచారు.


‘లక్షణ సారం’ అనే లక్షణ గ్రంథాన్ని రాసి లాక్షణికుల సరసన స్థానం పొందారు. భాగయ్య గారు జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్ళారు. కూలిపని నుండి ప్రారంభించి ఫ్రూఫ్‍ రీడర్‍ పని చేశారు. బండిపై కూరగాయలు, పిప్పరమెంట్లు అమ్మారు. వారి నినాదం శ్రమయేవ జయతే.
భాగయ్య గారు నాటి దక్కన్‍ రేడియోకి ‘నరకాసుర వధ’ అనే బుర్రకథను రాసి స్వయంగా ప్రదర్శించారు. భాగయ్య గారికి లౌకిక జీవితం కన్నా, ఆధ్యాత్మిక జీవితం పట్ల యిష్టత మెండుగా వుండేది. వారు ‘మాణిన్‍ ప్రభు’ సంప్రదాయాన్ని అనుసరించారు. బహుశా ఈ చింతనే వారిని వారి జీవితాన్ని సమతౌల్య స్థితిలో నిలబెట్టిందని గట్టిగా విశ్వసించవచ్చు.


భాగయ్యగారు శత గ్రంథకర్తలు, అర్థ శతయక్షగాన కర్తలు, పరిష్కర్తలు అంతకుమించి మానవతా వాది. నాడు తెలంగాణలో జనగామ, జడ్చర్ల రైలు ప్రమాదాలపై స్పందించి బుర్రకథలు రాయడం వల్ల వారికి గల సామాజిక స్పృహ ఏమిటో మనకు అవగతమౌతుంది.
చెర్విరాల భాగయ్యగారి వ్యక్తిగత జీవితంలో కళత్ర విషాదం పూడ్చలేని లోటుగా పేర్కొనవచ్చు. వారికి సంతానం లేకపోయినా వారి వంశజుల్లో ఒకరైన నాగలింగయ్యను పెంపకానికి తెచ్చుకున్నారు.


రజాకార్ల అల్లర్ల సమయంలో హైదరాబాద్‍ విడిచి గుమ్మడిదల గ్రామానికి వెళ్లినా అల్లర్ల తర్వాత తిరిగి హైదరాబాద్‍కు వచ్చారు భాగయ్య. వచ్చిన దాంట్లో గడుపుకోవాలని, వ్యాపారం చేసి బతకాలని హితం చెప్పారు పెంచుకున్న కొడుకు నాగలింగయ్యకు. దీని వల్ల భాగయ్య గారికి జీవితం దాని తాలూకా విలువలపై అపార నమ్మకం ఉందని అవగతం అవుతుంది.
వీరు మరాఠి భాష నుండి తెలుగు చేసిన గ్రంథాలు వీరిని అనువాదకులుగా నిలబెట్టాయి. భాగయ్యగారు ‘వీరదవళ’ అనే నవలను కూడా రాశారు. దాసబోధ గ్రంథంలో ఆధ్యాత్మిక వివరాలను అందించారు. కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు కూడా రాశారు. భజనలు, కీర్తనలు రాశారు. సామాజిక స్పృహతో రజాకార్ల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో చైతన్య గీతాలను రాశారు. వీరు ‘రాజలింగ శతకాన్ని’ కూడా రాసి శతక కర్తలయ్యారు. భాగయ్య గారు తమ సాహిత్యాన్నంతా ప్రజాప్రయోజనానికే ఉపయోగించారు. డబ్బు సంపాదించినా అంతకంటే దానాలు ఎక్కువ చేశారు. వీరి రచనా అంతర్యం గమనిస్తే పుట్టిన నేల, ప్రాంతం, భాష, సంస్కృతులు నవాబుల పాలనలో అంతరించి పోకుండా వాటిని సుస్థిరం చేసి రాబోయే తరాలకు అందివ్వాలనే లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది.


భాగయ్యగారు తమ యక్షగానాల్లో దేశీ చందస్సులను ప్రయోగించారు. వృత్తాలను యక్షగానాల్లో చందోబద్ధంగా రచించారు. సీసం, కందం, తేటగీతి, పంచ చామరాలను రచించారు.
వీరి ‘నలదమయంతి’ యక్షగానంలో చంపకమాల వృత్త పద్యాన్ని తేలికగా రచించారు. భాష విషయంలో సరళ గ్రాంథికానికి పెద్ద పీఠ వేశారు. పాత్రోచిత సంభాషణలతో పాటు అన్య దేశ్యాలను ప్రయోగించారు. వారి యక్షగానాలలో దాదాపు అర్థాలంకారాలను ప్రయోగిస్తూనే, ఒకే పద్యంలో రెండు, మూడు అలంకారాలను ప్రయోగించారు. కవిత్వ ప్రారంభంలో చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, కమల బంధం, కఠారి బంధం వంటి బంధ కవిత్వాలు రాశారు.
భాగయ్య గారు 1966 సంవత్సరం జనవరి 6వ తేదీ పుష్య శుద్ధ పౌర్ణమి నాడు పరమపదించారు. 62 సంవత్సరాలు జీవించిన భాగయ్య గారు జీవితంలో ఓడి సాహిత్యంలో గెలిచారు.


తెలంగాణ యక్షగాన పితామహునిగా వాసికెక్కి రాసిన గ్రంథాలను వాసిగా రచించిన చెర్విరాల భాగయ్య గారు ప్రాతఃస్మరణీయులు. వారి స్మరణార్చనకు ఈ పద్యం చిరు పుష్పం.


ఎవ్వని వాకిటి పాసరశారద ఒనరుగనిల్చి
సాహిత్య సంపదలందజేసె
ఎవ్వని కీర్తినివ్వటిల్లెడుచూడ్కి
మానితసంపదలీశుచుండు
ఎవ్వాని గుణలత డువారీసుల
కడపటికొండపై తెగయబ్రాకు
ఎవ్వని కలముబలముకల్పవృక్షంపై
తెలంగాణ నేలయక్షగానం ఫలములొసగి
అతడు భూరిజ్ఞాన ప్రకాశవిహాయస
ఆధ్యాత్మిక స్థితి ప్రజ్ఞ పరమహంస
ఆనంద ప్రదాత ఆత్మ గౌరవ సుప్రభాస
అతడెచెర్విరాల వంశధీమణి భాగయ్య
నార్సుసన్నుతించెదన్‍


-డా।। నోరి రాజేశ్వరరావ్‍
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి )

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *