గతానికి వర్తమానానికి వారధి, భావి నిర్మాణానికి మార్గదర్శి అంబర్‍పేట-ఆకాశానికి పూచిన మందారం


నైసర్గిక, కృతక స్వరూప స్వభావాల దృష్ట్యా, జనాభా విస్తరణ, పాలనాపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తెచ్చే మార్పులు… తదితర చారిత్రక పరిణామాలతో ఒక ప్రాంతం కొన్ని ప్రత్యేకతలు సంతరించుకుని వర్తమాన సామాజిక, రాజకీయ చిత్రపటంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తుంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటూ అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‍ మహానగరంలో వివిధ మతాలవారు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు ఆచరించే ప్రజలు, దేశం నలుమూలల నుంచీ శాంతియుత సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా మత, భాషా సంస్కృతీపరంగా అత్యంత వైవిధ్య భరితమైన, విలక్షణమైన ప్రజాజీవన విధానం ఇక్కడ నెలకొనివుంది. దక్కన్‍ల్యాండ్‍ ప్రత్యేకమనదగ్గ ఈ అపారమైన వైవిధ్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయిక విభిన్నతను పూర్తిగా పుణికి పుచ్చుకున్న సువిశాల ప్రాంతం అంబర్‍పేట. ఇది తెలంగాణ రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో కూడా) ఒక శాసనసభా నియోజకవర్గం. హైదరాబాద్‍ నగరంలో ఒక ప్రధాన మండల కేంద్రం. అన్ని రకాలుగా అభివృద్ధి చెంది జనంతో నిత్యం కిటకిటలాడే రోడ్లతో బాగా విస్తరించిన ప్రముఖ భాగం కూడా.


పాత్రికేయుడు, కవి, రాజకీయ విశ్లేష కుడిగా సుపరిచితుడైన కోడం పవన్‍కుమార్‍, మరిద్దరు మిత్రుల సహకారంతో, అంబర్‍పేట ప్రాంతపు అన్ని పార్శ్యాలను సృశిస్తూ సమగ్ర వివరణతో ‘అంబర్‍పేట-ఆకాశానికి పూచిన మందారం’ పేరుతో 202 పేజీలతో చారిత్రాత్మక పుస్తకాన్ని తీసుకువచ్చాడు. ఇందులోని విషయసామాగ్రి… చరిత్ర, అత్రాఫ్‍- ఐ-బల్దా, జ్ఞాపకాలు, రాజకీయ స్వరూపం, మారిన డివిజన్లు, శాసనకర్తలు, అంతరంగం, అంబర్‍పేటలోని డివిజన్లు… తదితర విభాగాలుగా విభజించాడు. ఈ ప్రాంతానికి ఆ పేరు రావడానికి మూలకారకుడైన అంబర్‍మియా జీవన విశేషాలు, ఒకనాటి సబ్బండవర్ణాలు, సమస్తవృత్తుల కాణాచిగా, తహసీల్‍ కార్యాలయ కేంద్రంగా విలసిల్లిన అంబర్‍పేట గ్రామం క్రమంగా గోల్కొండ నవాబులు, ఏడవ నిజాం హయాంలో అభివృద్ధి చెందిన విధానం, విశాలాంధ్ర అవతరణ అనంతరం చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులు, వివిధ రాజకీయ పార్టీల ప్రాబల్యదశలు, వాటి ఉత్థాన పతనాలు, వాటికి పునాదులు వేసిన రాజకీయ ప్రముఖుల జీవనచిత్రాలు, ప్రస్తుత హోదాలు, పదవుల్లో వున్న ప్రసిద్దుల జీవన విశేషాలు, దేశ, రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం పడవేసిన జాతీయ పార్టీల నాయకుల అంతరంగాలతో పాటు అంబర్‍పేట సామాజిక, ఆర్థిక పరిణామక్రమాన్ని సన్నిహితంగా పరిశీలిస్తూ వస్తున్న కొందరు ప్రముఖుల ఆసక్తికరమైన జ్ఞాపకాలు ఈ పుస్తకంలో పొందుపరుచబడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భూపాల్‍, ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి, డాక్టర్‍ అజిత్‍ ఎగ్బోటే, షర్మిష్టాదేవిల జ్ఞాపకాలతో అంబర్‍పేట, కాచిగూడ, నల్లకుంటల వందేళ్ల పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా గుర్తుకుతెచ్చారు. అలాగే ఈ ప్రాంతంలోని రాజకీయవేత్తలు కేంద్రమంత్రి జి.కిషన్‍రెడ్డి, హిమాచల్‍ ప్రదేశ్‍ గవర్నర్‍ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‍ సీనియర్‍ నాయకుడు వి.హనుమంతరావులు అంతరంగాన్ని పంచుకోవడం వల్ల నాటి నుంచి నేటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను మనకు పూసగుచ్చినట్లుగా వివరించారు.


అంబర్‍పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల స్థితిగతులను ఏ డివిజన్‍కు ఆ డివిజన్‍గా విభజించడంతో శాసనసభ నియోజకవర్గం ముఖచిత్రం పాఠకులకు అందుతుంది. ‘ఫర్‍ఫ్యూమ్‍ ఆఫ్‍ హెవెన్‍’ పేరిట అంబర్‍పేట, ‘కులవృత్తుల సమాహారం’గా బాగ్‍అంబర్‍పేట, ‘కాచె కులస్థుల జీవనదృశ్యం’తో కాచిగూడ, ‘కుంటపై విరిసిన నల్లకలువ’గా నల్లకుంట, ‘నిజాం సైనికుల కాపలా కేంద్రం’గా గోల్నాక డివిజన్ల రూపురేఖలు, జనసరళి, భౌగోళిక స్వరూపం, కార్పొరేటర్లు, నాయకుల రాజకీయ జీవన నేపధ్యాలను జర్నలిస్టు పవన్‍కుమార్‍ ఆకట్టుకునే శైలిలో వివరించారు. హైదరాబాద్‍ నగర తొలి కార్పొరేషన్‍ ఎన్నికలు జరిగిన 1951 నుంచి 2016 ఎన్నికల సమీక్షతో పాటు కార్పొరేటర్ల వివరాలను పొందుపరిచారు. చాలామందికి తెలియని తొలితరం కార్పొరేటర్లు పుస్తకం ద్వారా పరిచయం కావడం అరుదైన సమాచారంగా పేర్కొనవచ్చు. సుల్తాన్‍బజార్‍, గగన్‍మహల్‍, హిమాయత్‍నగర్‍, ప్రస్తుత అంబర్‍ పేటగా మారిన శాసనసభ తీరును కూలంకషంగా వివరించడం ఒక ఎత్తయితే, ఈ నియోజకవర్గాలలో పోటీచేసిన వారందరి పేర్లు, వారికి వచ్చిన ఓట్లు తదితర వివరాలు ఇవ్వడం గొప్ప సమాచార సేకరణగా భావించాలి. గెలిచిన శాసనసభ్యులు ఆలె నరేంద్ర, వి.హనుమంతరావు, కృష్ణయాదవ్‍, కిషన్‍రెడ్డిలు శాసనసభ్యులుగా అందరికీ తెలిసినవారే అయినప్పటికీ, వాసుదేవ కృష్ణాజీ నాయక్‍, శ్రీమతి శాంతాబాయి తల్‍పల్లికర్‍, తెళ్ళ లక్ష్మికాంతమ్మ, జి.నారాయణ రావుగౌడ్‍లను ఈ తరానికి పరిచయం చేశాడు. కార్పొరేషన్‍, శాసనసభ, సికింద్రాబాద్‍ పార్ల మెంటరీ నియోజకవర్గాల ఎన్నికల్లో అంబర్‍పేట ఓటర్లు ఏయే కాలల్లో, ఏయే పార్టీలవైపు మొగ్గు చూపారో గణాంకాలతో సహా ఇవ్వడం జరిగింది. ఇక్కడి ప్రజాజీవనంలో భాగమైన పోలీస్‍ శిక్షణా కేంద్రం, పోలీసు ఆర్టీసీ క్వార్టర్లు, స్మశానవాటికలు, మాయమైన, ఉనికి కోల్పోతున్న చెరువులు, కుంటలు, దేవా లాయాలు, మసీదులు, చర్చీలు, విద్యాలయాలయాలు, సిద్దిఅంబర్‍ సమాధి, బురుజు, చారిత్రక కట్టడాలు, స్థూపాలు, స్మృతిచిహ్నాలు, గ్రంధా లయాలు, ఆసుపత్రులు, వసతిగృహాలు తదితరమైనవన్నింటి గురించి సవివరమైన సమాచారం ఈ పుస్తకంలో దొరుకుతుంది.


కేశవనిలయం, సావర్కర్‍ కాంస్య విగ్రహం, బూర్గుల, దుర్గాబాయి దేశ్‍ముఖ్‍ల గృహాలు, ఆంధ్ర యువతి మండలి తెచ్చిన మహిళా విప్లవం, పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించిన బాలనందం, నైజాం రాష్ట్రంలో నూర్‍మహల్‍ టాకీస్‍ చరిత్ర, తొలి ఫిలిం స్టూడియో రూపుదిద్దుకున్న తీరు, ప్లేగు వ్యాధిగ్రస్తులకు శిబిరంగా ఉన్న వీరన్నగుట్ట, దేవిడీలకు నిలయంగా మారిన బర్కత్‍పుర, లింగంపల్లి వంటి ప్రాంతాలు… మరెన్నింటితో సుమారు ఐదవందల ఏళ్ల చరిత్రను ఈ పుస్తకం మోసుకొచ్చింది. నిన్న మొన్నటి యధార్థాలను గుదిగుచ్చిన చరిత్రను వర్తమానానికి వారధిగా ఈ పుస్తకం నిలిచిందనడంలో ఏలాంటి సందేహం లేదు. ఈతరం వారికి అంబర్‍పేట గురించిన అనేక విషయాలను తెలియ జేస్తుంది. దీనిని ‘అంబర్‍పేట ఎన్‍సైక్లోపీడియా’ అనవచ్చు. గత వైభవపు ఫొటోలతో పొరలు పొరలుగా చూపే అందమైన, ఆకర్షణీయమైన ఈ పుస్తకంలో ఇక్కడి ప్రజలకు అందని ఫలాలు, నెరవేరని ఆకాంక్షలను కూడా ఎత్తిచూపించింది. అన్యప దేశంగ భవిష్యత్తు గురించిన పలు విలువైన సూచనలు చేసింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకం కూర్చిన కోడం పవన్‍ కుమార్‍, డాక్టర్‍ ధనుంజయ, శ్రీనివాస్‍ ముదిరాజ్‍లు, లయ పబ్లికేషన్‍కు అభినందనలు. ఇలాంటి ఆత్మ చరిత్రాత్మక వాస్తవ కథనాలతో కూడిన పుస్తకాలు మరిన్ని రావలసిన అవసరం ఎంతైనా వుంది.

  • ఆడెపు లక్ష్మిపతి
    ఎ : 9701227207

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *