బంజార జీవితాలను నవరసభరితంగా చూపించిన ‘గోర్‍జీవన్‍’ చిత్రం


సుమారు వంద సంవత్సరాల తెలుగు సినిమా చిరిత్రలో పూర్తిస్థాయిలో బంజారా భాషలో రూపొందిన తొలిచిత్రం గోర్‍ జీవన్‍ సినిమా. ఒకరకంగా ఇది రికార్డ్ అనికూడా చెప్పొచ్చు. 1921లో రఘుపతి వెంకయ్య ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూగ సినిమా (మాటలులేని) వీడుదల చేశాడు. పూర్తిస్థాయి మాటలతో 1931లో భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. ఆనాటి నుండి నేటి వరకు వేల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ పౌరాణిక, సాంఘిక, చారిత్రక, కాల్పనిక నేపథ్యాలతో అల్లబడిన సినిమాలనే చెప్పాలి. వందల సంవత్సరాలుగా ఈ నేలపై జీవిస్తూ ప్రత్యేక భాష ఆచార వ్యవహారాలు, ఆహార్యం కలిగిన బంజారాల జీవితం మాత్రం వెండితెరపై కనిపించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఏదైమైన బలమైన కాంక్షతో జాతి ఋణం కొంత తీర్చుకోవాలన్న తలంపుతో కె.పి.ఎన్‍ చౌహన్‍ చేసిన తొలి ప్రయత్నం ఎంతో అభినందించదగ్గది.


మంగ్లీ, చౌహాన్‍, చమ్మక్‍, బోలెషావలి ప్రధానతారా గణంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకాధరణని, విమర్శకుల ప్రసంశలని దక్కించుకుంది. చిత్రకథలోకి వెళితే… సక్కు బాయిగా తండాలో స్మగ్లింగ్‍ ధందా చేస్తూ తనకి ఎదురొచ్చిన వారిని అడ్డుతొలగించుకొంటూ సొంతవ్యవస్థను నడుపు తుంటాడు షావలి. ఆక్రమంలో కొన్ని సంవత్సరాల కింద తండా నించి పారిపోయి ప్రేమ వివాహం చేసుకొని సంవత్సరాల కింద తండా నించి పారిపోయి ప్రేమ వివాహం చేసుకొని తిరిగొస్తున్న చౌహన్‍ (కథానాయకుడు) తల్లిదండ్రులను చంపుతాడు విలన్‍ షావలి. అదే సమయంలో తాగుడుకి బానిసై కూతురుని అమ్మ జూస్తాడు స్వేచ్ఛ (హీరోయిన్‍) తండ్రి. తన కూతురిని వ్యాపారస్తులు ఎత్తుకుపోతుంటే కాపాడబోయి వారి చేతిలో హత్యకు గురవుతుంది స్వేచ్ఛ తల్లి అక్కడి నుండి కథ హైదరాబాదుకి చేరుతుంది.
తల్లిదండ్రుల చనిపోవడంతో అనాథలుగా మారిన స్వేచ్ఛ, చౌహాన్‍లు హైదరాబాదులో పెరిగి పెద్దవుతారు. స్వేచ్ఛను ఒక పెద్దమనిషి పెంచుకొంటాడు. చౌహాన్‍ సొంతంగానే పెరుగుతాడు. సమాజంలో బాధ్యతగల పౌరుడిగా నడుచుకొంటూనే సినిమా డైరెక్టర్‍ అవుతాడు. చిన్నప్పుడు గోదావరి నదిలో పడవ ప్రయాణంలో స్వేచ్ఛను చూసి ఇష్టపడిన చౌహాన్‍ పెద్దయ్యాక దాన్ని ప్రేమగా మలుచుకొంటాడు. స్వేచ్ఛ జర్నలిస్ట్ అవుతది. ప్రపంచంలోని సవాళ్ళపై డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా తండాలపై డాక్యుమెంటరీ తీయడానికి తన సొంత తండాకి వెళుతుంది. స్వేచ్ఛను అనుసరిస్తూ చౌహాన్‍ అక్కడికి వెళ్లడంతో కథ పాకాన పడుతుంది. అక్కడే వీరిద్దరికి బాల్యంలో సక్కుబాయి చేసిన అన్యాయం బట్టబయలు అవుతుంది. దాంతో చౌహాన్‍, స్వేచ్ఛలు సక్కుబాయిపై పగ తీర్చుకోవడం, స్వేచ్ఛ చౌహాన్‍ ప్రేమను అంగీకరించడంతో కథ సుఖాంతం అవుతుంది.


నటీనటుల విషయానికొస్తే కథ, కథనం, మాటలు, దర్శకత్వం వంటి బాధ్యతలన్ని మీదేసుకొని కె.పి.ఎన్‍ చౌహాన్‍ తన ప్రతిభచాటాడు. నటుడిగా తొలిచిత్రమే అయినప్పటికీ ఎక్కడా ఆ భావన కనిపించలేదు. సినిమా దర్శకుడిగా, నిజాయితీగల ప్రేమికుడిగా, యాంగ్రీయంగ్‍ మెన్‍గా కనువిందు చేశాడు చౌహాన్‍. ఇక తెలుగు రాష్ట్రాల్లో తన గ్రాతంతో లక్షలాది అభి మానుల్ని సంపాదించుకొన్న మంగ్లీ స్వేచ్ఛ పాత్రలో ఒదిగిపోయింది. ఆపదలో ఆత్మ స్థైర్యాన్ని ప్రదర్శిస్తూ, కరాటీలో ఫైట్లు చేసి స్ఫూర్తివంతమైన పాత్రలో జీవించింది మంగ్లీ. వారిద్దరి తో పాటు చెప్పు కోవాల్సింది బోలెషావలి, చమ్మక్‍ చంద్రల గురించి రెండు భిన్నమైన వేరియేషన్స్తో బాగా ఆకట్టుకొన్నాడు షావలి. సాధారణ వ్యక్తిలా నాయక్‍గా, కరుడు కట్టిన విలన్‍ సక్కుబాయిగా అలరించాడు షావలి. అతడి భవిష్యత్‍కి ఈ పాత్ర ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. జబర్దస్తుతో సుపరిచితమైన చమ్మక్‍చంద్ర సినిమా ద్వితీయార్థంలో తనదైన మేనరిజమ్‍తో నవ్వులు పంచాడు. రెండవ హీరోయిన్‍ ప్రియ పాత్రమేరకు నటించింది. చిన్ననాటి నాయికా నాయకులుగా నటించిన చిన్నపాప, బాబు (లక్కీస్టార్‍ చక్రి) మంచి నటనని కపబరిచారు. కెరీర్‍ ప్రారంభంలోనో ఇట్లాంటి మంచిపాత్రలు దొరకడం, వాటిని వారు సద్వినియోగం చేసుకోవడం బాగుంది.


సినిమా చూస్తున్నంతసేపు టెక్నిషియన్స్ ప్రతిభ అడుగడుగున దర్శనమిస్తుంది. ఛాయాగ్రాహకుడు విజయ్‍ ఠాకూర్‍ తన కెమెరా పనితనంతో సినిమాకు మరింత వన్నె తెచ్చాడు. తండావాతావరణం గోదావరి అందాలు కళ్ళకు కనువిందుగా చూపించాడు. సంగీతం బ్యాక్‍గ్రౌండ్‍ స్కోర్‍ రెండూ అందించిన బోలేషావలికి ఇది మంచి బ్రేకింగ్‍ చిత్రమనే చెప్పాలి. సినిమాలోని ఆరుపాటలు వేటికవే ప్రత్యేకంగా, వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా ‘జారీచుయామా జారీచు యా, పిసానా వక జారీచు’ పాట మనసుల్ని కదిలించింది. బంజారా సంప్రదాయాన్ని చూపుతో ‘జాటీ జంగేలేతి డుంకర ఖొళ్యా మాతి, బంజారా… ఆ… ఆ…’ అంటూ సాగే గీతం హుషారుగా
ఉంటూ సంస్కృతిని ఆవిష్కరించింది. అట్లనే ఈ ‘జల్రోంతారు ఎల్దోజీ మాయె’ అనే ప్రేమగీతం హృదయాన్ని బరువెక్కించింది. సినిమా తీయాలంటే ఖ్చుతో కూడుకున్న పని. నిర్మాత సతీష్‍ నాయుడు చిత్రాన్ని ఎంతో క్వాలిటీగా నిర్మించాడు. పాటలు, సన్నివేశాలు చాలా బాగా కన్పించాయంటే దానివెనుక సతీష్‍ నాయుడు నిర్మాణ విలువలు కొనియాడదగినది. తెరపై కనిపించే ప్రతి సన్నివేశంలోనూ నిర్మాత ఖర్చు కనిపిస్తుంది. ఎడిటర్‍ సతీష్‍ దుర్గం ఎడిటింగ్‍ పర్వాలేదని పించింది. సినిమా మొదలైన దగ్గర నుండి చివరిదాకా సన్నివేశాలు సందర్భానుసారం రావడంలో ఎడిటర్‍ ప్రతిభ కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన కలుగుతుంది. అయినప్పటికీ ఫైనల్‍గా బాగుంది. దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన కె.పి.యన్‍. చౌహాన్‍ శ్రమ, అభిరుచి, నైపుణ్యం సినిమా ఆసక్తిగా మలిచి, అద్భుతమైన మనసుని హత్తుకునే సంభాషణలతో మలిచాడు దర్శకుడు. ఒకపక్క ప్రేమకథని చూపుతూనే, మరొపక్క సామాజిక సమస్యల్ని చూపించాడు. ఇప్పటికీ తండాల్లో అమాకులైన బంజారాలు మద్యం మత్తులో జీవితాల్ని ఎలా ఛిద్రం చేసుకుంటున్నారో చూపించాడు. అక్షర జ్ఞానం అంతగాలేని లంబాడీలు అప్పులు చేసి వాటికి పెరిగిన వడ్డీలు కట్టలేక ఆడపిల్లలని అమ్ముకునే దైన్యాన్ని కళ్లముందుంచాడు.


తండాలు హాయిగా, ఆనందంగా ఉంటాయని మనందరం అనుకుంటాం. కానీ వాటి లోతుల్లోకెళ్లి అక్కడి పరిసరాలతో మమేకమై వాస్తవాన్ని చూస్తే తండాల్లో విషాదాలు నింపుతున్న కోణాలెన్నో బోధపడుతాయి. మాయ, మోసం తెలియని బంజారాల్లో మద్యపానం, పేదరికం ఎట్లాంటి తప్పటడుగులు వేయిస్తాయో, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలకు పురిగొల్పుతాయో చెప్పింది ఈ చిత్రం. రిజర్వేషన్ల పేరిట ఒకరిద్దరు డెవలప్‍ అయినట్లు కనిపిస్తున్నా అది నామమాత్రమే. ఇప్పటికే తొంబై శాతం అభివృద్ధికి దూరంగా భారమైన జీవనాన్ని గడుపుతున్నారు. సినిమా ప్రారంభంలో వచ్చే 2050 సంవత్సరానికి సంబంధించిన సన్నివేశాలు గగుర్పాటుని కలిగిస్తాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్‍ కోసం ప్రజలు ఆనాటికి ఎంత కష్టపడాల్సి వస్తుందో దూరదృష్టితో చూపారు.


అడవుల పరిరక్షణ, ఆడపిల్లల అమ్మకాల నిరోధం, సంస్కృతి సంప్రదాయాల కలబోతగా తెరకెక్కిన ‘గోర్‍జీవన్‍’ చిత్రం సినిమా చరిత్రలోనే ఒక సందేశాత్మక, ప్రయోగాత్మక చిత్రం. అభివృద్ధి నాగరికత పేరుతో అన్యభాషలు నేర్చుతూ మాతృభాషలో మాట్లాడటం మర్చిపోతున్న ఈ రోజుల్లో గోర్‍బోలి / బంజారా భాషలో సినిమాతీ యడం గొప్ప ప్రయత్నం, స్ఫూర్తిదాయకం. ఇప్పటికే ప్రేక్షకాధారణ చూరగొన్న ఈ సినిమా భవిష్యత్‍ అనేక అవార్డులను కూడా అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటి దాకా ప్రజలని కాపాడే పోలీసువృత్తిలో సేవలందించి, నేడు జాతిని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసే బృహత్కార్యంగా చిత్రాన్ని మలిచి విజయం సాధించిన చిరంజీవి కె.పి.యన్‍. చౌహాన్ని మరొకమారు అభినందిస్తూ, చిత్రంలోని నటీనటులకు సాంకేతిక నిపుణులకు
శుభాకాంక్షలు. జీవితాల్ని అతిదగ్గరగా చూపే ఇలాంటి చిత్రాలు సినిమారంగంలో మరెన్నో రావాలని కోరుకుంటున్నాం.


చిత్రం: బంజారా భాషలో మొదటి చిత్రం
నటీనటులు: కె.పి.ఎన్‍. చౌహాన్‍ – కథానాయకుడు

మంగ్లీ – కథానాయకి
బోలేషావలి – ప్రతినాయకుడు
చమ్మక్‍చంద్ర – సహాయనటుడు
కథ, మాటలు, స్క్రీన్‍ప్లే (కథనం) దర్శకత్వం : కె.పి.ఎన్‍. చౌహాన్‍
నిర్మాతలు : సతీష్‍ నాయుడు కుమార్‍ సంగీతం : బోలేషావలి
ఎడిటర్‍ : సురేశ్‍ దుర్గం కెమెర : విజయ్‍ ఠాగూర్‍

  • ఆచార్య సూర్యాధనంజయ్‍,
  • ఎ : 9849104187

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *