పాద ముద్రలు


చితి మంటల్లో దహించుకుపోతున్న తండ్రి శరీరం వైపు అభావంగా చూస్తూ నిలుచున్నది సుమతి. సుమతి.. ది వైస్‍ ప్రెసిడెంట్‍ ఆఫ్‍ ‘రీ డు’ కంపనీ.
‘రీ డు’ కంపనీ తన మొదటి ప్రయత్నం లోపలే అన్ని వేళలా మనుషులు కృతకృత్యులు కారనీ.. గమ్యాన్ని చేరడానికి మనిషి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలనీ.. అలసిపోవడమో.. పథభ్రష్టత పొందడమో, లక్ష్యం నుండి ప్రక్కకు తొలగి దారి మళ్ళి వెళ్ళిపోవడమో చేయకూడదనీ.. అసలు ఏ మనిషైనా జీవితాంతం ఎప్పుడూ విజయాలనే చవిచూడలేరనీ.. ప్రతి మనిషీ చాలాసార్లు ఓడిపోతూ.. కొద్దిసార్లు మాత్రమే గెలుస్తాడనీ తన క్లెయింట్స్కు చెబుతూ వాళ్ళకు వాస్తవ జీవిత సత్యాలను అవగతపరుస్తూంటుంది. ఇది మొదట వినడానికి చాలా విస్మరణీయ విషయంగా.. సిల్లీగా.. అప్రాధాన్య సంగతిగా అనిపించినా తర్వాత్తర్వాత చాలా మంది ఈ సత్యాన్ని గ్రహిస్తూ లక్ష్యాలను చేరుకోవడానికి తాము పదే పదే ప్రయత్నాలు చేసి ఓడిపోయిన అనుభవాలను పంచుకోడానికి ముందుకొస్తూ అర్థం చేసుకున్నారు. మనిషి లక్ష్యాలన్నీ పూర్తిగా భౌతికం కావనీ.. ఎన్నో అంతర్గత హృదయ సంబంధ విషయాలు కేవలం గెలుపు ఓటములకు సంబంధించినవి కావనీ.. చాలా వరకు మనిషి ‘అసలు తనకు ఏమిటి కావాలో.. దానిని మించి ఏమిటి వద్దో.. తాను దేనికోసం తనకు తెలియ కుండానే అనవసరంగా ప్రాకులాడ్తూ విలువైన జీవితాన్ని వృధా పర్చుకుంటున్నాడో.. తమ ‘రీ డు’ సాంగత్యంతో తెలుసు కుంటున్నప్పుడు సుమతి ఎంతో ఆనందించడం అనుభవరీత్యా అనుభూ తించింది.
నాన్న.. నరసింహమూర్తి చెప్పాడు పదే పదే ఒక్కగానొక్క కూతురైన తనకు.. ‘అమ్మా.. జీవితం మనిషికి దొరికిన అద్భుతమైన ఒక అవకాశం. దీన్ని అర్థవంతంగా.. నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించడం చేయగలిగితే అదే సార్థకత’ అని. ఆ మాటను విన్నప్పుడు.. ‘అవకాశం’, ‘సార్థకత’ అన్న పదాలు ఎంతో క్లిష్టంగా, కొత్తగా, చాలెంజింగ్‍గా అనిపించాయి సుమతికి.


నిజమే మనిషి నడక నేర్చుకోవడం సుళువైన అతి కష్టసాధ్యమైన పనే. నాన్న అన్నాడు ‘అధ్యయనం చేయి.. ఈ ప్రపంచాన్ని.. ఈ దేశాలను.. ఈ భిన్న సమాజాలను.. కుల మత వర్ణ జాతులతో సంఘర్షిస్తున్న అనేకానేక మానవ సమూహాలను.. చివరికి ఆ అధ్యయనాల, విశ్లేషణల వెలుగులో నిన్ను నువ్వు తెలుసుకో.
‘నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత.. జ్ఞాన సంపన్నుడవైన నీకు నీ సామాజిక బాధ్యతలు అవగతమౌతాయి.. అత్యంత విషాదమైన విషయమేమిటంటే.. ప్రపంచ వ్యాప్తంగా మనుషులు వ్యష్టిగా.. అంటే, తాను కేవలం తనకు మాత్రమే చెందిన వానిగా భావిస్తూ తన, తన భార్యా పిల్లల, తన కుటుంబీకుల సుఖ సంతోషాలే పరమావధిగా జీవిస్తూండడం. కాని ప్రధానంగా సంఘ జీవియైన మనిషి ఆ మూలమైన ప్రధాన విషయాన్ని విస్మరించి సామాజిక బాధ్యతను మరిచిపోవడం. సాటి మనుషుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ఎథికల్‍ లివింగ్‍.. నైతిక జీవితాన్ని సమిష్టిగా జీవించగలిగే విస్తృత దృష్టితో ముందుకు ఆచరణాత్మకంగా ముందుకు సాగేవాళ్ళు దినదినం అంతరించిపోతూండడం. ఈ విపరిణామం పోను పోనూ ఒక అదృశ్య రుగ్మతగా విస్తరించి మానవ సమాజాలు ఎవరికివారే.. యమునా తీరేగా విచ్ఛిన్నమైపోతాయి.’


ఎన్ని లోతైన విషయాలో నాన్న ప్రస్తావించింది. ఆయన చెప్పిన అవే విషయాలు.. వయసు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్తగా, వినూత్నంగా, ఇంకా ఇంకా విస్తృతంగా అర్థమయ్యేవి. శ్మశానం దాటి చాలా దూరమే వచ్చారు అందరూ. ఓ పది మందిదాకా. వెనక్కి తిరిగి చూచింది కాలుతున్న చితివైపు సుమతి. కళ్ళనిండా నీళ్ళు చిమ్ముకొచ్చాయి. వెంట నడుస్తున్న మహేంద్ర ఆమె అంతరిక దుఃఖవివశతను గ్రహించి.. ఒక అనునయింపు నిండిన చూపుతో స్పర్శించాడు. మిగతా అందరిలోనూ గాఢ మౌనమే.


కారు ఎక్కుతూండగా ‘సుమతీ.. ఒక సుదీర్ఘ అధ్యయనం తర్వాత తెలిసిన బహిరంగ రహస్యమేమిటంటే.. ఈ మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఏకైక సమస్య.. కుల మత జాడ్యం అని. 1947లో స్వాతంత్య్రాన్ని పొంది మన స్వంత రాజ్యాంగంలో దీన్ని ఒక సెక్యులర్‍ దేశంగా ప్రకటిస్తూ.. కాలక్రమంలో కులమత రహిత సమాజంగా తీర్చి దిద్దాలని సంకల్పించిన అప్పటి తరం .. క్రమంగా అంతరించి పోతూ.. ఇప్పుడు.. భారతదేశమంటే.. కేవలం కుల మత సంఘాలతో మాత్రమే గల్లీ గల్లీలో వర్థిల్లుతూ చీలికలు పేలికలై అన్ని రాజకీయ పార్టీలూ శాసిస్తున్నాయి. భారత ప్రథమ ప్రధాని జవహర్‍ లాల్‍ నెహ్రూ తనను ‘నాకు కులం లేదు’ అని ప్రకటించుకున్నాడు. కాని.. సామాన్య మానవులమైన మనం ఈ కుల మత వ్యవస్థతో ఎంత పోరాటం చేస్తున్నామో.. నీకు తెలుసు గదా. ‘అని మొన్నటి రాత్రి నాన్న చెప్పిన విషయం కోటి జ్ఞాపకాల తుఫాన్‍ను సంధించింది.జ్ఞాపకం- 1:
పదునైన నేలపై బీజాలు పడిన వేళ. జూన్‍ 12, 1961.
నరసింహమూర్తి తన ఒక్కగానొక్క కుమార్తె సుమతిని తీసుకుని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాడు. ఉపాధ్యాయుడతను. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివించి అందరికీ మార్గదర్శకులు కావాలని అతని నికర ఆలోచన. ఆయన చేతి వేలు పట్టుకుని.. చంకలో కొత్త పలకను పట్టుకుని సుమతి. చిన్నపిల్ల.
‘‘అడ్మిషన్‍ ఫాం నింపండి’’ అని గుమాస్తా ఒక కాగితాన్ని చేతిలో పెడ్తే.,
పేరు.. తండ్రి పేరు.. చిరునామా.. కులము.. మతము.. జాతీయత.. ఇట్లా కాలంస్‍.
నరసింహమూర్తి ‘కులము’ అన్న కాలం దగ్గర .. ఖాళీ గీత, ‘మతము’ అన్న కాలం దగ్గర .. మళ్ళీ ఒక ఖాళీ గీత పెట్టి ‘జాతీయత’ అని ఉన్నచోట ‘ భారతీయురాలు (ఇండియన్‍ )’ అని పూర్తి చేసి కింద సంరక్షకుని సంతకం చేసి ఇస్తే.. గుమాస్తా తీసుకోడు. కుల మతాల కాలం విధిగా నింపాలని వాదన. హెడ్మాస్టర్‍ ను కలిస్తే .. అతనూ అంతే. వితండ వాదన.
‘‘నా కూతురుకు కులం లేదు. ఆమెను ఒక ఇండియన్‍గా భావించి తీసుకోండి’’ అంటే.. ఉహూ వినడు.
విసుగొచ్చి ‘‘ఈ సెక్యులర్‍ దేశంలో ఈ కుల మతాల కాలంస్‍ తప్పనిసరిగా నింపాలని ఉన్న రూల్‍ చూపించండి’’ అని ప్రశ్నిస్తే.,
‘‘అవి నింపకున్నా ఫర్వాలేదు.. అడ్మిషన్‍ ఇవ్వొచ్చు అన్న రూల్‍ చూపించండి ‘‘ అని ఎదురు ప్రశ్న.
ఇక చేసేది లేక వెనుదిరిగి.. ఒక పోరాటం ప్రారంభం.


బయటికి వస్తున్నపుడు.. వీధిలో రెండు ప్రక్కలా చెంపలకు ‘వెలుగు నీడలు’ సినిమా పోస్టర్లను కట్టుకుని వెళ్తున్న జట్కా బండిలోనుండి గ్రాం ఫోన్‍ పాట వినబడ్తోంది ‘పాడవోయి భారతీయుడా’ పల్లవితో. ‘పదవీ వ్యామోహాలూ, కులమత భేదాలూ, భాషా ద్వేషాలూ చెలరేగే నేడు’ అని. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి పద్నాలుగు సంవత్సరాలే ఐంది. సెక్యులర్‍ రాజ్యమని రాసుకున్న రాజ్యాంగం సిరా ఆరనేలేదింకా. శీశ్రీ మహాశయా జోహార్లు.
నాన్న ఇక తహసిల్‍ కార్యాలయంలో.. అక్కడినుండి కలెక్టర్‍ ఆఫీస్‍ కు.. భారత రాజ్యాంగం తన 25- 28 అధికరణాల్లో ఇచ్చిన ‘ఫ్రీడం ఆఫ్‍ రిలిజియన్‍’ హక్కు కింద ‘నో కాస్ట్ నో రిలిజియన్‍ సర్టిఫికేట్‍ ’ఇవ్వమని. కాని వాళ్ళు ఇవ్వమని.
ఈ ప్రయత్నం చేస్తున్న నాన్నను చూచి అందరూ వింతగా చూడ్డం.. అవహేళన చేయడం.. అవమానించడం.. ‘ బయల్దేరాడయ్య దేశోద్ధారకుడు ‘ అని ఎకసక్కాలు .
పట్టు వదలని నాన్న చివరికి జిల్లా కోర్ట్.. అక్కడినుండి హై కోర్ట్ దాకా వెళ్ళి పదిహేను సంవత్సరాల తర్వాత పట్టువదలని నరసింహమూర్తిగా ‘నో క్యాస్ట్నో రిలిజియన్‍’ సర్టిఫికేట్‍ ను సాధించాడు. ఐతే ఎప్పుడూ దేశం గొడ్డుపోదు. ఈ పదిహేను సంవత్సరాల్లో నాన్న తనవంటి నాల్గు వందలమంది సామాజిక చైతన్యం గల వ్యక్తులనూ, కార్యకర్తలనూ తీర్చి దిద్దారు.


సుమతి పి.యు.సి అడ్మిషన్‍ కు వెళ్తే మళ్ళీ ఇదే ప్రతిబంధకం. నాన్న ఆ కోర్ట్ సర్టిఫికేట్‍ను చూపిస్తూ అధికారులను తిట్టడం.. ప్రతిసారీ ఒక సీన్‍. ఈ పట్టువదలని నాన్నకు ఈ పట్టింపేమిటి.. అని మొట్టమొదటిసారి సుమతి ఒక పౌరురాలిగా ఆలోచించింది. ఎందుకో ఆ క్షణం ఆమెకు ఆత్మగౌరవమూ, దయా, నిక్కచ్చితనం, నైతిక బాధ్యత కలిగిన నాన్నపై జాలీ, ప్రేమా, ప్రశంసా సమ్మిళితమై గర్వం కలిగింది. అప్పుడామె నాన్న పాదముద్రల కోసం వెదకడం ప్రారంభించింది.జ్ఞాపకం-2: ఆరోగ్యవంతమైన మొలక తప్పక ఎదిగి వృక్షమౌతుంది.
యూనివర్సిటీలోనే ప్రథమురాలిగా స్వర్ణ పథకాన్ని సాధించిన సుమతికి దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్ వేర్‍ కంపనీ ‘వైబ్రెంట్‍ మైండ్స్’లో ఇంజనీర్‍ గా ఉద్యోగం వచ్చినపుడు జాయినింగ్‍ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అభ్యంతరం లేవనెత్తారు హెచ్‍ ఆర్‍ డిపార్ట్ మెంట్‍. .. ‘నీ కులమేమిటో.. మతమేమిటో ‘తప్పక రాయాలని. ఇక తప్పలేదు సుమతికి మళ్ళీ పోరాటం చేయక.
నేరుగా హైకోర్ట్ను ఆశ్రయించి నాన్న తనను చేతి వ్రేలుపట్టుకుని ప్రభుత్వ పాఠశాలకు తీసుకుపోయిన దగ్గరినుండి ఈ లౌకిక దేశంలో ‘నాకు కులము లేదు మతము లేదు’ అని నెహ్రూ లాగనే ప్రకటించినందుకు పడ్డ కష్టాల గురించీ, అవమానాల గురించీ ఏకరువుపెట్టింది కాగితంపై. ధర్మాసనాన్ని ‘ రైట్‍ టు రిలిజియన్‍
ఉంటే.. రైట్‍ టు నాన్‍ రిలిజియన్‍ కూడా ఉంటుందికదా యువరానర్‍’అని ప్రశ్నించింది.
న్యాయమూర్తి.. సుమతి చేస్తున్న అలుపెరుగని పోరాటాన్ని ప్రశంసిస్తూ.. రాజ్యాంగబద్దమైన ఈ హక్కును ఉపయోగిస్తున్న పౌరులకు .. నిజానికి సమసమాజాన్ని స్వప్నిస్తున్న యువతరం ఒక ఆదర్శ మార్గంలో నడుస్తోంటే.. వాళ్ళకు దన్నుగా కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఈ అంశాన్ని ఒక ప్రధాన విషయంగా స్వీకరించి ఒక చట్టాన్ని తయారు చేయాలి’ అని మానవ వనరుల శాఖకు సలహా ఇచ్చింది.
ఐతే సుమతి ఈ దిశగా అనేకమంది సామాజిక స్పృహ ఉన్న వందలమంది యువతీ యువకులను చైతన్య పరుస్తూ.. ‘నో క్యాస్ట్ అండ్‍ నో రిలిజియన్‍ సొసైటీ’ని స్థాపించింది.. రాజకీయ నాయకులను సభలకు పిలిచి.. వాళ్ళ చేత సమాజం బాగుపడాలంటే మనుషులు ఈ కులమత భావనను విడనాడాలని బహిరంగంగా చెప్పించింది. మీడియాలో అనేక చర్చలను పెట్టించి రాజ్యాంగ హక్కులు.. సమసమాజ స్థాపన దిశగా ఒక బలమైన ఆలోచనను యువతరంపై సంధించింది.
సుమతికి తోడు మహేంద్ర చేరాడు సరిగ్గా అదే భావాలు కలిగిన యువకునిగా.
‘ఇక దీన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి విస్తృతపరుద్దాం’ అని తీర్మానించుకుని పిడికిలి బిగించారు.
సుదీర్ఘ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలైంది.జ్ఞాపకం -3: మానవులే మహనీయులు 11 ఏప్రిల్‍, 1982 జ్యోతిరావ్‍ పూలే జన్మదినం.
జీవితాంతం కృషి చేసిన కులరహిత సమాజ స్వాప్నికుడు, సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‍ పూలే జయంతి సందర్భంగా సుమతి, మహేంద్ర లు సృష్టించిన ‘రీ డు’ సాఫ్ట్ వేర్‍ సంస్థ భారీ ఎత్తున ఒక బహిరంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దానిక్కారణం సుమతే తే దానికి ఎం.డి కావడం. విజేత కావాలనుకుంటున్నవాడు ముందుగా తనను తాను ఆర్థికంగా, బలగం పరంగా సమర్థునిగా మలచుకోవాలె.
నిజానికి దుర్వ్యసనాలు ఎంత తొందరగా వ్యాపిస్తాయో.. మంచి కార్యక్రమాలుకూడా తగిన, సమర్థవంతుడైన నాయకుడుంటే అంతకన్నా వేగంగా ప్రజల్లోకి విస్తరిస్తాయి. గాంధీ నాయకత్వంలో బ్రిటిష్‍ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జాతీయోద్యమం అట్లాగే విస్తరించింది అప్పుడు. ‘ నో క్యాస్ట్ అండ్‍ నో రిలిజియన్‍ సొసైటీ ‘ యువకుల్లో ఒక మానియా ఐ విస్తరిస్తోంది. సుమతీ, మహేంద్రా యువకుల్లో రివర్‍ క్లీనింగ్‍, సేవ్‍ రాక్స్, ఇసుక మాఫియాలను అడ్డుకోవడం, ఎన్విరోన్‍ మెంటల్‍ ప్రొటెక్షన్‍ వంటి కార్యక్రమాలను గత రెండేండ్లుగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మంచి ప్రతిస్పంనద వస్తోంది అన్ని వర్గాల్లోనుండి.


ఆ రోజు.. సుమతికీ, మహేంద్రకూ పెళ్ళి. జ్యోతిరావ్‍ పూలే ‘సత్యశోధక మార్గం’లో ఏ వేదమంత్రాలూ, పురోహితులూ లేకుండా నిరాడంబరంగా స్నేహితుల మధ్య ‘గాంధీ’ పటం సాక్షిగా జరుగుతోంది కార్యక్రమం. పెళ్ళి ఖర్చులను ఆదా చేసి పదిహేను వందలమంది విద్యార్థులకు యూనిఫాంస్‍, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వేదికపై.. సుమతీ, మహేంద్రా తమ తమ పేర్లకు ముందూ, వెనుకా కులాలను సూచించే తగిలింపులను త్యజిస్తున్నట్టు ప్రకటించారు. ఇంటి పేరునూ కత్తిరించేశారు. తొడుగులూ, ముసుగులూ తొలుగుతున్నకొద్దీ మనుషులు పరిపూర్ణులౌతారని పెద్దలు చెప్పిన మాటలను ఉటంకించారు.


చివరగా సుమతి ఒక బృహత్‍ ప్రణాళికను ప్రకటించింది. ‘ఈ దేశం నుండి ప్రజలకు అత్యంత హానికారకమైన ప్లాస్టిక్‍ ఉపయోగాన్ని పూర్తిగా నిషేదించేదాకా విశ్రమించేది లేదని’ ప్లాస్టిక్‍ వినియోగం పై రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాటకాన్ని బట్టబయలు చేస్తూ.. ‘అసలు ప్లాస్టిక్‍ ఉత్పత్తి కేంద్రాలలోనే ప్లాస్టిక్‍ ను తయారు చేయడం నిషేదించాలని ప్రతిపాదించింది. ‘మేమైతే తయారుచేస్తాం, అమ్ముతాం.. కాని మీరు వాడకండి ‘ అనే నినాదం తప్పు. బూటకం. అసలు ప్రజలకూ, వ్యాపారస్తులకు ప్లాస్టిక్‍ సంచులూ, ఇతర ఐటంస్‍ అందకుండా, కంపనీలు తయార్‍ చేయకుండా నిషేదిస్తే.. ఈ ప్లాస్టిక్‍ భూతం మరుదినమే పారిపోతుందీ దేశం నుండి. దేశమంతా ఎక్కడ చూస్తే అక్కడ చెరువులు, కుంటలు, మున్సిపల్‍ మోరీలు, నదులు, రేవులు, కాలువలు అన్నీ ప్లాస్టిక్‍ వ్యర్థాలతో మురిగిపోతూ మునిగిపోతున్నాయి. ఇది ఎంత హానికారకమో ఇప్పుడర్థం కావట్లేదు జనానికి. కాని పెనుప్రమాదం ముంచుకొస్తోంది వేగంగా ‘ చెప్పుకుపోతూనే ఉంది సుమతి ఆవేశంగా.‘నో క్యాస్ట్ అండ్‍ నో రిలిజియన్‍ సొసైట’ ఢిల్లీ జంతర్‍ మంతర్‍ వద్ద వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన లక్షల మంది యువకులతో ఒక మెగా ర్యాలీని నిర్వహిస్తోంది.’
నినదిస్తున్నాయి లక్షల కంఠాలు.
‘నో క్యాస్ట్ అండ్‍ నో రిలిజియన్‍ తరానికి రాజ్యాంగ భద్రత.. రక్షణ కల్పించాలె.’
‘ప్రభుత్వాలు కుల సంఘాలకూ, మత సంస్థలకూ వంత పాడడం ఆపేయాలె’
‘దేశంలో ప్లాస్టిక్‍ ఉత్పత్తిని తక్షణం నిషేదించాలె.’
‘మీరు మాకు చేయూత నివ్వండి.. మేము ఈ దేశాన్ని
శుభ్రం చేస్తాం
‘యువత తలుచుకుంటే.. ఈ దేశ గమనం మారుతుంది. కలిసికట్టుగా ఆరోగ్యవంతమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మిద్దాం.’
నినాదాలు మిన్ను ముడ్తున్నాయి.
కొత్త రక్తం.. కొత్త గాలి.. కొత్త ఆలోచనలు.. కొత్త తరం ముంచుకొస్తోంది ఈ దేశపు వీధులగుండా.

  • రామా చంద్రమౌళి,
    ఎ : 9390109993

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *