అంబేద్కర్‍ని ఆవాహన చేసుకున్న హైదరాబాద్‍


అసఫ్జాహీలు ముఖ్యంగా ఏడో నిజాం ఉస్మానలీఖాన్‍ పాలనలో హైదరాబాద్‍ రాజ్యంలో బయటి వ్యక్తులు రాజకీయ, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఆంక్షలుండేవి. దాదాపు నిషేధం ఉండేది. ఒక వేళ ఎవరైనా కచ్చితంగా పాల్గొనాల్సి వస్తే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ముందుగానే ప్రభుత్వానికి అందజేయాలి. అనుమతి తీసుకోవాలి. ఆ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి వస్తున్న రాష్ట్రేతర వ్యక్తుల ప్రసంగ పాఠాన్ని కూడా పోలీసు అధికారులకు ముందుగానే అందజేయాల్సి ఉండేది. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ భాగ్యరెడ్డి వర్మ తాను నిర్వహించిన ‘ఆదిహిందూ సోషల్‍ సర్వీస్‍ లీగ్‍’ సభలకు కర్నాటకకు చెందిన రావు సాహెబ్‍ టి.జె.పాపన్న, మద్రాసుకు చెందిన ఎం.సి. రాజా తదితరులను పిలిపించి సమావేశాలు నిర్వహించాడు. అయితే తన జీవిత కాలంలో ఆయన అంబేద్కర్‍ని పిలిపించి సమావేశం ఏర్పాటు చేయలేక పోయినాడు. కానీ అంబేద్కర్‍ని భారతదేశ దళిత ప్రల ఏకైక ప్రతినిధిగా గుర్తించి రౌండ్‍ టేబుల్‍ కాన్ఫరెన్స్కు పంపించడంలో ఆయన కృతకృత్యులయ్యారు. ఇదే సందర్భంలో హైదరాబాద్‍ రాజ్య ప్రభుత్వమే అంబేద్కర్‍ సేవలను గుర్తించి కొంత గ్రాంటుని మంజూరు చేసింది. అంతేగాకుండా అంబేద్కర్‍ దళితుల అభ్యున్నతికి చేస్తున్న సేవలకు అండగా నిలబడేందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రతినెలా 500ల రూపాయలు అందించేలా కూడా ఏర్పాటు చేసింది. ఇలా హైదరాబాద్‍కు అంబేద్కర్‍కు అతి సన్నిహితమైన, సమాజహితమైన సంబంధాలున్నాయి.


1931 సెప్టెంబర్‍లో ఆలిండియా ఆది-హిందూ పొలిటికల్‍ కాన్ఫరెన్స్ (రాజకీయ సభలు) లక్నోలో జరిగాయి. ఆ సమావేశానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే చట్టసభలకు దళితుల ఎంపిక కోసం ప్రత్యేక విధానాన్ని అమలు పరచాలని తీర్మానించారు. అలాగే రెండో రౌండ్‍టేబుల్‍ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి జాతీయ స్థాయిలో దళితుల ఏకైక ప్రతినిధిగా, సర్వామోదమైన వ్యక్తిగా అంబేద్కర్‍ని నిర్ధారించడంలో ఈ సభ కీలక పాత్ర పోషించింది. ఇది మొదటి సారిగా హైదరాబాద్‍కు చెందిన వ్యక్తి అంబేద్కర్‍ని అక్కున చేర్చుకున్న సంఘటన. అంబేద్కర్‍ రెండోసారి రౌండ్‍ టేబుల్‍ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆయన ప్రతిభను గుర్తించి, రాజకీయ కార్యకలాపాలకు ప్రోత్సాహమిచ్చి, మొత్తం దళిత సమాజానికి మేలు చేసే ఉద్దేశ్యంతో నిజాం ప్రభుత్వం ప్రతినెలా ఐదువందల రూపాయలను గ్రాంటుగా ఇచ్చింది. హైదరాబాద్‍ రాజ్యంలో దళితుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను ప్రచారం చేసుకునేందుకు నిజాం ప్రభుత్వం ఇదొక అవకాశంగా భావించింది.


నిజానికి అంబేద్కర్‍కు హైదరాబాద్‍కు చాలా దగ్గరితనమున్నది. హైదరాబాద్‍ రాజ్యంలో మరఠ్వాడా ప్రాంతం కూడా భాగం. ఈ ప్రాంతంలోని దళితులపై అంబేద్కర్‍ ప్రభావం ప్రగాఢంగా ఉండింది. మరఠ్వాడాలో భాగమైన ఔరంగబాద్‍లో మిలింద్‍ కళాశాల ఏర్పాటులో అంబేద్కర్‍కు హైదరాబాద్‍ ప్రభుత్వం సహకరించింది. మరఠ్వాడా ప్రాంతంలో విద్యావ్యాప్తికి అంబేద్కర్‍ చేసిన కృషి గణనీయమైనది. ఆయన వేసిన పునాదులపై 1958లో మరఠ్వాడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినారు. ఈ విశ్వవిద్యాలయం పేరు మార్పు కోసం 1978నుంచి ఉద్యమాలు జరిగాయి. చివరికి ఈ విశ్వవిద్యాలయం పేరును ‘డాక్టర్‍ బాబాసాహెబ్‍ అంబేద్కర్‍ మరఠ్వాడా విశ్వవిద్యాలయం’గా మార్చినారు.


హైదరాబాద్‍ రాజ్యంలో భాగమైన మరఠ్వాడా ప్రాంతంలో అంబేద్కర్‍ చాలా సార్లు వివిధ సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఔరంగాబాద్‍ కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా విద్యారంగంలో ఔరంగాబాద్‍కు విశిష్టత చేకూర్చినాడు. అయితే ఆయన జీవితకాలంలో హైదరాబాద్‍ నగరంలో ఆరేడు సార్లకన్నా ఎక్కువగా పర్యటించలేదు. ఇందుకు ప్రధానకారణం తాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దళితహిత కార్యకలాపాలు, హైదరాబాద్‍ రాజ్యంలో దాదాపు అమల్లో ఉండడమే కారణం. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు, స్కాలర్‍షిప్‍, వాణిజ్య రంగాల్లో దళితులను ప్రోత్స హించడం తదితర కార్యకలాపాలన్నింటిని నిజాం ప్రభుత్వం అమలు చేయడంతో హైదరాబాద్‍లో తన కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేగాకుండా హైదరాబాద్‍లో భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, ఎం.ఎల్‍.ఆదయ్య, వల్తాటి శేషష్య తదితరులు అంబేద్కర్‍ కన్నా ముందు నుంచే సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన కృషిని చేసినారు. వీరితో పాటుగా చైతన్యవంతులు, విద్యావంతులైన జె.హెచ్‍.సుబ్బయ్య, బి.శ్యామ్‍సుందర్‍, కె.ఆర్‍.వీరాస్వామి తదితరులు అంబేద్కర్‍ ఐడియాలజీని విస్తృతంగా ప్రచారం చేసినారు. అంతగా విద్యాధికుడు గాకున్నా బి.ఎస్‍. వెంకటరావు కూడా ఈ విషయంలో గణనీయమైన కృషి చేసినాడు.


హైదరాబాద్‍ నగరంలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్‍ 1932లో పర్యటించినాడు. 1932 సెప్టెంబర్‍ మూడు నాడు హైదరాబాద్‍లో జరిగిన హైదరాబాద్‍ రాజ్య ‘72వ విదేశీ సంబంధాల కమిటీ సమావేశం’లో అంబేద్కర్‍ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సర్‍ అక్బర్‍ హైదరీ, ఆర్‍.సి.ట్రెంచ్‍, ఎం.ఎస్‍.ఎ.హైదరీ, కె.పి.మున్షీలు పాల్గొన్నారు. ఈ సమావేశం హైదరాబాద్‍లోని ఫైనాన్స్ కార్యాలయంలో సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన జరిగింది.


ఈ సందర్భంగా అంబేద్కర్‍ మాటల గురించి నిజాం ప్రభుత్వ కాన్ఫిడెన్సియల్‍ రిపోర్టులో వివరంగానే రాశారు. దీని ప్రకారం దళితుల అభ్యున్నతికి నిజాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అలాగే ఈ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకు పోవడానికీ, దేశ వ్యాప్తంగా దళితుల అభ్యున్నతికి తాము చేపడుతున్న కార్యక్రమాలకు రెండు లక్షల గ్రాంటు మంజూరు చేయవలసిందిగా నిజాం ప్రభుత్వాన్ని అంబేద్కర్‍ కోరినారు. అయితే నిజాం ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని 15,000ల రూపాయల గ్రాంటుని జారీ చేయడమే కాక 1932 నుంచి మూడేండ్ల పాటు నెలకు 500ల రూపాయల చొప్పున గ్రాంటు ఇవ్వడానికి (నిజాం ప్రభుత్వం) నిర్ణయించింది. అలాగే ఈ విషయానికి అంతగా ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదని కూడా తీర్మానించినారు. ఈ మేరకు నిజాం ప్రభుత్వ కార్యదర్శి సర్‍ అక్బర్‍ హైదరీ కుమారుడు బొంబాయిలో అంబేద్కర్‍ని కలుసుకొని 15వేల రూపాయల చెక్‍, మరో చెక్‍ ఐదు వందల రూపాయలది (ప్రతినెలా ఇచ్చే గ్రాంటులో మొదటిది) రెండూ అందజేసినాడు. దీనికి కృతజ్ఞతలు చెబుతూ అంబేద్కర్‍ నిజాం ప్రభుత్వ పొలిటికల్‍ సభ్యుడు నవాబ్‍ మెహదీయార్‍ జంగ్‍కు అక్టోబర్‍ నాలుగు, 1932 నాడు ఉత్తరం కూడా రాయడం జరిగింది. ఇదంతా హైదరాబాద్‍కు అంబేద్కర్‍కు ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియ చెబుతున్నది. అంబేద్కర్‍ హాజరైన విదేశి సంబంధాల కమిటీ సమావేశంలో అంబేద్కర్‍ మాటలను రికార్డు చేసినారు. నిజానికి అంబేద్కర్‍ ఆనాడు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కొంత భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. దళితులకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది వేదికగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‍ని సున్నితంగా తిరస్కరిస్తూ గ్రాంటుని మాత్రం విడుదల చేసింది. “He ascribed the gradual awakening the depressed classes to a consciousness of their political and social rights and to the sesentment threat of caste Hindus. He said that as one who was very largely responsible for this awakening he had drawn a good deal of hostility to his own person and mentioned some of the attempts made by congress partisans to isolate him. The organization, which he had built up was in sure need of habitation and therefore of funds. He wanted a small piece of land on which he could build. the premises would accommodate a press and also contaion a meeting hall. The ground floor would be rented by shopkeepers the rent from whom would go towards meeting the expenses of his orgnization. When not in use for his own meetings he could also hire out lumpsum grant of 2 lakhs. He said tha a large proportion of Hyderabad’s population belonged the Depressed classes and that she had a duty to this community. He appreciated the fact that any grant given to him would be an expenditure outside the State and could only be justified on political grounds. He felt that a grant made to him and his organiztiaon would evoke the gratitude of the Depressed classes all over India inluding Hyderabad. He had a certain position as their spokesman and protaganist. The efforts of himself and his supporters could in many ways ensure that the Depressed classes in the State would provide a solid element of stability there in. while appreciating the fact that other commitments in the State had a cliam on Governement’s assistance, he argued that the Depressed classes had received little support so far because they had been inarticulate. They also had a claim. (Confidential; HEH The Nizam’s Political department, round table conference, 1932).” హైదరాబాద్‍ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ ప్రజాహిత కార్యక్రమాలను అంబేద్కర్‍ ప్రశంసించిన సంగతి కూడా ఈ ప్రసంగం ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్‍ రౌండ్‍టేబుల్‍ కాన్ఫరెన్స్ సందర్భంగా దేశ దళితుల దయనీయ స్థితిగతులను సమర్ధవంతంగా చాటి చెప్పగలిగినాడు. ఈ సమావేశాల్లో హైదరాబాద్‍ రాజ్య ప్రతినిధిగా సర్‍ అక్బర్‍ హైదరీ కూడా పాల్గొనడంతో ఆయన్ని మరింత దగ్గరగా చూడడానికి, నైతికంగా మద్దతుగా నిలబడడానికి వీలయింది. ఆనాటి నుంచి హైదరాబాద్‍ ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. ఇందుకు అంబేద్కర్‍ ప్రతిభతో పాటు అక్బర్‍ హైదరీ ఉదారగుణం కూడా కారణం.


1935నాటి చట్టంలో దళితులందరినీ ‘షెడ్యూల్డ్ కాస్టస్’గా గుర్తించిన అనంతరం వారి అభ్యున్నతి కోసం ఒక రాజకీయ పార్టీని అంబేద్కర్‍ ఏర్పాటు చేసినాడు. ఒక వైపు గాంధీ హైదరాబాద్‍లో కాంగ్రెస్‍ పార్టీ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదూ అని ప్రకటిస్తే మరో వైపు అదే హైదరాబాద్‍లో అంబేద్కర్‍ దళితుల మేలుకోసం ‘షెడ్యూల్డ్ కాస్టస్ ఫెడరేషన్‍’ శాఖను ఏర్పాటు చేసినాడు. ఈ శాఖ నిర్వహణలో జె.హెచ్‍.సుబ్బయ్య, పి.వి.మనోహర్‍, రాజమణీదేవి, ఎం.ఆర్‍.కృష్ణ తదితరులు ప్రముఖంగా పనిచేశారు. వీరి కృషికి గుర్తింపుగా హైదరాబాద్‍ రాష్ట్ర ప్రజలు షెడ్యూల్డ్ కాస్టస్ ఫెడరేషన్‍ తరపున ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక లోక్‍సభ సభ్యుడిని మొదటి సాధారణ ఎన్నికల్లో గెలిపించారు. ఈ సంస్థ అనేక ఉద్యమాలను హైదరాబాద్‍ కేంద్రంగా నడిపించింది. పూనా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసింది. దళితులకు ప్రత్యేక ఎలక్టోరేట్‍ ఉండాలని, జనాభా దామాషాలో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని, దళితుల అభ్యున్నతి కోసం ఒక కోటి రూపాయల ఫండ్‍ని ఏర్పాటు చేయాలని డిమాండ్‍ చేసింది. విలియమ్‍ బార్టన్‍ స్కూల్‍ని ఉత్తమంగా తీర్చిదిద్దడంలోనూ ఈ ఫెడరేషన్‍ కీలకంగా వ్యవహరించింది. తర్వాతి కాలంలో గాంధీ(మాలవ్యా)-అంబేద్కర్‍ల మధ్యన జరిగిన పూనా ఒప్పందాన్ని హైదరాబాద్‍ దళితులు నిర్ద్వందంగా వ్యతిరేకించారు. దానికి నాయకత్వం వహించింది ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‍ పార్టి. దళితులకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కేటాయించకుండా అందరితో పాటు కలిసి పోటీచేయాలనడం అన్యాయమని షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‍ తరపున జె.హెచ్‍.సుబ్బయ్య, రాజమణీదేవి తదితరులు వ్యతిరేకించినారు. సెప్టెంబర్‍ -9నాడు (1944) ‘పూనా ఒప్పంద’ వ్యతిరేక దినాన్ని హైదరాబాద్‍లో పెద్ద ఎత్తున నిర్వహించారు. నిరసన సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాద్‍లో అరవముదం అయ్యంగార్‍ నేతృత్వంలోని ‘రాజ్యంగ సంస్కరణల’ కమిటీ చట్టసభలో 50శాతం సీట్లు ముస్లింలకు, మిగతా 50 శాతం సీట్లు హిందువులకు, ఈ హిందువుల్లో ఐదు సీట్లు దళితులకు కేటాయించాలని నివేదిక సమర్పించారు. ఈ నివేదిక పట్ల దళితులు తీవ్ర నిరసన వ్యక్తం జేసినారు. మొత్తం 85 సీట్లలో తమకు హిందువులతో సంబంధం లేకుండా పది సీట్లను దళితులకు కేటాయించాలని డిమాండ్‍ చేసినారు. అక్టోబర్‍ చివరి వారం (1944)నాడు రాజమణీదేవి నాయకత్వంలో సికింద్రాబాద్‍లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. వీటన్నింటికీ స్ఫూర్తి అంబేద్కర్‍ దిశా నిర్దేశమే!


హైదరాబాద్‍ కేంద్రంగా రాజకీయాలు నడిపిన వారిలో శ్యామ్‍సుందర్‍, బి.ఎస్‍.వెంకటరావులు మరఠ్వాడాతో మమేకమయినారు. వీరిద్దరూ రాజకీయాల్లో తమ తొలి ఓనమాలను ఔరంగాబాద్‍లోనే నేర్చుకున్నారు. ఔరంగాబాద్‍ కేంద్రంగా ప్రజాభ్యుదయ కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాతి కాలంలో ‘హైదరాబాద్‍ అంబేద్కర్‍’గా పేరుగాంచిన బి.ఎస్‍. వెంకటరావు అంబేద్కర్‍ స్ఫూర్తితో హైదరాబాద్‍ కేంద్రంగా ఉద్యమాలు నడిపినాడు. అంతేగాదు అంబేద్కర్‍ మహారాష్ట్రలో నిర్వహించే సభలు, సమావేశాలకు అతిథిగా హాజరై అక్కడి ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేశాడు. అందుకే అక్కడి ప్రజలు ఆయనకి ‘హైదరాబాద్‍ అంబేద్కర్‍’అనే బిరుదునిచ్చారు. హైదరాబాద్‍లో పుట్టి మహారాష్ట్రలో చదువుకున్న రాజారామ్‍ భోలే కూడా అంబేద్కర్‍తో సన్నిహితంగా ఉన్నాడు. పీపుల్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ తర్వాత బొంబాయి నుంచి లోక్‍సభకు ఎన్నికయినాడు.


జె.హెచ్‍.సుబ్బయ్య, పి.ఆర్‍.వెంకటస్వామి నాయకత్వంలో కొంతమంది దళిత నాయకులు పూనాకు వెళ్ళి అంబేద్కర్‍ని కలిసి ఆయన చేస్తున్న ఉద్యమాలకు సంఘీభావాన్ని ప్రకటించారు. పి.ఆర్‍.వెంకటస్వామి తర్వాతి కాలంలో హైదరాబాద్‍లో ‘అంబేద్కర్‍ యూత్‍లీగ్‍’ని ఏర్పాటు చేసి దళితోద్యమ కార్యకలాపాలను చేపట్టారు. దీనికి కొనసాగింపుగానే హైదరాబాద్‍ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‍ ఏర్పాటయింది. హైదరాబాద్‍ డిప్రెస్డ్ క్లాసెస్‍ అసోసియేషన్‍ ఏర్పాటైన తర్వాత రాజకీయ పరిణామాలను అంబేద్కర్‍తో చర్చించాలని జె.హెచ్‍.సుబ్బయ్య తదితరులు భావించారు. దీంతో జె.హెచ్‍.సుబ్బయ్య, పి.వి.మనోహర్‍, తుకారామ్‍ గాడే, పి.ఆర్‍.వెంకటస్వామి ప్రభృతులు ఢిల్లీ వెళ్ళి అంబేద్కర్‍ని కలిశారు. ఈ సంఘటన 1943లో ప్రారంభంలో జరిగింది. విద్యావంతులు, నిస్వార్థులైన యువకులు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‍ కార్యకలాపాలు నిర్వహించడం పట్ల అంబేద్కర్‍ హర్షం వ్యక్తం చేశారు. (పి.ఆర్‍.వెంకటస్వామి; 1955, వాల్యూమ్‍ -1; పి.పి.255) ప్రతి సంవత్సరం అంబేద్కర్‍ జయంత్యుత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. అంబేద్కర్‍ పోరాట స్ఫూర్తి యువతరానికి అందజేయడంలో ఈ ఉత్సవాలు కీలకంగా పనిజేసేవి. ఇలాంటిదే అంబేద్కర్‍ 55వ జయంత్యుత్సవాలను పండిత ప్రేమకుమార్‍ ఆధ్వర్యంలో 1944 ఏప్రిల్‍ 14నాడు సికింద్రాబాద్‍లో నిర్వహించారు. జె.హెచ్‍.సుబ్బయ్య భవనంలో జరిగిన ఈ సమావేశం గురించి పత్రికల్లో బాగా ప్రచారం చేసినారు. అంబేద్కర్‍ తొలిసారిగా 1944 సెప్టెంబర్‍, అక్టోబర్‍ నెలల్లో ఆంధ్రాలోని గుడివాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్టణం, అనకాపల్లి, నెల్లూరు, కొవ్వలి, రామచంద్రాపురంలలో పర్యటించాడు. మరోవైపు దాదాపు అదే సమయంలో హైదరాబాద్‍లో కమ్యూనిస్టు ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ దశలో బ్రిటీష్‍ వైస్రాయ్‍ కౌన్సిల్‍లో లేబర్‍ మంత్రిగా ఉంటూ దేశంలోని వివిధ ప్రదేశాల్లో అంబేద్కర్‍ పర్యటించారు. అందులో భాగంగా హైదరాబాద్‍లో 1944 సెప్టెంబర్‍లో పర్యటించాడు. సెప్టెంబర్‍ 20, 1944 నాడు అంబేద్కర్‍ హైదరాబాద్‍కు వచ్చారు. ఆయన నాంపల్లి రైల్వే స్టేషన్‍కు పి.ఎన్‍.రాజ్‍భోజ్‍తో కలిసి వచ్చాడు. అయితే ఈ సందర్భంలో అంబేద్కర్‍ని డిప్రెస్డ్ క్లాసెస్‍ అసోసియేషన్‍ తరపున బి.ఎస్‍.వెంకటరావు ఆహ్వానం పలకాల్సి ఉండింది. బి.ఎస్‍.వెంకటరావు రాజకీయ ప్రత్యర్థి, అంబేద్కర్‍ హైదరాబాద్‍ పర్యటన నిర్వహకులయిన జె.హెచ్‍.సుబ్బయ్య పన్నాగం పన్ని బి.ఎస్‍.వెంకటరావుకు స్థానం లేకుండా చేశాడు. దీంతో బి.ఎస్‍.వెంకటరావు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీన్ని బట్టి ఆనాటి నాయకుల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఎన్ని ఎత్తుగడలు వేసేవారో అర్థమవుతుంది.


పీపుల్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న అంబేద్కర్‍ తాను ఔరంగాబాద్‍లో నిర్మించ తలపెట్టిన మిలింద్‍ కళాశాల కోసం ఆర్థిక సహాయం (గ్రాంట్‍) గురించి మిలిటరీ (హైదరాబాద్‍) ప్రభుత్వంతో చర్చల కోసం హైదరాబాద్‍కు వచ్చారు. ఈ సారి కూడా గతంలో మాదిరిగానే సికింద్రాబాద్‍ ప్రెండర్‍గాస్ట్ రోడ్డులో ఉన్న జె.హెచ్‍.సుబ్బయ్య భవనంలోనే మకాం వేశాడు. ఈ సమయంలో గృహ నిర్బంధంలో ఉన్నటువంటి బి.ఎస్‍.వెంకటరావుని విడిపించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కొంతమంది మరఠ్వాడా నాయకులు అంబేద్కర్‍ని కోరినారు. అందుకు సిద్ధపడి నిర్బంధంలో ఉన్నటువంటి వెంకటరావుని కలిసేందుకు సమ్మతిని తెలిపాడు. అయితే ఇక్కడ వెంకటరావుపై పైచేయి సాధించేందుకు సుబ్బయ్య చక్రం తిప్పి ఆ సమావేశం జరగకుండా అడ్డుకట్ట వేయగలిగిండు.
హైదరాబాద్‍పై పోలీసు చర్య అనంతంరం ‘డిప్రెస్డ్ క్లాసెస్‍ వెల్ఫేర్‍ ఫండ్‍’ పేరుని ‘షెడ్యూల్డ్ కాస్టస్ ట్రస్ట్ ఫండ్‍’గా మార్చినారు. ఇందులోని సభ్యుల్లో కూడా భారీ మార్పులు జరిగాయి. ఇందులో ఎక్కువ మేరకు ‘షెడ్యూల్డ్ కాస్టస్ ఫెడరేషన్‍’ నాయకులకు స్థానం దక్కింది. ఈ ట్రస్ట్ ఫండ్‍ బోర్డులో మొత్తం పదిమంది సభ్యులున్నారు. వారిలో జె.హెచ్‍.సుబ్బయ్య, పి.వి.మనోహర్‍, కె.ఆర్‍.వీరస్వామి, కృష్ణకుమార్‍ మానె, పి.ఎస్‍.సర్వడె, తర్వాతి కాలంలో, ఎం.ఆర్‍.కృష్ణ, జె.హెచ్‍.కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ హైదరాబాద్‍ రాజ్యంలో భాగమైన ఔరంగాబాద్‍లో పీపుల్స్ ఎడ్యుకేషన్‍ సొసైటీ నిర్మించ తలపెట్టిన కళాశాలకు 12 లక్షల రూపాయలను అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది.


1950, మే మూడోవారంలో అంబేద్కర్‍ మరోసారి హైదరాబాద్‍కు విచ్చేశారు. ఈసారి తాను ఔరంగాబాద్‍లో నిర్మించ తలపెట్టిన కళాశాల 12 లక్షల అప్పు ఒప్పందం చేసుకున్నారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు నిజాం ప్రభుత్వం దళితుల అభ్యున్నతికోసం ఏర్పాటు చేసిన ఒక కోటి రూపాయల షెడ్యూల్డ్ కాస్ట్ ట్రస్ట్ఫండ్‍ నుంచి ఈ మొత్తాన్ని అప్పుగా కేటాయించారు. హైదరాబాద్‍ రాజ్యం పోలీసు చర్య అనంతరం ఇండియాలో భాగమైన తర్వాత కూడా ఈ కమిటీ కొనసాగింది. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. గ్రాంటుగా విడుదల చేసిన ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా తర్వాతి కాలంలో ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం బొంబాయిలోని ‘పీపుల్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ’కి తాఖీదులు జారీ చేసింది. గ్రాంటుని విరాళంగా ప్రకటించి మాఫీచేయాలని సొసైటీ తరపున మాజీ చీఫ్‍ జస్టిస్‍ సికింద్రాబాద్‍కు చెందిన రాజారామ్‍ భోలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‍ కోట పున్నయ్య జడ్జిగా ఉన్నారు. ప్రభుత్వం తరపున కాంగ్రెస్‍కు చెందిన ఎం.ఎస్‍.రాజలింగం వాదించినాడు. అయితే ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ చీఫ్‍ జస్టిస్‍ గోపాలరావు ఎగ్బోటే పూనిక మేరకు ఆ రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తున్నదని ప్రకటించినాడు. ఎగ్బోటే పూర్వీకులు మహరాష్ట్రీయులు కావడం కూడా ఇందుకు తోడ్పడింది.


అంబేద్కర్‍ ఎప్పుడు హైదరాబాద్‍ వచ్చినా ఒక్క దళితులే గాకుండా హైదరాబాద్‍ సమాజం మొత్తం ముఖ్యంగా హైదరాబాద్‍లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న మహరాష్ట్రీయులు ఆసక్తిగా, ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేవారు. నిజాం ప్రభుత్వంతో గ్రాంటు విషయంలో ఒప్పందం చేసుకునేందుకు అంబేద్కర్‍ హైదరాబాద్‍లో ఉన్న సమయంలో హైదరాబాద్‍ బోట్స్ క్లబ్‍లో కొంతమంది విద్యావంతులతో సమావేశమయ్యారు. ఇక్కడ ఉపన్యాసమివ్వకుండా సభికుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన బుద్దిజంలోకి దళిత సమాజం మారడానికి సంబంధించి, ఐక్యరాజ్యసమితిలో షెడ్యూల్డ్ కులాల వారి స్థితిగతుల చర్చించాలనే అంశాలపై స్పందించారు. ఈ దేశంలో దళితులకు సమాన హోదా ఉండాలి, ఐక్య రాజ్యసమితిలో విషయం చర్చించడంపై తనకేమి అభ్యంతరం లేదని చెప్పాడు. “he would not give any other lead to the Sechdeuled Castes except asking them to become men, equal men in this country and not to accept to be the second grade citizens.
Answering a question on democracy he said that “Hindu society is not ideally suited for democrary. It is against democratic tradations by its caste and such-caste divisions. Even untouchability grave even. Asked “whether it was true that the Scheduled Castes Federation passed a resolution saying that they would take the matter before U.N.O.” Dr. Ambedkar denied any resolution being passed. He said, however, there was nothing against any citizen carrying a subject before U.N.O.” (పి.ఆర్‍.వెంకటస్వామి; భాగం-2; 1955) అంబేద్కర్‍ మరోసారి డిసెంబర్‍ 31, 1950, 1 జనవరి 1951లో హైదరాబాద్‍కి వచ్చారు. ఈసారి హైదరాబాద్‍ తాత్కాలిక ప్రభుత్వంలో దళితులకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి చర్చలు జరిపినారు. ప్రభుత్వ అతిథిగా లేక్‍వ్యూ గెస్ట్ హౌజ్‍లో ఉన్నారు. జె.హెచ్‍.సుబ్బయ్య తన స్వప్రయోజనాల కోసం అంబేద్కర్‍ని తప్పుదారి పట్టిస్తున్నారని భావించిన కొంతమంది దళిత నాయకులు అంబేద్కర్‍ని కలవాలని ప్రయత్నించారు. ఇందులో లీలావతి నాథమ్‍, జె.పి.నారాయణ, పి.వి.మోహన్‍ తదితరులున్నారు. ఇందులో లీలావతినాథమ్‍ అంబేద్కర్‍ని కలిసి ఒక నివేదికను సమర్పించింది. మాలకులానికి చెందిన లీలావతినాథమ్‍ క్రిస్టియన్‍ మతం పుచ్చుకున్నారన్న ప్రచారంతో ఆమె రిజర్వేషన్‍ సీటు నుంచి నామినేషన్‍ వేసిన తర్వాత ప్రత్యర్థులు దాన్ని చెల్లకుండా చేసినారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ఎత్తులు, పై ఎత్తులుగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్‍కే చెందిన డిప్రెస్డ్ క్లాసెస్‍ అసోసియేషన్‍ నాయకులు విద్యావంతులైన కె.ఆర్‍.వీరాస్వామి 1949లో డిల్లీలో అంబేద్కర్‍ని కలిసి ‘పోలీసు చర్య’ గురించి చర్చలు చేసినారు. రజాకార్లుగా వ్యవహరించినవారే వేషం మార్చి కాంగ్రెస్‍ పార్టీలో కొనసాగుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన నివేదించారు.


మరోవైపు జనవరి 12, 1953 ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు దేశంలోనే మొట్టమొదటిసారిగా అంబేద్కర్‍కు గౌరవ డాక్టరేట్‍ని (డి.లిట్‍) ప్రదానం చేసింది. ఈ డిలిట్‍ని స్వీకరించడానికి అంబేద్కర్‍ స్వయంగా హైదరాబాద్‍కు వచ్చినారు. విదేశాల్లో ఉన్నత చదువులు, డాక్టరేట్‍ పొందినప్పటికీ, ప్రపంచంలోని మొత్తం ఐదారుగురు మేధావుల్లో ఒక్కడుగా ఆనాడే గుర్తించబడ్డప్పటికీ ఆయనకు స్వదేశంలో ఏ విశ్వవిద్యాలయం డాక్టరేట్‍ని ప్రకటించలేదు. ఈ పనిని ఉస్మానియా విశ్వవిద్యాలయం చేసింది. అనంతరం 1954 నవంబర్‍లో మరోసారి ఆయన హైదరాబాద్‍కు వచ్చారు. ఈ సారి సికింద్రాబాద్‍ ప్యారడైజ్‍ హోటల్‍లో మకాం చేశారు. నవంబర్‍ -14వ తేదీ కొంతమంది దళిత విద్యార్థుల కోరిక మేరకు కాచీగూడాలోని ఎస్సీ హాస్టల్‍ని సందర్శించి వారి నుద్దేశించి ప్రసంగించారు. అలాగే 15వ తేదీన కోటీ (జాంబాగ్‍)లోని వివేకవర్ధని విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి కళాశాల అధ్యాపకులు డా.ఎస్‍.డి.సత్వాలేకర్‍, సచిన్‍ మాడేకర్‍, గోపాలరావు ఎగ్బోటే (ఆంధప్రదేశ్‍ హైకోర్టు మాజీ చీఫ్‍ జస్టిస్‍) తదితరులు పాల్గొన్నారు. ‘నాయకుడు ఎలా ఉండాలి అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ ‘‘నాయకుడనేవాడు సమాజానికి ఆదర్శంగా వుండాలి, ప్రజ్ఞావంతుడుగా, క్రమశిక్షణా పరుడిగా, శీలవంతుడిగా, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేవాడిగా, మార్గదర్శకుడిగా వుండాలి’’ అని అన్నారు.


ఏది ఏమైనా హైదరాబాద్‍కు అంబేద్కర్‍కు అవినాభావ సంబంధమున్నది. ఆయన రాజకీయ కార్యాచరణ స్ఫూర్తితో ‘హైదరాబాద్‍ అంబేద్కర్‍’గా బి.ఎస్‍.వెంకటరావు వెలుగొందినాడు. నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రిగా రాణించినాడు. బత్తుల శ్యామ్‍సుందర్‍ అంబేద్కర్‍ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేసినాడు. ముఖ్యంగా హైదరాబాద్‍, పాత హైదరాబాద్‍-కర్నాటక, మరఠ్వాడా ప్రాంతాల్లో బలమైన నాయకుడిగా ఎదిగినాడు. నిజానికి ఈనాడు గ్రామ గ్రామాన అంబేద్కర్‍ విగ్రహాల స్థానపనకు నాంది శ్రీకారం చుట్టింది శ్యామ్‍సుందర్‍. ఆయన బీదర్‍లో అంబేద్కర్‍ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి 1957 ఆ ప్రాంతంలోనే హైకోర్టు దాకా కోట్లాడి సాధించినాడు. అంబేద్కర్‍ విగ్రహం స్థాపించడం ఆత్మగౌరవ ప్రకటనలో భాగం చేసినవాడు శ్యామ్‍సుందర్‍. అంబేద్కర్‍ ‘ఎడ్యుకేట్‍, ఆర్గనైజ్‍, అజిటేట్‍’ అనే నినాదాన్ని ‘ట్రూ స్పిరిట్‍’తో ఆచరించింది కె.ఆర్‍.వీరస్వామి. ఈయన హైదరాబాద్‍లో మొట్టమొదటిసారిగా దళితుల విద్యాసదస్సుని నిర్వహించడమే గాకుండా ఎమ్మెల్యేగా, విద్యావేత్తగా రాణించినారు. వీరి స్ఫూర్తిని, అంబేద్కర్‍ని ఆచరణను కలుపుకొని కొట్లాడాల్సిన బాధ్యత నేటి యువతరం మీద ఉన్నది.


-సంగిశెట్టి శ్రీనివాస్‍,
ఎ : 9849220321

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *