‘దోస్తులు చెప్పిన కథల్లో జగదీశ్వర్‍ రచనా పరిపక్వత’’


‘‘బాలలే విజ్ఞాన హేతువులు
నేడురేపుల మధ్య సేతువులు
చంద్రబంధుర సుధాశీతువులు
మానవత్వవికాస ధాతువులు’’

-శీశ్రీ


బాలల కథకుడు పెండెం జగదీశ్వర్‍ అసువులుబాసి ఏడాది. ఆయన్ను సంస్మరించడం సాహిత్య అధ్యాపకుడిగా నా కర్తవ్యం.తెలుగులో బాలసాహిత్యం విస్తృతికి నల్లగొండ జిల్లా వాసిగా జగదీశ్వర్‍ వేసిన దారి వినూత్నమైనది.


ఆయన పూర్ణజీవనం గడిపి ఉంటే బాలసాహిత్య రంగంలో ఇప్పుడు అందరూ కీర్తిస్తున్నట్టుగానే మరింత ఖ్యాతి గడించేవాడు.తను రాస్తున్న విధానం అనుభవం మీద ఇంకింత పరిపక్వంగా రాటుదేలేది.మన కాలపు బాలసాహిత్యవేత్తలు రెడ్డి రాఘవయ్య, భూపాల్‍, తిరునగరి వేదాంత సూరి వంటి వారి సరసన నిలబడేవాడు. ఈ మాట అంటున్నది జగదీశ్వర్‍ కృషిని తక్కువ చేయడానికి ఎంతమాత్రం కాదు. రచయితలుగా మనందరం పరిపక్వంగా ఎప్పటికి రాయగలుగుతాం అనేది తెలిసిరావడానికి అంటున్నాను. ఇదే విషయాన్ని గురించి Ellison Wells అనే రచయిత్రి తన The life stages of a short story writer అనే వ్యాసంలో ఇట్లాAs we grew within our writing experience we pass through different stages.You gain maturty,you just know thing you didn’t understand before.This presents a feasible analogy with life and it s stages towards adulthood.” అంటారు.ఈమె రచయితల రచనా జీవితాన్నిBaby Stage, Childhood Stage,Teenage,Young Adult, Adult Stageలుగా విభజించి విశ్లేషించారు. సైకాలజిలో మనిషి యొక్క 15-21 సంవత్సరాల మధ్య కాలాన్ని ప్రకృష్టాత్మ దశ (high self value age)అంటారు. ఈ దశ ఉత్తరార్థంలో రచయిత రచన ఆరంభింస్తాడు. అంటే 18-28 baby age,28-38 childhood, 38-48 teenage,48-58young adult age,58-68 adult age ఈ స్కేలు ప్రకారం పెండెం జగదీశ్వర్‍ శిశు,బాల్య,కౌమార దశలను మాత్రమే పూర్తి చేసుకోగలిగాడు.


జగదీశ్వర్‍ కృషిలో ‘దోస్తులు చెప్పిన కతలు’ హైద్రాబాద్‍ మంచిపుస్తకం వారు మే 2018లో ప్రచురించారు. ప్రముఖ చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్‍ పుస్తకానికి ముఖచిత్రంతో పాటు ఈ కథల్లో సన్నివేశాలకూ బొమ్మల్ని రూపుదిద్దాడు. ఈ కథలు పిల్లల్ని పెద్దల్ని తన లఘు పీఠికలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‍ ఏనుగు నర్సింహారెడ్డి అన్నట్టు నిజంగానే ‘‘జనపదాల్లోకి నడిపించే కథలు’’. ఇవి జగదీశ్వర్‍ స్వీయ సృజన కాదు. తనేచెప్పినట్టు ‘‘నా బాల్యంలో నా మిత్రులు ముఖతా విన్న అనేకానేక కథల్లోంచి ఇరవై కథల్ని ఎంపిక చేసుకొని ఇలా దోస్తులు చెప్పిన కతలుగా మీ ముందుంచుతున్నాను’’ అనడంతో ఇవి సేకరణ కథలు అని మనం గుర్తించాలి. అంటే వీటిలో తప్పొప్పులకు రచయిత బాధ్యత వహించాల్సిన పనిలేదు. ఐనా సేకర్తగా లేఖకుడిగా జగదీశ్వర్‍ కొంత సరిదిద్దితే బాగుండేది. సరిదిద్దడం అనే స్థాయి రచయిత రచనా మెళుకువలకు సంబంధించినది.ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించినది. విమర్శకుడి పరిధిలో రచయిత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కూడా చర్చించబడతాయి. యూరప్‍లో 1760-1840 మధ్య కాలంలో బాలల హక్కుల ఉద్యమం జరగడంతో బాలసాహిత్యం యొక్క అవసరం చర్చకొచ్చింది. ఆ తర్వాత మిగతా దేశాల్లో బాలల సాహిత్యం పురుడు పోసుకుంది. ఇరవైయ్యో శతాబ్దాన్ని బాలసాహిత్యానికి ‘స్వర్ణ యుగం‘అన్నారు సాహిత్య విమర్శకులు. జగదీశ్వర్‍ బాలసాహిత్య స్వర్ణయుగం తదనంతరం మరో నూతన ఒరవడికి వాకిళ్లు తెరిచే కాలంలో జన్మించిన తెలంగాణ బిడ్డ.


ఏదేశంలోనైనా బాలసాహిత్య గ్రంథానికి ఉండాల్సిన ముఖ్యమైన నాల్గు లక్షణాలు ఇవి. 1. సాధారణ ఇతివృత్తం- ఆలోచన (Simple idea-theme), 2. వాస్తవిక పాత్రలు (Characters that are real),3.నీతిని చెప్పడం (Contain moral lessons), 4.పఠనీయ కథనం మరియు మనోహరమైన బొమ్మలు (Readable text and captivating illustration). ఈ నాలుగు అంశాలు ‘దోస్తులు చెప్పిన కతలు’ పుస్తకంలో సరిపడా ఉన్నప్పటికీ కథల్లో అవసరంలేని ఘటనలు, ఒక రసం నుంచి దానికి వ్యతిరేక రసంలోకి కథ మార్చబడిన అంశాలను నేను చర్చించాలనుకుంటున్నాను. ఈ చర్చ కథకుడికి గల ఖ్యాతిని భంగపరచడానికి కాదని మళ్లీ ఒకసారి విన్నవించు కుంటున్నాను. మొదటి కథ ’శెట్టుకు పుట్టిన గుర్రం’. ఎటువంటి వాళ్లకు అటువంటి వాతే పెట్టాలంటరు పెద్దలు.ఈ కథ అటువంటిదే.పిల్లల కథ కాబట్టి నక్క ఇందులో నక్క ఐంది.లేదంటే మనిషే .అవతలివాడు అడ్డంగా మాట్లాడితే అంతే అడ్డంగా మాట్లాడే మనిషే. బాలల కథాలక్షణాల్లో చోద్యం (Fantasticalness), ఔపదేశిక వాస్తవికత (Didactic realism) లు బాగా కుదరాలి. అందుకే ‘‘మీ వూల్లె శెట్టుకు గుర్రం పిల్ల పుట్టంగలేంది మా వూర్లె శెర్వు తలుగవడదా, శాపలు శెట్లెక్కయా?‘‘ అని నక్కతో మాట్లాడించారు జగదీశ్వర్‍. ఈ కథ విన్నా చదివినా ఎగిరి గంతేస్తారు పిల్లలు. రెండోకథ ‘రాజుగారి శిన్నబిడ్డె’ మనుషుల మైండ్‍ సెట్‍ను వివరిస్తుంది.ప్రపంచం మీద మొత్తం మానవాళికి పదిహేను రకాల మైండ్‍ సెట్స్ ఉంటాయని మనోవైద్యశాస్త్రవేత్త ఎడ్వర్డ్ డి. బొనో చెబుతాడు. కథలో రాజుగారి పెద్ద బిడ్డలు ఆరుగురిది అసూయా మనస్తత్వం (Evvy mindset), చిన్నమ్మాయిది కృతజ్ఞతా మనస్తత్వం (Gratitude mindset). కథ కారుణ్య కథ కావటాన పసివాండ్లకు బాగా నచ్చుతుంది. భాషాపరంగా చూసినప్పుడు ‘సమంగ, టైము, ఆహారం’ అనే పదాలకు బదులు ‘ఒక్క తీర్గ,అదను,తినంగ’అంటే కథాకాలపు భాషావరణం సిద్ధించేది. సేకర్త కథను రాసుకునేటపప్పుడు భాషావరణం దెబ్బతినకుండా చూసుకోవాలి.


మూడోకథ’అడిగింది ఒకటి అనుకుంది ఒకటి’ గొల్లల అమాయకత్వాన్ని , ఆ అమాయకత్వంలోంచి వచ్చే ధైర్యాన్ని ప్రదర్శించే కథ.రాజు తనకు తట్టిన ఆధ్యాత్మిక ప్రశ్నకు జవాబును రాబట్టే కథ.కథ కట్టిన జానపదుడి ప్రకారమే చూస్తే ఒకటికి రెండిచ్చే మనస్తత్వం గల యాదవుడు మూడోగొర్రె దగ్గర వెనక్కి పోడు. ఐనా అడుగుతుంది రాజుగారు. ఒక్కటి ఎక్కువ ఇస్తే మంద ఏం తగ్గదు. ఏ గాలో ధూళో సోకి చచ్చింది అనుకుంటడు. మందల చచ్చింది మందల్నే పుడుతుంది అనేది యాదవుల విశ్వాసం. ఒకవేళ రాజు లెక్క ప్రకారమే ఐతే భూమి నలుమూలలు తిరిగే గొల్లనికి సృష్టి రహస్యాలు అందరికంటే ముందుగాలనే తెలుసు. శివుడు యాదవుల కులదైవం. విష్ణువు యాదవుల ఇంట పాలుమీగడ వెన్నెలలు తాగి పెరిగిన వాడు. విష్ణు తనయుడు బ్రహ్మ గీతను రాతను గొల్లలు నమ్మినట్లు సృష్టిలో మరెవ్వరూ నమ్మరు. దీన్ని గణనలోకి తీసుకుంటే కథ మరోరకంగా ముగిసేది. సాహిత్యంలో బహుజన దృక్పథం వెల్లివిరుస్తున్న తన కాలంలో ఇట్లాంటి కథ చెప్పడం వలన కథకుడి కాలస్పృహ అవగతమవుతుంది. ఈ కథ పిల్లలకు నిజంగా హాస్యం పరిధి దాటి అర్థమైతే జగదీశ్వర్‍ పిల్లలకు శత్రువు అవుతాడు.ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవాళ్లలో గొల్లకురుమల పిల్లలే అధికం.ఈ కథ రాజుల పిల్లలకు సరిపోతుంది. దిగువజాతుల బిడ్డలకు అంతగా అవసరపడదు. సబాల్ట్రన్‍ వర్గాలను బుద్ధి హీనులుగా చిత్రించే కథలు వాటిల్లో ఎంత మెలిక (Twist) ఉన్నా సేకర్తలు పక్కన పెట్టాల్సిందే, లేదంటే సవరించాల్సిందే,కాదంటే కాన్షియస్‍ గా చేసిన సృజనాత్మక తప్పిదం అవుతుంది.నాల్గో కథ ‘పైసలిచ్చే మేక’. ఇదీ గొల్లపిల్లవాడి అమాయకత్వాన్ని’ రూకల్ని నూకలు’ అనుకుని మందను పోగొట్టుకునే కథ. బాలబాలికలకు కథలు వినిపించడం ద్వారా మనం నీతి,న్యాయం, ధర్మం, సాహసం, కరుణ, ఔదార్యం నేర్పుతం.మరి ఈ కథ పైసలుంటే మస్తు మంది పనివాండ్లను పెట్టుకొని బ్రతకొచ్చు అనే భావన కల్గిస్తుంది.కథలో వినోదం పండినప్పటికీ , పైసలు రాల్తావుంటే పేదోళ్లకు పంచిపెట్టినరు అనే ఒక్క మాట కనుక చివర్లో ఉంటే ప్రపంచంలోనే గొప్ప బాలలకథ అయివుండేది. శ్రేష్ఠ వర్గ సంస్కృతి (Elites culture) మాయలో జగదీశ్వర్‍ ఒక మంచి కథకు గొప్ప కథకు చెడ్డ ముగింపు అనలేం కాని, ఇవ్వాల్సిన ముంగిపు ఇవ్వలేకపోయాడు అనే చెప్పాలి.


ఖననం, ఖండనం, హింస, జుగుప్స, వంటి అంశాలు పిల్లలకు ఎట్టిపరిస్థితిలోనూ చూపెట్ట కూడదంటాడు పిల్లల ప్రేమికుడు సుప్రసిద్ధ భారతీయ సాహిత్యవేత్త పద్మభూషణ్‍ రష్కిన్‍ బాండ్‍. ఐదో కథ ‘యెవలుజేసుకున్న కర్మ ఆల్లే అనుబవించాలె’. ఈ కథలో మంత్రి ముక్కు చెవులు కోయించుకున్న దృశ్యం.
రష్కిన్‍ బాండ్‍ అభిప్రాయాన్ని విభేదిస్తుంది. ఆరో కథ ‘మాయ గిన్నె’లో చివరి ఘట్టం అనవసరం. కథలో పొట్టోళ్లు పుట్టుకొచ్చి ఊరందరికీ శిరోముండనం చేయడం కథకు ఏరకంగానూ ఉపయోగపడదు.ఏ పాపం ఎరుగని జనానికి విందుకు వచ్చినందుకు గుండుగీకడం సామాజిక వ్యతిరేకత (Social antinomy) అవుతుంది.అది చిన్న కథైనా పెద్ద కథైనా కథాంశం (Pilot)లో 1.ప్రవేశిక (Introduction), 2.చర్యోపక్రమణం (Rising of action), 3.పరాకాష్ఠ (Climax), 4.చర్యావనతం (Falling of action), 5.కడపటి సన్నివేశం (Denouement)లు ఉంటాయి. కడపటి సన్నివేశంలో 1.బాహ్యసంఘర్షణ ((External struggle%), 2.అంతస్సంఘర్షణ (Internal struggle) ఉంటాయి. రాజ్యం తాలూకు అంశాల్లో తప్పితే కడపటి సన్నివేశంలో కుటుంబ గత ఫలితాన్ని సామాజం మొత్తానికి వర్తింప చేయరాదు.’ యెవలన్న వొచ్చి అడిగితె తిర్పతికి వొయ్యొచ్చినం అని చెప్పుడు మొదల్వెట్టిర్రు ‘అనే దగ్గర కథ ముగించి, కథకు ‘మాయ గిన్నె’ అనే పేరుకు బదులు ‘తిర్పతికి వొయ్యొచ్చినం’ అని పెడితే పిల్లలు లొటకలేస్తూ చదీవేటోల్లు. ఆఖరి పేరాగ్రాఫ్‍ వలన సహజ హాస్యానికి బదులు అసహజ హాస్యం చాటున కథ బీభత్స రసానికి మళ్లింది. ముగియాల్సిన చోట కథ ముగియక పోతే చర్యావనతం, కడపటి సన్నివేశం తారుమారు అవుతాయి.ఈ తారుమారు వలన రసం మారుతుంది.రస మార్పిడి జరిగినపుడు కథTheme,Point of viewమారతాయి.ఈ కథలో ఇవే జరిగాయి. ఏడోకథ’ బండిని మింగిన పులి’పెద్దల కథ.అన్నా చెల్లెళ్ల అనుబంధానికి సంబంధించినది.కుటంబ సంబంధాల్లో అసఖ్యతను తగ్గించి సఖ్యతను పెంపొందించాలే తప్ప వ్యక్తుల్లో దురాశా స్వభావాన్ని (Greed mindset) తారాస్థాయికి చేర్చి కథ చెప్పడం వలన పిల్లలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోగా వ్యతిరిక్తత (Antagonism)కు దారులు తెరిచినవాళ్లం అవుతాం.ఈ కథ సరిగ్గా ఇటువంటిదే.ఎనమిదో కథ ‘పాపిష్టి వదిన’ కూడా ఏడో కథ లాంటిదే.


తొమ్మిదో కథ ‘అంత మన మంచికే’ పరోక్షంగా నరబలిని ప్రోత్సాహించే కథ.కథలో ప్రథమాంశం దాని కూర్పు (Setting). దీనిలో స్థలం(Place), కాలం (Time) ఉంటాయి. జగదీశ్వర్‍ చెప్పినట్టు ‘ఒగనాడు రాజు శాకుతోటి పండుగోస్తుంటె యేలు దెగింది’ సంఘటనలో కూర్పు దెబ్బతిన్నది. రాజు స్వయానా శాకుతో పండు కోయడం అంతఃపురంలో ఉండదు. రాజుకు గాయం కావడాన్ని మరో రకంగా జగదీశ్వర్‍ చెప్పాల్సిన వుండె. పదోకథ ‘నీ నోట్లకెల్లి ముత్యాలు రాలు గాక’ వలయీకృత స్వభావ కథ. కథాంశాల్లో రెండోది కథలోని పాత్రలు (Characters). అవి 1.నాయక పాత్రలు (Protohonists) 2.ప్రతి నాయక పాత్రలు (Antagonists). ఇవి నాలుగు1. క్రియాశీల (Dynomic) 2.స్థిర (Static) 3.సమతల (Flat) 4.వలయీకృత (Round) చిత్తవృత్తి కలిగి వుంటాయి. బాలబాలికలకు క్రియాశీల పాత్రలు బాగా నచ్చుతాయి. జగదీశ్వర్‍ విని చెపుతున్న ఈ కథల్లో పాత్రలు డైనమిక్‍గా ప్రవర్తించవు. కాలాలు (Seasons) దేవతలుగా అవతారం ఎత్తడం వంటి ఫాంటసీ ఈ కథ కు ఒక మెరుపు. అయితే ఇందులో అత్తాకోడళ్లది వలయీకృత స్వభావం. అంటే ఘర్షణ నుంచి ఘర్షణకే చేరుకుంటాయి. చేరేలోగా పాత్రలు విలోమంగా మారతాయి. విలోమంగా మారినపుడు పాత్రకు సంబంధించిన క్షమ, సహనం, ఆదరణ , ప్రతీకారం, తొందరపాటు, అనాదరణ థీమ్‍(పాఠం)గా రూపం ధరిస్తాయి. వెంటనే కథ యొక్క దృక్కోణానికి లోపం ఏర్పడుతుంది. పదకొండో కథ ‘దరిద్రపు మొకం’. ఇది మూఢ విశ్వాసాన్ని బలపరిచే కథ.అయితే ‘బిచ్చగాడు రాజును ప్రశ్నిండం ‘అనే కడపటి సన్నివేశం విద్యా తత్త్వవేత్త జాన్‍ డ్యూయీ వ్యావహారిక సత్తా వాదా(Pragmatism)న్ని ఇముడ్చుకున్నందు వలన పిల్లలు బాగా ఇష్టపడతారు. పన్నెండో కథ ‘రమ్మంటావా? నన్ను రమ్మంటావా?’. ఇది Human vs Supernatural స్టోరీ.పైసల్ని కాళ్లతో తన్నరాదు అనేది ఈ కథలోని నీతి.చిన్నారులకు బాగా నచ్చుతుంది. పదమూడో కథ ‘లడ్డూల వాన’. ఇందులో Fate theme జొప్పించ బడింది. దొరికిన సొమ్ము తో ధనవంతులు కావడం అనేది పిల్లలపై నెగెటివ్‍ ప్రభావం కనబరుస్తుంది. బంగారం దొంగలకు శిక్షపడక పోవడం రచనకు సంబంధించి Falling actionలో పెనులోపం. పద్నాల్గో కథ’యెముడు ఎందుకు కనవడడు?’. ఇది మృత్యువు ఆంతర్యాన్ని గురించిన కథ. బ్రాహ్మడు వైకుంఠం వెళ్లడం, యముడికి విష్ణు మూర్తి’ ‘అందర్కి కనపడేటట్టు వొయ్యి పానాలు తీస్కొచ్చుడు నువ్వు చేస్తున్న తెలివి తక్కువ పని ‘అని హితవుచెప్పడం పిల్లల్లో అన్వేషణా (quest) తాత్త్వానికి పదును పెడతాయి. అయితే మహోపాధ్యాయుడు గిజుభాయి వధేకా చెప్పిన’’పిల్లకు బాల్యంలో వివాహం చేయడం ఎంతటి అనర్థమో దేవుని గురించి మతం గురించి చెప్పడం అంతే అనర్థం’’అనే భావనకు ఈ కథ పూర్తి వ్యతిరేకం.


పదిహేనో కథ ‘యెలుగొడ్డు మొగడు’.శివనిందా పర్యవసానం గురించిన కథ.మిగతా కథల్లో లాగ కాకుండా ఇది కారుణ్యంతో ముగిస్తూ పాత్ర యొక్క మాచురేషన్‍ను సూచిస్తుంది.ఇక్కడా అధ్యాపకులు గిజుభాయి మాటల్నే గుర్తుపెట్టుకోవాల్సింది.పదహారో కథ’ సూర్యుణ్ని మింగిందెవలు?’. ఇది సూర్యగ్రహణం గురించి పురాణకాలపు ఘటనకు సంబంధించిన కథను జానుపదుల కోణంలో ఆవిష్కరించే కథ. ఇందులో అక్క కోసం తమ్ముడు చేసే ధైర్యం అనేక మంది అక్కాతమ్ముళ్లలో ఐకమత్యాన్ని పెంచుతుంది.సూర్యుడిని పాము మింగడాన్ని సైన్సు ఒప్పుకోదన్న విషయాన్ని పిల్లలకు పరోక్షంగా కథ ద్వారా చెబితే బాగుండేది.పదిహేడో కథ’పాము కూర’. ఇది ధనవంతురాలైన అక్కకు అతి దారిద్య్రంతో బాధపడే చెల్లెలికి సంబంధించిన కథ. సచ్చిన పామును చెల్లెలు కూర వండితే వనదేవత మాయ వల్ల అది వజ్రాలు రత్నాలు అవుతై. అదే ప్రయత్నంలో ప్రయత్నించి అక్క దారుణంగా మరణిస్తుంది. చెల్లెలు పేదరికంతో పోరాడలేక ఇంటిల్లిపాదికి విషసర్పాన్ని వండడం అనే క్లైమాక్స్ ద్వారా, దురాశతో పుట్టలో చేయి పట్టి మరణీంచే అక్క ద్వారా పిల్లలు నేర్చుకునేది ఏమీ వుండదు. పైగా పాముకూర అనే మాట వింటేనే ఓకరిస్తారు, వణికి చస్తారు పిల్లలు. వికారపు విషాన్నాలు, విషాదాంత దృశ్యాలు బాలల కథల్లో పొరపాటున కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే సామాజిక ముప్పుకు విరుగుడుగా విషాద సన్నివేశాలు ఉండాలి. అతీత శక్తుల సాయం కంటే స్వీయ సామర్థ్యంతో సమస్యలను అధిగమించడం అనే ధోరణిని అలవర్చుగలిగే కథలే గొప్ప కథలు. ఇందుకు పాముకూర కథ పూర్తి గా విరుద్ధం. పద్దెనిమిదో కథ ‘మంచి శెకునం’. శకునాలు జనాదరణ (Popular) పొందినట్లుగానే, జనాదరణ పొందిన దురభిప్రాయాలు (Popular misconceptions) గా కూడా ఉంటాయి. శకునాలకు హేతుబద్ధత ఉండదు.కథలో ప్రయాణం పెట్టుకున్నప్పుడు నక్కకు వరుణుడు, భూదేవి, లక్ష్మీ దేవి ఎదురైతే అసంగతాలు గుర్తుకు రావడం -వాటి సమన్వయం బాగానే వుంది. అగ్ని దేవుడు ఎదురైనప్పుడు నక్క మంచి శకునం అని చేసే సమన్వయంలో సహేతుకత లేదు.పిల్లలకు అగ్నిలో కాలే శరీరాలను ఉదహరించడం ఆరోగ్యకరం కాదు.పంతొమ్మిదో కథ ‘శిన్న ముసలమ్మ పెద్ద ముసలమ్మ’. ఒకటి రెండు పోను ఈ సంపుటిలోని ఇతర కథల్లాగే ఇది సారాంశం రీత్యా ఆరోహణ మరియు అవరోహణ (Ascesion & Descesion) పద్ధతికి చెందిన కథ. అంటే పెద్ద ముసలమ్మ తన మేకను కొడితే నోట్లోంచి వజ్రవైడూర్యాలు రాల్తవి, శిన్నముసలమ్మ తన మేకను కొడితే పెంట పెడుతుంది.మంచి వాళ్లకు మంచి జరగడం చెడ్డవాళ్లకు చెడు జరగడం అనే విషయాన్ని పిల్లలకు చెప్పడానికి మూగజీవాల పీడనను అనుసరించడం అంత హృదయంగమం కాదు.పై పెచ్చు జంతు పీడన వల్ల పిల్లలకు చేకూరేది బండహాస్యమే. ఇరవయ్యోకథ ఆఖరి కథ ‘నంది జేశిన తప్పు’.ఇది చెప్పింది చేయని వాళ్లు పొందే ప్రతిఫలానికి (Vengeance)కు సంబంధించిన కథ.నందిని శివుణ్ణి ఇందుకు దృష్టాంతంగా చెప్పడం ,పశు సంతతి శాపవశాత్‍ రైతుల పొలాల్లో కష్టాలు పడుతున్నాయనడం భూమి-రైతు-పశువులు సంబంధాలను కించపరచడం కిందకు వస్తుంది. బాలల కథకు తప్పుడు తీర్పులు (Efroneus judgements) ముగింపుగా ఉండకూడదు.


బాలలకు నీతి నియమాలు ,మంచి చెడులు చెప్పాలనుకున్న జగదీశ్వర్‍ ఈ కథలను ‘పిల్లలు-ప్రకృతి’ వాతావరణానికి అతి దూరంగా పెద్దలతో ,పెద్దల సమస్యలతో నడిపించాడు.దాదాపుగా కథలన్నీ ప్రతీకారం (Revenge)తీర్చుకునే వైపు నడుస్తాయి.’’బాల సాహిత్యం ముఖ్యంగా పిల్లల శారీరక ఎదుగుదలకు,మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తుంది. మానవీయ విషయాలను సామాజిక విషయాలను, ధైర్యసాహసాలను, విజ్ఞాన సంశోధక విషయాలను ఆకళింపు చేసుకునే విధంగా ఉండాలి’’ అంటున్నారు దక్కన్‍ లాండ్‍ మాసపత్రిక హైదరాబాద్‍ ఆధ్వర్యంలో వస్తున్న ‘బాల చెలిమి’ బృందాలు. కథల్లో మనుషులను ఆదుకునే దైవక•ప కన్నా, మానవుడు మేధస్సుతో సాధించే అద్భుతాలనే బాలలకు చేరవేయడమే ఇవాళ్టి అవసరం.ఈ లక్ష్యాల సాధనలో పెండెం జగదీశ్వర్‍ ‘దోస్తులు చెప్పిన కథలు ‘అంతగా కృతకృత్యం కాలేవు. కథా వస్తువులకు సంబంధించి సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత జార్జెస్‍ పోల్తీ తన The thirty six dramatic situations గ్రంథంలో పేర్కొన్నట్టు- నాల్గోది : బంధువుకోసం బంధువు మీద ప్రతీకారం (Vengeance taken for kin upon kin), ఏడోది: క్రూరత్వం, దురదృష్టాలకు బలైపోవడం (Falling prey to cruetly of misfortune), పదమూడోది: బంధువుల శత్రుత్వం (Enmity of kin) అనే అంశాలకు ఈ కథలు లఘురూపాలుగా కనిపిస్తాయి. బహుశా ఈ మూడే కదా! సాహిత్య జగత్తులో అపురూపంగా వెలుగొందాల్సిన జగదీశ్వర్‍ కథ అర్థాంతరంగా ముగియడానికి కారణం.తనకు ఎదురైనదంతా పెద్దలకు చెప్పుకోలేక పిల్లలకు ఎరుక చేసి వెళ్లిన కథకుడుగా ఈ కథల ద్వారా జగదీశ్వర్‍ బాలసాహిత్య లోకంలో మిగిలాడు,వెలుగుతున్నాడు.

  • డా. బెల్లి యాదయ్య
    ఎ: 9848392690

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *