మానవీయ విలువల ఇతివృత్త కథా సంపుటి వెంట వచ్చునది ఏది?


‘‘శరీరం నిండా గుచ్చుకున్న ముళ్లు రాలిపోతున్నాయి. తగలబడుతున్న మనశ్శరీరాలు తడిదేరుతున్నాయి. దశాబ్దాలుగా ఘనీభవించిన అభిప్రాయాలు కరిగి, కమనీయ పుష్పాలుగా వికసిస్తున్నాయి.’’ – పశ్చాత్తాపానికి లోనయిన ఓ తండ్రి హృదయ స్పందన


‘‘ఒక్కోరాత్రి గడిచేకొద్దీ ఆందోళనలు అధికమై మెదడులో అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. పిచ్చిపిచ్చి ఆలోచనలేవో చితి మంటల్లా ఎగసిపడుతూంటాయి. నిద్రపట్టదు. ఈ పరిస్థితుల్లో రాత్రి పడుకోబోయే ముందు తలతీసి డీప్‍ఫ్రీజర్‍లో పెట్టటం అలవాటు చేసుకున్నారు.. పంచేద్రియాల పనితనం మంచులో కప్పబడి పోవటంతో తుపాన్లు, అగ్నిపర్వతాల బెడద లేని విచిత్రలోకంలో అప్పుడు నిద్రపోగలుగుతున్నారు’’ – కార్పొరేట్‍ కళాశాలలో విద్యార్థుల మానసికస్థితి


ఇలాంటి మెరుపులాంటి వాక్యాలు ‘వెంట వచ్చునది’ కథా సంకలనంలో అడుగడుగునా తళుక్కున మెరుస్తూంటాయి. అభిరుచి ఉన్న కవి కావటం ఎమ్వీరామిరెడ్డికి కలిసొచ్చే అంశం. ప్రవాహవేగంతో కథ సాగటమే కాదు. వాక్యాలు పదునుదేరి భావగర్భితంగా సాగుతూంటాయి. అలాగే తనకు చిరపరిచితమైన వ్యక్తుల్ని.. పరిసరాలను కథలకు ఇతివృత్తంగా ఎంచుకోవటంతో కథావరణానికి సహజత్వం అబ్బింది.


ఇక కథలోకి వెళదాం..

రైతుకు, తన పంట పొలానికి నడుమ బంధం అనిర్వచనీయ మైంది. ఈ ఆత్మీయ బంధాన్ని రామిరెడ్డి చాలా కథల్లో ప్రభావ వంతంగా చెప్పుకొచ్చారు. ‘పొలాల తలాపున’ కథనే తీసుకుందాం. ఇందులో గొంతుకేన్సర్‍కు చికిత్సపొందుతున్న పానకాలుకు ఆస్పత్రి పరిసరాలు అంతగా రుచించవు. ఊపిరందక ఉక్కిరిబిక్కిరయినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి పారిపోదామా అని తపిస్తాడు. ‘‘నాకు దేముడు అన్నీ ఇచ్చాడు. రత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు, కన్నబిడ్డల్లాంటి కోడళ్లు, బంగారంలాంటి మనవలు, మనవరాళ్లు నన్ను ప్రాణంగా చూసుకునే ఇల్లాలు.. ఇలా అన్నీ అందరూ నన్ను కళ్లల్లో పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పుడు నాకు సంతృప్తిగా జీవించాలనుంది’ అని చెప్పి సొంత ఊరికి వెళ్లిపోతాడు. పొలంలో అడుగుపెట్టగానే అతనిలో కొత్త జీవం పుట్టుకొస్తుంది. ‘‘అయిన వాళ్ల ఆత్మీయ కుశల ప్రశ్నలు, జన్మభూమి గాలీ వెలుతురు కొత్త రక్తం ఎక్కించాయి. పోయిన శక్తి తిరిగివచ్చినట్టయింది’’ అంటూ పంట పొలంతో రైతుకున్న అనుబంధాన్ని చెప్పుకొస్తారు. గుండె బరువెక్కుతుంది.


‘రేపటి బీడు’ కథలోనూ అంతే. ల్యాండ్‍పూలింగ్‍లో భాగంగా పొలాన్ని పోగొట్టుకున్న శ్రీను… ‘‘ప్రభుత్వానికి నా వంతు కానుకగా భూమి ఇచ్చేశాను. తల్లి వేరు తుంచుకున్నాను. మట్టిబంధం తెంచుకున్నాను. రేపట్నుంచి ఎలా బతకాలి. తెల్లారి లేచి ఏ దిక్కుగా నడవాలి’’ అని పత్తి చేనును పొదివి పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తాడు. శ్రీను పత్తిసాగు చేస్తూంటాడు.


రచయిత ఏదో స్వచ్ఛంద సంస్థలో చేరతాడు. ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రకటన చేయగానే వారి స్నేహితుడు రమేష్‍ పొలం అమ్మేసి డబ్బు చేసుకుంటాడు. మిగతా ఇద్దరు ల్యాండ్‍ పూలింగ్‍లో పొలాలను వదులుకోవలసి వస్తుంది. ‘‘రాత్రికి రాత్రి మా ఊరి భూములకు రెక్కలొచ్చాయి. పొలాలు కోట్లకు పడగలెత్తాయి. మారుమూల గ్రామాల్లో రియల్‍ ఎస్టేట్‍ ఆఫీసులొచ్చాయి. కార్లు క్యూ కట్టాయి. దళారుల్ని ఆకస్మిక అదృష్టం వరించింది’’ అంటూ రచయిత పాఠకుణ్ని కథలోకి లాక్కుంటాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. రమేష్‍ భార్యను నిర్లక్ష్యం చేసి ఓ టీవీ నటికి చేరువవుతాడు. చివరకు ఆ నటి ఆత్మహత్యకు పాల్పడటంతో నేరం రమేష్‍ పైన పడుతుంది. అకస్మాత్తుగా వచ్చిపడే సంపద మనిషిని ఒక్కసారిగా స్థితిపరుణ్ని చేయటమే కాదు. అతన్ని కొత్త వ్యసనాలకు చేరువ చేస్తుంది. లేనిపోని బలహీనతలవైపు పురిగొల్పుతుంది అన్న విషయం అర్థమవుతుంది. భూసమీకరణలో రైతులు కొందరు పొలాలను స్వచ్ఛందంగా ఇస్తే మరి కొందరి పొలాలను ప్రభుత్వమే నిర్బంధంగా తీసుకోవటం వంటి అంశాలను రచయిత ఇందులో సృజించారు.


‘త్రిశంకు స్వప్నం’ అన్న మరో కథలో రాజధాని ప్రకటనతో మారిన పల్లె స్వరూపాన్నే కాదు. మానవసంబంధాలు విచ్ఛిన్నం కావటం వంటి అంశాలను చిత్రించారు. ఒక్కసారిగా పంట పొలాలకు గిరాకీ వచ్చి కొందరు అకస్మాత్తుగా శ్రీమంతులు కావటం, కార్లజోరు పెరగటం వంటి పరిణామాలు పల్లెలో చోటుచేసుకుంటాయి. నిన్న మొన్నటి వరకూ సఖ్యంగా ఉన్న అన్నదమ్ముల మధ్య కక్షలు చెలరేగి అన్ననే తమ్ముడి తలతెగనరకుతాడు.
అమరావతి రాకతో ఉపాధి కోల్పోయిన రోజుకూలీ అగచాట్లను ‘సమిధ’ అని అతి చిన్న కథలో ఆసక్తికరంగా వివరించారు. పట్టణంలో వివిధ వృత్తుల్లో ఉన్న అరాచకాన్ని ఇందులో చూపించారు. తనను తాను కోల్పోకుండా ఒక ఆకుపచ్చ జీవితాన్ని తొడుక్కోగల అవకాశాలు మృగ్యమేనని ఈ కథ చాటిచెబుతుంది.


రుణాత్మకం’ రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారుల మనస్తత్వాన్ని పరిచయం చేసే కథ. బాలరాజు అప్పు తీర్చే దారిలేక సతమత మవుతూంటాడు. తనకు మంచి భూమి చూపిస్తే కమిషన్‍ మొత్తాన్ని అప్పులో తెగ్గొడతానన్న ప్రతిపాదన చేస్తాడు శివరామయ్య. దాంతో బాలరాజు ఆయనను వెంటబెట్టుకుని కారులో బయలుదేరతాడు. మార్గమధ్యంలో కారు కుంటలోకి జారిపోయి శివరామయ్య ప్రాణం మీదకు వస్తుంది. మృత్యుముఖంలో ఉన్న ఆయనను ఆస్పత్రికి చేర్చటానికి చాలా శ్రమ తీసుకుంటాడు బాలరాజు. స్వస్థత చేకూరాక శివరామయ్యలో మునుపటి మనిషి మేల్కొంటాడు. తనకు ప్రాణభిక్ష పెట్టాడన్న కనీస కృతజ్ఞతయినా చూపకుండా మనిషిని పంపి అప్పుతీర్చమని ఒత్తిడి చేస్తాడు. ఇల్లు అమ్మేసి బాకీ తీర్చటానికి సిద్ధమవుతాడు బాలరాజు. ‘‘రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారం ప్రారంభించిన తర్వాత.. అంతకు ముందు రూపాయి వడ్డీ వసూలు చేసే వ్యక్తి దాన్ని రెండు రూపాయలకు మార్చాడు. ఎనిమిది వేల పైచిలుకు మొత్తానికి నోటు రాయించుకున్నాడు. ఎన్నోసార్లు పదివేలు, పాతిక వేలు అప్పుఇచ్చి వడ్డీ లేకుండా చేసిన వ్యక్తి, పాత బాకీ చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నాడు’’ అంటూ శివరామయ్య పాత్రను పరిచయం చేస్తారు. మునుపటి స్వభావానికి భిన్నంగా ఫక్తు డబ్బుమనిషిగా ఎలా మారాడో చెప్పుకొస్తారు. కుంట నుంచి శివరామయ్యను రక్షించే క్రమంలో బాలరాజు పడిన అవస్థను వర్ణించటంలో కథకుని ఊహాబలం ముచ్చటేస్తుంది.ప్రయోగాత్మక కథల్లోనూ ప్రత్యేక ముద్ర
కంకాళశాల, మృగయా కథల్లో రచయిత విభిన్నమైన ప్రయోగం చేశారు. కార్పొరేట్‍ కాలేజిని ‘కంకాళశాల’ అంటారు. ఆ వాతావరణంలో ర్యాంకుల కోసం పోటీలో విద్యార్థులెంత దీ(హీ)నంగా బతుకుతారో వ్యంగ్యాత్మకంగా వివరిస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల హింస వారిని మానసికంగా చిత్రవధ చేస్తున్న తీరు చదువుతుంటే మనసు కరిగి కన్నీరవుతుంది. అక్కడ ఉండేది విద్యార్థులు కాదు. కేవలం అస్థిపంజరాలేనని చెప్పటం చిత్రమైన ఊహ. వాళ్లవి ఆత్మహత్యలుకావు. కేవలం ప్రాయోపవేశాలే అనటం గమ్మత్తయిన వ్యాఖ్యానం.


ఆడపిల్లల జీవితాల్లో మగాళ్లు మృగాల్లా ఎలా వ్యవహరిస్తారో, భయకంపితుల్ని చేస్తారో వివరించే కథ ‘మృగయా’. ఇది ఒక్క స్వప్న కథ కాదు. మన చుట్టూ ఉన్న ఎందరో ఆడపిల్లల హృదయ విదారక విషాద గాధ. పైకి మృదువుగా మాట్లాడే సమీప కుటుంబ సభ్యులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రేమిస్తానని వెంటపడే వాళ్లు, పెళ్లాడేవాళ్లు, ఒక్కొక్కరు ఒక్కో


ఒక్కో రకంగా ఆమె శరీరంతో ఆడుకునే తీరు ఒళ్లు గగుర్పొడుస్తుంది. పాము, తోడేలు, ఎలుగుబంటి, హైనా, హిప్పో, ఖడ్గమృగం గుంటనక్క పాత్రలతో కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.


ఈ సంకలనంలో ఆలోచింపచేసే కథగా ‘తాలు’ను చెప్పుకోవచ్చు. కంప్యూటర్‍ ఏమైనా చేయగలదు.. కానీ గిద్దెడు బియ్యం గింజలను పండించగలదా? కొత్త యాప్‍ సృష్టించి.. సన్మానం అందుకున్న సాఫ్ట్వేర్‍ ఇంజినీర్‍ను.. వ్యవసాయ దారుడయిన అతని తండ్రి అడిగిన ఈ ప్రశ్న ఆలోచింప చేస్తుంది. సాంకేతిక ప్రగతి అని జబ్బలు చరుచుకునే ప్రభుత్వాలు ఈ విషయంపైన మనసు పెడితే రైతు సమస్యలకు కొంతవరకయినా సమాధానం దొరుకు తుంది. అప్పుడే నిజమైన ధాన్యం రాశులు పండుతాయి అన్న సందేశం ఇందులోకథలో కనిపిస్తుంది. ‘‘ఎన్ని యాపులైనా ఒక యాపచెట్టుకు సమానం కాదు. మనిషికి గుప్పెడు గింజలు పెట్టగలిగితేనే ఏ టెక్నాలజీకైనా అర్థం, పరమార్థం’’అనేది ఆచరణీయమైన జీవనసత్యం.


కొందరు కేవలం పనిమనుషులుగా మిగిలిపోరు. తాము పని చేసే ఇళ్లలో పిల్లల్ని సొంత తల్లికంటే ఎక్కువగా సాకుతారు. పిల్లలికి కష్టాలొచ్చినప్పుడు గుండెల్లో పెట్టుకోవటమే కాదు. నీవెనుక నేనున్నాను అన్న భరోసా ఇస్తారు. అలాంటి తల్లి సుశీలను పరిచయం చేసే ప్రయత్నమే ‘కాపలా తల్లి’ కథ. ఇందులో వర్ణిత తన పాతజ్ఞాపకాలను తడుముకుంటూ.. సుశీలను వెతుక్కుంటూ వస్తుంది. ఆమె ఇంటికి చేరటంతో కథ ముగుస్తుంది. ఇరువురి మధ్య భావోద్వేగాల ప్రస్తావన ఉండదు. ముగింపు భిన్నం.


‘ముళ్లూపూలూ’ చాలా ఇళ్లలో సాగే కథే. మగపిల్లలపైన గంపెడాశలు పెట్టుకోవటం..ఆడపిల్లల తెలివితేటల్ని తక్కువ చేయటం, వారి ప్రతిభాపాటవాలను గుర్తించకపోవటమే కాదు. చులకన చేయటం మనం వింటున్నదే. ఈ కథలో మగపిల్లలు.. నిజానికి సొంత బిడ్డలు కాదు. చనిపోయిన సోదరి పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటాడు రచయిత. కుమారై సుమ అభిప్రాయాలను గౌరవించడు. స్కాలర్‍షిప్పులతో చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి సోషల్‍వర్క్ పిజీ పూర్తిచేసి ప్రతిభావంతురాలిగా రాణిస్తున్నా ఖాతరు చేయడు. చివరికి పరిస్థితులు అతనికి కనువిప్పు కలిగేలా చేస్తాయి.


మంత్రులు, ఇంజినీర్లు, గుత్తేదారుల మధ్య అనైతిక పొత్తును ‘కొండ అద్దం మందు’ మనకు పరిచయం చేస్తుంది. క్షేత్రస్థాయిలో అంశాలతో పరిచయం లేకపోతే ఇలాంటి కథలను రాయటం కష్టం. అసలంటూ లేని కొండను, ప్లైఓవర్‍ను కాగితంలో చూపించి ఎవరికి వారు ఎలా లబ్ధిపొందారో, ప్రత్యర్థులను ఎలా దెబ్బతీశారో ఈ కథ గొప్పగా చెబుతుంది.


స్ఫూర్తిదాయక కథల్లోనూ వైవిధ్యం

ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని దాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన రిటైర్డ్ ఉద్యోగిని ‘మొగ్గలు వికసించే చోటు’లో చూపిస్తారు. ‘బ్లూవేల్‍’ ప్రభావంతో తనను తాను హింసించుకుని ఆస్పత్రిపాలయిన తన మనవణ్ని అక్కడకు తీసుకొచ్చి ఆయన సంస్కరిస్తారు. గోటీబిళ్ల, గోలీలాట, బొంగరాలాట, ఏడుపెంకులాట లాంటి ఆటలను, పతంగులు ఎగరవేయటం, ఈత కొట్టడం, చెక్కభజన వంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. పిల్లల్లో అంతర్గత శక్తులు తేజోవంతమైతే.. వారు ఏవిషయమైనా ఇట్టేపట్టేస్తారు. ఆటపాటల్లో నిమగ్నమయ్యే విద్యార్థులు చదువుల్లో రాణిస్తారని, నెంబర్‍ ఒన్‍గా నిలుస్తారని కూడా అర్థమయ్యేలా విడమరిచి చెబుతారు. మనవడిలో కలిగిన మానసిక మార్పు అతన్ని కార్పొరేట్‍ కళాశాలను వదిలి అదే ప్రభుత్వపాఠశాలలో చదివేలా చేస్తుంది.


నాలుగ్గోడల మధ్యనా విద్యార్థిని బంధించి చదువుల పేరుతో వారిని బంధిస్తే ఎప్పుడెప్పుడు ఆ గోడలను బద్దలు కొట్టుకుని బయట పడాలా అనే ఆలోచిస్తారు తప్ప వారికి చదువుపైన మనసు లగ్నం కాదని… ‘శిలలు’ కథ చదివితే అర్థమవుతుంది.
‘చిగురించని వసంతం’ కథలో.. భూమిక చురుకైన అమ్మాయి. సాటి మనుషుల పట్లే కాదు. మూగజీవాల పైనా సానుభూతి చూపుతుంటుంది. శేఖర్‍కు ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. నిజానికి ఆమె నాయకత్వ లక్షణాలే నచ్చి ప్రేమలో పడినా, అనాథ ఆశ్రమంలో పెరిగిన అనిల్‍పై ఆమె ప్రేమాభిమానాలు వ్యక్తం చేయటం అతనికి నచ్చదు. చివరకు ఆమెను అర్థం చేసుకుని పశ్చాత్తాపానికి గురయినా ఆమె తిరస్కరిస్తుంది.


హంగేరికి చెందిన కెరోలీ టాకాక్స్ స్ఫూర్తితో.. పారా ఒలంపిక్స్లో పోటీకి సిద్ధమైన ఒక యువకుని గాధను ఆధారంగా చేసుకుని ‘అవయవాలు మొలిచిన మనిషి’ కథ అల్లారు. సత్‍సంకల్పం అంటూ ఉండాలేగానీ ఏ పనైనా పూర్తికావటం తథ్యం. ‘దాహనీగిసిదరప్పా’ కథలో.. దుబారా అవుతున్న ప్రభుత్వ నిధులను మళ్లించి ఓ గ్రామంలో దాహార్తిని తీర్చటానికి ఇద్దరు వ్యక్తులు ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసి తమ మానవీయతను చాటుకుంటారు.
పురిటినొప్పులతో విలవిలలాడుతున్న గిరిజన మహిళను రక్షించటం అన్న మానవీయ స్పందన ఒక వైపు, మావోయిస్టులను ఎదుర్కోవటం అన్న కర్తవ్యనిర్వహణ మరో వైపు సమాంతరంగా సాగి ‘పురిటినొప్పులు’ కథ సస్పెన్స్ సినిమాలా సాగుతుంది. విలువైన భూమిని కాజేసేందుకు ఓ రాజకీయనేత పన్నిన కుట్రలో భాగంగా సుపారీ తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అవతల వ్యక్తిని బెదిరించి విజయవంతంగా సంతకాలు పెట్టించుకుని తిరిగివస్తారు. ప్రమాదంలో చిక్కుకుంటారు. వాళ్లను రక్షించిన వ్యక్తి మరెవరో కాదు. తాము మోసం చేసిన వ్యక్తే కావటం గమనార్హం.


అజరామరం, మనిషిజాడ, బిందువు కవితా సంపుటాలు, వెన్నెలో లావా కథాసంపుటితో ఇప్పటికే ప్రసిద్ధుడైన ఎమ్వీరామిరెడ్డి ఈ రచనతో పాఠకుల్లో బలమైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే ఈ కథా సంపుటికి పలు అవార్డులు వచ్చాయి. అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన అన్నదాతలకు ఈ పుస్తకాన్ని అంకితమివ్వటం ఆయన చిత్తశుద్ధికి, మానవీయ హృదయానికి అద్దం పడుతుంది. రాబోయే రోజుల్లో ఈ రచయిత కలం మరిన్ని వెలుగులు విరజిమ్ముతూ పైపైకి సాగుతుందని ఆశిద్దాం.

శ్రీసాయిపల్లవి
ఎ : 998505013

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *