బాలల్లో చైతన్యం పెంపొందించే బాధ్యత పెద్దలదే..

  • ప్రముఖ రచయిత, కాళోజీ సాహిత్య ప్రధమ పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్‍
  • బుక్‍ ఫెయిర్‍లో 22వ బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమం
  • 60 మంది రచయితలు హాజరు


బాలల్లో దాగియున్న సృజనాత్మకతను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ, బాలచెలిమి పిల్లల వికాస పత్రిక విశేషమైన కృషి చేస్తోంది. పిల్లలకు వైవిధ్యమైన విజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి నెల రెండవ శనివారం ‘బాలచెలిమి ముచ్చట్లు’ కార్యక్రమాన్ని కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, బాలసాహివేత్తలతో నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 21 బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. హైదరాబాద్‍ రాజధాని ప్రాంతంలోనే కాకుండా వివిధ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్‍ 30న హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లోని నోముల సత్యనారాయణ వేదికలో ‘బాల చెలిమి 22వ ముచ్చట్లు’ కార్యక్రమంలో భాగంగా ‘బాలమేళలో బాలసాహిత్యకారుల సమ్మేళనం’ అనే అంశంపై సదస్సు జరిగింది. నేషనల్‍ బుక్‍ ట్రస్ట్ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జూలూరీ గౌరీశంకర్‍, గౌరవ అతిథిగా ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్‍, విశిష్ట అతిథిగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍, బాలసాహితీవేత్తలు పాల్గొన్నారు.


పిల్లలు అల్లరి చేయడం మరిచిపోతున్నారు : కాళోజీ మొదటి పురస్కా గ్రహీత అమ్మంగి వేణుగోపాల్‍

గౌరవ అథితిగా పాల్గొన్న ప్రముఖ రచయిత, కాళోజీ పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్‍గారు మాట్లాడుతూ యం. వేదకుమార్‍ గారు ఎంతో పట్టుదలతో బాల సాహిత్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. బాలల్లో చైతన్యం మనమే పెంపొందించాలి. సమాజంలో బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న బాల్యాన్ని గొప్పగా తీర్చిదిద్దవలసిన అవసర మెంతైనా ఉందన్నారు. పిల్లలు క్రమశిక్షణ పేరుతో వారి సహజ స్వభావం అల్లరి చేయడాన్ని మరచిపోతున్నారని, పదిమందిలో కలిసి మెలిసి వుండే తత్వాన్ని కోల్పోతున్నారని అది సరికాదని అన్నారు. పిల్లలు అందరితో కలిసిపోయినప్పుడే వారి వికాసాభివృద్ధి జరుగుతుందని అన్నారు.


తెలుగు రాష్ట్రాల నుండి అతిపెద్ద బాలమేళను నిర్వహిద్దాం: హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ అధ్యక్షులు జూలూరీ గౌరీశంకర్‍
కలకత్తా, ఢిల్లీ తరహాలో హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍కు అపూర్వ ఆదరణ లభించడం గర్వకారణమని, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‍ అకాడమీ, బాలచెలిమి నిర్వహిస్తున్నా ఈ 22వ బాలచెలిమి ముచ్చట్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి బాల సాహిత్య రచయితలు ఇంతమంది రావటం అభినందనీయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి అతి పెద్ద బాలమేళ నిర్వహిస్తామని, దీనికోసం తెలుగు ప్రజలు ఉండే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. బాలసాహిత్యాన్ని సృష్టించడమే కాదని, ఆ సాహిత్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇది జ్ఞానానికి సంబంధించిన పెద్ద పని అన్నారు. ఎక్కడైతే జలాలుంటాయో, ఎక్కడైతే జ్ఞానముంటుందో.. అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. బాలమేళా నిర్వహించడం వల్ల ఈ ప్రాంగాణమంతా పులకరించి పోయిందన్నారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాలకు, గ్రామాలకు వెళ్లి బాల సాహిత్య విస్తృతికి కృషి చేస్తామన్నారు.


సాహిత్యంపై ప్రేమతోనే బాలచెలిమి ముచ్చట్లు నిర్వహిస్తున్నాం : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍

సాహిత్యంపై ఉన్న ప్రేమ కారణంగానే కష్టమనిపించినా గత 22 నెలల నుండి బాలచెలిమి ముచ్చట్లు నిర్వహిస్తున్నట్లు చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన వేదకుమార్‍ మాట్లాడుతూ 22 నెలల నుండి ప్రతి రెండవ శనివారం నిర్వహిస్తున్నామని, గత మూడు నెలల నుండి జిల్లాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దగ్గర జరిగే పండగల్లో పెద్ద పండుగ పుస్తకాల పండుగ అన్నారు. పుస్తక ప్రేమికులను విజ్ఞాన భాండాగారం ఎంతో ఆకర్షించినట్లు తెలిపారు. రీసర్చ్ స్కాలర్స్కు అన్ని రకాల పుస్తకాల ఇక్కడ లభ్యం కావడం గర్వకారణం అన్నారు. బాలచెలిమికారులు బుక్‍ ఫెయిర్‍ బాలమేళాలో బాలచెలిమి ముచ్చట్లు పెట్టాలని నిర్ణయించిన కారణంగా ఈ కార్యక్రమం రూపుదాల్చింద న్నారు. తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల ‘బడిపిల్లల కథలు’ వేద్దామని పిల్లలు రాసిన కథలను ఆహ్వానిస్తే మొత్తం 882 కథలు వచ్చినట్లు తెలిపారు. వాటిని ఒక కార్యశాల నిర్వహించి అందులో ప్రతి జిల్లాకు కథలు ఎన్నుకున్నట్లు తెలిపారు. 14 మంది ఆర్టిస్టులు 10 జిల్లాల నుండి వచ్చి కార్యశాల ద్వారా బొమ్మలు గీసి ఇచ్చినట్లు తెలిపారు. దాంతో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ 10 జిల్లాల బడి పిల్లల కథలు పుస్తకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. బాల సాహిత్య రచయితలు రాసిన కథలను కూడా ఎన్నుకొని వాటికి బొమ్మలు గీసి సకాలంతో తీసుకొస్తున్నట్లు తెలిపారు. చదువురాని వాళ్లకు కూడా ఈ బడి పిల్లల పుస్తకాలు అర్థమవుతాయన్నారు. ఏది పిల్లలకు రాయ కూడదో, ఏది రాయాలో తెలుసుకుంటే బాలలకు చక్కని కథలు అందించవచ్చన్నారు. పిల్లల కోసం రాయనివాళ్లు కూడా ఇక నుంచి కథలు రాయాలన్నారు. తద్వారా ఇంకా గొప్ప సాహిత్యం తెలుగులో అందిస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన 22 చర్చలను చిల్డ్రన్స్ అకాడమీ రికార్డు చేసిందని, త్వరలో దాన్ని పుస్తకం రూపంలో తీసుకొస్తున్నట్లు తెలిపారు. 2020లో తెలంగాణలోని 31 జిల్లాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవల భూదాన్‍ పోచంపల్లిలో బాలచెలిమి గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మరో ఐదు జిల్లాల్లో కూడా గ్రంథాలయాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బాలసాహిత్యాన్ని నిండు మనస్సుతో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.


బాలచెలిమి పత్రికకు కొనసాగింపుగా బాలచెలిమి ముచ్చట్లు : నేషనల్‍ బుక్‍ ట్రస్ట్ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍

బాలచెలిమి పత్రికకు కొనసాగింపుగా 2017 అంతర్జాతీయ పుస్తక దినోత్సవంలో బాలచెలిమి ముచ్చట్లు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎన్‍బీటీ చైర్మన్‍ పత్తిపాక మోహన్‍ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలల సాహిత్యాన్ని పెంపొందించడం కోసం బాలచెలిమి అకాడమీ విశేషంగా కృషి చేస్తుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 60 మందికిపైగా కథా రచయితలు, సాహితీవేత్తలు, కవులు తమ అనుభవాలను వేదిక ద్వారా పంచుకోవడం అభినందనీయం అన్నారు.


శతకపద్యాల్లాగా శాశ్వతంగా నిలిచే ముచ్చట్లు : ఓయూ అసిస్టెంట్‍ ప్రొఫెసర్‍ డా.ఎస్‍.రఘు
ఈ ముచ్చట్లు గాలిలో కలిసిపోయే ముచ్చట్లు కాదని, శతకపద్యాల్లాగా శాశ్వతంగా నిలిచిపోయే ముచ్చట్లని ఓయూ అసిస్టెంట్‍ ప్రొఫెసర్‍ డా.ఎస్‍.రఘు పేర్కొన్నారు. చాలా కొత్త కొత్త ఆలోచనల కోసం, కొత్త అభివ్యక్తి కోసం, ఇతివృత్తం కోసం అన్వేషిస్తున్నటువంటి వేదికగా ఇది మారిందన్నారు. ఈ బాలసాహిత్య వేదిక ద్వారా కొత్త రచయితలు, కొత్త పాటకులు ఉద్భవిస్తున్నట్లు చెప్పారు.


బాలసాహిత్యం మీదనే బుక్‍ ఫెయిర్‍ పెట్టాలి : రచయిత గిరిజ

చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‍ అకాడమీ చైర్మన్‍ వేదకుమార్‍ గారు ఏ పని మొదలుపెట్టిన విభిన్నంగా ఉంటుందని రచయిత గిరిజ అన్నారు. కేవలం పిల్లల కోసమే హైదరాబాద్‍లో బుక్‍ ఫెయిర్‍ పెడితే చూడాలని ఉందన్నారు.


మంచి సాహిత్యానికి బాలసాహిత్యం దోహదపడుతుంది : రచయిత వీఆర్‍.శర్మ

బాలసాహిత్యం రాస్తున్నవారిలో పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఉన్నారని, కాబట్టి ప్రతినెల సాహిత్యంపై ప్రతి మండలం లేదా జిల్లా ప్రాంతాల్లో కలిసి బాల సాహిత్యంపై చర్చిస్తే బాగుంటుందని రచయిత వీఆర్‍.శర్మ అన్నారు. ఇది పిల్లల్లో మంచి కవిత్వాన్ని తీసుకురావడానికి ఉపయోగ పడుతుందన్నారు. జీవితాన్ని, సమాజాన్ని అర్థం చేసుకునేవాళ్లు ఉన్నారని, పిల్లలను నడిపించే బాధ్యత బాలసాహిత్యంపై ఉందన్నారు.


పిల్లల బాల్యంలోకి వెళ్లి కథలు రాయాలి : రచయిత డా.కె.బి.గోపాలం
తన తమ్ముడు పార్దసారధితో కలిసి చిన్నతనంలో చాలా డ్రామాలు వేసినట్లు డా.కె.బి.గోపాలం అన్నారు. బాలసాహిత్యంలో ఆస్ట్రానమీ నుంచి హిస్టరీ వరకు అన్ని సబ్జెక్టులపై ప్రసంగిస్తే చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. విష్ణుశర్మ నీతిచంద్రిక చెప్పినప్పుడు జంతువులను ఆధారం చేసుకొని రాజకుమారులకు తెలివి నేర్పినట్లు తెలిపారు. కాబట్టి మన బాల్యంలోకి వెళ్లి కథలు రాయడం కాదని, పిల్లల బాల్యంలోకి వెళ్లి కథలు రాస్తే చాలా సక్సెస్‍ అవుతారని చెప్పారు.


అడ్రస్‍ ఇస్తే ఉచితంగా పుస్తకాలు పంపిస్తాను : రచయిత చెన్నూరి సుదర్శన్‍
తాను జంతుశాస్త్ర లెక్చరర్‍గా పనిచేశానని, 2010లో పదవీ విరమణ పొందిన తర్వాత 2012 నుండి కథలు రాస్తున్నట్లు రచయిత చెన్నూరి సుదర్శన్‍ అన్నారు. తాను ఇప్పటి వరకు 120 కథలు రాశానని, తనకు ఎవరైనా అడ్రస్‍ ఇస్తే వారికి తప్పకుండా ఉచితంగా పుస్తకాలు పంపిస్తానన్నారు. పిల్లలకు అర్థమయ్యే స్థాయిలో కథలు రాయాలని గ్రహించి తాను రాసిన పుస్తకాలకు తానే బొమ్మలు గీసినట్లు తెలిపారు.


పిల్లలకు దిశానిర్దేశం చేయాలి : గేయ కవి, రచయిత, ఉపాధ్యాయులు తుమ్మూరి రామ్మోహన్‍రావు

గేయ కవి, రచయిత, ఉపాధ్యాయులు తుమ్మూరి రామ్మోహన్‍రావు మాట్లాడుతూ తాను కథలు రాస్తున్నానంటే దానికి స్ఫూర్తి చందమామ కథలేనన్నారు. తమ ఇంట్లో నాలుగైదు వేల పుస్తకాలు ఉన్నాయంటే దానికి కారణం చందమామ పుస్తకం కారణం అన్నారు. పిల్లలకు దిశానిర్దేశం చేయాలని బాలచెలిమి కృషి చేస్తోందని అభినందించారు. పెద్దలుగా మనమంతా బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలన్నారు.


బాలచెలిమితో బాలల సాహిత్య వికాసం: రచయిత ఉరిమిల్ల సునంద

తమ పాఠశాల నుంచి ఐదారు పుస్తకాలను తీసుకొచ్చినట్లు రచయిత ఉరిమిల్ల సునంద అన్నారు. బాలసాహితీవేత్తలు అందరూ కూడా బాగా చదువుకున్నవాళ్లని, అదేస్థాయిలో పిల్లలచేత పెద్ద సంఖ్యలో రచనలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ప్రోత్సహించడంలో తాను ఎంతో ముందుంటానని చెప్పారు.


బాలసాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి : రచయిత సుతారపు వెంకటనారాయణ

బాలసాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్దులై పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రచయిత సుతారపు వెంకటనారాయణ అన్నారు. బాలసాహిత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


గ్రంథాలయాలను ప్రోత్సహిద్దాం : కథా రచయిత గుర్ర చిదంబరం

తమ చిన్నతనంలో బాలసాహిత్యం తక్కువగా ఉండేదని, ఇప్పుడు కూడా తక్కువగానే సాహిత్యం రావడం బాధాకరమని కథా రచయిత గుర్ర చిదంబరం అన్నారు. పేపర్లలో కూడా బాలసాహిత్యంపై తక్కువ పేజీలు వస్తున్నాయని, ఇంకా కొంచెం పేజీలు పెంచాలన్నారు. గ్రంథాలయాలను ప్రోత్సహిద్దాం, వాటి అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. బాలల కోసం సాహిత్యం రాసే పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.


సాహిత్యం భవిష్యత్‍తరాలకు నాంది : రచయిత పిట్టగుంట సురేష్‍కుమార్‍
బాలచెలిమి ముచ్చట్లు గత రెండు సంవత్సరాల నుండి నిర్వహించడం అభినందనీయం అని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్‍తరాలకు ఉపయోగపడుతాయని రచయిత పిట్టగుంట సురేష్‍కుమార్‍ అన్నారు.


ఈ సందర్భంగా 60 మంది కథా రచయితలు, సాహితీవేత్తలు, కవులు తమ అనుభవాలను వేదిక ద్వారా పంచుకున్నారు. బాలచెలిమి కార్యక్రమంలో పాల్గొన్న రచయితలందరికీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍ కార్యదర్శి కోయ చంద్రమోహన్‍, బాలచెలిమి చిత్రకారుల కార్యశాల కన్వీనర్‍ కూరెళ్ల శ్రీనివాస్‍, బాల సాహిత్యవేత్తలు సిఎ ప్రసాద్‍, గరిపల్లి అశోక్‍, సుతారపు వెంకటనారాయణ, చొక్కాపు వెంకటరమణ, దాసరి వెంకటరమణ, మంచి పుస్తకం సురేష్‍, వడ్డెపల్లికృష్ణ, డా.పరుశురాం, పి.గిరిజ, శాంతకుమారి, ఎండ్ల లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

  • రామకృష్ణ కాంపాటి,
    ఎ : 9866168863

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *