1938లో హైదరాబాద్‍కు మొదటి రంజీ ట్రోఫీ

  • సౌత్‍ ఇండియాలో ట్రోఫీ అందుకున్న మొదటి రాష్ట్రం   
  •  నవనాగర్‍ జట్టుపై అద్భుత విజయం

అదొక అండర్‍డాగ్స్ రంజీ జట్టు.. స్టార్‍ ప్లేయర్లు లేకుండా, ఎలాంటి అంచనాల్లేకుండా ఆటను ప్రారంభించింది. బరిలోకి దిగి ఒక్కో ప్రత్యర్థి జట్లకు దిమ్మదిరిగే షాక్‍ ఇస్తూ ఫైనల్‍ వరకు దూసుకొచ్చింది. ఫైనల్‍ మ్యాచ్‍లో డిఫెండింగ్‍ ఛాంపియన్‍ ప్రిన్స్లీ స్టేట్‍ ఆఫ్‍ నవనాగర్‍ జట్టుపై అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 

1938వ సంవత్సరంలో హైదరాబాద్‍ రంజీ క్రికెట్‍ జట్టు ఈ రికార్డును నెలకొల్పింది. భారత క్రికెట్‍ కంట్రోల్‍ బోర్డు (బీసీసీఐ) నిర్వహించే ఫస్ట్క్లాస్‍ క్రికెట్‍ టోర్నమెంట్‍ రంజీ ట్రోఫీ. ఈ రంజీ ట్రోఫీ ఫైనల్‍ మ్యాచ్‍ 1938, ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు జరిగింది. ఈస్ట్జోన్‍, నార్త్జోన్‍, వెస్ట్జోన్‍, సౌత్‍ జోన్‍ నుండి మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి.  ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్‍ మ్యాచ్‍లో హైదరాబాద్‍ రంజీ క్రికెట్‍ జట్టు మరియు ప్రిన్స్లీ స్టేట్‍ ఆఫ్‍ నవనాగర్‍ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. హైదరాబాద్‍ జట్టు ఎలాంటి అంచనాలు లేకుండా పాల్గొనగా, డిఫెండింగ్‍ ఛాంపియన్‍ అయిన నవనాగర్‍ జట్టులో ప్రసిద్ధ క్రికెటర్లు అమర్‍సింగ్‍, సొరాబ్జీ కోలా (ఈ ఇద్దరు భారత క్రికెట్‍ టీమ్‍లో ఎంపికై టెస్టు మ్యాచ్‍లు ఆడారు) ఉన్నారు.


టాస్‍ గెలిచి మొదటి బ్యాటింగ్‍ ఎంచుకున్న నవనాగర్‍ జట్టు హైదరాబాద్‍ జట్టు అద్భుతమైన బౌలింగ్‍ ధాటికి కకావికలమైంది. నవనాగర్‍ జట్టు ఒకానొక దశలో 99 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. బౌలర్ల ధాటికి 54.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. అందులో నారిమన్‍ మార్షల్‍ ఒక్కరే 36 పరుగులు సాధించి టాప్‍ స్కోరర్‍గా నిలిచారు. హైదరాబాద్‍ బౌలర్లలో హైదర్‍ అలీ 4/55 (22.4 ఓవర్లు) వికెట్లు, ఇబ్రహీం ఖాన్‍ 3/44 వికెట్లు తీసి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
అనంతరం హైదరాబాద్‍ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 113 పరుగులు (31.2ఓవర్లు) సాధించింది. అందులో మహ్మద్‍ హుస్సేన్‍ ఒక్కరే 36 పరుగులు సాధించి టాప్‍ స్కోరర్‍గా నిలిచారు. నవనాగర్‍ బౌలర్‍లలో షూటే బెనర్జీ 4/34 వికెట్లు పడగొట్టారు.


రెండో ఇన్నింగ్స్లో నవనాగర్‍ జట్టు 270 (70.4ఓవర్లు) పరుగులు చేసి ఆలౌట్‍ అయ్యింది. అల్బర్ట్ వెన్‍స్లీ 67 పరుగులు సాధించి టాప్‍ స్కోరర్‍గా నిలిచారు. హైదరాబాద్‍ బౌలర్లలో హైదర్‍ అలీ 5/92 (23 ఓవర్లు) వికెట్లు తీసి బెస్ట్ నమోదు చేశారు.


హైదరాబాద్‍ రెండో ఇన్నింగ్స్లో 310/9 పరుగులు (100.4 ఓవర్లు) సాధించి విజయం నమోదు చేసింది. ఎడుల్జీ ఐబరా ఒక్కరే 137 (నాటౌట్‍) పరుగులు చేసి హైదరాబాద్‍ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నవనాగర్‍ జట్టులో ముబారక్‍ అలీ 3/48 (21ఓవర్లు) వికెట్లు సాధించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలుపుకొని నవనాగర్‍ జట్టు మొత్తం 422 పరుగులు సాధించగా, రెండు ఇన్నింగ్స్లో హైదరాబాద్‍ జట్టు 423 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది.


హైదరాబాద్‍ విన్నింగ్‍ టీమ్‍లో సభ్యులు :
ఎస్‍.ఎం.హుస్సేన్‍ – (క్యాప్టెన్‍), అసదుల్లా ఖురేషీ, ఎస్‍.ఆర్‍.మెహతా, అశ్వక్‍ అహ్మద్‍, ఈబీ.ఐబరా, హైదర్‍ అలీ, ఎస్‍.ఎం.హదీ, ఎఫ్‍.టుర్కీ, వీజీ.మచి (వికెట్‍ కీపర్‍), వజుభా, ఇబ్రహీం ఖాన్‍, 12వ ఆటగాడు హెచ్‍.అలీ.


సౌత్‍ ఇండియాలో మొదటి జట్టు :

రంజీ క్రికెట్‍ మ్యాచ్‍లో సౌత్‍ ఇండియా నుండి మొదటి సారిగా రంజీ క్రికెట్‍ ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టుగా హైదరాబాద్‍ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది.
హైదరాబాద్‍ రంజీ జట్టులో ఆడిన ఇడుల్జీ బుర్జోర్జీ ఐబరా 1986-87 రంజీ ట్రోఫీ విన్నింగ్‍ టీమ్‍కు కోచ్‍గా వ్యవహరించారు.


ఖైజర్‍ భాషా, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *