బహుళ అస్తిత్వ స్వప్నం అఫ్సర్‍ కవిత్వం

అఫ్సర్‍ ‘‘రక్త స్పర్శ’’ ఇచ్చిన కవి. అచ్చులోని ఆధారం కోసమైతే ‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది’ అని హిందీ విప్లవ కవి సర్వేశ్వర దయాళ్‍ సక్సేనా గురించి రాసిన ఎలిజీ తొలి వాక్యం. కన్నీటి కాళ్లు, గతంచెక్కిళ్లు, అగ్ని చూపులు, చిర్నవ్వుల పక్షులు, అశాంతి స్వప్నాలు, రూధి రాశ్రువులు, కలల గాలి పటాలు, ఆవేదనా కెరటాలు, యాసిడ్‍ వెకిలి నవ్వులు, రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నాలు, కలల బిడ్డ మృత రూపాలు, కలలు తెగిపడ్డ చప్పుడు లాంటి సరికొత్త అభివ్యక్తతో…
‘‘కలల పచ్చలారక ముందే
నికృష్ట వాస్తవాల క్రూరత్వానికి నలిగిపోతూ
కాలం దింపిన మేకుల బాధని’’
అనువదించే ప్రయత్నం చేశాడు ఆ రక్త స్పర్శ నాటికే
‘‘ఇప్పుడిప్పుడే నన్నేమీ అడగకు
నేనింకా జీవితం నుంచి
సమాధానం రాబట్టు కోవాలి
నేనింకా సందేహం నుంచి
తెల్లగా తేరుకోవాలి
నేనింకా సూర్యుడి నీడలోకి
స్పూర్తితో నడిచి రావాలి
ప్రస్తుతానికి నేనొక ప్రశ్నని!
నేనింకా వెలగని తూర్పుని
రూపుదిద్దుకుంటున్న మార్పుని’’
అని ప్రకటించాడు. తన అస్తిత్వం, తన స్పృహ, తన చైతన్యం. ఎందుకోసం ఉన్నామో దశలో తేల్చుకోవటం. ఏ కవికైనా అంత తేలిక కాదు. తన చేతిలో కవిత్వం అనే ఆయుధం ఉంది. కానీ, ‘‘విరిగి ముక్కలైపోతున్న కలలాంటి వాస్తవం’’ కూడా అఫ్సర్‍ ముందు విశాలంగా పరచుకొని ఉంది. ఈ భంగపడ్డ స్వప్నాలను, కలల ముక్కలను అతికించటం ఎలాగో రక్త స్పర్శ నాటికి ఆతరానికి బోధపడలేదు. ఒక ప్రజాస్వామిక స్థలం ఇంకా ఆవిష్కృతం కానీ స్థితి నుంచి’ అనధికార శాసనకర్త’గా తనని తాను నమ్ముకుని బయలు దేరిన కవికి ‘బెంగతో వెనుదిరిగే నిరాశ కాళ్లు’ కనిపించడంలో వింతేమీ లేదు. రక్త స్పర్శలు మనకు ఇస్మాయిల్‍, మో, బైరాడి అజంతాల ఛాయ, తిలక్‍ ఆవేదనల నీడ కనిపిస్తుంది. బైరాగి అంతు తెలియని ఆవేదన, మో అధిరూపకం, అజంతా ఆందోళన. ఇస్మాయిల్‍ అనుభవప్రకటన చిత్రంగా బ్లెండ్‍ అయ్యాయి. ‘ఇవాళ’ లోకి వచ్చేటప్పటికి ‘నేనే ఒక సమూహం’ అని గుర్తించటమే కాదు ప్రకటించనూ గలిగాడు. తాను సమాజంలోకి నిర్జించుకున్న గడప మౌనంగా పగిలిపోయిందనీ గుర్తించాడు కాబట్టే..
‘‘నేను వెయ్యిముక్కలుగా
నీలోకి నీలోకి నీలోకి చీలిపోతాను
మాటలు నవ్వులుగా
తడిసి బరువెక్కిన కల్లుగా
కన్నీళ్లుగా
అంగాంగం నేను నా అస్తిత్వాన్ని కాల్చుకుంటూ
పోతాను’’
అని అనగలిగాడు. జన సముద్రాల్లోనే తనని తాను వెతుకున్నారు. అయితే అఫ్సర్‍ కల గురించి కలవరించటం మానలేదు. కలల్ని పాడబోతనా / నా గొంతు మీద నిజంగాట్లు పడ్తాయి’’ ఆ తరువాత అఫ్సర్‍ ‘ అద్దంలో నెత్తుటి మరకల’ను గురించి పాడాడు. యానాం వేమనలను గురించి రాశాను. గుర్తింపు రాజకీయ ఉద్యమ కవిత్వానికి తానుగా చేయవలసిన దోహదం చేశాడు. విశ్వాసాలు, నమ్మకాలు గాయపడ్డప్పుడు అఫ్సర్‍ మాట్లాడాల్సినవి మాట్లాడాడు.
‘‘గొంతులన్నీ ఒకే రాగంలోకి విరుగుతున్నప్పుడు
గుండెలన్నీ ఒకే స్వప్నంలోకి కరుగుతున్నప్పుడు
ఎవరూ ఎవరిలానూవుండరు
అందరూ అందరిలానే వుంటారు.
ఎవరూ ఎవరికీవుండరు
అన్నీ గొడలే
మాటలూ, మేనిఫెస్టోలూ, రాజ్యలూ, రాజ్యాంగాలూ
అన్నీ జీవన సముద్రం మీద పతనమయ్యేఓడలే’’ అని నిర్దారించాడు.
‘‘మరణం కడుపులోంచి పుట్టిన యుద్దం నా కవిత్వం
మరణిచలేకపోవడమే కవిత్వం’’
అని నినదిస్తున్నాడు. వలస, ఊరి చివర, ఇంటివైపులోని కవితలు తెలంగాణ అస్తిత్వంతో మిళితమై గ్లోబాలిటీసీ గురించి నిరంతరం ఆలపించే స్వాప్నక గతమే అఫ్సర్‍ కవిత్వం.

సీతారాం, 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *