వరువాత గట్లను ముట్టాలనే వేకువ తపనను
అర్థం చేసుకోకపోతే ఎట్లా
చీకటి సుడిగుండంలో చిక్కుకున్న శీతగాలిని
తెగ్గొట్టుకోకతప్పదుజి
దృశ్యాన్ని చూస్తున్న కళ్ళు
బుద్ధిని కోల్పోతే ఇంకేమన్నావుందా
వీస్తోంది కదా అని గాలిని
అసలు వడగట్టకపోతే మరణాన్ని పీలుస్తున్నట్లే
వెలుతురు ఎంత ఏకధాటిగా కాస్తున్నా
ఎక్కడన్న చీకటి మరకలున్నాయేమో చూసుకోవాలి కదా
నిఘంటువులోదే కదా శబ్దం అని
పుటం పెట్టకుండావాడితే
అర్థం… నెప్పులు పడేదేప్పుడూ…? అన్వయం
పురుడు పోసుకునేదేప్పుడూ….?
నిన్ను పడద్రోసే వాంఛా గర్తం
ఊరిస్తూనేవుంటుంది
నువ్వుకోరుకునే చంక మలుపు అంకపాళి
మధుకరుడులా మోహరిస్తూనేవుంటుంది
మన భ్రమే మన మనసుకు
ఉద్యమాల ఉద్యోగం- గిల్లుకోవాలి
మన నడకే మన గమ్యానికి
లక్ష్య సాధనం- అల్లుకోవాలి
అమృత కలశం వంటి
మబ్బుకూజాను ఆకాశం దాచుకున్నట్టు
నైతికాంశం విడమరిచే
ప్రాకృతిక ధర్మాన్ని పరిరక్షించుకోవాలి
ఎలాగోలా బ్రతకటంవేరు
తూర్పులో తొగరులా బ్రతకటంవేరు
తొలి వెలుతురు సంపుటిలోనే
తెలిమిన్నపాట అనే వజ్రగీతం.
- సాంధ్యశ్రీ
ఎ : 810689740