జీదిమాజా ఒక ప్రపంచ కవి

2018 అక్టోబర్‍లో చైనాలోని బీజింగ్‍ నార్మల్‍ యూనివర్సిటీ వారి ఆహ్వానం మేరకు నేను చైనా వెళ్ళాను. 22 సాయంత్రం స్వాగత విందు (welcome Banquet) లో మొదటిసారి చైనీస్‍ మహాకవి జీదిమాజా (Jidi Majia)ను చూశాను. మనిషి స్ఫురద్రూపి, అందగాడు. ఆయన సాన్నిధ్యం వల్ల కడుపుకే కాదు కంటికీ విందు చేకూరినట్టనిపించింది.


జీదిమాజా చైనాలోని 55 ఆదివాసీ తెగల్లో ఒకటైన ‘యీ’ తెగకు చెందినవాడు. ఆ తెగలో 90 లక్షల మంది జనాభా. ఆయన కవిత్వం 20 అంతర్జాతీయభాషల్లోకి అనువాదమైంది. వాటిలో స్పానిష్‍, ఫ్రెంచ్‍ ఉండక తప్పదు గదా! 30 దేశాల్లో ఆయన కవిత్వానికి విశేషఖ్యాతి లభించింది. ఆయనకు ప్రపంచస్థాయి అవార్డులెన్నో లభించాయి. ఒక్క నోబెల్‍ప్రైజ్‍ తప్ప. ప్రస్తుతం చైనారచయితల సంఘానికి ఉపాధ్యక్షుడిగా (Vice-Chairman), సెక్రటరీజనరల్‍గా ఉన్నాడు ఆయన అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఆ విందులో ఆయనొక పాట పాడాడు. అది ‘యీ’ జానపదగీతం అయి వుంటుంది. ఆ పాటతో ఆ హాలులోని గాలికి ప్రాణం వచ్చినట్టు అనుభూతి. మన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‍ గుర్తుకొచ్చాడు. నేను నాతో తీసికెళ్ళిన నా ‘జీవనభాష’ కవితా సంపుటి ఆంగ్లానువాదాన్ని (Life Speaks) ఆయనకు బహూకరించి ఫోటో దిగాను.


మరునాడు లూషన్‍ ఇనిస్టిట్యూట్‍ (Lu Xun Institute) లో కవితా పఠనం జరిగింది. కార్యక్రమం అనంతరం ఆవరణలో ఓ చెట్టు కింద నిల్చున్నప్పుడు ‘గాబీ’ అని కేక వినపడింది. (చైనీస్‍ ఉచ్చారణలో నా పేరు) చూస్తే జీదిమాజా. ఆయన తన అసిస్టెంట్లను పురమాయించి తన 3 అనువాద గ్రంథాలను ఓ అట్టపెట్టెలో పెట్టినవి నాకు బహూకరించాడు. ‘నీకు విమానం లగేజీ బరువౌతుందేమో’ అన్నాడు. ఆ గ్రంథాలు 7, 8 కిలోల బరువుంటాయి. మిగిలిన సామాను ఇక్కడ వదిలేసి అయినా వీటిని తీసుకపోతానన్నాను. ఆయన ఒక్క ప్రసన్నహాసం చాలు ఆ రాబోయే బరువును తేలికపర్చడానికి. నేను తప్పకుండా ఆయన కవితలను నా మాతృభాష తెలుగులోకి అనువాదం చేస్తానన్నాను. చైనా నుంచి నాకిదొక మంచి కానుక.
జీదిమాజా 2007 నుండి చైనాలో గొప్ప సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 1) క్వింగాయ్‍ అంతర్జాతీయ కవిత్వోత్సవం 2) క్వింగాయ్‍ కవుల టెంట్‍ ఫోరం 3) జియాంగ్‍ క్వింగ్వాయ్‍ లేక్‍ కవుల వారోత్సవం వగయిరా.


60 యేళ్ళయినా నిండని ఈ మహాకవి (1961) ఎక్కడో నైరుతీ చైనాలోని మారుమూల లింగ్‍షాన్‍ పర్వత ప్రాంతాల్లో జన్మించాడు. దీనిని ఆనుకునే మనోహరమైన క్వింగాయ్‍ సరస్సు. ఇక్కడ ఆదివాసీలు మాట్లాడేదే ‘యీ’ భాష. ఇది బర్మీస్‍, టిబెటన్‍ భాషలకు దగ్గరగా వుంటుంది. లింగ్‍షాన్‍ ప్రాంతం కొండలతో, పీఠభూములతో, లోయలతో, నదులతో, సరోవరాలతో ప్రకృతి రామణీయకానికి పెట్టింది పేరు. జీదిమాజా కవిత్వానికి భిత్తికను సమకూర్చింది ఈ నేపథ్యమే. ఒక రకంగా ప్రాకృతిక ప్రాంతాలే ఆయన కవిత్వంలోని పాత్రలు. ‘యీ’ తెగలోని పూర్వులు వాటికి ప్రాణం పోసిన ఆకాంక్షల, విశ్వాసాల, జ్ఞాన నిధులు. ఒక్కమాటలో చెప్పాలంటే గొప్ప మానవీయ ప్రతీకలు. అక్కడి చావుపుట్టుకలు, కష్టసుఖాలు, రుతువులు, పక్షులు, చెట్లు, పువ్వులు వీటన్నింటిలో జీదిమాజా ఒక బృహత్‍ జీవనాటకాన్నే దర్శించాడు. అదే ఆయన కవిత్వానికి జీవధాతువు. పట్టణ కవిత్వమే ఆధునికం అనుకునే కాలంలో ఈ మహాకవి ప్రాక్తన జీవన విధానంలోని తేజస్సును ఆధునికంగా మార్చి అలరించాడు.


జీదిమాజా రచనలు రాశిలోనూ రాసిలోనూ ప్రశస్తమైనవి. కవితా సంపుటాలు, దీర్ఘకవితలూ వగయిరా. ‘స్నోలియోపార్ట్, రివర్‍’ లాంటి కావ్యాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. వీటిని విఖ్యాత అమెరికన్‍ కవి డేనిస్‍ మేయర్‍ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. ప్రస్తుత “The  Enduring  One” కూడా ఆయన చేసిందే. మేయర్‍ అనువాదం ఆధారంగానే నేనీ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాను.
ఇక్కడో విషయం చెప్పాలి. ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో ప్రధాన భాష వుంటుంది. ఆ దేశం పేరు చెప్పగానే ఆ భాషే గుర్తుకొస్తుంది. చైనాలో చైనీస్‍ భాషను 90% ప్రజలు మాట్లాడతారు. దాని గుర్తింపు అదే. జర్మన్‍, ఫ్రెంచి, డేనిష్‍, రష్యన్‍ మొదలైన భాషల సంగతీ అంతే. ఇండియా దగ్గరికొచ్చేసరికి ఇది అనేక భాషల సమాహారం. వందలాది చిన్నచిన్న భాషలు కాకుండా సాహిత్య అకాడమీ గుర్తించినవే 24కు పైగా వున్నాయి. ఆ రకంగా ఇండియా అనగానే ఒకే భాష గుర్తుకురాదు. బయట హిందీ గురించి కొంత విని ఉన్నారు. తెలుగు గురించి తెలియదు.


తెలుగు దక్షిణ భారతదేశానికి చెందిన నాగరిక భాష అనీ, దీనికి వెయ్యేండ్లకు పైగా సాహిత్య చరిత్ర వుందనీ, తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండున్నాయనీ, 10కోట్లమంది తెలుగువారున్నారనీ అమెరికా, దక్షిణాఫ్రికా, మారిషస్‍, మలేషియా, ఫిజీ మొదలైన దేశాల్లో స్థిరపడినవారిని కలిపితే 12 కోట్లు అవుతారనీ బయటి ప్రపంచానికి తెలియదు. నేనీ పుస్తకాన్ని అనువదించడానికి కారణాల్లో తెలుగు గురించి ఇతరులకు తెలియాలనే ఉద్దేశం కూడా ఒకటి.


ఈ సంపుటిలో 103 చిన్న పద్యాలున్నాయి. ముక్తకాలివి. పరిమాణంలో చిన్న పద్యాలే కాని సాంద్రత, గాఢత వల్ల జీవితమంత పెద్దవి. పైన నేను చెప్పిన చైనీయ ఆదివాసీల ప్రాక్తన కాల పౌరాణిక వృత్తాంతాలు, మానవీయ స్పందనలు, ప్రకృతిలోని మార్మిక రహస్యాలు, వెరసి అద్భుతమైన కవితాశక్తి వీటిలో కనిపిస్తాయి. వీటిని నేను వివరించనక్కరలేదు. వేటికవే స్వయంసుబోధకాలు, రమణీయార్థ ప్రతిపాదక శోభితాలు. జీదీమాజా రచనలు మరిన్ని తెలుగులోకి అనువదించడానికి ఈ పుస్తకం నాకెంతో ప్రేరణ కలిగిస్తున్నది. ఈ అనువాదం విషయంలో నన్ను ఉత్సాహపరిచిన నా పరమమిత్రుడు, గుజరాతీ, ఆంగ్ల కవీంద్రుడు దిలీప్‍ ఝవేరి (ముంబయి) గారికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. ఆయన జీదీమాజా కవిత్వాన్ని గుజరాతీలోకి తీసికెళ్ళారు. ఆయనకన్నా ముందు జీదిమాజా సారస్వతాన్ని పశ్చిమ దేశాల్లోకి తీసికెళ్ళిన జామీ ప్రాక్టర్‍ఝాను కూడా నేనీ సందర్భంగా స్మరించక తప్పదు. నా చైనా యాత్రను రూపకల్పన చెయ్యటంలో ఆమె పోషించిన భూమిక విలువైనది. ఆమె ఉభయ భాషా ప్రవీణ (ఇంగ్లీషు, చైనీస్‍), ఇరు దేశాల్లో పౌరసత్వం గల అరుదైన వనితామణి. అలాగే నా అనువాదం చిత్తుప్రతిని చదివి చక్కని సూచనలు చేసిన అగశ్రేణి కవీ, రచయితా నాకెంతో ఆత్మీయులు విహారిగారికి నా ధన్యవాదాలు.


-డా।। ఎన్‍.గోపీ,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *