తెలంగాణ కుంభమేళ.. మేడారం సమ్మక్క-సారక్క జాతర


ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక-సారక్క జాతర. తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే ఈ విశిష్ట జాతర ప్రకృతి రమణీయతకు, పర్యావరణ సమతౌల్యానికి అద్దం పడుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నెలరోజులపాటు ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రకృతి అంటే ప్రాణమిచ్చే ఆదివాసీలు వాళ్లే పూజారులై ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను ఎంతో వైవిధ్యంగా,మరెంతో అపురూపంగా తమ ఆచార సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. సమ్మక్క – సారక్క జాతరకు సుమారు 900 వందల ఏళ్ల గొప్ప చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. కాలం మారుతున్నా ఆదివాసీల సంప్రదాయాలు చెక్కుచెదరకుండా అత్యుత్తమంగా కొనసాగుతుండటం గర్వించదగ్గ విషయం. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల నుండి కోట్లాది మంది భిన్న కులాలు, విభిన్న మతాల ప్రజలు జాతరకు రావడం వారి సహజమైన సామూహిక స్వభావానికి, ఐక్యతాభావనకు గుర్తు. ప్రకృతితో మమేకమైన ఆదివాసీలు పర్యావరణ పరిరక్షణకు ఏమాత్రం అవరోధాలు కలగకుండా ఎంతో నిష్టతతో ఈ ఉత్సవాన్ని మహోన్నతంగా నిర్వహిస్తున్నారు.


తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే వాటిలో గొల్కోండ బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు, జంగుబాయి జాతర, నాగోబా జాతర, కొమరవెల్లి జాతరలకు ప్రముఖస్థానం ఉంది. అంతకుమించి మేడారం సమ్మక్క – సారక్క జాతరకు మరింత విశిష్టత కలదు. తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో ఆచార సంప్రదాయాలు కూడా అంతే గొప్పవి. ఇలాంటివి భవిష్యత్‍ తరాలకు అందించాలి. ఆదివాసీల సంస్కృతి అంతరించిపోకుండా కలకాలం కాపాడుకోవాలి. మన వారసత్వ సంపదగా భావించి పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తెలంగాణలో మరుగుపడిన అనేక చారిత్రకాంశాలను ప్రత్యేక శ్రద్ధతో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి గుర్తింపు తెచ్చే దిశలో పనిచేస్తుంది. ఇప్పటికే గొల్కొండ కోటతోపాటు జయశంకర్‍ భూపాలపల్లి జిల్లాలోని రామప్ప ఆలయం కూడా యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించబడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరియు కాకతీయ హెరిటేజ్‍ ట్రస్టు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చారిత్రక రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించాలని యునెస్కోకు ప్రతిపాదించాయి. యునెస్కో బృందం రామప్ప కట్టడాలను పరిశీలించడంతోపాటు సంబంధిత పరిశోధక అధికారులను ప్యారిస్‍కు పిలిపించి వారితో చర్చలు జరిపింది. ఈ సంవత్సరానికిగాను రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.


ఇదేక్రమంలో అంతర్జాతీయ చారిత్రక పరిశోధకులచే గుర్తింపబడిన ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క- సారక్క జాతరను కూడా యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించేరీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపేలా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభం కావాలి. అధికారికంగా డాక్యుమెంటేషన్‍ చేసి పంపాలి. ఇంటాంజ్‍బుల్‍ హెరిటేజ్‍ (లివింగ్‍ హెరిటేజ్‍)లో భాగంగా యునెస్కో గుర్తింపు పొందడానికి సత్వర ప్రయత్నాలు జరిపిన పక్షంలో కచ్చితంగా సమ్మక్క-సారక్క జాతరకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంది.
దీనికి ప్రజలు, సామాజికవేత్తలు, నిష్ణాతులు భాగస్వాములై ప్రభుత్వానికి ప్రతిపాదించి, చేయూతనిచ్చి గుర్తింపు సాధించే దిశగా కృషి జరగాలి.


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *