అప్పుడప్పుడు – 12

అప్పుడప్పుడు – ఏడేడు సముద్రాలు దాటి
ఏడేడు కొండలు గడిచి
ఏడేడు మంచు పర్వతాలు చుట్టి
ఏడేడు ఖండాలు పారి
ఏడేడు దుఖ్ఖపర్వతాలు
ఏడేడు సంతోష శిఖరాలు
ఏడేడు సంగీత సరస్సులు
ఏడేడు మానవ విస్పోటనాలు
ఏడేడు జీవజాల మాయాజాలాలు
ఏడేడు ప్రకృతి జనన రహస్యాలు
ఏడేడు మానవ మానసిక సరిగమలు
ఏడేడు సిద్ధాంత రాద్దాంతరాలు
ఏడేడు విజయోత్సవ పతాకలు
ఏడేడు అపజయపరంపరల అంపశయ్యలు
ఏడేడు నిన్నలు నేడులు రేపులు
ఏడేడు వాయుజనిత భావోద్రేకాలు
ఏడేడు భారతాలు
ఏడేడు రామాయణాలు
ఏడేడు భాగవతాలు
ఏడేడు ఉల్లాస గీతాలు


ఏడేడు అగ్ని పర్వతాల ఆగ్రహాలు
ఏడేడు మంచు శిఖరాల మంటల శకలు
ఏడేడు ఛమ్కీకోట్లు
ఏడేడు జరీ ఖండువాలు
ఏడేడు పిల్లల చెడ్డీలు
ఏడేడు బంగారు కడ్డీలు
ఏడేడు జంతరు పెట్టెలు
ఏడేడు ముంతల మూతలు


ఏడేడు ధాన్యపు గింజలు
ఏడేడు తాటి ముంజలు
ఏడేడు రాట్నాలు జట్కాలు మట్కాలు
ఏడంటే ఏడే సప్తస్వరాలు
ఏడంటే ఏడే నక్షత్రాలు
ఏడులోనే పాడు
ఏడులోనే జోడు
ఏడులోనే కాడు
ఏడులోనే ఆడు
ఏడులోనే గోడు
ఏడులోనే లాడు
ఏడులోనే ఏడులోనే యీడులోనే…

పలికిందే పలికి
అలికిందే అలికి
కెలికిందె కెలికి
గిలికిందే గిలికి
వొలికిందే వొలికి
వొలియొ వొలియే వొలియె..
రాగాల కొసల మీంచి
అల్లనేరేడు జాడలలోంచి
కోతీ కొమ్మల ఆటల
ఊడల ఊపుల జోరులలోంచి
ఉయ్యాల జంపాల పాటల
చిరుమత్తుతో జోగుడులోంచి
నింగి లోంచి
నేలలోంచి
అగ్ని లోంచి
గాలి లోంచి
నీటి లోంచి
ఆకాశపు అంచు లోంచి
పాతాళపు పదఘట్టన లోంచి


మంచి లోంచి
చెడు లోంచి
చెడుగుడు లోంచి
చెంగల్వ పూదండ లోంచి
ఆకాశం పూసిన ఎండకు
నీళ్లలో కదిలే
వెలుగు రేఖల లోంచి
అడుగులో అడుగు వేసి
ఆఖరి అడుగుగా
ఆగిపోయిన వైనంలోంచి
పానిపట్‍ లోంచి
కనికట్టు లోంచి
కష్టాల కానుకల
లోతట్టు జగమెట్టు లోంచి
జట్లు జట్లుగా నడక సాగించే
మానవ సమూహాల
స్మశానాల క్షరశాలల
మర బొమ్మల
మత తెన్నుల
పలు భాషల
పర యాసలో
పలు మాటల
ఈటెల వేటలలో..

శరానికి చిక్కిన
పక్షి లా
స్వతంత్రత
అసలే లేని
సామాన్యుడిలా
కీర్తి కిరీటాలు
భుజకీర్తులు
ధరించిన కండూతీపరుడిలా
ఆశ కదిలి
ఆశ కలిగి
ఆశ పెరిగి
ఆశ విరిగి
విసిగి వేసారి
అదే విముక్తి కీర్తనలలో
మెట్లు ఎకుతూ
దూరం ఎరగక
తీరం దొరకక
భారం మోయలేక
ఈడ్చ లేక పూడ్చలేక
ఏడేడు దుఖ్ఖ పర్వతాలని
అరువు తెచ్చుకుని


ఏడేడు తోబుట్టువులను పట్టుక వగచి
ఏడేడు తొవ్వలలో
ఏడేడు మలుపులలో
ఏడేడు నిండు భాండాగారాలలో
ఏడేడు పండు వెన్నెలలో
విరిగిన పాలలా
విరిగిన శిఖరంలా
విరిగిన కాళ్ళ వేళ్ళలా
జరుగుతున్న కాలం
వెలవెల బోతున్న
జీవనకాంతి
అడుగంటిన క్రాంతి
అణగారిన బ్రాంతి
నిటారుగా నడిచి వెళ్ళి
శిఖరంపై నుండి
లోయలోకి చూపు సారించి
గాలిలోకి తేలి తేలి పోయే
రెండుకాళ్ళు, రెండు కళ్ళు, రెండు చేతి వేళ్ళు, లేని కాలి జోళ్ళు
యుక్తి మాట
విముక్తి బాట
పగిలిన వెన్నెల..
– (అయిపోయింది)


-బి. నరసింగరావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *