వాసన


ఒక్కమాట చాలు
వాసన పసికట్టడానికి.
అది అవసరమో
ఆప్యాయతో
ఆనందమో
అవ్యాజమో
చప్పున స్ఫురిస్తుంది.

పరిమళం పువ్వులనుంచే రాకపోవచ్చు
ఆకాశం నుండి రాలే వాన చినుకులు
భూమిని ముద్దుపెట్టుకునేటప్పుడు
లేచే మృత్తికాసౌరభం కావచ్చు,
తోటంతా ఉక్కిరిబిక్కిరౌతూ
సమిష్టి భావనలు నిండిపోవచ్చు
కాని ఇవేవీ కావు.

అది రింగ్‍టోనో
ఎస్‍. ఎం. ఎస్సో
వాట్సాపో
చివరికి ఈ మెయిలైనా కావచ్చు
నీటిబొట్టు లా రాలే శబ్దానికి
ఒక స్మరణ మేల్కోంటుంది.

ఏమి రాయకుండానే
తెల్లకాగితానికి కలలుంటాయి
అక్షరాలకు ధ్వనులే ఒక వాసన

ఎవరిదో పొడ గడపలోంచి
లోపలికి అడుగుపెట్టగానే
తెలిసిపోయే అపరిచిత సమీరస్పర్శ
ఘ్రాణేంద్రియానికి అందేది కాదు
ప్రాణ సర్వస్వానికి తెలిసేది కాదు.
సమస్త వాసనాధురీణ జగుత్తులో
కాస్త కాస్త దేనికోసమో అలమటించిపోతున్నాను
బహుశా అది
మనిషి వాసన కావచ్చు.

  • డా. ఎన్‍. గోపి,
    ఎ : 040-27037585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *