నిశ్శబ్దంలోకి
పెద్ద శూన్యంలోకి
ఎక్కడెక్కడికో
ఎందుకో
ఈ ప్రయాణం
అలుపుసొలుపు లెరగకుండా
అంతం లేకుండా.
నిర్మలత్వానికి
అంకురార్పణ చేసే
యజ్ఞ ఆహుతిలో
ఏ చోటని చెప్పను
ఏ సూత్రమని విప్పను
ఏ జపమాలలోని
అంకెల అక్షరాల
శూన్య ద్వారాల గుండా
ధగధగ మెరిసే
కిరీటాల తలలపై నుండి
దూసుక పోతోంటే
వింత వింత సంగీత ధ్వనులు
పుష్పవాసనలై
చుట్టు మూగుతూ ఉంటే
అదో విశ్వవాణీ
సంరంభంగా
ఉధృతంగా
ఉత్సాహం
కట్టలు తెంచుకోగా
ఓహఁ !
కాలం కళ్ళలో
వెలిగే లోకంలో
ఆకాశం అంచులతో
ఆడుకోవడానికి
గుండెల నిండా
గాలి పీల్చుకొని
గాలిపాటలు
పాడుకోవడానికి
నదీనదాలు
పర్వత శిఖరాలు
లోయలు
సెలయేర్లు
జలపాతాలు
మంచు శిఖరాలు
ఎడారుల ఈలపాటలు
అన్నీ ఆనంద సాగరాలే
అక్కడక్కడ
అసావేరి రాగాలు.
అడుగులో అడుగుపడి
నూతన సృష్టిలో
అన్నీ ఆనవాళ్ళకు ఆవల
ఒక పూర్తి వృత్తాకారానికి
నాలుగు కోణాలతో రాటుదేల్చి
వస్తే వస్తాను
మళ్ళీ మళ్ళీ
సుఖసంతోషాల గాలి పీల్చడానికి
గెంతడానికి
వరదలా ఉప్పొంగడానికి
సూర్యాస్తమయాల మధ్య
ఉయ్యాల లూగడానికి.
నా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా!
వాటిని ఎవరైనా గుర్తు పడ్తారా!
ఆనవాళ్ళు లేని నేలలో
నేలలాంటి ఆకాశంలో
ఆకాశంలాంటి అంతరంగంలో
విహరించేవాణ్ణి
అద్దమరాత్రి
గుడ్డలన్నీ విప్పేసి
నగ్నంగా
మంచు సముద్రంలో
గభీల్మని దూకుతాను
నా కళ్ళముందు
రక రకాల రంగులు
తేలి తేలి పారుతుంటాయి
రేఖలు పోటీపడి
పరిగెత్తుతుంటాయి.
సుఖం దుఃఖం
ఎప్పుడో ఏట్లో కొట్టుకపోయాయి
ఇక ఉన్నవి ఏమిటి?
ఒకే ఒక్కటి
అది చిరుమందహాసం
అది ఎప్పుడూ చెక్కుచెదరలేదు
మైనంతో కాదు
అది కంచుతో చెక్కబడింది.
కుటుంబం సమాజం
ఇవి చాలా చాలా
వాడి అరిగిపోయిన
పర్యాయపదాలు
వాయిస్తున్నప్పడి
వేళ్ళ నెత్తరు చిందే
మనోవీణ మోతకు
సప్త సముద్రాలు
పోటెత్తుతాయి.
ఆగి ఆగి మోగేది
జీవభాషనే కావొచ్చు
భాషలేని తనమూ ఉంది
నిశ్శబ్దంతో
నగీషీలు చెక్కబడ్డ
మంచుశిఖరం
అమాంతంగా నా మీదపడి
కౌగిలించుకుంటుంది
నాకస్సలు ఊపిరి సలపదు.
మంచూ కౌగిలించుకుంటుంది
మంటా కౌగిలించుకుంటుంది
గాలి గమ్మత్తుగా వంకర్లుతిరుగుతు
నా గమనాన్ని అడ్డుకుంటుంది
రమ్మన్నది రాదు
పొమ్మన్నది పోదు
రాకపోకలమధ్య
ఏదో వింత గూడు
దోబూచులాడుతుంది.
ఏమవుతుందో
తెలుసుకునేందుకు
ఒక్కసారిగా
బిగ్గరగా అరుస్తాను
విచిత్రం
అసలు శబ్దమే లేదు
రాగం లేదు
తానం లేదు
రుతువూ లేదు
క్రతువూ లేదు
ఉన్నది లేదు
లేనిది ఉన్నది.
ఇదే క్రమం
ఇదే పరంపర
ఇదే మార్గం
ఇదే మంత్రం
ఒకొక్క అడుగే పడనీ
ఒకొక్క కలనే
నరుక్కుంటూ వెళ్ళిన
వీధులు లేవు
దిక్కులు లేవు
పక్కలు లేవు
వేటి అవసరమే లేదు
అవసరం అన్నది
తన అస్థిత్వాన్నే కోల్పోయింది.
రంగు రుచి
వాసన
ఇవైనా ఉన్నాయా
ఇవన్నీ
నవ్వు తెప్పించే మాటలు
అసలు నవ్వులు పువ్వులు ఉంటేగా
ఒకే ఒక
చెక్కిన
చిరు మందహాసం
మాత్రం
మొఖంపై
పళయ తాండవం
చేస్తూ ఉంటుంది.
ఎన్నింటిని తప్పించుకుని
ఇంత దూరం వచ్చాను
కాని ఈ దూరం
తప్పించుకోకుండా ఉంది
అందీ అందనట్టుగా ఉంది
అందాల భరిణను పోలి ఉంది
అంగబలం అర్థబలం
బుద్ధిబలం
చక్కగా సర్ది
ట్రంకుపెట్టెలో
బంధింపబడి ఉన్నాయి
మరి ఇక ఉన్నదేమిటి?
వెయ్యి కాళ్ళ జెర్రి
ఎన్ని కాళ్ళు విరిగినా
ప్రయాణం ఆగదు
అవి మళ్ళీ మళ్ళీ
పుట్టుకు వస్తూనే ఉంటాయ్!
ఏదీ ఆగదు
ఏదీ స్థిరంగా ఉండదు
అస్థిరంగానూ ఉండదు
అంతా ఉండీలేనట్టు
కేకను
గాలిలోకి విసిరినట్టు
కేకా వినబడదు
గాలి సోకినట్టూ తెలియదు.
ప్రయణం
నడుస్తూనా
గెంతుతూనా
దొర్లుతూనా
ఎగుర్తూనా
కొట్టుకపోతూనా
ఎలా తెలుస్తుంది
అది తెలిస్తే
ఆ ముడివిప్పితే
అన్ని ముడులు విప్పిన్నట్టే
ఐనా
అన్నీ ఎందుకు తెలియాలి
తెలిసి చేసేదేమిటి?
తెలియకా చేసేది లేదు
‘తెలిసీ తెలియక’
అన్నదే సూత్రమై ఉంటుంది.
రారా
రాజా
రావా
ఏమైనావ్
ఎక్కడికెళ్ళావ్
కనిపించవా
ఇక ఎప్పుడూ కనిపించవా?
వినిపించనే వినిపించవా!
తీసెయ్
జ్ఞాపకాల తెరని తోసెయ్
అదుగో
యెనబోతులా
తెరలు తెరలుగా
దొర్లుతూ వస్తుంది
అది ఏమిటో?
అది నా పైనుండి వెళ్తుందా!
కింది నుండి వెళ్తుందా!!
లేక నన్ను చీల్చుకొని వెళ్తుందా!!!
ఐతే
దాన్ని చీల్చుకొని వెళ్ళే
శక్తి నాకుందా?
ఏమో?
ఏది తెల్సిందని
ఇది తెలియడానికి.
ఇసుర్రాయి తిరిగే చప్పుడు
పెరిగి పెరిగి ఇంకా పెరిగి
భువనభోంతరాలను
చుట్టేసింది
ఇంకా నాకేమీ కనబడదు
వినబడదు.
మళ్ళీ సద్దుమణుగుతుందా!
అసలేమణుగదా!!
అగమ్యగోచరం…
-బి. నరసింగరావు