హైదరాబాదుకు 30 కి.మీ.ల దూరంలో కొంపెల్లి గ్రామానికి చేరువలో మేడ్చల్ మండలంలో వున్న గుండ్లపోచంపల్లికి 2 కి.మీ.దూరంలో ప్రభుత్వ అటవీభూముల అంచున 3శిలాశ్రయాలలో(Rock Shelters) కొత్తగా రాతిచిత్రాలు (Rock Arts) కనుగొనబడ్డాయి. ఈ చిత్రిత శిలాశ్రయాలు భౌగోళికంగా 17.5820 డిగ్రీల అక్షాంశాలు, 78.4617 డిగ్రీల రేఖాంశాలపై, సముద్రమట్టానికి 545మీ.ల ఎత్తున వున్నాయి. గుండ్లపోచం పల్లికి చెందిన సాయికృష్ణ, దక్కన్ యూనివర్సిటి చారిత్రక పరిశోధక విద్యార్థి, యువ ఇంజనీర్ చరిత్రపై ఆసక్తితో తన అన్వేషణను తనవూరి నుండే మొదలుపెట్టి సఫలీకృతంగా ఈ మూడు చిత్రిత శిలాశ్రయాలను గుర్తించాడు. మా తెలంగాణ చరిత్రబృందాన్ని ఆహ్వానించి వాటిని చూపించాడు. ఈ చారిత్రక యాత్రలో మొదటిసారి శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, బెల్లంకొండ సంపత్ కుమార్, చంటి, ఫారెస్టుగార్డ్, సాయికృష్ణ తోడుగా పాల్గొన్నారు. రెండవసారి యాత్రలో తెలంగాణ చరిత్రబృందంతో కట్టా శ్రీనివాస్, కట్టా జ్ఞానేశ్వర్‍లు ఉన్నారు.
మొదటి రాతిచిత్రాలతావు ఒక పెద్దరాతిగుండు పడిగెరాయి కింద రాతిగోడమీద వున్నాయి. 8,9 అడుగుల ఎత్తున్న ఈ రాతిగుండు లోపలి తెరుచుకున్న గుహవలె వుంది. ఈ తావు వెడల్పు 12 అడుగులను మించి వుంది. రాతిచిత్రాల కాన్వాస్ ఎత్తు 5అడుగుల మాత్రమే వుంది. ఈ చోటు పరిసరాలలో రాతిచిత్రాలు వేయడానికి వాడే పదార్థాలలో ఒకటైన హెమటైట్ పిగ్మెంట్స్ దొరికాయి. ఈ రాతిచిత్రాలమీద మా బృందం సైంటిస్టు కట్టా జ్ఞానేశ్వర్ రామన్ స్పెక్టోగ్రఫీతో విశ్లేషణ చేసినపుడు ఈ ఎరుపురంగు రాతిచిత్రాలు గీయడానికి వాడిన పదార్థాలలో హెమటైట్ వాడినట్లు తేలింది.
ఈ Rock Sheltersలో మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం సంధికాలానికిచెందిన రాతిచిత్రాలున్నాయి. ఈ చితాశ్రయంలో చాలా అందంగా చిత్రించిన ఎరుపురంగు పెద్దకొమ్ముల అడవిదున్నల చిత్రాలు ఆధునిక చిత్రకారుల పెయింటింగ్సునే సవాలు చేసేంత గొప్పగా కళాత్మకంగా వున్నాయి. రెండడుగుల ఎత్తు, మూడడుగుల పొడవున్న ఈ చిత్రాలు తెలంగాణ పూర్వయుగచరిత్రకు కొత్తపేజీలు. ఈ రాతిచిత్రాల వెనక మలిగిపోయిన మరికొన్ని రాతిచిత్రాలు అగుపిస్తున్నాయి. వాటిలో కొన్ని నేలమీద పడివున్న మనుషుల బొమ్మలను పోలివున్నాయి.
ఇక్కడే కొన్ని రాతిపనిముట్లు లభించాయి. వాటిలో బూమరాంగు వంటి వంపుగల రాతిపనిముట్టు, పెచ్చురాళ్ళతో ఒకవైపు చెక్కిన గొడ్డళ్ళు, బొరిగెల వంటివి, రాతికత్తులు, మరొక నునుపైన రెండు వైపుల చెక్కిన రాతిగొడ్డలిముక్క (నవీనశిలా యుగానికి చెందినది)వున్నాయి.
రెండవ శిలాశ్రయం చాలా ముఖ్యమైనది ఎక్కువచిత్రాలు వేర్వేరుకాలాలలో ఒకదానిపై మరొకసారి గీసిన లేదా అధ్యారోపణంచేసిన (superimposed) రాతిచిత్రాలు చాలా వున్నాయి. ఒకచోట అందమైన మొదటి శిలాశ్రయంలోని అడవిదున్నలతో పోలికలున్న చిత్రణతో మూపురమున్న ద్విశూలం వంటి వంపు కొమ్ములతో ఒక ఎద్దు, దాని పక్కన గొప్ప చిత్రకారుని చేతిలో రూపుదిద్దుకున్న చిత్రం వంటి రెండెద్దులబొమ్మ, ఒక ఎద్దు ఎదురుగా మరొక ఎద్దు వాటి మూపురాలు కలిసివున్నాయి.
తలలు, కొమ్ములు వ్యతిరేకదిశలో ఒకబొమ్మలో మరొక బొమ్మ సగం కలిసి అగుపిస్తుంటాయి. ఈ చిత్రమే దేవాలయాల్లో ఎద్దు, ఏనుగు తలలు కలిపి చెక్కే శిల్పాలకు మార్గదర్శకమా అనిపిస్తుంది. అదొక ప్రేమచిత్రంలెక్క కనిపిస్తుంది. వీటికి దగ్గరలో ఒక దుప్పిబొమ్మ చిత్రించిన తీరు మనోహరంగావుంది. ఈ పెద్ద చిత్రాల కాన్వాసులో మరొకచోట సన్నని గీతల ఏనుగు బొమ్మవుండడం విశేషం. మెదక్ జిల్లా అస్తలాపూర్ తర్వాత ఏనుగు కనిపించడం ఇక్కడే. చిత్రాల అంచులలో అంతటా ఈటెలు, తాళ్ళవలలు ధరించిన వేటగాళ్ళబృందాలు కనిపిస్తున్నాయి. అవి కొంచెం ఎక్కువగా Fade అయి వున్నాయి. ఇంకొక చోట సామూహికనృత్యం చేస్తున్న ముగ్గురు ఆదిమానవుల దృశ్యం గొప్పచిత్రం. ఇదికూడా హస్తాల్పూర్ రాతిచిత్రాలలోని 3వరుసల సామూహికనృత్యాన్ని గుర్తుకు తెస్తుంది. వాళ్ళ పక్కన పడివున్న జంతుదేహాలు కనిపిస్తున్నాయి. వేటపండుగ కావచ్చు. ఈ కాన్వాస్ లోనే అందమైన నెమలిబొమ్మ చిత్రించబడి వుంది. తెలంగాణాలో నెమళ్ళ రాతిచిత్రాలు మెదక్ జిల్లాలోని కంచనపల్లిలో, రత్నాపూర్ రాతిచిత్రాలలోను, తర్వాత గుండ్ల పోచంపల్లిలో గుర్తించబడ్డాయి. ఈ రాతిచిత్రాలలో వేటదృశ్యంలో అడివిదున్నను వేటగాడు ఈటెవంటి ఆయుధంతో చంపుతున్న బొమ్మ ప్రత్యేకమైనది. ఇటువంటి టెర్రకోట ముద్ర మనకు హరప్పా-మొహంజోదారోలో కనిపిస్తుంది. ఈ రెండవ శిలాశ్రయం 20 అడుగుల ఎత్తులో వుంది. దాదాపు 16 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పైన ఈ చిత్రిత శిలాశ్రయం పడగరాయికింద ఇంటికప్పులెక్క రెండువైపుల వాలుతలంతో వుంది.
మూడో శిలాశ్రయంలో రాతి చిత్రాలన్నీ మాసిపోయివున్నాయి. పెద్దవి, పొడవైన కొమ్ములున్న మగజింక(ఇర్రి) వంటి జంతువు చిత్రించబడి వుంది. మరికొన్ని జింకలవంటి అస్పష్టచిత్రాలు అక్కడ అగుపిస్తున్నాయి. ఈ శిలాశ్రయం 30 అడుగుల ఎత్తులో వుంది. ఈ శిలాశ్రయం రాతిగుండ్లపేర్పుమీద పైరాతిగుండు పడిగెరాయి ఆవాసంగా వుంది. అడుగున రాతిగుండ్ల మధ్య ఖాళీగా, వర్షం సమయంలో, వేట సమయంలో దాచుకునే మంచిచోటుగా వుంది. ఈ చిత్రిత శిలాశ్రయంలో వున్నవి పది దాటని రాతిచిత్రాలే కాని, స్పష్టంగా కనిపించేది 1,2 ఇర్రులే. వాటి జననాంగాలు చిత్రించ బడడం చేత అవి మగజింకలని తెలుస్తున్నది. బొద్దుగీతలు, మొరటు బొమ్మలశైలి మనకు మధ్యరాతియుగం రాతిచిత్రాలలో, పాతరాతి యుగం అంతిమదశలో గీసిన రాతిచిత్రాలలో కనిపిస్తాయి. ఠాకూర్ రాజారాం సింగ్ నర్రా ఏశాలపల్లిలో బొద్దుగీతల్లో గంటుబొమ్మల్ని గుర్తించి అవి మధ్యరాతియుగం కాలంనాటివని నిర్థారించాడు.
ఈ చిత్రిత శిలాశ్రయాలు మూడుయుగాల ప్రతినిధులు. మూడో శిలాశ్రయం ప్రాచీనశిలాయుగంలో అంతిమదశకు, మధ్యశిలా యుగానికి కూడా చెందినది. ఇక్కడి బొద్దుగీతల బొమ్మలు చాలా రఫ్ గా వున్నాయి. అంత ఎత్తున ఆదిమానవుల నివాసాలున్నది మధ్యశిలాయుగాలకు ముందటికాలంలోనే. దట్టమైన అడవిలో కూరజంతువుల నుండి రక్షణకై ఇంత ఎత్తులలో వుండడం సహజంగా మధ్యశిలాయుగంనాటి లక్షణం. రెండవ శిలాశ్రయంలోని బొమ్మలు రెండుతరాలకు చెందినవిగా అగుపిస్తున్నాయి. సన్ననిగీతల బొమ్మలు, వీటిలో ఆడవాళ్ళబొమ్మలు లేవు. వేట దృశ్యాలు వీటి ప్రత్యేకత. చాల్కోలిథిక్ పీరియడ్లో వేసిన బొమ్మల వలె జననేంద్రియాల చిత్రణ లేదు వీటిలో. వేసిన బొమ్మలమీదనే బొమ్మలు వేసి వున్నాయంటే తర, తరాలుగా ఆదివాసుల ఆవాసంగా ఈ ప్రదేశం వుండి వుంటుంది. రెండోతరం బొమ్మలన్నీ Fine Arts, కళాత్మకత వుట్టిపడుతున్నాయి. రెండెద్దుల బొమ్మలోని చిత్రకళానైపుణ్యం ఆది మానవుల ఈస్థటిక్సుని తెలియ చేస్తున్నది. రెండవ చిత్రిత శిలాశ్రయం మీద ఎన్నో పరిశోధనలు చేయవచ్చు.
మొదటి శిలాశ్రయం రాతిపనిముట్ల వల్ల మధ్యశిలా యుగానిదని, రాతిచిత్రాల వల్ల నవీనశిలాయుగానిదని తెలుస్తున్నది. ఒకేచోట ఆదిమానవుల సాంస్క•తిక వైభవాన్ని చూడగలగడం ఒక అద్భుతం, అపూర్వం.
ఆధార సూచికలు:
- Annual Report – 1986-87. 1990. V.V. Krishna Sastry (ed.), Department of Archaeology and Museums, Govt. of Andhra Pradesh, Hyderabad.
- CHANDRAMOULI, N. 1994. Rock Art of Andhra Pradesh-South India, Purakala 5 (1-2).
- CHANDRAMOULI, N. 2003a. Rock Art of Andhra Pradesh, in M.L.K. Murthy (ed.) Pre and Proto Historic Andhra Pradeshup to 500 BC, vol.I (Comprehensive History of Andhra Pradesh Series), Orient Longman, Hyderabad.
- CHANDRAMOULI, N. 2003b. Rock Art of Telangana, A Report of the minor research project (UGC unassigned grants) submitted to the School of History, Culture and Archaeology, PottiSreeramulu Telugu University, Srisailam, Andhra Pradesh, unpublished.
- CHANDRAMOULI, N. 2012. Beginning of Cattle domestication in Andhra region: Perspectives of rock art and archaeology, Purakala 22.
- CHANDRAMOULI, N. 2013.Rock Art of Andhra Pradesh A New Synthesis, Indira Gandhi National Centre for the Arts (Aryan Books International), New Delhi.
- GNANESWAR RAO, KATTA, SRIRAMOJU HARAGOPAL, KATTA SRINIVASA RAO and VEMUGANTI MURALIKRISHNA 2017. Identification of Natural Pigments used in Rock Paintings from different Rock shelters in Telangana with portable Raman Spectroscope, a paper presented in 22nd Congress of The Rock Art Society of India (RASI) held at Deccan College Post Graduate and Research Institute, Pune from 26-28 October.
- HARAGOPAL, SRIRAMOJU and VEMUGANTI MURALIKRISHNA 2018. A Rock Art Site at Ratnapur in Telangana, Purakala 27-28.
- INDIAN ARCHAEOLOGY — A REVIEW: 1959-60, 1963-64, 1964-65, 1967-68, 1973-74, 1974-75, 1975-76, 1976-77, 1977-78, 1983-84.
- KESEV V. GENTELA, ARAVIND KUMAR and K. JOHN MILTON 2018. A Study of Rock Art Sites at Devarlamorey and Peerollaloddi in Lower Godavari Valley, Telangana, Purakala 27-28.
- KRISHNA MURTHY, L. S. 1941. Geology of parts of Mahabubnagar and Gulbarga District, The Journal of Hyderabad Geological Survey 4 (1).
- KRISHNA SASTRY, V. V. 1983. The Proto and Early Historical Cultures of Andhra Pradesh, Department of Archaeology and Museums, Govt. of Andhra Pradesh, Hyderabad.
- MURALIKRISHNA, VEMUGANTI 2017. Rock Art in Vargal in Telangana State (in Telugu), a paper presented in 21stCongress of The Rock Art Society of India (RASI) held at Dept. of AIHC & Archaeology, Sri Venkateswara University, Tirupathi from 16-18 February.
- NEUMAYER, ERWIN 1993. Lines on Stone: The Pre historic Rock Art of India, Manohar Publishers and Distributors, New Delhi.
- NEUMAYER, ERWIN2011. Rock Art of India: The Pre-historic cave-Art of India, Oxford University Press, New Delhi.
- REDDY, B. M. 2016. Discovery of the Rock Art sites in Andhra Pradesh and Telangana in 2015-16, Purakala26.
- REDDY, B. M. 2018. Discovery of Rock Art sites in Telangana State reported during 2016-2017, Purakala27-28.
- SAIKRISHNA, E.2017. New Rock Art findings in Gundla pochampally, Medchal District, Telangana, a paper presented in 22nd Congress of The Rock Art Society of India (RASI) held at Deccan College Post Graduate and Research Institute, Pune from 26-28 October.
-శ్రీరామోజు హరగోపాల్
ఎ : 9949498698