రాజును బంధించిన చెరసాల ‘సీతారాంబాగ్‍ దేవాలయం’


అడుగడుగునా అనేకానేక సతత హరిత, సప్త రంగుల తీరున్నొక్క, ఫల పుష్ప సుగంధ భరిత ఉద్యానవనాలు, తుమ్మెదల జుంకారపు ధ్వనులు ప్రతిధ్వనించే పూదోటలు, పొదరిండ్ల వలన ఆ బంగారు దినాలలో భాగ్య నగరాన్ని ‘‘భాగ్‍ నగర్‍’’ అని కూడా అనేవారు. నిజంగానే అదొక సార్థక నామధేయం. భాగ్‍ల పేరుతోనే అనేకానేక బస్తీలు అవతరించాయి. ఉదాహరణకు సీతారాం బాగ్‍, బషీర్‍ భాగ్‍, జాం భాగ్‍, అజీజ్‍ భాగ్‍, మురళీధర్‍ బాగ్‍, ఇబ్రాహీం భాగ్‍, ఫూల్‍ భాగ్‍, మూసారాం భాగ్‍, రాం భాగ్‍, కిషన్‍ భాగ్‍, లలితా భాగ్‍, అసద్‍ భాగ్‍ (నేటి నిజాం కాలేజీ), భాగ్‍ లింగంపల్లి, భాగ్‍ అంబర్‍ పేట్‍, భాగే ఆం (పబ్లిక్‍ గార్డెన్‍). మరి ఆ తోటలన్నీ ఏమైపోయినాయి? నగరం నిప్పుల కొలిమిలా ఎట్లా మారింది?


విజ్ఞులు, పెద్దలు ఆగ్రహించకపోతే ఒక చిన్న మాట సెలవిస్తాను. భారతదేశంలోని ఈ ఉద్యానవనాల పోషణా, పెంపకం సంస్క•తి (సెంటర్‍ ఫర్‍ హార్టికల్చర్‍) మధ్య ఆసియా దేశాల నుండి దిగుమతి అయిందని కూడా ఒక ఆలోచన చెలామణీలో ఉంది. మధ్యాసియా లోని ఉజ్బెకిస్తాన్‍ నుండి వచ్చిన బాబర్‍ ‘‘భాగ్‍లు లేని భారతదేశాన్ని’’ చూసి ఆశ్చర్యపోయాడట. హిమము కురిసే మంచు ప్రాంతాల నుండి వచ్చిన మొగలులు మన దేశంలోని వేడిని తట్టుకోలేక విశాలమైన సతతహరిత ఉద్యానవనాలను పెంచి పోషించారు. ఫలితంగా షాజహాన్‍ కాలంలోనే కాశ్మీరులో ‘‘షాలిమార్‍ గార్డెన్‍’’ ఏర్పడింది. దానిని సందర్శించిన ఆ షహెన్‍షా భూమ్మీద వెలిసిన స్వర్గం అంటూ ఏదైనా ఉంటే అది ఇదే ఇదే ఇదే అని ఫార్సీ కవిత్వ భాషలో ముమ్మార్లు కీర్తించాడట. ఎసిలు లేని ఆ కాలంలో వేడి వాతావరణాన్ని చల్లబరచటం కోసం ఉద్యానవనాలలో వాటర్‍ ఫౌంటేన్‍లను అనగా జల యంత్రములను పరిచయం చేసిన ఘనత కూడా మొగలులదే.. మండుటెండలను పండు వెన్నెలలుగా మార్చేందుకు మన దేశానికి కర్బూజాలను, తర్బూజాలను పట్టుకొచ్చిందీ వారే. మన ప్రాచీన కట్టడాలు, శిల్ప వైభవానికి తోడుగా మినార్‍లు, కమాన్‍లు, గుంబజ్‍లు, మహళ్ళు, మక్బరాలను నిర్మించి భారతదేశ వాస్తు శిల్ప నైపుణ్యానికి నగిషీలు అద్దింది మొగలులే. వారే రాకపోతే, లేకపోతే మనకు ఒక ఎర్రకోట, ఒక తాజ్‍ మహలు లేకపోయేది కదా.. ఇకపోతే బిర్యానీలు, పులావ్‍లు కూడా తెలియని మనం పులిహోరా, దద్దొజనం, చెక్కర పొంగళిలతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చేది కదా!


సరే మళ్ళీ మన సీతారాం భాగ్‍ దేవాలయానికి పోదాం పదండి. మంగల్‍ హాట్‍ నుండి మల్లేపల్లికి వెళ్ళే దారిలో ఎడమవైపు కొంచెం లోపల ఈ పురాతన దేవాలయం ఉంది. రాజస్థాన్‍ నుండి తెప్పించిన పాలరాతితో సీతారాముల విగ్రహాలను తొలిచి 1833 ప్రాంతంలో అనగా 182 సంవత్సరాల క్రిందట ఈ దేవాలయాన్ని పురాన్‍ మల్‍ గనేరీ వాలా అనే ఒక రాజస్థానీ బ్యాంకర్‍ నిర్మించాడు. 25 ఎకరాల విశాలమైన ఉద్యానవనం మధ్యలో ఉన్న ఈ దేవాలయాన్ని ప్రజలు సీతారాం భాగ్‍ అన్నారు. ఈ దేవాలయం నిర్వహణ కోసం నిజాం నవాబులు ఒక జాగీరును దానం చేసారు. ఈ దేవాలయం వాస్తు శిల్ప నిర్మాణ నైపుణ్యమంతా మొగలాయీ, రాజస్థానీ, పద్ధతులలో ఉంది. ఇప్పటికీ గనేరీ వాలా వంశ వారసులే ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు.


సరే ఇక అసలు కథకు వద్దాం. ఈ సీతారాం భాగ్‍ దేవాలయానికి వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావుకు సంబంధించిన జనరంజకమైన, మనో రంజకమైన ‘‘మజేదార్‍’’ కహానీ ఒకటి ఉంది. ఇక ఆ కథ కూడా చెప్పుకుందాం.
వనపర్తి సంస్థానానికి చెందిన రాజా రామేశ్వరరావు ఒక అద్భుత సాహస వీరుడు. రాబిన్‍ హుడ్‍ లాంటివాడు. కేవలం వీరుడే కాక అష్ట భాషా కోవిదుడు. తెలుగు, ఉర్దూ, పర్షియన్‍, ఇంగ్లీష్‍ భాషలలో బాగా పట్టున్నవాడు. పద్నాలుగు సంవత్సరాలకే సింహాసనాన్ని అధిష్టించాడు. 1830లలోనే అతను యూరోపియన్‍ పాశ్చాత్య జీవన శైలిని అనుసరించాడు. యూరపుకు సంబంధించిన మిలిటరీ దుస్తులను, ఫర్నీచర్‍ను, క్రాకరీ, కట్లరీని వాడేవాడు. హైద్రబాద్‍లోని బ్రిటిష్‍ రెసిడెంటుతో స్నేహ సంబంధాలను నిర్వహించేవాడు.


కోడె వయసులో శంకరమ్మ అనే పల్లె పడుచును ప్రథమ వీక్షణంలోనే మోహించి ఆమెను గుర్రంపై తన గడీకి ఎత్తుకొచ్చి పెళ్ళి చేసుకున్నాడు. శంకరమ్మతో పాటు ఆమె చిన్నారి చెల్లె ‘‘జానమ్మ’’ అనే మూడు సంవత్సరాల పాప కూడా గడీలోనే పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు కరోలినా అనే కొత్త పేరు పెట్టి మద్రాసులోని కాన్వెంటు విద్యాభ్యాసానికి పంపాడు. అక్కడామె ప్రతిభావంతురాలుగా పేరు తెచ్చుకుంది. శంకరమ్మకు పిల్లలు కలగనందున రాజావారు కరోలినాను కూడా వివాహం చేసుకున్నాడు. కరోలినా పాశ్చాత్య జీవన శైలిని అనుసరించింది.


రాజా రామేశ్వరరావు అతి పెద్ద సైనిక పటాలాన్ని నిర్వహించే వాడు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. దాని వలన ఖజానా ఎప్పుడూ ఖాళీగా ఉండేది. ఖజానా నిండుకున్నది మహా ప్రభూ అని మంత్రి చెప్పగానే మరి ఎటువైపు బయలుదేరుదాం అని అడిగి తనకు వ్యతిరేకులైన జాగీరులవైపో లేక సంస్థానాల వైపో దాడికి బయలుదేరే వాడు. ఉన్న వాళ్ళను కొట్టి తన ఖజానాను నింపేవాడు. ఒకరోజు ఒక వార్త వేగుల ద్వారా అందింది. నిజాం సర్కారు వారి జమాబందీ ‘‘పేష్‍కష్‍’’ (ఆదాయం) కర్నూలు నుండి హైద్రాబాద్‍ వైపు బయలు దేరిందని. దానికి కాపలాగా సైనికుల బందోబస్తు కూడా ఉందని ఉప్పు అందింది. దేనికీ బెదరని గండరగండడు, సాహసకార్యాలపై మక్కువ కల్గిన రాజావారు తన ఆఫ్రికన్‍ సైనికులతో బయలుదేరి జడ్చర్ల వద్ద మెరుపుదాడి చేసి బొక్కసాన్ని దోచుకున్నాడు. వార్త విని నిజాం నవాబు పరేషాన్‍ ఐపోయాడు. ఆఖరికి మంచి మాటలతో రాజావారిని హైద్రాబాద్‍కు రప్పించి మోసంతో సీతారాంభాగ్‍ దేవాలయంలోని ఒక గదిలో ఖైదు చేశాడు.


రాజావారు తన భోజనం తన వంటవారు మాత్రమే వండాలని నిజాం నవాబుకు షరతు పెట్టాడు. గుడి అవతల కొద్ది దూరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కొద్దిమంది వంట బ్రాహ్మలు ప్రతిరోజు రాజాకు భోజనం సిద్ధం చేసి పంపేవారు. రాజాగార్ని బంధించిన గది చుట్టూ విచ్చుకత్తుల సైనికుల పహరా ఉండేది.
ఒకరోజు రాజుగారు తన తండ్రి తద్దినం ఉందని బ్రాహ్మలతో తన గదిలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిజాంను కోరాడు. ‘‘కొండ ఎలుక’’ లాంటి రాజా మనస్తత్వం తెలియని నవాబు సరే అన్నాడు. బ్రాహ్మలు రాగానే గది తలుపులు బిడాయించుకున్నాయి. పురోహితుల మంత్రాలు, గంటల గణగణలు లోపల నుండి వినబడుతున్నాయి. అపరాహ్ణం వేళ దాటిపోయింది. ఇంకా ఎంత సేపని ఇవతలి నుండి సైనికులు తలుపులను దబదబా బాదారు. మరి కొంచెం సేపు అని రాజావారి గొంతు వినబడింది. మరో గంట కూడా గడిచింది. గంటల గణగణ అలానే కొనసాగుతుంది. మంత్రోచ్చారణలు మాత్రం లేవు. అనుమానం వచ్చిన సైనికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి దూసుకు వెళ్ళారు. గదిలో ఎవరూ లేరు ఒక పెద్ద సొరంగం తప్ప. ఆ సొరంగం చుట్టూ ఒక గండుపిల్లి చక్కర్లు కొడుతుంది. దాని మెడలో వ్రేలాడుతున్న గంట గణగణా మ్రోగుతుంది. ఆదరాబాదరాగా సొరంగంలోకి దిగిన సైనికులు చివరికి గుడి అవతల ఉన్న వంట గదిలో తేలారు.
నిజాం నవాబుగారికి ఈ పిడుగులాంటి వార్త చేరేసరికి రాజా రామేశ్వరరావు తన అనుచరులతో వాయువేగంతో వెళ్ళే అరబ్బీ గుర్రాలను అధిరోహించి మనోవేగంతో పురానాపూల్‍ దాటి తన వనపర్తి సంస్థానంవైపు దూసుకువెళ్తున్నాడు. ‘‘చిక్కడు దొరకడు’’ సామెత అతని పట్ల నిజం అయ్యింది.


రాజులు మారారు. రోజులూ మారాయి. తర్వాత్తర్వాత ఘనత వహించిన ఆ పురాతన పవిత్ర సీతారాం భాగ్‍ దేవాలయ ప్రాంగణంలో సంస్కృత పాఠశాల వెలిసింది. దాని పేరు ‘‘వేదాంత వర్దని’’. దానిని స్థాపించిన మహానుభావుడు ‘‘నాగులపల్లి కోదండరామారావు. అందరూ ఈయన్ని ఎన్‍.కే.రావు అనేవారు. వృత్తి రీత్యా న్యాయవాది. తన ప్రజ్ఞను ప్రజలకోసం వినియోగించాడు. తన సంపాదన కూడా దేశం కోసమే హారతి కర్పూరంలా వెచ్చించాడు. తన గ్రంథాలయాన్ని వేదాంత వర్దనికి సమర్పించాడు. ఆయన పాండిత్యం ముందు ఎవరు మాట్లాడినా, చేతులు కట్టుకుని మాట్లాడేవారు. మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత ఆంధ్రమహాసభను నడిపించిన మూడవ కార్యకర్త ఇతనే. ఈయన ఆంధ్ర విద్యాలయాన్ని కూడా స్థాపించాడు. టీచర్లు రాకపోతే తనే క్లాసులను నిర్వహించేవాడు. పేద విద్యార్థులకు ప్రతి వారం 200 రూ।।లు విరాళంగా ఇచ్చేవాడు. కాంగ్రేసు కేసులను ఉచితంగా వాదించటమే గాక కాంగ్రేసు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించాడు. 1947లో దేశానికి స్వాతంత్య్రం రాగానే కె.ఎన్‍.రావు ప్రతిభను గుర్తించిన సర్దార్‍పటేల్‍ కేంద్రంలో ఆర్థిక సలహాదారుడుగా నియమించాడు. తన కూతురు పెళ్లి ఉన్నందున ఆ పదవిలో అపుడే చేరలేనని ఒక నెల గడువు కావాలని ప్రార్థించాడు. సరే అన్నాడు సర్దార్‍ పటేల్‍. నెల తర్వాత ఢిల్లీ వెళ్లగానే రాజకీయ కారణాల వలన ఆ పదవి రద్దు అయ్యింది. అయినా పటేల్‍ ఆ నెల జీతాన్ని లక్ష రూ।।ల చెక్కుతో రావుగారికి అందచేశాడు. చేయని ఉద్యోగానికి జీతం తీసుకుని దేశానికి నష్టం చేయనని ఆ డబ్బును వినయంగా నిరాకరించి కనీసం రైలు చార్జీలు, హోటల్‍ చార్జీలన్నా తీసుకోక హైద్రాబాద్‍కు వాపస్‍ వచ్చాడు.
1948లో పోలీస్‍ యాక్షన్‍ జరిగాక హైద్రాబాద్‍ రాష్ట్రంలో మిలిటరీ పరిపాలన ఉన్నప్పుడు కొంతకాలం ఆర్థిక సలహాదారుడిగా పనిచేశారు. తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధుల పరిపాలనలో ఇటువంటి దేశభక్తులకు స్థానం కరువయ్యింది. ఆయన జీవితాంతం ఎటువంటి పదవులు, భోగభాగ్యాలు ఆశించలేదు. అందుకే కాంగ్రేసు పార్టీ వాళ్లెవరికీ అప్పుడు, ఇప్పుడు కూడా కనీసం నాగులపల్లి కోదండరావు అన్న పేరైనా తెలియదు.


వేదాంత వర్ధని విద్యార్థుల వేద ఘోషలతో సీతారాంభాగ్‍ దేవాలయం పులకించి పోయింది. ఉచిత విద్యాదానం వెల్లివిరిసింది. ఆచార్య ఖండవల్లి నరసింహ శాస్త్రి వ్యాకరణ పండితులుగా ఇక్కడే పని చేశారు. వారు అమరభారతి అను లిఖిత మాస పత్రికను ఈ నేల మీదే నిర్వహించారు. ప్రముఖ సంస్క•తాంధ్ర పండితులు రవ్వా శ్రీహరి, కేకే రంగనాథాచార్యుల వారు ఇక్కడే ఈ పూదోటలో పూచిన పువ్వులే. మన కాలం వీరుడు, విప్లవ కవి జ్వాలాముఖి అను కొమాండూరు వీర రాఘవాచార్యులు ఈ ప్రాంగణంలోనే జన్మించి ఈ పాఠశాలలోనే ఓనమాలు దిద్దుకుని ‘‘ఇంతింతై వటుడింతై’’ అన్నట్లు కారాగారాన్ని దర్శించి కటకటాలను లెక్కించాడు. అట్లా గుడి బడి కలగిలిస్తే కలసి నడిస్తే ఒక సీతారాంభాగ్‍ దేవాలయం అయ్యింది.


(షహర్‍ నామా (హైద్రాబాద్‍ వీధులు – గాథలు) పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *