ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం

  • తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం.. ప్రతి తెలంగాణ బిడ్డ జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచే సమయమిదే. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. అరవై ఏండ్లు ఆలస్య మైనా కోల్పోయిన రాష్ట్రాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్ప జాతి మనది. మొండి పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చూపెట్టాలి. ఈ కరోనా.. దేశంలో ఎవరిని ఏంచేసినా.. ఈ తెలంగాణవాళ్లను మాత్రం ఏమీ చేయలేకపోయిందన్న పేరు తెచ్చుకోవాలి.
  • జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరుతూ చప్పట్లు కొట్టాలంటే మోదీని తిడతారా? మొద్దులు ఎత్తుకోమనలేదు. బరువులు మోయమనలేదు కదా. రెండు చేతులతో నాలుగు నిమిషాలు చప్పట్లు కొడితే తప్పేంది. ఊరంతా చప్పట్లు మారుమోగుతయి. దీనికి కొంత మంది పనిలేకుండా వక్రబుద్ధితో ప్రధానిని కూడా అవహేళన చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. డీజీపీకి చెప్పుతున్నా. ఇటు వంటి వారిని అరెస్ట్ చేయాలి. కేసులు నమోదు చేయాలి. వాళ్లకు బుద్ది వచ్చే విధంగా చేయాలె. సంఘీభావం తెలిపే పనిచేయా లంటే కూడా హేళన చేస్తే, పద్దతి కాదు. ప్రధాని అంటే గౌరవించాలి. ప్రతిదాన్ని వ్యంగ్యంచేయడం మంచిది కాదు.
  • మనం పిలిస్తేనే కరోనా వస్తది ఈ కరోనాపై ఒక జోక్‍ తిరుగుతున్నది. కరోనా స్వాభిమానం ఉన్న జబ్బు. అంటే అభిమానం ఉన్న జబ్బు. అది ఉన్న కాడ్నే ఉంటది. దాన్ని మనం ఆహ్వానిస్తే తప్పమన దగ్గరికి రాదు. మనం రమ్మంటే తప్ప రాదు. దాన్ని మనం ఆహ్వానించనద్దు. అలాంటి జబ్బును కొనుక్కోవద్దు. ప్రభుత్వం ఎంత చెప్పినా.. ప్రజల సహకారం ఎక్కువ అవసరం. ఇలాంటి ఆపత్కాలంలో ఎవరి నియంత్రణ వాళ్లు పాటించి, సంయమనం పాటిస్తే మంచిది. – సీఎం కేసీఆర్‍


కరోనా కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటిం చిన జనతా కర్ఫ్యూను తెలంగాణలో 24 గంటలపాటు పాటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‍ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వీయ నియంత్రణలో తెలంగాణ.. దేశానికి ఆదర్శంగా నిలువాలన్నారు. విదేశాల నుంచి తెలంగాణ వచ్చినవారి కారణంగానే కరోనా వ్యాప్తి చెందుంతున్నందున విదేశాలనుంచి వచ్చినవారు అధికారులకు స్వచ్ఛందంగా సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరసేవలు మినహా మిగిలిన సేవలన్నీ పూర్తిగా బంద్‍ అవుతాయని తెలిపారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో.. రాష్ట్రంలో చేస్తున్న ఏర్పాట్లు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‍ శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. సీఎం పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే…


తెలంగాణ సాధన స్ఫూర్తి మళ్లీ చాటుదాం
ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులెత్తి దండం పెట్టి అభ్యర్థిస్తున్న. ప్రతి తెలంగాణ బిడ్డ ఆదివారం ఒక్కరోజు కర్ఫ్యూను తప్ప కుండా పాటించాలె. జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్‍లో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. మన తెలంగాణ జాతి చాలా గొప్పజాతి. అరవై ఏండ్లు ఆలస్యమైనా కోల్పోయిన రాష్ట్రాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్పజాతి మనది. అంతటి ఘనమైన చరిత్ర మనకు ఉన్నది. మొండి పట్టుదల ఉన్నవాళ్లం. ఇప్పుడు అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చూపెట్టాలి. ఈ కరోనా.. దేశంలో ఎవరిని ఏంచేసినా.. ఈ తెలంగాణ వాళ్లను మాత్రం ఏమీ చేయలేక పోయిందన్న పేరు తెచ్చుకోవాలి.


అత్యవసర సేవలు తప్ప అన్నీ బంద్‍

ఆర్టీసీ బస్సులు వందశాతం బంద్‍ పెడుతున్నం. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరుగదు. అత్యవసర సేవల కోసం ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రతి డిపోకు ఐదు బస్సుల చొప్పున సిబ్బందితో సహా సిద్ధంగా పెడుతున్నాం. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాత్రమే సిద్ధంగా ఉంచుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను సరిహద్దుల్లోనే ఆపాలని సీఎస్‍కు, రవాణాశాఖ, పోలీస్‍ శాఖలకు చెప్పాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి రానివ్వబోమని ముందే చెప్తున్నాం. ఇది కఠిన సమయం. క్లిష్ట పరిస్థితి. సంకట సమయంలో కఠినంగా ఉండకతప్పదు. స్వీయ నియంత్రణ పాటించాలి. మేం పాటించం అని ఎవరైనా అంటే వాళ్లను రానివ్వం. మెట్రో రైళ్లు దేశవ్యాప్తంగా బంద్‍ చేస్తున్నరు. హైదరాబాద్‍లో పూర్తిగా బంద్‍
ఉంటయి. అత్యవసర పరిస్థితి కోసం ఐదు రైళ్లను అందుబాటులో ఉంచుతున్నం.


ఎవరికి వారు బంద్‍ చేసుకోవాలి
వ్యాపార వాణిజ్య సంఘాలు స్వయంనియంత్రణ పాటించాలి. ఎవరికి వారు బంద్‍ చేసుకోవాలి. మేం జబర్దస్త్ గా ఎవరినీ బంద్‍ చేయించడంలేదు. విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బంద్‍లు పాటించాం. ఒక్కరోజుతో మునిగి పోయేదేమీలేదు. నిత్యా వసర సరుకుల కొరత రాకుండా చర్యలు తీసు కొంటున్నాం చిన్నచిన్న వ్యాపారస్థులు దెబ్బ తినొద్దని, పాలు, మాంసం, చేపలు, కూర గాయలు విక్రయించే దుకాణాలను నిషేధించడం లేదు. పాలు, చిన్నారులకు సంబం ధించిన ఇతర దుకాణాలు, వైద్యసేవలు, అంబులెన్లు, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక సిబ్బంది, తాగునీటి వ్యవస్థకు సంబంధించిన సిబ్బంది, సివరేజ్‍ సిబ్బంది సహా ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది తప్ప మిగతా అందరూ 24 గంటలపాటు ఎవరికి వారు బంద్‍ పాటించాలి. మీడియా మిత్రులు కూడా తిరగవచ్చు. మీడియాను ఎవరూ నిరోధించరు. అత్యవసరంగా భావించి వీటిని మినహాయిస్తున్నాం. మీడియా నియంత్రణ పాటించాలి. మీటరు దూరంలో ఉండి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్‍ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లకుంటేనే ఉత్తమం. వెళ్తే మాత్రం మీటరు దూరంలో ఉండి మాట్లాడాలి. ప్రగతిభవన్లో ఎన్నో విలేకరుల సమావేశాలు నిర్వహించుకున్నాం. కానీ ఈ రోజు (శనివారం) విలేకరులను కూడా మూడు మూడు ఫీట్ల దూరంలో కూర్చోవాలని చెప్పినం. కారణం ఏందంటే.. మన చేతుల్లో ఉన్నంత వరకు జాగ్రత్తలు పాటిద్దాం… ఆ తర్వాత భగవంతుడి దయ. చేయగల్గింది. చేయవల్సింది… తప్పక చేయాలి. దయచేసి మీరు స్వీయ నియంత్రణ పాటించాలి.


పనిమనుషుల కోసం చూడొద్దు
ఆదివారం పనిమనిషులు రావాలే.. మాకు సేవకులు రావాలే అని చూడవద్దు. ఈ ఒక్క రోజు ధనవంతులు , కల్గినవాళ్లు పనివాళ్లను పిలవకండి. మీ పనులు మీరు చేసుకోండి.. ఇవన్నీ పాటిస్తే కరోనా ప్రభావం మనకు రాదు. ప్రతి ఒక్కరు సహకరించాలి.


వృద్ధులు బయటికి రావొద్దు

60 ఏండ్లకు పైబడినవారు, పదేండ్లలోపు పిల్లలు రెండు, మూడు వారాలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు గమనిస్తే 60 ఏండ్లవారు ఎక్కువగా చనిపోతు న్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో కోరాం. మన దగ్గర సీసీఎంబీ ఉన్నదని సూచించాం. దురదృష్టం కొద్దీ మన దగ్గర కూడా పరిస్థితి తీవ్రమైతే రోజుకు వెయ్యి మందిని పరీక్షించే సామర్థ్యం ఉన్నది. దాన్ని కూడా వాడుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అడిగాం. ప్రధాని కూడా ఆదేశాలిచ్చారు. అవసరమైతే మనం దాన్ని కూడా వాడుకుంటాం. మన దగ్గర ఉన్న వసతులు, వనరులను ఎలా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది. అందరం కలిస్తే తప్పక కరోనాను నివారించవచ్చు.


స్వాభిమానం ఉన్న కరోనా!

ఈ కరోనాపై ఒక జోక్‍ తిరుగుతున్నది. కరోనా స్వాభిమానం ఉన్న జబ్బు. అంటే అభిమానం ఉన్న జబ్బు. అది ఉన్న కాడ్నే
ఉంటది. దాన్ని మనం ఆహ్వానిస్తే తప్ప మన దగ్గరకి రాదు. మనం రమ్మంటే తప్ప రాదు. దాన్ని మనం ఆహ్వానించవద్దు. అలాంటి జబ్బును కొనుక్కో వద్దు. ప్రభుత్వం ఎంత చెప్పినా.. ప్రజల సహ కారం ఎక్కువ అవసరం. ఇలాంటి ఆపత్కా లంలో ఎవరి నియంత్రణ వాళ్లు పాటించి, సంయమనం పాటిస్తే మంచిది.

నమస్తే తెలంగాణ
తెలుగు దినపత్రిక సౌజన్యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *