ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు

ఎవరీ ఆదేశ్‍ రవి? ఎక్కడో విన్నట్టు, ఇంకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదు. అవును మీ అనుమానం నిజమే. కవిగా, గాయకునిగా, సౌండ్‍ ఇంజనీర్‍గా, సినీ సంగీత దర్శకునిగా, మాటల రచయితగా, నటుడిగా, సహదర్శకుడిగా సినిమాకు సంబంధించి అనేక విభాగాలో అవసరానికి అనుగుణంగా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. పదిమందిని మెప్పించే సామర్థ్యం కలిగినవాడు. ప్రస్తుత ‘కరోనా’ పరిస్థితులలో వలసకూలీల వెతలను గానం చేసిన ఆదేశ్‍ రవి ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్శించిండు. రవి తండ్రి పేరెన్నికగన్న మార్క్సిస్టు పార్టీ నాయకుడు. కమ్యునిస్టు సిద్ధాంతమే ఉపిరిగా బతికిన విప్లవవాది. అయినా అవేవి రవి ధరిచేరలేదు. కానీ పోరాటగీతాలు పాడుతూ, బుర్రకథా గానాలు చేసిన తండ్రి నటనా కౌశల్యం మాత్రం రవికి అబ్బంది. తాత (అమ్మ తండ్రి కొక్కుల లక్ష్మి నారాయణ) పాడిన రాగాలు ఆపాత మధురాలై, మనసులో నుంచి చెరిపేయలేనంత బలమైన ముద్ర వేసినయి. తాత, తండ్రుల కళా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రవి కవిత్వం లోను, పాటల్లోను ఒక ప్రత్యేక శైలి ప్రతి బింభిస్తది. సామాజిక బాధ్యతతో కూడిన గురువు గుడిహాళం రఘునాథం పదాల నడక తన అక్షరాల నిండా పరుచుకుంటది.


లోకమంత పిచ్చిగా ఓవైపు పరుగులు తీస్తుంటే ఆ గుంపులో పడి కొట్టుకపోవడం తెలువనోడు. ఈత ప్రాణమై ప్రవాహానికి ఎదురీదినోడు. చెత్త చెదారంతో పేజీలు నింపి పుస్తకాలు ఏసుకునే బాపతు కాదు. హృదయం ద్రవించి, మనసు గుక్కపట్టి ఏడ్చినప్పుడు ఓ నాలుగు వాక్యాలు వాటంతటవే తన్నుకొస్తయి. ఆదేశ్‍ రవి కవిత్వమైనా, పాటైనా అట్ల పుట్టింది. ‘కరోనా’ వైరస్‍  విజృంభించి లోకమంత అల్లకల్లోలమైతున్న ప్రస్తుత పరిస్థితులలో భారతదేశపు సగటు మనిషిని ఆవిష్కరించిన తీరు ప్రపంచాన్ని కదిలించింది. ఆదేశ్‍రవిలోని కవిని, గాయకున్ని, మరోసారి కొత్తగా సాహితీ ప్రపంచానికి పరిచయం చేసినట్టయ్యింది. సామాజిక బాధ్యతను పెంచి తనలోని ఆశలు, ఆశయాలకు మరింత పదును పెట్టింది. మనిషిని ఆలోచింపజేసే ‘కరోనా’ పాటతో కన్నీరు పెట్టించి ఒక సంచలనాన్ని సృష్టించిన కవి, గాయకుడు ఆదేశ్‍రవిని గురించి నేటి మన ‘అలుగెల్లిన పాట’లో…
‘‘మనిషి వ్యక్తిత్వానికి అతని నీతి, నిజాయితే గీటురాయి’’. -ఠాగూర్‍. ఈ మాట చదువుకోవడానికి తప్ప మనుషుల్లో వ్యక్తిత్వం ఎక్కుడుంది? మానవత్వం అడుగంటి అవినీతి అక్రమాలే రాజ్య మేలుతున్న సందర్భాన్ని కూడా రవి తన పాటల ద్వారా వివరిస్తడు.


ఆదిలాబాద్‍ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‍ గ్రామానికి చెందిన దిడ్డి రమణయ్య – రాంబాయి దంపతులకు కలిగిన నలుగురు సంతానంలో రవిందర్‍ చిన్నవాడు. 1975 మార్చి 8న జన్మించిన రవిందర్‍కు అక్క లక్ష్మి, అన్నలు తిరుపతి, శ్రీనివాసులు ఉన్నరు. రమణయ్య ఉద్యోగరీత్యా షోలాపూర్‍లో పనిచేస్తూ కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితుడై సీపీయం నాయ కుడిగా ఎదిగిండు, ఇంటినిండా కమ్యూనిస్టు సిద్ధాంత గ్రంధాలతో పాటు ప్రాచీన, ఆధునిక సాహిత్యం ఉండేది. ప్రజాసమస్యల మీద పోరాటం చేసే రమణయ్య మీద రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అయినప్పటికి సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేసిండు. పాటలు పాడడం, బుర్ర కథలు చెప్పడం వంటి పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పని చేయడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ప్రజా చైతన్యం కోసం పనిచేసే రమణయ్య ఇంట్లో బియ్యం ఉన్నా లేకున్నా పుస్తకాలు మాత్రం ఉండేవి. కొంత కాలం సిరిసిల్లలో పనిచేసిన రమణయ్య ఆ తర్వాత స్వగ్రామం చేరుకుండు. పిల్లల చదువులు, కుటుంబం కొంత అస్థవ్యస్తతకు లోనైంది. అయితే రమణయ్య ఏనాడు బెదిరించి తిట్టి కొట్టిన సందర్భాలు లేవు. ఉన్నత చదువులు చదివించలేక పోయినప్పటికి పిల్లల్లో ఉన్నత జ్ఞానాన్ని పెంపొందించిండు. సామాజిక సృహను కలిగించండు.


రవిందర్‍ ప్రాథమిక విద్య మొదలు 9వ తరగతి వరకు స్థానిక రామకృష్ణాపూర్‍ జిల్లాపరిషత్‍ హైస్కూల్‍లో చదివాడు. చిన్నప్పటి నుంచి రవిందర్‍ ఆలోచనా విధానం మిగతా వారికంటే భిన్నమైంది. తల్లితో కలిసి ఊర్లకు తిరగడం, పాత కొత్త లేకుండా పిల్లలతో కలిసి బావులలో ఈత కొట్టడం భలే సరదా. రవిందర్‍ 5వ తరగతిలో ఉన్నపుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఆయన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆకలి దూపకు ఎడబాసి, పొద్దూకులు ఆటాడి ఇంటికొచ్చిన రవిందర్‍తో ఇంట్లో ఎవరూ మాట్లాడకుండా, అడిగినా అన్నం పెట్టకుండ ఉండడంతో రమణయ్య కొడుకు బాధను చూసి దగ్గరికి పిలిసిండు. ‘‘పొదటి నుంచి అమ్మ నీకోసం ఎక్కడెక్కడ వెతికిందో నీకు తెలువదు. ఎంత ఏడ్చిందో నీకు తెలువదు. నీ ఆట నీది అయినా నిన్నేమి అనను. కాని ఈ రోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చిన కథ చదివి అందులో నీతి ఏంటో చెప్పు’’ అన్నాడు. సరేనని ఒకటికి రెండుసార్లు ఆ కథ చదివి మొత్తానికి అర్థవంతమైన సమాధానం చెప్పడంతో తండ్రి సంతోషిస్తడు. ఆ సమాధానాన్ని పోస్టు కార్డు మీద రాసి పత్రికకు పంపడంతో రవిందర్‍ పేరు పత్రికలో ప్రచురించబడింది. ఈ విషయం బడిలో అందరికి తెలిసి రవిని ఎంతగానో అభినందిస్తరు. దీంతో ఇంటా బయట తన కొచ్చిన (ప్రశంశలను చూసి పొంగిపోక చదువు పట్ల ఆసక్తిని పెంచుకుంటడు. చదవడమే పనిగా పెట్టుకుంటడు. ఏకసంతాగ్రాహిగా మారి ఉపాధ్యాయులచేత ‘‘శభాష్‍’’ అనిపించు కుంటడు. ఇదే కాకుండ రవిందర్‍ మంచి జానపదాలు పాడుతుండేటోడు. అయితే 10వ తరగతి జమ్మికుంట హైస్కూల్లో చేరడం, ఇంటర్‍, డిగ్రీ కూడా జమ్మికుంట లోనే చదవడం రవిందర్‍కు సాహితీ మిత్రుల పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ఇంటర్‍లో గుడిహాళం రఘనాథం, సంపతీ రావు సార్ల్ల సాన్నిహిత్యం రవిందర్‍కు తెలుగు సాహిత్యం పట్ల అవగాహనను పెంచింది. ఇంటర్‍లో చదువు ఆగిపొయే స్థితిలో గుడిహాళం అన్ని తానై చూసుకుండు. రవిందర్‍ అన్న దగ్గర ఉండి టైలరింగ్‍ చేస్తు తన ఖర్చులు తానే ఎల్లదీసుకుంటు చదువుకుండు. రవిందర్‍ కథలు, కవిత్వం నవలలు చదవడంతో పాటు గుడిహాళం కవితా సంపుటి ‘‘ఫోర్త్ పర్సన్‍ సింగులర్‍’’ ఎంతగానో కదిలించింది. రవిలోని కవి మేల్కొన్నాడు. చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని చెప్పే రవిందర్‍ కవిత్వంతో గురువులను సైతం ఆశ్చర్య పరిచిండు.


రవిందర్‍ పుట్టి పెరిగిన వాతావరణమో, గురువుల సాన్ని హిత్యమో, యాత్ర సాహిత్య ప్రభావమో తెలువదు గానీ ప్రపంచమంతా తిరగాలన్న తపన, ఈతకొట్టాలన్న కోరిక బలంగా ఉండేది. కేవలం ఈత సరదా తీర్చుకోవడం కోసం మంథినిలో ఉంటూ కొల్లూరు చెరువులో పొద్దూకులుండేది. వెన్నెల రాత్రుల్లో ఈతకొట్టడమంటే చెప్పలేనంత ఇష్టం. ఈ కోరిక ఏకంగా సముద్రంలో ఈదాలనంత వరకు పోయింది. అందుకోసం డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రా యూనివర్సిటీలో చేరాలని అనుకున్నడు. కాని కుటుంబ కారణాల రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్‍ చదువు మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఉస్మానియా నుంచే నాయశాస్త్రంలో పట్టా పొందిండు. 2002లో ‘లా’ ద్వితీయ సంవత్సరంలో ఉండగానే కనగర్తికి చెందిన దాసరి ఉప్పలయ్య, వెంకటలక్ష్మిల బిడ్డ స్వరూపను పెండ్లి చేసుకుండు. ట్రావెలర్‍గా తిరగాలన్న తన బైరాగి తత్వానికి కొంత బ్రేక్‍ పడింది. అయితే సినిమారంగం ద్వారా కొంతలో కొంతైనా తన ఆశయాలు నెరవేర్చుకునే అవకాశం ఉంటదని భావించిండు. అందుకోసం తనులోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసిండు. రవి ఎంత స్వేచ్ఛగా తిరిగితే స్వరూపకు అంత సంతోషం. ఏనాడు రవి చేసే పనులకు అడ్డు చెప్పింది లేదు. రవి-స్వరూప దంపతులకు ఇద్దరు సంతానం. ఆదేశ్‍, ధ్యాన్య (ప్రస్తుతం ఆదేశ్‍ 7వ తరగతి, ధాన్య 3వ తరగతి చదువుతున్నరు.
తెలుగు సాహిత్యంలోని ఆధునిక కవులు, కథకులు, గాయకులతో రవికి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. బావమరిది హనుమయ్య సహకారంతో చెన్నైలోని SAE (Sound of Audio Engineering)లో చేరిండు. డిప్లమా ఇన్‍ ఫిలిం టెక్నాలజీలో (DFT) కోర్సును పూర్తి చేసిండు. మొత్తానికి సౌండ్‍ ఇంజనీర్‍గా 2006లో సినీజీవితం ప్రారంభించిండు. సంగీత దర్శకులు రమణగోగుల వద్ద చేరి యోగి, కొత్తబంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, చందమామ కథలు వంటి సినిమాలకు పనిచేసిండు. ఈ క్రమంలో ‘‘బతుకమ్మ’’ సినిమాకు పనిచేసిండు. దర్శకులు టి. ప్రభాకర్‍తో మంచి అనుబంధం ఏర్పడింది. తన మిత్రుడైన ఖాజాపాషా దర్శకత్వంలో వచ్చిన ‘‘డాటర్‍ ఆఫ్‍ వర్మ’’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిండు. ఈ సినిమాలో రవి నాలుగు పాటలు పాడిండు. అప్పుడు తెరమీద రవి అనే తన పేరుకు ముందు కొడుకు ఆదేశ్‍ పేరు చేర్చుకొని ఆదేశ్‍ రవిగా సినిమా రంగంలో అడుగు పెట్టిండు. అయితే నటుడిగా, దర్శకుడిగా ఎదగాలన్న ఆలోచనతో సౌండ్‍ ఇంజనీర్‍గా, సంగీత దర్శకునిగా వచ్చిన ఎన్నో అవకాశాలను వదులకున్నడు. లక్ష్యం కోసం ఎదురు చూస్తూనే అడపా దడపా కవిత్వం, పాటలు రాసిండు. నిజానికి విద్యార్థి దశలోనే ఆదేశ్‍ రవి కవిత్వం పత్రికల్లో ప్రచురించబడింది. ఆయన రాసింది తక్కువే అయినప్పటికీ ప్రతి వాక్యం తెలంగాణ భాషా సొగసులను అద్దుకొని నిండైన కవిత్వంతో మరిచిపోలేనిదిగా ఉంటది. ఒక రకంగా ఆదేశ్‍ రవిది వెంటాడే కవిత్వం. ‘మనసున వడ్తలేదు’ అనే కవితలో
‘‘మందిల తిరుగుతున్న – రంధితోనే ఉంటున్న’’ అంటడు. పదిమందిలో చేరి నవ్వుకుంట తుళ్ళుకుంట ఉన్నంత మాత్రాన మనిషికి పరేషాన్‍ లేదని కాదు, అనే భావాన్ని ఆదేశ్‍రవి చెప్పిన తీరు భిన్నంగా ఉంటది. ‘ముడేసే ఖాళీ’ అనే మరో కవితలో
‘‘ఉరుకుతుంట కాలం లేని కాలంలో
చీకటి భిలంలో…
ఊగుతున్న ఉయ్యాలలో’’ అంటడు. జీవితం పట్ల మనిషికి గల సృహను గుర్తు చేస్తడు. గమ్యం లేని గమనాన్ని సాగిస్తున్న తీరును అక్షరీకరిస్తాడు. సరళమైన పదాలతో బరువైన భావాన్ని పలికిస్తడు. ఆదేశ్‍రవి కవితా శీర్షికలు కూడా భిన్నంగా ఉంటయి. ‘మనిషి ఖ్యాల్ల లేడు’’ అనే శీర్షికతో రాసిన కవితలో
‘‘చావు దొరకదు – బతుకు లెక్కనే గంగాధరా’’ అంటు మొదలు పెట్టి ‘‘వాడినదేదైనా వొడుస్తది కదా – మరి దుఃఖమెందుకు వొడుస్త లేదు’’ అంటడు. దుఃఖ కంపితులను చేసి వొడవని దుఃఖాన్ని వలపోస్తడు. ఈ క్రమంలోనే ‘‘బతుకమ్మ’’ ప్రభాకర్‍ ‘‘కిష్కింధ కాండ- 2’’ సినిమాకు పనిచేయవలసిందిగా ఆహ్వానిస్తాడు. కథా చర్చలు జరుగుతున్న సమయంలోనే రసమయి బాలకిషన్‍ నుంచి ప్రభాకర్‍ సారు పిలుపు రావడం ‘‘తుపాకి రాముడు’’ సినిమా మొదలు పెట్టడం వెంట వెంటనే జరిగిపోతది.


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి నాళ్ళలో పూర్తి నిడివి గల తెలంగాణ భాషా చిత్రాన్ని చేయాలన్న తలంపుతో రసమయి బాలకిషన్‍ ఈ సినిమాను మొదలుపెట్టిండు. కథ, మాటలు, పాత్రధారుల ఎంపిక వంటి కీలక అంశాలను చూస్తూనే హీరో స్నేహితుడి పాత్రను పోషించి పలువురి దృష్టిని అలరించిండు. తనలోని నటనా కౌశల్యాన్ని దర్శకత్వ ప్రతిభను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండు. ఇదే సమయంలో అజయ్‍ దర్శకత్వంలో వచ్చిన ‘‘తమిళ తంబి’’ అనే సినిమా లోను ఫుల్‍ లెంత్‍ క్యారెక్టర్‍ చేసిండు.


ఆదేశ్‍రవి స్వంతంగా స్టూడియో పెట్టుకొని సౌండ్‍ ఇంజనీర్‍గా పని చేస్తూనే నటన, దర్శకత్వం మీద దృష్టి పెట్టిండు. మొదటి నుంచి ఆదేశ్‍ రవిది భిన్నమైన వ్యక్తిత్వం. తాను ఎక్కడున్నా ఫోర్త్ పర్సన్‍ని దేవులాడుకునే స్వభావం. ‘కరోనా’ వైరస్‍ దాడిలో ఒక్కసారిగా మానవ ప్రపంచం అల్లకల్లోలమైంది. మనుషులు పిట్టల్లా రాలిపోయి పెనువిపత్తు ఏర్పడింది. ఎవరు ఊహించని విధంగా ‘లాక్‍డౌన్‍’ అంశం తెరమీది కొచ్చింది. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేసినయి. మీడియా సహకారంతో ప్రజల్లో వైరస్‍ పట్ల అవగాహనను పెంచింది. కవులు, కళాకారులు పెద్దఎత్తున స్పందించి కవిత్వం, పాటలతో జనంలో చైతన్యాన్ని కల్గిస్తున్నరు. ఈ తరుణంలో వచ్చిన ఆదేశ్‍రవి పాట అందరిని ఆలోచింపజేసింది. అంతకుముందు రాసిన ‘తూ… బతుకు జెడ’ అనే పాటకూడా ఒక సంచలనాన్ని సృష్టించింది. సమాజంలో పెచ్చు పెరిగిపోయిన అవినీతి, అక్రమాలను ఎండగడుతూ రాసిన ఈ పాట ఒక దుమారాన్నే రేపింది. సమాజంలో ‘శివ మాల, అయ్యప్ప మాల, ఇతర మాల’లు ధరించినట్టు మనిషి దీక్షతో ‘నిజాయితీ మాల’ ధరించాలని ఆక్రోశిస్తడు. ఆవేదన వ్యక్తం చేస్తడు. ఇట్ల ఐదారు పాటలకు మించి రాయని ఆదేశ్‍ రవి రాసిన ప్రతి పదంలోను ఆర్ధ్రత ఉంటది. అంతులోని సామాజిక బాధ్యత ఉంటది. అంతే బాధ్యతతో రాసిన


‘పిల్లజెల్ల ఇంటికాడ ఎట్ల ఉండ్రో
నా ముసలి తల్లి ఏమిబెట్టి సాదుతుందో?
పూట పూట జేసుకోని బతికెటోళ్లం
పూట గడువా ఇంతదూరం వచ్చినోళ్లం
దేశమేమో గొప్పదాయే బతుకులేమో సిన్నవాయె
మాయదారి రోగమొచ్చి – మా బతుకు మీద మన్నుబోసే
ఏమి బతుకు ఏమి బతుకు – చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డబతుకు’
అంటు కుమిలిపోతడు.


కరోనా వైరస్‍ వల్ల చెలరేగిన దుమారంలో గూడు చెదిరిన పక్షుల గోసను కండ్లకు కట్టినట్లు చూపిస్తడు. ‘ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో’ అని కడుపుల పేగుల్ని కదిలిస్తడు. ఇంత గొప్ప దేశంలో మా బతుకులకు ఇంత నీడలేకపాయే అని ఎద్దేవ చేస్తడు. పూటగడవని స్థితికి కారణం ఎవరని ప్రశ్నించకుండానే నిలదీస్తడు.


‘‘పేదరోగం కంటే పెద్ద రోగముందా
అయిన వాళ్ళకంటే పెద్ద అండ ఉందా
కష్టకాలం ఇంటికాడ ఉంటె సారూ
కలిసి మెలిసి కలో గంజో తాగేటోల్లం
పిలగాళ్లు కన్నులల్ల విడువకుండ మెదుల బట్టె
ఇంటిదాని దుఃఖమయో ఆగకుండా తరుమ బట్టె
ఏమిజేత్తు ఏమిజేత్తు ఏమిజేత్తు ఏమిజేత్తు’’
అంటూ బతుకుదెరువుకు కాలుకాలు గొట్టుకుంట కాని రాజ్యం వచ్చి కన్నతిప్పలు బడుతున్న దృశ్యాన్ని కండ్లకు గట్టిస్తడు. అయినా ‘పేదరోగం కంటే పెద్ద రోగ మేమున్నదని’ అందరిని ఆలోచింప జేస్తడు. అయినవాళ్ళు అండ ఎంతో ఆదెరువు నిస్తదని అంటడు. ఉన్నదో లేందో తిని ఇంటి పట్టున ఉంటే ఇయ్యాల ఈ బాధ ఉండక పోవునని సోకం బెడతడు. వలసకూలీలు రోడ్ల మీద వందల కిలో మీటర్లు నడిసిపోతుంటే చూసేటోల్ల కండ్లల్ల నెత్తురు కారుతుంది. దీనికి తోడు అడుగడుగునా అడ్డంకులు ఎదురై ఆయింత అడుగు ముందుకేయలేని దుస్థితిలో


‘‘బస్సులొద్దు బండ్లు వొద్దు అయ్యసారు
ఇడిసిపెడితే నడిసి నేను బోతసారు’’


అంటూ రవి గొంతులో జీవం పోసుకున్న ఈ పాట ఒక రకమైన జీరతో విన్నంతసేపు దుఃఖసాగరంలో ముంచెత్తుతుంది. దేశదేశాలను కదిలించిన ఈ పాట పొగిలిపొగిలి ఏడ్చేటట్టు జేస్తది. అశేష ప్రజాదరణ పొందిన ఈ పాటతో ఆదేశ్‍ రవి జీవితం, వ్యక్తిత్వం బయటికొచ్చింది. తెలుగు సినీరంగంలో నటుడిగా, దర్శకుడిగా స్థిరపడాలన్న తన ఆశయం నెరవేరాలని, మరిన్ని మంచి పాటలు రాయాలని ఆకాంక్షిద్దాం.


-అంబటి వేకువ, 94927 55448

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *