చీర్యాలలో శిథిల శివాలయం: కళ్యాణీ చాళుక్యుల శాసనం

తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రను అన్వేషిస్తున్న కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్‍, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు చంటి, వారసత్వశాఖ ఉద్యోగి జి.రాజేందర్‍ గైడెన్స్ లో మేడ్చల్‍ జిల్లా, కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో 1200 యేండ్ల నాటి పురాతన శివాలయ శిథిలాలను సందర్శించారు. అక్కడున్న శాసనాన్ని ఎడిట్‍ చేసి, పరిష్కరించారు.


మనం చూసే వీరగల్లులలో ప్రాణత్యాగం చేసిన శివభక్తుల ప్రతిమలు కూడా చేరి గౌరవించ బడుతున్నాయి. అటువంటి వీరగల్లు చీర్యాలలోని శివాలయ శిథిలాలలో కనిపించింది. భక్తుని తల నరుకుతున్న వీరుని శిల ఒకటి అక్కడ వుంది. ఆ శిథిలాలలో ఒక కాలు ఆనవాలు మిగిలిన నందిశిల్పం, దేవాలయ శిఖరం, దేవాలయ స్తంభాలు, రాతిగోడల భాగాలు కనిపిస్తున్నాయి. దేవాలయానికి అంతరాళం లేనట్టుంది. గర్భగుడి పూర్తిగా కూలిన రాళ్ళతో నిండిపోయింది. తూర్పు ముఖంగా వున్న శివాలయానికి ఎదురుగా నంది (మంటపంలో) వుంది. గుడికి 30అడుగుల దూరంలో పశ్చిమాభిముఖుడై వున్న ఎరుపురాతిలో చెక్కిన 5 అడుగుల ఎత్తు, అడుగున్నర మందం, మూడడుగుల వెడల్పున్న వినాయకశిల్పం వుంది. వినాయక రూపం రాష్ట్రకూటశైలిలో వుంది. ఈ వినాయకునికి రెండుచేతులే వున్నాయి. వినాయకుని విగ్రహం వెనకవైపు కూడా వినాయకుని సిగ, వీపుభాగం చెక్కివుంది. ఆ దేవాలయ ప్రాంగణంలో భక్తాంజ నేయుడు దక్షిణాభి ముఖంగా నిలిపివుంచబడి, పూజలందు కుంటున్నాడు.

అక్కడే రాతిసలపలకు ఒరిగించి పెట్టిన 4అడుగుల పొడవు, ముప్పావు అడుగు వెడల్పుతో వున్న నల్లరాతిమీద శాసనం చెక్కబడి వుంది. ఈ శాసనం కళ్యాణీ చాళుక్యుల పాలనాకాలంనాటిది. 1వ జగదేకమల్లుడు కళ్యాణపురం(కర్ణాటక) నెలవీడుగా (తాత్కాలిక రాజధాని) వున్నపుడు, శ్రిర్యాలపురం (చీర్యాల)లోని పెద గండిరడ్డి గడేశ్వరదేవరకు (స్థానికనామం) కొన్ని మరుతురుల భూమి, కొన్ని మాడల ధనం, రాటనాలపన్ను, కొడంగల సుంకం యిచ్చినట్టు శాసనంలో చెప్పబడింది. అట్లే గడేశ్వరునికి కవచము చేసిన బ్రహ్మోజుకు కూడా 1 మరుతురు భూమి యిచ్చినట్టు తెలుపబడింది.

చీర్యాల
మండలం: కీసర
జిల్లా: మేడ్చల్‍
శిథిల శివాలయం ఆవరణలో నాలుగడు గుల పొడవు, ముప్పావు అడుగు వెడల్సున్న నల్లరాతి స్తంభంపై శాసనం
రాజవంశం: కళ్యాణీ (పశ్చిమ) చాళుక్యులు
రాజు: 1వ జగదేకమల్లుడు
తేది: శక సం.(9)6(4) అంటే క్రీ.శ. 1042, (ఆ)షాఢ శుద్ధ 15, గురువారము
భాష: కన్నడము
లిపి: తెలుగన్నడము
శాసన పంక్తులు: 27


శాసన సారాంశము:
కళ్యాణీచాళుక్య చక్రవర్తి 2వ అయ్యన తమ్ముడు జయసింహుడు ‘జగదేకమల్ల’ బిరుదుతో క్రీ.శ.1014లో సింహాసనాన్ని అధిష్టించాడు. 1042 లేక 1044వ సం.లో ఆహవమల్ల, త్రైలోక్యమల్ల బిరుదులు కల సోమేశ్వరుడు జగదేకమల్లుని తర్వాత అధికారానికి వచ్చాడు. క్రీ.శ.1042సం.లో వేయబడిన ఈ శాసనంవల్ల ‘‘శ్రిర్యాలపురము’’ (చీర్యాల) వాసి (పె)దగండిరడ్డి దేవాలయములోని గడేశ్వరదేవరకు (ప)ది మరుతురులు, మాడ, రాటణమునకు … మాడలు, ….పొలము కొలిచి రెండు మరుతురుల భూమి, ప్రతియంటికి రెండు మాడలు, గడేశ్వరదేవరకు, అడ్డా… గంధి కాలువ (కింద) 1మర్తురు భూమి, రాటణమునకు 1పుట్టెడు ధాన్యం, కొడంగడసుంకం చెల్లించాలని, గడేశ్వరదేవ కవచము చేసిన బ్రహ్మోజుకు 1మర్తురుభూమి ఇచ్చినట్లు తెలుస్తున్నది.
పూర్వం కొన్ని దేవాలయాల ఆవరణలో ఒకచోట సాగునీటి నందించేందుకు పెద్దబావిని తవ్వించి, దానికి రాటణస్తంభాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన రైతులకు నీరు అందజేసి, వారివద్ద కొంత పన్ను వసూలు చేసేవారు. మనకిటువంటి రాటణస్తంభాలు వరంగల్‍ దగ్గరలో వున్న శాయంపేట దేవాలయంలో, జాఫర్‍ గడ్‍ లోను, ఖమ్మంజిల్లా రాజేశ్వరపురంలోని దేవాలయంలోను కనిపిస్తాయి. ఆనాటి కాలంలో రాజులు విధించే సుంకాలలో అంగడిసుంకం ఒకటి. ఈ శాసనంలో ‘కొడంగడసుంకము’ అని వుంది. ఈ శాసనం రాసినవాడు…. రాజు అని చివరలో రాసివుంది.


చీర్యాల శాసన పాఠం:
1. ‘‘…ద్రి……………..హా రాజాధి
2. ………శ్రయ కులతిలక చాళుక్యాభర
3. ……….రాజ్యముత్తరోత్తరాభివృద్ధి ప్ర
4. ….ళ్యాణ పురద నెలవీడి నోళు
5. …..త్తుమిం ఏస్వస్తిశ్రీ మచ్చాళు
6. (9)6(4)నేయ శ్రీమతు జగనేకమల్ల
7. ….శాడ శుద్ధ15 గురువారదందు శ్రి
8. (ర్యా)లపురము (పె)దగండిరెడ్డి మరి
9. …ది మఱుతురున మాడ రె
10. ..త్తురున మాడ రాటనము కా
11. మాడలు ష…మి పొలము
12. గొలువ మరుతురు రెండు
13. రానకు నెఱియింటికి రెండు
14. స్వస్తిశ్రీ గడేశ్వరదేవర
15. …ద…ము..పొ………..
16. ..గడేశ్వరదేవరకు మఱ్తురు
17. ………….శ్వర దేవరకు అడ్డా
18. ..గంధి కాలువ మఱ్తు1
19. ….. …సోమ……………
20. రాటణము …పుట్టెండు1
21. …ము నంద్య కొడంగడ సుంక
22. ..విలలు..శ్రీగడేశ్వరదేవా
23. చము జేసినె బ్రమ్మోజునకు
24. మ1 గన్డపసముద్రము మ1
25. మ..స్వదత్తం పరదత్తం వా
26. …సహస్రాణి మిష్టాయాం జా
27. ……రాజు వ్రాలు


ఈ శాసనాన్ని చదివి, పాఠం రాసింది:
–శ్రీరామోజు హరగోపాల్‍,  9949498698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *