సాహిల్‍ ఎందుకు రావాలి?!

 ‘‘ఒక మనిషిని కల కననివ్వకపోవడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష’’ అన్నది ‘‘సాహిల్‍ వస్తాడు’’ కథలు చదివిన తరువాత టక్కున గుర్తుకు వచ్చిన మాట. ఆ కల కనలేని వారే ఈ దేశ కుల,మత బాధిత సమూహాలు. ‘‘సామూహిక అభద్రత’’ అనేది ఇవాళ ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ముఖ్యమైంది. బీఫ్‍ బ్యాన్లు, ఘర్‍ వాపసీలుస్కృతిక స్వేచ్ఛ అడుగంటిపోయి నిర్ధాక్షిణ్యంగా అధికార మతానికి లొంగి బతకాల్సిన అనివార్యత సృజించబడుతున్నది. మతం ఒక కలహకారణంగా మిగిలిపోయి ఒక రోజూవారి హింసలో ఈ దేశంలోని ముస్లిములను, దళితులను బలిపశువులుగా మారుస్తున్నది. ఇలాంటి సంధి కాలంలో వచ్చిన కథా సంపుటి ‘సాహిల్‍ వస్తాడు’.


సమస్యను సర్కిల్‍లో ఉండి చూడడం వేరు. సర్కిల్‍ బయటి ఉండి అర్థం చేసుకోవడం వేరు. ఇందులో ఈ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి రచయిత దేశీయ ముస్లింగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలైతే, రెండవది అంతర్జాతీయ సమాజంలో ముస్లిముల పట్ల ఎలాంటి వివక్షత ఉందో, అలాగే తాను పుట్టిన ఊరును విడిచిన తరువాత కొనసాగుతున్న కనిపించని హింస ఎంత దారుణమైందో స్వహానుభవంతో చెప్పే గొంతుక మరొకటి.


ఈ కథల నిండా దు:ఖమున్నది. వ్యక్తం చేయలేని నొప్పి ఉంది. మన చుట్టూనే గిరిగీయ బడ్డ వెలివేత తాలూకు శకలాలు ఉన్నాయి. కారుతున్న నెత్తుటి గాయాల నొప్పిని పంటి బిగువన ఒడిసి పట్టి, ఈ లోకాన్ని ఆలోచించమని చెప్పే పోరాటగొంతుక ఉంది. నిద్ర పోతున్న తన జాతిని చూసి చలించి పోయి బాధపడ్డతనము నుండి మళ్లీ తన శక్తినంతా కూడదీసుకొని సమూహ ప్రతినిధిగా ఉద్యమించే తనముంది. ఈ వెలివేతకు బాధ్యులైన వారినే కాదు, సాటి బాధిత సమూహాలను కూడా ఆలోచించి సమాధానం చెప్పమనే అప్పీలు ఉంది. అందుకే ఇవి రాజకీయ కథలు. వీటికి స్పష్టమైన సామాజిక ప్రయోజనం ఉంది. నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన ఒక కవి, సామాజిక అవసరంగా కథ రాస్తే ఎలా ఉంటుందో తెలిపే తీరు ఉంది. తెలుగు సాహిత్యంలో నలభై యేళ్లుగా కొనసాగిన అస్తిత్వ ప్రవాహ గానాన్ని మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం ఈ కథల్లో ఉంది. ‘‘నువ్‍ మనిషివైతే, నీ స్వేచ్ఛను నువ్వే సంపాదించకొ’’మ్మని మాల్కమ్‍ ఎక్స్ చెప్పినట్టు ఇవి స్వేచ్ఛను కోరుకుంటున్న మనిషి కథలివి. ఏ కథను తీసుకున్న అందులో నలిగిపోతున్న జిందగీల ఆక్రందన మన స్ఫురణలోకి వస్తుంది.


తీవ్రవాదం పేరుతో అమాయక ముస్లిములను మట్టుపెట్టే దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన కథ ‘‘సాహిల్‍ వస్తాడు’’. ఎక్కడ బాంబు పేలినా దాని శకలాలు ముస్లిం గల్లీల మీద అనుమానాల రూపంలో నిందలుగా వచ్చి పడతాయి. ఏ మాత్రం సంబంధం లేని ముస్లిములను నిర్ధాక్షిణ్యంగా తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం, మతం ముసుగు తొడుక్కున హిందూ రాజ్యం అధికారికంగా చేస్తున్న కుట్ర. చట్టాలు, కోర్టులు శాంతి భద్రతల ముసుగులో ఒక మతం మొత్తాన్ని దోషులుగా తేల్చే దమననీతికి తార్కాణం. అత్యంత హృద్యంగా సాగిన సాహిల్‍ వస్తాడు కథనం మనకు తెలియని మరో ఆవలి తీరాన్ని పరిచయం చేస్తుంది. కథ ముగింపులో రెండు కన్నీటి బొట్ల రాల్చకుండా ఉండలేని స్థితికి నెట్టివేస్తుంది.


ఇది బాధిత వేదన. ఇది పీడిత ఆవేదన. సరికొత్త పంథాలో ముస్లిమేతర గొంతుకతో కథను చెప్పిన తీరు పాఠకున్ని కన్విన్స్ చేస్తుంది. ఈ శతాబ్దపు ముస్లిం కన్నీటి విషాదగాథకు అద్ధం పట్టిన కథ ఇది. ఇది వర్తమాన సామాజిక సంక్షోభానికి సజీవ సాక్ష్యమైన కథాంశం. దేశంలో ఎక్కడ తీవ్రవాద కదలికల ఆనవాళ్ళు కనిపించినా హైదరాబాద్‍ పాతబస్తీలో కొంతమంది యువకులు మాయం చేయబడతారు. ఇంటరాగేషన్‍ పేరుతో పేలుళ్లతో సంబంధం లేని యూత్‍ ను పోలీసు వ్యవస్థ టార్గెట్‍ చేస్తుంది. చేయని నేరం మోపి, ఒప్పుకునే వరకు టార్చర్‍ పెడుతుంది. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి కూడా. పోలీసు స్టేషన్లలో ఇచ్చిన కంప్లెయింట్లు అలాగే ఉన్నాయిగాని సాహిల్‍ లాగే, తిరిగిరాని కొడుకుల కోసం వారి తల్లిదండ్రులు ఇంకా పోలీసు స్టేషన్ల చుట్టూ దక్కని న్యాయం కోసం వెతుకులాడుతూనే
ఉన్నారు.


కవితాశిల్పంతో సాగిన కథ ఇది. ముస్లిం జీవితాలతో పెనవేసుకున్న గజల్‍, ముషాయిరా, ఛాయ్‍ సంస్కృతిని కథకుడు అద్భుతంగా కథీకరించాడు. రచయిత కవి కూడా కావడం వల్లనే ఈ శిల్పం సాధ్యమయ్యింది. కథలో వాడిన భాష కూడా కవిత్వ భాషే. ఒకలాంటి పెయిన్‍ ను పలికించడానికి ఈ భాష బాగా పనికి వచ్చింది. అలాగని ఎక్కడ కథకునిలోని కవి డామినేట్‍ చేయడు. ఇదే కథను మరో తీరుగా చెప్తే కథ తేలిపోయే ప్రమాదం పొంచి
ఉంది.
హిందూమతంలో హిందుత్వ జొరబడ్డ తరువాత భారతదేశ చిత్రపటం మారుతోంది. మన చుట్టే ఉన్న మనుషుల మధ్య అనుమానాలు తలెత్తేలా అవమానిస్తున్నది. భారతదేశంలో ముస్లిములు జనాభా అధికంగా ఉండే నగరాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాలుగా కలిసి అన్నదమ్ముల్లా బ్రతికిన ఆత్మీయతలన్నీ గతంగా మారాయి. దేశ విభజన తర్వాత మతం వైరస్‍ గా మారింది. అది బాబ్రీ మసీదు విధ్వంసం నాటికి ముదిరింది. గుజరాత్‍ అల్లర్లతో వికృతరూపం దాల్చింది. దాని ప్రతిఫలనాలనే మనం ఇవాళ అనుభవిస్తున్నాము. మతం తాలూకు విషబీజాలను పసి వయసు స్థాయి నుండే ‘నాటే కుట్ర’ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఊళ్లకు ఊళ్లు ఇవాళ రెండుగా విడిపోతూ మనుషులమనే విషయాన్ని మరిచిపోయి, మతాలుగా కలహించుకుంటున్నారు. ఈ దారుణాన్ని కళ్లకు కట్టిన కథ ‘‘చమ్కీపూల గుర్రం’’. చాలా సీరియస్‍ విషయాన్ని కథకుడు చిన్న గుర్రపు బొమ్మతో, ఇద్దరు పసిపిల్లల స్నేహంతో పాఠకులకు పట్టించిన తీరు ఎవ్వరినైనా ఆలోచింపజేస్తుంది. ఒకప్పటి మత సామరస్యం ఇవాళ ఎందుకు కొరవడుతున్నదో ఆలోచించాల్సిన ఆవశ్యకతను చర్చకు పెట్టింది ఈ కథ. కథ చాలా చిన్నదే. కానీ, ఎంచుకున్న ఇతివృత్తం తాలూకు సంఘర్షణ మాత్రం చాలా విస్త•తమైంది. చాలా హాయిగా సాగే కథనం ముగింపుకు చేరే సరికి ఒక కుదుపుకు గురిచేస్తుంది. మానసిక అంత: ప్రపంచాల్ని రగలిస్తుంది. ఎక్కడి నుండి మొదలైన పయనం ఎక్కడి చేరుకున్నదనే ఆవేదన కలిగిస్తుంది. కులానికి ఇవాళ అతీతమైన జాగా లేనట్టే, మత ఉన్మాదాలకు తావు లేని స్పేస్‍ లేకుండా పోతున్న కల్లోలాన్ని కండ్లముందుంచింది ఈ కథ.


ఒక జాతిని తమ మాతృభాషకు, తమదైన సంస్కృతికి దూరం చేయడం దారుణమైన విషయం. ముస్లిములు అయి ఉండి తమ భాషకు దూరమై పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ముస్లిములు ఇవాళ అనేకమంది తారసపడుతున్నారు. తాము తమ భాషలో మాట్లాడితే ఎక్కడ తమ మతం బయటపడుతుందోననే అభద్రతా భావంలోకి ఏనాడో నెట్టివేయబడ్డారు. అందుకే క్రమంగా తెలుగు మాత్రమే మాట్లాడే ముస్లిముల సంఖ్య పెరుగుతున్నది. ఈ దుస్థితి ఏ సాంస్కృతిక ఆధిపత్యాల నుండి ఆపాదించబడుతున్నదో బహిరంగ రహస్యమే. అందుకే ప్రసిద్ధ భాషా శాస్త్రవేత నోమ్‍ ఛామ్‍ స్కీ భాషా సంస్కృతులు లేని జాతులు అంతరిస్తాయన్నాడు. ఈ నేపథ్యంతో అఫ్సర్‍ రాసిన కథే ‘‘తెలంగీ పత్తా’’.


ఈ కథలో తన భాషను తానే మరిచిపోయి, తన అస్తిత్వాన్ని తానే విస్మరించి జీవిస్తూ, నిత్యం అభద్రతలో బతికే తీరు పాఠకున్ని అంతరంగాన్ని కుదిపేస్తుంది. దేశవిభజన రాజకీయం ఒక సమూహం మొత్తాన్ని అభద్రతలో పడేసిన తీరుకు ఈ కథ ఒక నిదర్శనం. ఇప్పటికీ ప్రతీ ముస్లిమునూ పరాయి దేశస్తునిగా చూసే దృష్టి ఒకటి బలంగా మన సమాజంలో ఉంది. పాకిస్తాన్‍ బూచీని చూపిస్తూ వేధించే రాక్షస క్రీడ నిత్యకృత్యంగా మారింది. అసలు ఇండియాలో ఉన్న ముస్లిముల్లో అత్యధికశాతం జనాభా ఇక్కడి వారే. ముస్లిం రాజుల పాలనలో అవకాశాల కోసమో, ఆత్మగౌరవం కోసమో ఇస్లామును స్వీకరించింది బహుజనులే. ముఖ్యంగా ఇక్కడి ఎస్సీలు, బీసీలే ఇస్లామును స్వీకరించి ముస్లిములుగా మారారు. దర్గా సంస్కతే ఇందుకు సాక్ష్యం. అందుకే ఇప్పటికీ దళిత, బహుజనుల ముఖాలు ఇండియన్‍ ముస్లిముల ముఖాలు ఒకే తీరుగా ఉంటాయన్నది ఆంత్రోపాలజికల్‍ సర్వేలు తేల్చిన విషయం. హిందుత్వవాదులు ఈ విషయాన్ని అంగీకరించరు. అందుకే ఇప్పుడు అంగీకరించాల్సింది బహుజన సమాజమే.


మతోన్మాద ముసుగులో ముంచుకొస్తున్న పెను ప్రమాదానికి ఒక విరుగుడుగా మెజారిటేరియనిజాన్ని తిరగేసి చూడాలి. దళితుల నుదుటన అంటరానితనమనే రేఖను గీసిన హిందూయిజమే మతస్థులుగా ముస్లిములను మైనారిటీలన్నది. అదే ముస్లిములు బహుజనులతో జతకూడి అగ్రవర్ణహిందువులను మైనారిటీలను చేయడమే ఇవాళ బహుజనుల ముందున్న ఎజెండా. నిత్యం అభద్రతలో బ్రతుకుతున్న ముస్లిములకు భరోసా కావాలి. మాకేమైనా అయితే ఈ దేశంలోని బహుజనులు అండగా నిలబడుతారన్న ధైర్యాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇవ్వాలి.


సచార్‍ కమిటీ రిపోర్ట్ ప్రకారం దేశంలో అత్యంత దయనీయమైన స్థితిలో బతుకుతున్న సమూహం ముస్లిములేనని తేల్చిచెప్పింది. ‘దళితుల కంటే కూడా’ అని మరో మాటను కూడా పేర్కొన్నది. ఈ మాట దళితేతర సమాజానికి అర్థం కాకపోవచ్చుగానీ దళిత సమాజానికి మాత్రం అర్థం అయ్యే అవకాశం ఉంది. కారణం వీరి మధ్య దగ్గరితనమనే బంధం ఉంది. ఏ పల్లెను చూసినా, పట్టణాన్ని చూసిన అక్కడ దళితుల ఇండ్లకు అతి సమీపంలోనే ముస్లింముల ఇండ్లు ఉంటాయి. ఈ రెండు సమూహాల్లో ఉండే పేదరికం, దు:ఖానికి తోడు ప్రస్తుత అభద్రత తోడయ్యింది. మతం పేర జరగుతున్న దాడుల్లో గడిచిన ఐదేండ్ల కాలంలో అత్యంత ఎక్కువగా దాడులకు గురైంది, అవుతున్నది దళితులూ, ముస్లిములే. అట్లా వణికిపోయే ముస్లిం జీవిత శకలాన్ని చూపించిన కథా ‘ధేడీ’. మూడువేల యేండ్లుగా అన్ని హక్కులకు దూరమైన దళితులు ఇప్పుడిప్పుడే ప్రగతి బాట పడుతున్నారు. దళితులకు కులకాసారమైన పల్లెలను వదిలి బాబా సాహెబ్‍ అంబేద్కర్‍ పట్టణాలకు తరలమన్నాడు. అట్లా చదువుకున్న తరమొకటి ఎదిగివచ్చి పట్నాల్లో జీవిస్తున్నది. అయినా సరే కులసర్పం పడగ నీడ మాత్రం తప్పడం లేదు. ఆధిపత్య అహంకారాల నడుమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం దళితులు నిత్యం పోరాటం చేయకతప్పని పరిస్థితి. దేడీ కథలో చెప్పులుకుట్టే మాదిగాయనతో కథానాయకునికి ఉన్న స్నేహం ఈ దేశ దళిత్‍ ముస్లిం ఐక్యతను సూచిస్తున్నది. కానీ, అది చైతన్యవంతమైన కథా నాయకుని పాత్ర. మరి అదే కథానాయకునికి భార్య, తల్లి మాత్రం మాదిగబుద్దు లొచ్చినయి అని తిడుతుంటారు. అంటే వారిలో సైతం ఈ హిందూ అగ్రవర్ణ సమాజం అందించిన చూపు ఒకటి చేరింది. అందువల్లే వారు కూడా దళితులను చీదరించుకున్నారు.


ఇది వాస్తవానికి మన సమాజంలో కూడా ఉంది. బాధిత సమూహాలు తోటి బాధిత సమూహం పట్ల ఎలాంటి కనెసెర్న్ ను చూపించకుండా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఒక చట్రాన్ని అడ్డంగా పెట్టింది. మతం కారణంగా నలిగిపోయేవారు, కులం కారణంగా బాధింపబడుతున్నవారిని కలుపుకుపోవాలి. వారి మధ్య ఒక చారిత్రక స్నేహం అవసరముంది. అది కథకుడు చాలా జాగ్రత్తగా సంకేతించాడు. ఒకవైపు ముస్లిం జీవిత దైన్యాన్ని చెబుతూనే తాను మానవీయ కోణంలో దళితునితో స్నేహం చేసే తీరు ఇవాళ్టి చారిత్రక అవసరం.


అందుకే ఈ కథలు అందరికన్నా ఎక్కువగా బాధితులకు అర్థంమవుతాయి. బాధితేతరులకు ఇవి కేవలం కథలు మాత్రమే. కానీ, బాధిత సమూహాలకు మాత్రం ఇవి కేవల కథలు మాత్రమేకాదు. తమ జీవిత సంఘర్షణ తాలూకు నొప్పికి, నిరంతర వేదనలకు కళాత్మక వ్యక్తీకరణలు. మానని గాయాల తడి స్పర్శలు.
‘‘మరణమేమి పెద్ద విషాదం కాదు బతికున్నప్పుడు లోలోపల మరణిస్తూ జీవించడమే అసలు విషాదం’’. ఆ విషాదాన్ని ఇవాళ ముస్లిం సమాజం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిత్యం ఎదుర్కుంటున్నది. ఈ కథల నేపథ్యాన్ని విశ్లేషిస్తూ కథారచయిత అనేక ప్రశ్నల్ని సమాజం ముందుంచాడు. అందులో ఒకటి… 1992 తరువాత మాత్రమే మత ద్వేషానికి బీజాలు ఎట్లా, ఎందుకు పడ్డాయి? ఈ ఆవేదన నుంచే ‘గోరీమా’ కథ పుట్టింది. మతమే రాజ్యంగా మారాలన్న కుట్ర నుంచి దేశంలో మత రాజకీయల వేగం పెరిగింది. అది దురాక్రమణలు, దాడుల వరకూ చేరింది. ఈ కలత చెందిన తనమే కవిని, సామాజిక ఆలోచనాపరున్ని కథలవైపు నడిపింది. సమకాలీన ముస్లిం రాజకీయ వాస్తవికతను చర్చకు పెట్టడం వెనకాల, రచయితకు స్పష్టమైన రాజకీయ దృక్పథం ఉంది. ఏ ఏ చారిత్రక మలుపులు ముస్లిం జీవితాలను ప్రమాదం అంచుల్లోకి నెట్టాయనే ఎరుక ఉంది. ఆ మలుపుల్లో దాగిన కుట్రలను చెప్పకపోతే తాను సృజనకారునిగానే కాదు, మనిషిగానూ విఫలమైనట్టేనన్న అంకితభావమే ఈ నెత్తురసొంటి కథలకు ప్రాణం పోసింది.


ఏ వస్తువును ఎంచుకున్నా సరే, దానిని లోతుల్లోకి వెళ్లి కథను నడిపిన తీరు పాఠకున్ని ఆలోచనలో పడేస్తుంది. కథ ముగిసే సరికి పాఠకుడు ఆవలితీరం గురించి ఇంతకాలం తెలియని జీవితాన్ని తెలుసుకుంటాడు. ఈ కథలు చదివాక ముస్లిం సమాజం పట్ల అప్పటి వరకూ ఉన్న దృష్టి మారిపోయేలా చేయడమే ఈ కథల విజయం. ఎంతటి దుర్భరమైన స్థితిలో ముస్లిములు బతుకుతున్నారో మన చేయిపట్టుకొని తీసుకుపోయి చూపిస్తాడు కథకుడు. చూపించడమే కాదు, దీనికి కారకులు ఎవరో చెప్పమంటాడు. అలాంటి అనేక ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తాడు.


అందుకే ఈ కథల్లో వినిపించే స్వరం ఈ దేశంలోని బాధిత ముస్లిం ప్రజానీకానిది. అది ఒక పాయగా మొదలై ప్రవాహ ఉధృతిని పెంచుకొని, చిక్కబడడం వెనుక అంతులేని ఆవేదన ఉంది. రచయితకు తన అస్తిత్వానికి సంబంధించిన బాధ మాత్రమే కాదు, తోటి బాధిత సమూహాల దు:ఖమూ తెలుసు. వాటి మూలాలు తెలుసు. అందుకే ముస్లిం సమాజంలోని పేదరికాన్ని మాత్రమే కాదు, స్త్రీల కన్నీటిని కూడా కథల్లో జాగ్రత్తగా చిత్రించాడు. ప్రశ్నలు వేయడం మాత్రమే అస్తిత్వవాదాలు చేస్తాయనే విమర్శ ఉంది. ఈ కథలు ఆ పరిధిని బద్ధలు కొట్టి, సమాధానాలు కూడా వెతికి చూపెడుతున్నది. నాలుగు దశాబ్దాల అస్తిత్వ సాహిత్య గమనం మరింత పదునెక్కతున్న దశకు ఈ కథలు ఒక దాఖలా. కాషాయ, ఆకుపచ్చ వర్ణాలు దాటి, మనిషి వర్ణాన్ని చేరుకోవడమే ఈ కథల లక్ష్యం. అమానవీయత సాధరణీకరించ బడుతున్న ప్రస్తుత ఆధిపత్య శక్తుల అరాచక సందర్భంలో అవసరమైన కథలివి.


ముస్లిం జీవితాల విషాద చీకటిని అక్షరాలకెత్తి ఒక చర్చను లేవనెత్తి ఈ కథలు మరింత కన్‍స్ట్రక్టివ్‍ క్రిటిసిజాన్ని డిమాండ్‍ చేస్తున్నాయి. మతాధిపత్య శక్తుల వికృత రూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. బాధితుల దైన్యాన్ని, పోరాట ఆవశ్యకతను ఎత్తిచూపుతున్నాయి. దళిత, బహుజనులనే కాదు, సమస్త బాధిత సమూహాలను మీరు ఎవరి వైపు నిలబడుతారో తేల్చుకోమంటున్నాయి.


డా.పసునూరి రవీందర్‍
ఎ : 77026 48825

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *