నలభై వసంతాల మాభూమి

1950లలో భారతదేశంలో నవ్య సినిమా ప్రారంభమై దాని ప్రభావం క్రమంగా మరాఠి, ఒరియా, అస్సామి రంగాలకు పాకినా దక్షిణాదిని తాకింది 1970 ప్రారంభంలో. అదీ మలయాళ రంగాన్ని. అప్పటికే రామూ కారియత్‍ వంటివారు ‘నీలక్కుయిల్‍’ (1954), ‘చెమ్మీన్‍’ (65), పి.రాందాస్‍ ‘న్యూస్‍పేపర్‍ బాయ్‍’ (1954) వంటి ఆలోచనాత్మక చిత్రాలు మలయాళంలో వచ్చినవి. అయితే ఆదూర్‍ గోపాల కృష్ణన్‍ మలయాళ చిత్రరంగ ప్రవేశం మలయాళ సినిమా రంగాన్ని మహత్తరమైన మలుపు తిప్పింది.


వీటన్నింటి ప్రభావం మద్రాసును తాకలేదు కానీ హైదరాబాదును తాకి. అది సికిందరాబాదు ఆల్వాల్‍లో పుట్టి పెరిగిన ‘శ్యాం బెనగల్‍’ని ప్రభావితం చేశాయి. శ్యాంబెనగల్‍ అచ్చ తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, ‘అంకుర్‍’ సినిమాగా 1974లో తీశారు. తెలంగాణలోని భూస్వాముల దౌర్జన్యాలు, స్త్రీలపట్ల అమానవీయంగా ప్రవర్తించే తీరుకు దృశ్యరూపం ఇస్తూ ఈ సినిమా తీశారాయన. జాతీయస్థాయిలో అది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటీ నటుల అవార్డులను సాధించింది. అట్లా భారతదేశంలో సమాంతర సినిమాకు హైదరాబాదు తొలి బీజం వేసింది. శ్యాంబెనెగల్‍ తెలంగాణ గడీల దొరల కథతో ఆ తరువాత ‘నిశాంత్‍’ తీశారు.
సరిగ్గా ఇదే కాలంలో వరంగల్‍కు చెందిన, టి.మాధవరావు దాశరథి రంగాచార్య రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవలను అదే పేరుతో తెరకెక్కించారు. ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినా సినిమా ట్రీట్‍మెంట్‍ సరిగ్గా లేకపోవడంతో ఫెయిలయింది. కానీ తెలంగాణ భాష, యాస, కథలతో తెలుగులోతయారైన తొలి చిత్రంగా ‘చిల్లర దేవుళ్ళు’ (1977) చరిత్రకెక్కింది. ఇటు డైబ్భైల్లో తెలుగు సినిమా పతన దశకు చేరుకున్నది. అగ్ర హీరోలుగా ఉన్న ఎన్టీఆర్‍, ఎన్నార్‍లు స్టెప్పులు, ఫైట్లు చేస్తూ కొత్తతరంతో పోటీపడుతూ ఉంటే సినిమా రంగం సంక్షోభిత కాలంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అది.


తెలుగు సినిమా రంగంలో 1970లో మొదలైన పతనదశ 1980 నాటికి క్రమంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న సమయం అది. తెరనిండా హత్యలు, దోపిడీలు వికృత నృత్యాలు, ద్వంద్వార్థాల సంభాషణలు, పాటలు ఆ తరానికి చెడుపు చేసే కథలు, విలయతాండవం చేస్తున్న కాలమది. అప్పటి దాకా (1970) కాల్పనిక కథలే అయినా సమాజానికి చెరుపు చేయని చిత్రీకరణ కొంత ఉండేది. సంగీత, సాహిత్యాలు, విలువల గురించి కొద్దిగా బాధ్యతలుండేవి. కానీ ఆ తరువాత అవన్నీ సినిమాకు అంటరానివైనవి. ఇలాంటి తరుణంలో ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని, విభిన్నతను ఇంకా చెప్పాలంటే ఒక వాస్తవిక సమాజాన్ని తెరకెక్కించాలని ప్రజలు తమ కోసం చేసిన ఒక మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని దృశ్యమానం చేస్తూ కొందరు ఔత్సాహిక ప్రగతిశీల వాదులు చేసిన అపూర్వ ప్రయత్నమే  ‘మాభూమి’ సినిమా.


మాభూమి : వెండితెరపై
తెలంగాణ మట్టిమనుషుల పోరాటం

మా భూమి సినిమా నిర్మాణ ప్రయత్నాలు 1977లోనే మొదలైనవి. అయితే అంతకు ముందు వచ్చిన మృణాల్‍ సేన్‍ ‘ఒక వూరి కథ’ విడుదలైంది. దాని నిర్మాత రవీంద్రనాథ్‍. అయితే అది వ్యాపార పరంగా విజయం పొందక పోయినా, తెలంగాణలో సినిమా నిర్మాణానికి ఊతమిచ్చింది. దీని ఫలితం ఎలా ఉన్నా మళ్ళీ కూడా మృణాల్‍ సేన్‍తో తమ సినిమాను దర్శకత్వం చేయించాలని రవీంద్రనాథ్‍- బి.నరసింగ రావులు అనుకున్నారు. ఆనుకున్నట్లుగానే ఇద్దరూ వెళ్ళి మద్రాసులో ఉన్న మృణాల్‍సేన్‍ను అడిగారు. ఆయన బడ్జెట్‍ ఎంతపెడతారని అడిగితే తాము అనుకున్న బడ్జెట్‍ చెప్పారు. ఆయన దృష్టిలో అది చాలా చిన్న బడ్జెట్‍ అనిపించడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తక్కువ బడ్జెట్‍లో నేను సినిమా తీసిపెట్టలేనని చెప్పారు. అయితే మళ్ళీ ఆయనే మీకు సరిపోయె దర్శకుడు బెంగాల్‍లో ఒకడున్నాడు. అతనిప్పటికే డాక్యమెంటరీలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాడని గౌతంఘోష్‍ను సూచించారు. గౌతంఘోష్‍ అప్పటికే ‘ది న్యూ ఎర్త్’, ‘హంగ్రీ ఆటమ్‍’ డాక్యుమెంటరీలు తీసి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు. మృణాల్‍సేన్‍ సలహా మేరకు ‘మాభూమి’ సినిమా కోసం గౌతంఘోష్‍ని దర్శకుడిగా ఎంపిక చేయడానికి నరసింగరావు- రవీంద్రనాథ్‍ల బృందం కలకత్తా వెళ్ళింది.


గౌతంఘోష్‍ సినిమా తీయడానికి ఒప్పుకున్నాడు. అయితే కథ ఏమిటనే చర్చ మొదలైంది. తెలంగాణ ఇతివృత్తంగా ఉండాలన్నది మొదటి ప్రాధాన్యం. దాంతో కిషన్‍ చందర్‍ ఉర్దూలో రాసిన ‘జబ్‍ ఖేత్‍ జాగే’ నవలను సినిమాగా తీయడానికి నిర్ణయమైంది. ఈ నవల అప్పటికే ‘జైత్రయాత్ర’ పేరుతో తెలుగులోకి అనువాదమైంది. దీనికి కింద ట్యాగ్‍లైన్‍ ‘పొలాలు మేల్కొన్నపుడు’’. హిందీలో కొంత ప్రవేశం ఉన్న గౌతంఘోష్‍ ‘జబ్‍ ఖేత్‍ జాగే’ నవల ఆధారంగా ఒక స్క్రీన్‍ప్లే రాసుకుని హైదరాబాదు వచ్చారు.
‘‘అయితే ఆయన తయారుచేసిన స్క్రిప్టు మాకు నచ్చలేదు. తెలంగాణలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ‘మగ్దూం మొయినుద్దీన్‍ చెప్పిన సంఘటనల ఆధారంగానే కిషన్‍ చందర్‍ ‘జబ్‍ ఖేత్‍ జాగే’ నవలను రాశారు. ఆ నవలలోని కొన్ని విషయాలు అశాస్త్రీయంగా అనిపిస్తాయి. గౌతం బెంగాలీ కావడం తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి తెలియనివాడవటంతో ఆ నవలలో ఉన్న అంశాల ఆధారంగానే తన స్క్రిప్టు తయారుచేసుకున్నాడు. అందుకే మేం ఆ స్క్రిప్టును ప్రక్కనపెట్టి అందరం కలిసి తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిన కొన్ని ప్రాంతాలలో తిరగాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే సూర్యాపేట, బైరాన్‍పల్లి, బాలముల, నల్గొండ, వరంగల్‍, కరీంనగర్‍ తదితర ప్రాంతాలు తిరిగాం. తెలంగాణ పోరాటంలో పాల్గొన్నవాళ్ళని ప్రత్యక్షంగా కలుసుకుని వాళ్ళ అనుభవాలను తెలుసుకున్నాం. వీటికితోడు లైబ్రరీల్లో 1940 ల నాటి మీజాన్‍ డెక్కన్‍ క్రానికల్‍, గోల్కొండ పత్రికల్ని తిరగేశాం. సాయుధ పోరాటంపై నాయకులు, రచయితలు రాసిన పుస్తకాలు సేకరించాము. ఫోటోల్ని సేకరించాము. సమాచార సేకరణ పూర్తయ్యాక నేను, గౌతం, పార్థా బెనర్జీ, ప్రాణ్‍రావు కూర్చుని స్క్రిప్టు సిద్ధం చేశాం. గ్రామీణ జీవితంలో అనుభవజ్ఞుడైన లక్ష్మారెడ్డిని పిలిపించి స్క్రిప్టులో అశాస్త్రీయమైనవి ఏవైనా ఉంటే చెప్పమని సలహాలు తీసుకుని ఫైనల్‍ స్క్రిప్టు సిద్ధం చేశాం’’ అంటారు బి.ఎన్‍.


సినిమా అంతా 1940ల నాటి వాతావరణం ప్రతిబింబించాలి. తెలంగాణ పల్లె జీవనం ఎట్ల ఉంటదోనన్నది కనిపించాలి. అందుకు నర్సింగరావు, గౌతంఘోష్‍ బృందం అంతా ఊర్లలోకి తెల్లవారు తుండగానే వెళ్ళి ప్రజల ఇండ్లముందు కాపలా కాసేవారు. లేస్తూనే వారి దినచర్య ఎట్లా ఉంటది, స్త్రీలు ఎలాంటి పనులు చేస్తారు, జనాల కట్టు, బొట్టు, ఆహార్యం, అలవాట్లు, వాచికం అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. వీటన్నింటి వెనుక ఉన్నది బి.నర్సింగ్‍రావే. ఇంకా మా భూమిలోఉపయోగించడానికి ఎలాంటి పాటలుండాలి, బుర్రకథ, పీర్ల పండుగ, దూలా, పోచమ్మ పండుగ, వరినాట్ల పాట, వాటికి సంబంధించిన ట్యూన్లు ఆన్నికూడా బి.నర్సింగరావుఎంపిక చేసినవే. లొకేషన్‍లో అప్పటికప్పుడు డైలాగ్‍లు రాసి షూటింగ్‍ చేయడంవల్ల సినిమాలో సహజత్వం కనిపిస్తుంది. పెద్ద మనుషులంతా ఒకచోట కూర్చుని వ్యూహ రచన చేసేటప్పుడు మాట్లాడుకునే మాటలు ‘‘పెద్దమనిషి తరీఖానేనా ఇది’’ అని అనడంవంటివి గ్రామీణ సంభాషణ రీతులను పట్టిచూపుతవి.


సినిమా షూటింగ్‍ హైదరాబాదులోని సారథి స్టూడియోస్‍, పురానాపూల్‍, హైకోర్టు పరిసరాలు, సిటీ కాలేజి, జూబ్లీహిల్స్, గాంధీనగర్‍లోని పైపుల ఫ్యాక్టరీ, వనస్థలిపురంలోని నయాఖిల్లా, పాతబస్తీలోని జహనుమా, ఖజానా తదితర ప్రాంతాలతోబాటు యాప్రాల్‍, అల్లీపూర్‍, దొంతి, నర్సాపూర్‍ ఫారెస్టు, మంగళపర్తి, మెదక్‍ లో జరిగింది.


పాత్రధారుల కాస్టూమ్స్ చార్మినార్‍ ఏరియాలో కొనుగోలు చేశారు. వీటితోబాటు పోలీసుల టోపీలు, డ్రెస్‍లు, బూట్లు, బాడ్జెస్‍లన్నింటినీ కాలానుగుణంగా ప్రత్యేకంగా సంపాయించారు. ఈ ప్రయత్నాల, ప్రయాసల వెనుక దర్శక నిర్మాతల కృషి చిత్తశుద్ధి కనిపిస్తుంది.
సినిమా షూటింగ్‍ మొదలైంది. మెదక్‍ జిల్లాలోని మంగళపర్తి, దొంతి, దౌల్తాబాదు గ్రామాలతో బాటు మెదక్‍లో సుమారు 50 రోజుల పాటు మాభూమి చిత్రీకరణ జరుపుకున్నది. ప్రధానపాత్రధారులు విడిగా కనిపించకుండా జనంలో ఒకరుగా కనిపించడం చిత్రీకరణలో ప్రత్యేకత. గ్రామస్తులుగా నటించినా వారిలో చాలా మటుకు నిజమైన ఊరి జనమే నటించారు. కేవలం 5.5లక్షల చిన్న బడ్జెట్‍లో భారీ కాన్సెప్ట్తో సినిమా మాభూమి. దొరల మీద దాడి లాంటి సీన్లలో నటించడం కాదు అంతా జీవించారు. ‘దొంతి’లో గడిని ముట్టడించే సీన్‍ తీసే నాటికి వాళ్లేమనుకున్నారో గాని ఆ సీన్‍ తీయడానికి ఒప్పుకోలేదు. అనుమతి లేకుండానే జనం ఆగ్రహంతో ఉరికి వస్తుంటే సెట్‍ చేసుకున్న కెమెరాలతో జనం గడి తలుపులు తోసుకొని ముందుకెళ్ళే షాట్‍ను చిత్రీకరించారు.


దర్శకుడు గౌతం ఘోష్‍ మాభూమి షూటింగ్‍ అనుభవాన్ని చెప్పుకుంటూ ‘‘ఈ సినిమాలో నటించిన వారంత అమెచ్యూర్‍ ఆర్టిస్ట్లే. మోహన్‍ కోడా, సాయిచంద్‍ సహా. వీళ్లకు ఒక వారం రోజులపాటు ట్రైనింగ్‍ ఇచ్చాం. మా భూమిలో గ్రామస్తులుగా నటించిన వారిలో చాలా మంది నిజమైన గ్రామస్తులే. అదీగాకుండా సాయుధ పోరాటంలో పాల్గొన్నవాళ్లు కొందరు ఇందులో నటించారు. నిజంగా ఇది నా అదృష్టం. ఒకరకంగా ఈ సినిమా నాకు సాహసం వంటిది. చిన్న బడ్జెట్‍. భారీ కాన్సెప్ట్. పైగా ఇది నా తొలి సినిమా. డైరెక్టర్‍గా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇచ్చిన సినిమా. క్లైమాక్స్లో దొరల మీద దాడి లాంటి సీనులో నటించడంకాదు అంతా జీవించారు. గడీని ముట్టడించే సీన్‍ ఒకటుంది. అప్పటి వరకూ గడీలో షూటింగ్‍కు పర్మీషన్‍ ఇచ్చిన వాళ్లు ఎందుకో గాని తర్వాత షూటింగ్‍ చేయవద్దన్నారు. గేట్‍ మూసేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. జనాలు అంతాగేట్లు పగలగొట్టేంత ఆవేశంలో ఉన్నారు. అప్పుడు నేను ‘‘భూపాల్‍ నిజంగానే అటాక్‍ చేద్దామా?’’ అన్నాను. నువ్వు ఒకే అంటే చేద్దాం అన్నాడు. తెల్లవారే పడ్బందీగా ప్లాన్‍ వేశాం. ఊళ్లో ప్రజలంతా ఆగ్రహంతో ఉరికి వస్తుటే కెమెరాలను సెట్‍ చేసుకున్నాను. ఇంకేముంది జనం తలుపులు బద్దలు కొట్టారు. షాట్‍ డబుల్‍ ఒకే అయింది.’’ చిత్రీకరణలో చారిత్రక సంఘటనలు చూపించేటప్పుడు అప్పటి వార్తా పత్రికలు లైబ్రరీ షాట్స్ని వాడటంలో సినిమా స్థాయి మరింత పెరిగింది.

సినిమా అంతా మూడు షెడ్యూల్స్లో పూర్తయింది. బ్యాక్‍గ్రౌండ్‍ మ్యూజిక్‍ గౌతాఘోష్‍నే చేశాడు. పాటలన్నీ హైదరాబాదులోని జర్మన్‍ లైబ్రరీలో రికార్డు చేశారు. సినిమా పూర్తయి సెన్సార్‍కి వెళ్లింది. ఏమవుతుందోననే భయం. కానీ సెన్సార్‍ సభ్యులు నిర్మాతలను లోపలకు పిలిచి అభినందించి సర్టిఫికెట్‍ ఇచ్చారు. విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. చూసిన వారంతా ఇదేదో రాజకీయ పాఠాలు చెప్పినట్లుగా ఉందని వెనక్కివెళ్లి పోయారు. చివరికి లక్ష్మీ ఫిలింస్‍, శ్రీతారకరామా ఫిలింస్‍ వారు రిలీజ్‍ చేశారు. ఆ రోజు 1980 మార్చి 23. విడుదలైన చోటల్లా హౌస్‍ఫుల్‍. టికెట్స్ దొరక్క థియేటర్ల వద్ద జనం గుంపులు గుంపులుగా వెనక్కి వెళ్ళిపోయారు. థియేటర్లు ఈలలు డ్యాన్సులతో మారు మ్రోగినవి. అదో గొప్ప చరిత్రాత్మక విజయం. ప్రజలు ఇండియన్‍ ఆర్మీ దళాలపై పోరాటం చేసిన చారిత్రక వాస్తవాన్ని దృశ్యమానం చేసిన తొలిచిత్రం మాభూమి నే. ఇందులోని పాత్రలన్నీ సహజమైన గ్రామీణ భాషను, ముస్లిం పాత్రలు హైదరాబాదీ ఉర్దూలో మాట్లాడుతై. ఈ సినిమా రాకతో తెలుగు సినిమాకు మంచి రోజులు రానున్నాయని పత్రికలు రాశాయి.


వెండితెరపై ప్రల పోరాట చరిత్ర
‘మా భూమి’ చిత్ర కథాకాలం 1936-51. తెలంగాణలోని సిరిపురం గ్రామానికి జగన్నాథరెడ్డి ఒక పెద్ద జమీందారు. భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధి. ప్రజలను దోపిడీ చేసే విలాస జీవితం గడుపుతుంటాడు. పేదలకు, రైతులను అణగద్రొక్కుతుంటాడు. కానీ పెత్తందార్ల దోపిడీ, దౌర్జన్యాలు ఎంతకాలం సాగుతాయి. ఏదో సందర్భంతో ప్రజల్లో చైతన్యం మొదలవుతుంది. అది రామయ్య అనే రైతు రూపంతో మొదలవుతుంది. పేద రైతు వీరయ్య కొడుకే రామయ్య. వీరయ్య కొడుకుగా రామయ్య కూడా చిన్ననాటనే జీతగాడవుతాడు. పెరిగి పెద్దవాడైన రామయ్య చంద్రిని ప్రేమిస్తాడు. కానీ ఆమె జమీందారు కామవాంఛకు బలవుతుంది. అది తెలిసిన రామయ్య చంద్రిని తిరస్కరించి ఊరు వదలివెళ్లిపోతాడు. సూర్యాపేట, హైదరాబాదులకు పోయి అక్కడ యూనియన్‍ నాయకులతో ఎన్నో విషయాలు తెలుసుకుని మానసికంగా పరిణతి సాధిస్తాడు. తాను పని చేస్తున్న ఫ్యాక్టరీలో జరిగిన సమ్మెలో పాల్గొని అరెస్టవుతాడు. జైల్లో మిత్రుడు నాగయ్య (బి.నర్సింగరావు)ను కలుస్తాడు. సిరిపురంలో జమీందారుకు విరుద్దంగా జరుగుతున్న పోరాటాల గురించి వివరిస్తాడు. ప్రజలకు భూమి మీద హక్కు ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మి తిరిగి గ్రామానికి వెళ్లి పోరాటానికి నాయకత్వం వహిస్తాడు. గెరిల్లా దళాలు ఏర్పడతాయి. భూస్వాముల పునాదులు కదిలిపోతాయి. అంతా పట్టణాలకు వలసపోతారు. 1948లో నిజాం లొంగిపోయి నిరంకుశపాలన అంతమైనా భూమిపై హక్కులను ప్రజలు పొందలేకపోయారు. పోరాటం కొనసాగుతుంది. చివరకు రామయ్య పోలీసు కాల్పుల్లో మరణిస్తాడు. సినిమాలో అంతా కొత్త వారే అయినా పరిణతి చెందిన నటన చూపిస్తారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవీంద్రనాథ్‍ ఏమంటారంటే ‘‘మాభూమి’ ప్రజల సినిమా. జీవితంలో నేనేమైనా మంచిపని చేశానంటే అది ‘మాభూమి’ సినిమా తీయడం . ‘మాభూమి’ తీసిన ఆ రెండేళ్ళూ ఒక యజ్ఞంలా భావించాము. రెండో పనిలేదు. ఎందరో ఈ మహాయజ్ఞంలో తోడ్పడ్డారు. ముఖ్యంగా నా భార్య. సినిమా విడుదలైన మూడోరోజు ఆదివారం. మాకు యజ్ఞఫలం దక్కింది. సుదర్శన్‍ టాకీస్‍లో టిక్కెట్ల కోసం పెద్ద దాడే జరిగింది. అది చూసి ఇంతమంది జనం మా సినిమా కోసం వచ్చారా అన్న ఆనందం ఒకవైపు. అలాగే ఆరోజు పొందిన ఆనందం జీవితంలో మరువలేను. సినిమా అంతగా సక్సెస్‍ అవుతుందని ఊహించి ఉండలేదు. ఏదో సినిమా తీయాలనుకున్నాం చేశాం అనుకున్నారు. కానీ నేనొక్కడినే ‘మాభూమి’ అపూర్వ విజయం సాధిస్తుందని నమ్మాను. ఎందుకంటే ప్రజలకు మనం కావలసింది ఇస్తే వాళ్ళు మనకు ఆదరణ రూపంలో తిరిగి ఇస్తారని నమ్మినవాణ్ణి. అది అక్షరాలా నిజమైంది.


సినిమా తీసినంత కాలం ఏరోజుకారోజు డబ్బులు వెదుక్కుని సెట్స్ మీదికి వెళ్ళేవాళ్ళం. ఇందుకు అమ్మవలసినవన్నీ అమ్మేశాను, కుదువ పెట్డాల్సినవన్నీ కుదువపెట్టేశాను. సినిమా పూర్తయింది. సెన్సార్‍ చేయించాలి. చివరికి భద్రంగా దాచుకున్న వెడ్డింగ్‍ రింగ్స్ కూడా అమ్మేశాను. (గుర్తుందా భూపాల్‍?). వచ్చిన 700/- రూపాయలతో సెన్సార్‍ చేయించాము. అవన్నీ తలచుకుంటె భావోద్వేగం తన్నుకువస్తోంది. ఎంతోమందిమి కలిసి పనిచేశాం. వారంతా హృదయపూర్వకంగా పనిచేశారు. అందరూ తమదైన పాత్ర పోషించారు. తక్కువ, ఎక్కువ అని లేదు. సమిష్టి కృషి ఫలితమే ‘మాభూమి’. ‘మా భూమి’ ప్రజల సినిమా గనుకనే ప్రజలు ఆదరించారు అని అంటారు ఆయన.’’


మాభూమి తెరపై
‘మాభూమి’లో కథా నాయకుడు రామయ్యగా త్రిపురనేని గోపీచంద్‍ కొడుకు సాయిచంద్‍, తండ్రి వీరయ్యగా కాకరాల, జమీందార్‍గా ఎంబీవీ ప్రసాదరావు, పట్వారీగా లక్ష్మణ్‍రావు లంబాడి చంద్రిగా మరాఠి నటిహంస, ఇంకా నరసింగరావు, గద్దర్‍, భూపాల్‍రెడ్డి, రామిరెడ్డి, ప్రదీప్‍శక్తి, విజయప్రకాశ్‍, మాస్టర్‍ సురేశ్‍, యాదగిరి, రాజగోపాల్‍, రాజేశ్వరి, శకుంతల, పోచమ్మ, సూర్యకుమారి, రమణి తదితరులు నటీనటులు. బి.నరసింగరావు – ప్రాణ్‍రావ్‍లు సంభాషణలు రాశారు. తెలంగాణ యాసలో మాటలు జీవం పోసుకున్నవి. సహజ జానపద స్వరాలతో సంగీతం చేసింది వింజమూరి సీతాదేవి. బి. గోపాలం ఆర్కెస్ట్రా సమకూర్చారు. గద్దర్‍ పాడిన, బండి యాదగిరి రాసిన ‘బండెనక బండికట్టి’ నేటికీ తెలంగాణ జనజీవన గీతమేసుద్దాల హనుమంతు రాసిన ‘పల్లెటూరి పిల్లగాడ పసులగాసె మొనగాడ’ పాట సంధ్యనోట జీవం పోసుకున్నది. ‘పొడలా పొడలా గట్లా నడుమ’ పాట కూడా మరవదగినది కాదు. సినిమాటోగ్రఫి నిర్వహించింది కమల్‍నాయక్‍. వైకుంఠం కళ, డి.రాజగోపాల్‍ ఎడిటింగ్‍ నిర్వహించారు. కాస్ట్యూమ్స్ గౌతం గర్ల్ఫ్రెండ్‍ నీలాంజన చేశారు. (అప్పటికి వారిద్దరికి పెళ్లి కాలేదు). చైతన్య చిత్ర ఇంటర్నేషనల్‍’’ బ్యానర్‍పై చిత్ర నిర్మాణం జరిగింది.


మాభూమి నా జీవితంలో ఒక అద్భుతం : సాయిచంద్‍
ఎప్పటికీ ‘మాభూమి రామయ్య’నే అని అంటారు ప్రధాన పాత్ర పోషించిన సాయిచంద్‍. ‘‘మాభూమి సినిమా నా జీవితంతో పెనవేసుకుపోయింది. అంతా నిన్న మొన్న జరిగినట్లుగా ఉంది. నా జీవితం ‘మాభూమి’కి ముందు తరువాతగా మారింది. నన్ను ఈ చిత్రం జీవితానికి దగ్గరగా తీసుకుపోయింది. అంతకుముందు నేను అలాంటి వాస్తవిక జీవితాన్ని చూడలేదు. సహజత్వం కోసం 1940ల నాటి వాతావరణం ఉట్టిపడేలా వున్న మంగలపర్తిలో సినిమా తీశారు. కరెన్సీ దగ్గర్నుంచి అన్నీ ఆ కాలం నాటివే వాడారు. అవే కాస్టూమ్స్. థియేటర్‍ నుంచి వచ్చిన వారవడం వల్ల వారిద్దరు ప్రతీది చేసి చూపేవారు. దాంతో నాకు నటించడం ఈజీ ఐపోయింది. ‘రామయ్య’ పాత్రలో లీనమయ్యాను. నాతోనేమిటి ఊరి వాళ్లతో కూడా ఉదా।। కొమరయ్య, సాయిలు మొదలైనవారిని వారి వారి పాత్రల్లో సహజంగా నటింపజేయడం గౌతం, నర్సింగ్‍ల గొప్పతనమే. ‘మాభూమి’ నా జీవితంలో ఒక అద్భుతం. ఆ సిండ్రోమ్‍లోనే ఉండిపోయాను. అందుకే అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ‘మాభూమి రామయ్య’గానే ఉండిపోతాను.’’


మాభూమి అద్భుత ఆవిష్కరణ : బి.నర్సింగరావు
‘‘మాభూమి’’లోని ఒక్కో ఎపిసోడ్‍లో ఒక్కో సినిమా ఉంది అంటారు బి.నర్సింగరావు. ఆ సినిమా ఏడాది పాటు ఏకబిగిన ఆడింది. స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం, స్క్రీన్‍ప్లేకు నంది అవార్డులు అందుకున్న మాభూమి ఇండియన్‍ పనోరమాకు ఎంపికైంది. రాజకీయ కారణాల వల్ల జాతీయ అవార్డు రాలేదు. ఫిలింఫేర్‍, సిని హెరాల్డ్ అవార్డులతో బాటు ట్రివెండ్రమ్‍, కార్ల్ వివరీ, కైరో, సిడ్ని, తాష్కెండ్‍ ఫిలింఫెస్టివల్స్లో ప్రదర్శితమైంది. సీఎన్‍ఎన్‍ ఐబిఎన్‍ వారు భారతదేశంలో ఎంపిక చేసిన నూరు అత్యుత్తమ చిత్రాల్లో మాభూమి స్థానం సంపాదించుకున్నది. ఏ విధంగా చూసినా వెండి తెరపై తెలంగాణ మట్టి వాసనకు దృశ్యరూపం ఇచ్చిన సినిమా ‘మాభూమి’. ప్రజల పోరాటానికి, ఆ చరిత్రకు, సంస్కృతికి, భాషకు సినిమా పరిభాష ‘మాభూమి’. ఒకనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి సహజమైన నలుపు తెలుపులో అద్భుత ఆవిష్కరణ ‘మాభూమి’.


– హెచ్‍.రమేష్‍బాబు,
 7780736386

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *