బాల్యంలోనే బ్యూటీ ఉంది.. దాన్నిపదిలంగా కాపాడాలి

‘కరీంనగర్ జిల్లా బడి పిల్లల కథలు’ ఆవిష్కరణ సభలో మణికొండ వేదకుమార్….

పిల్లలు పిల్లల్లాగే ఉండాలి. అందులోనే బ్యూటీ వుంది. ఆడుకోవాలి, పాడుకోవాలి, చదువుకోవాలి. మీ బాల్యాన్ని మీరు నష్టపోవద్దు. మీ బాల్యాన్ని పదిలంగా కాపాడటం పెద్దవాళ్ళంగా మా అందరి బాధ్యత అని చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ ఛైర్మన్‍, బాల చెలిమి సంపాదకులు వేదకుమార్‍ అన్నారు. మార్చి 5వ తేదీన కరీంనగర్‍లోని రాంనగర్‍ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కరీంనగర్‍ జిల్లా బడి పిల్లల కథలు ఆవిష్కరణ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన వేదకుమార్‍ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పిల్లలు పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతరేతర పుస్తకాలు, అనువాద గ్రంధాలు చదవాలని జీవితంలోని వివిధ కోణాలను, దాని విస్తృతిని, వివిధ ప్రాంతాల చరిత్ర, సంస్కృతిని అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక రీడింగ్‍ రూమ్‍ వుండాలని, దానికి ఒక ఇన్‍ ఛార్జి వుండాలన్నారు. అకాడమీ 33 జిల్లాలలో బాల చెలిమి గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తుందని, ఇప్పటికే భూదాన్‍ పోచంపల్లి – యదాద్రి జిల్లా, జల్లిపల్లి – ఖమ్మం జిల్లా, తడపాక – నిజామాబాద్‍ జిల్లాలలో బాల చెలిమి గ్రంథాలయాలు విజయవంతంగా నిర్వహించ బడుతున్నాయని అన్నారు. పిల్లలలోని సృజనాత్మక శక్తులను వెలుగులోకి తెచ్చే వివిధ కార్యక్రమాలలో భాగంగా ఉమ్మడి పదిజిల్లాల బడి పిల్లల కథల సంపుటాలను వెలువరించామని. ఇప్పుడు ఆవిష్కరించిన కరీంనగర్‍ జిల్లా బడి పిల్లల కథలు ఆ సిరీస్లోనిదేనని అన్నారు.


ఈ సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుప్పాల కృష్ణగోపాల్‍ అధ్యక్షత వహించి ఈ సభ ఇక్కడ తమ పాఠశాలలో జరగడం చాల సంతోషంగా ఉందని, ఈ ప్రేరణ వల్ల తమ పాఠశాల విద్యార్థులు తమలోని సృజనాత్మక, నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ పాఠశాల విద్యార్థులు పేదకుటుంబాలనుంచి వచ్చినవాళ్ళని, పుస్తకాలుకొని చదువుకునే అవకాశాలులేవని బాల చెలిమి గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే దానికి కావల్సిన రీడింగ్‍ రూమ్‍ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని వినతి పత్రాన్నియివ్వగా వేదకుమార్‍ ఆమోదాన్ని తెలియజేశారు.


ఈ సభలో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్‍ ప్రొఫెసర్‍ ఎస్‍. రఘు, కరీంనగర్‍ జిల్లా బడి పిల్లల కథలు కన్వీనర్లు కూకట్ల తిరుపతి, వాసరనేని పరశురాం, రాష్ట్ర కన్వీనర్‍ గరిపల్లి అశోక్‍, ప్రముఖ కవి బూర్ల వెంకటేశ్వర్లు, బాల సాహితీవేత్త బైతి దుర్గయ్య, ఈ పుస్తకానికి బొమ్మలు వేసిన ఆర్టిస్ట్ మర్రిపల్లి రమేష్‍ తదితరులు ప్రసంగించారు. ఈ సంకలనంలో బెంచి కథ రాసిన నవాబ్‍ పేట మండలం చిగురుమామిడి జెడ్పీ హైస్కూలు విద్యార్థిని పెండ్యాల ప్రత్యూష రెడ్డి తన తండ్రితోనూ, కేశవపట్నం టీఎస్‍ఎంఎస్‍ విద్యార్థులు ‘అపురూప కానుక’ రాసిన కె. జ్యోతి, ‘ప్రకృతి విద్య’ రాసిన పావురాల భావన, ‘కోతి విశ్వాసం’ రాసిన గుండవేణి శ్రీ లేఖ, ధర్మారం మండలం కొత్తూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ‘మంచి ఆలోచన’ రాసిన నెరువట్ల సౌమ్య, ‘అప్పగింత’ రాసిన నెరువట్ల నవ్య రాణి, సింగారం విద్యార్థులు ‘సీసా వక్కలు’ రాసిన వాసరనేని విజ్ఞశ్రీ, ‘మూఢనమ్మకాలు’ రాసిన వాసరనేని వివేక్‍ తదితర బాల రచయితలు తమతమ ఉపాధ్యాయులతో పాల్గొని సభావేదిక నుంచి కథల పుస్తకాలను స్వీకరించారు.


ఈ సభలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అన్నవరం రాజేశ్వరి, దామరకుంట శంకరయ్య, పద్మావతి, శోభా రాణి, కె. నర్సింహా రెడ్డి, గాయత్రి, కవిత, మెరుగు ప్రవీణ్‍, మర్రిపల్లి శ్రీనివాస్‍, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఆహుతులందరికీ ప్రశంసా పత్రాలు, పుస్తకాలు వేదకుమార్‍ గారి చేతుల మీదుగా అందించారు.


ఈ సభను చిన్నారులు సిహెచ్‍ రమ్య, డి. వినయ్‍ వ్యాఖ్యా తలుగా విజయవంతంగా నిర్వహించారు. రోజూ పాఠశాలలో ప్రార్థనా గీతం పాడే ఆరవ తరగతి విద్యార్థి శశివర్ధన్‍ అర్థవంతమైన వేమన పద్యాన్ని తాత్పర్య సహితంగా కరతాళధ్వనుల మధ్య పాడివినిపించడం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.


జుగాష్‍ విలి,
9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *