నయాపూల్ దాటాక ఎడమవైపున్న నాయబ్ హోటల్ పక్క సందులోకి మళ్లితే చత్తాబజార్ వస్తుంది. అక్కడి సిటి సివిల్ కోర్టు వెనక భాగాన ఉన్నదే పురానీ హవేలీ. ఐదవ కులీ కుతుబ్ షాకు (1580-1612) ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్ మోమిన్ అస్త్రాబాదీ నివాసమే ఈ హవేలీ. ఇది అవతలి వారికి కనబడకుండా ఉండటం కోసం దీని చుట్టూ ఒక మైలు దూరం వర్తులాకారంలో ఎత్తైన ప్రహారీ గోడను నిర్మించారు. రెండవ నిజాం మీర్ అలీ ఖాన్ తన కుమారుడు, మూడవ నిజాం అయిన సికిందర్ జా (1803-1829) కోసం ఈ హవేలీని ఖరీదు చేసాడు కాని, సికిందర్ జా అందులో కాక మోతీగల్లీలోని చౌమహల్లా ప్యాలెస్‍లో నివసించటం వలన ప్రజలు దీనిని ‘‘పురానీ హవేలీ’’ అని పిలువసాగారు. ఐదవ నిజాం అఫ్జలుద్దౌలా ఇందులోనే జన్మించాడు. ఆయన కుమారుడైన ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ పాషా (1866-1911) దీనిని అధికార నివాసంగా ఉపయోగించు కున్నాడు.
ఈ పురానీ హవేలీలో మొత్తం పదకొండు భవనాలు ఉన్నాయి. ఇందులోని ప్రధాన భవనం ‘‘బారాదరి’’ (పన్నెండు ద్వారాల భవనం). దీనిని ఆరవ నిజాం నిర్మించాడు. ఇండో యూరోపియన్ శిల్పకళకు ఈ భవనం ఒక ప్రతిబింబం. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం ఈ బారాదరిని మ్యూజియంగా మార్చారు. మిగిలిన భవనాలను 1971లో 8వ నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ ‘‘ప్రిన్స్ ముఖరంజా ఎడ్యుకేషనల్ ట్రస్టుకు’’ అప్పగించగా ప్రస్తుతం అక్కడ పలు విద్యా సంస్థలు నిర్వహింపబడుతున్నాయి. ఆరవ నిజాం జీవితమంతా ఈ పురానీ హవేలీతో ముడిపడి ఉంది. అందులోని ప్రతి రాయి, రప్పా ఆయన జీవితాన్ని కథలు కథలుగా చెప్పుతాయి. గాన పాఠక మహాశయుల్లారా కొన్ని కతలను ఆలకించండి.
1869లో మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి హఠాన్మరణం వలన మహబూబ్ అలీ పాషా ‘‘బాలరాజు’’గా సింహాసనాన్ని అధిష్టించాడు. దివాన్ సర్ సాలార్ జంగ్ గారు ఒక చేయి, బ్రిటిష్ రెసిడెంటుగారు మరొక చేయి పట్టుకుని తప్పటడుగులు వేస్తున్న ఆ బాలరాజును ‘‘మన్సద్’’వైపు నడిపించి దానిపై కూచో బెట్టారు. ఆ బాలుడు నామ్‍కే వాస్తే నవాబు కాని యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని నడిపించింది మాత్రం దివాన్‍గారే. ఆయన కొండంత అండదండలతో, చల్లని ఛత్రచ్చాయలలో ఆ బాలరాజు దిన దిన బలప్రవర్థమానుడై. తన పదిహేడవ ఏట సింహాసనాన్ని అధిష్టించాడు. సర్ సాలార్‍జంగ్ తర్వాత ఆరవ నిజాంగారికి మహారాజా కిషన్ పర్‍షాద్‍గారు దివాన్‍గా నియమితులైనారు.
ఒకసారి నవాబుగారు మారుమూల గ్రామాలలో పర్యటిస్తు న్నప్పుడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు కనిపించి తనకు ఏడుగురు కూతుర్లని, వారి పెళ్లిళ్లు చేయలేక పోతున్నానని, ఆర్థిక సహాయం చేయమని ప్రార్థించాడు. నవాబుగారు తన శేర్వానీ జేబులు తడుముకుని ఉన్నదంతా ఆ పేదకు దానం చేశాడు. అతను ఆ రూపాయలను లెక్కపెట్టాడు. అవి కనీసం రెండు వందలు కూడా లేవు. ‘‘ఇవి ఏ మూలకు కూడా సరిపోవు మహాప్రభూ’’ అని మళ్లీ మొరపెట్టుకున్నాడు. ‘‘నీ అదృష్టంలోఉన్నదంతే’’ అని నవాబుగారు విచారం వెలిబుచ్చారు. వెంటనే ఆబ్రాహ్మడు గడుసుగా ‘‘దేవరా నేను నా అదృష్టంలోఉన్నదేదో అడగలేదు. మీ అదృష్టంలోఉన్నదాంట్లో నుండి కొంత దానం చేయ మని అడిగాను’’ అన్నాడు. నవాబుగారు ఆ సమయస్ఫూర్తికి సంతసించి 14,000 రూపాయలు జారీ చేయమని తన వెంట ఉన్న అధికారులను ఆదేశించాడు.
ఆయన దాతృత్వం అలా ఉండేది. తను కేవలం మట్టిమనిషినన్న ఎరుక, జ్ఞానం మహబూబ్ అలీ పాషాకు స్పష్టంగా ఉండేది. అందుకే కాబోలు దారిలో వెళ్లుతున్నప్పుడు శవయాత్ర కనిపిస్తే చాలు తన వాహనం దిగి కాసేపు కొంచెం దూరం నడిచి తానెన్నడూ చూడని, కనీసం పేరు కూడా తెలియని ఆ అనామక శవపేటికను మోసేవాడు. అది మనిషి లక్షణం. ఆ మంచుపల్లకీని మోయటం అంటే, ఆ మనిషి ఆఖరియాత్రలో పాల్గొని నాలుగు అడుగులునడిచి, ఆఖరిసారిగా వీడ్కోలు చెప్పటం అంటే ఆ ఒక్క చనిపోయిన మనిషినే కాదు మొత్తం మానవత్వాన్నే గౌరవించటం. విశ్వమానవ సంస్కృతి అంటే అదే. సకల మానవులను ప్రేమించిన మహబూబ్ అతను.
హిందువులు, ముస్లింలు నాకు రెండు కండ్లు అన్న ఆ మహబూబ్ బ్రిటిష్ రెసిడెంటుకు రాసిన ఒక లేఖలో ఇలా అన్నాడు. ‘‘పుట్టుకతో నేను మహమ్మదీయుడను. సున్నీమతమునకు చెందిన వాడను. అయినను నేను రాజును గనుక ఏ మతమునకు చెందిన వాడను గాను. అన్ని మతములకు చెందిన వాడనై ఉన్నాను. రాజు అన్ని మతములకు మతరక్షకుడుగా, మత పోషకుడిగా ఉండాలి గనుక నేను అన్ని మతములకు సమానుడను. నారాజ్యమును నాలుగు సుబాలుగా విభజించి నలుగురు సుబేదారుల ద్వారా పరిపాలిస్తున్నాను. వారిలో ఇద్దరు హిందూ సుబేదారులు. నా ప్రజలలో నాకెవ్వడు ప్రియముగాని అప్రియముగాని కాదు. కావున మీరు కూడా ఎటువంటి పక్షపాతము, ద్వేషముగాని లేక ప్రజాహితముగా రాజ్యపాలనము చేసినచో మీకెవ్వరును ద్వేషులుండ జాలరు’’.
చివరి రోజులలో అనేక కారణాల వలన నవాబుగారి ఆరోగ్యం క్షీణించ సాగింది. కుటుంబంలో వారసత్వంపై చికాకులు ఎక్కువైనాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎడల ఆయన సుముఖతను గమనించిన మరోరాణి తన మూడు సంవత్సరాల కొడుకు సలాబత్ జాను వారసుడిగా ప్రకటించమని పొర సాగింది. మొఘల్ వంశ సంప్రదాయం ప్రకారం జ్యేష్టకుమారుడే సింహాసనానికి వారసుడు కావాలని ఆసఫ్‍జాహీ వంశంలో నిబంధన ఏమీ లేనందున నవాబుపై వత్తిడులు అధికమైనాయి. ఇంటిపోరు భరించలేక ఆయన అలిగి తన అధికార నివాసభవనం పురానీ హవేలీని వదిలి ఒంటరిగా ఫలక్‍నుమా ప్యాలెస్‍కు వెళ్లి బాధలతో అధికంగా త్రాగటం ప్రారంభించాడు. అప్పటికి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు.
నవాబుగారికి అప్పటికే కాలేయ వ్యాధి మురటం వలన హకీం పర్యవేక్షణలో వైద్యం జరుగుతుంది. పత్యం ఉంది కావున పడని పదార్థాలు తినరాదని, త్రాగరాదని హకీం కఠినంగా హెచ్చరించాడు. అందులో ముఖ్యం మద్యం. నవాబుగారు ఆ సలహాను పాటించక మానసిక వత్తిడుల నుండి దూరం కావటానికి ప్రతిరోజు మూడు సీసాల విస్కీని మంచి నీళ్లలా సేవించి తనను తాను విధ్వంసం చేసుకోసాగాడు.
పవిత్ర రంజాను మాసం మొదలై ఆ రోజు మూడవరోజు, మొహబూబ్‍గారి బ్రతుకు నావ సుదీర్ఘ ప్రయాణం తర్వాత నెమ్మది నెమ్మదిగా మునగసాగింది. డాక్టర్లు పెదవి విరిచారు. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో యువరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన అధికార నివాసం కింగ్‍కోఠీనుండి హడావుడిగా వచ్చి తండ్రి దగ్గర కూచున్నాడు. నవాబ్ మహబూబ్ అలీ పాషా తన కనురెప్పల్ని బలవంతంగా తెరిచి కొడుకు వైపు సూటిగా సుదీర్ఘంగా చూసాడు. ఆ కనుకొలుకులనుండి ఏ అవ్యక్త సందేశాన్ని ఏ ఆఖరి సందేశాల్ని అందించాడో ఎవరికి తెలుసు? ఆ తర్వాత ఆ కన్రెప్పలు శాశ్వతంగా మూతపడినాయి.
ఒక వైభవోజ్వల మహాయుగం అంతరించి కాలం తెర వెనకకు నిష్క్రమించింది. హైద్రాబాద్ రాజ్య ప్రజలు ఏనాటికీ మరిచిపోని మాణిక్య మహాప్రభువు మీర్ మహబూబ్ అలీ పాషా, ఈ భూమి మీద సంచరించే భగవంతుని నీడ శాశ్వతంగా మాయమయ్యింది. అనేక మందికి అనేక రూపాలలో తన బహుముఖ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి, ఒకరాజుగా, రాజనీతివేత్తగా, దైవభక్తి పరాయణుడిగా, కవిగా, మానవతా వాదిగా, మహాప్రేమికుడిగా, హిందూ ముస్లిం లిద్దరూ నారెండు కనులు అని చాటి మత సహనాన్ని పాటించిన మహా ప్రభువుగా, ఎముకలేని చెయ్యని కీర్తించబడిన అన్నదాతగా, దీనబంధు వుగా ఆయన తన ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. మనిషి మాయమైనా ఆ మంచితనం మాత్రం భూమ్మీద నిలిచిపోయింది.
తండ్రి పాదాలపైబడి బోరున విలిపిస్తున్న కొడుకు మీర్ ఉస్మాన్ అలీఖాన్‍ను పెద్దలు బలవంతంగా లేపి కింగ్‍కోఠీకి పంపించివేశారు.
మీర్ మహబూబ్ అలీ ‘‘పాషా’’ ఇక లేరన్న వార్త నగరం నలుమూలలా కార్చిచ్చులా వ్యాపించింది. ఎంతో మంది నవాబులు తమ ముఖాలను దస్తీలలో దాచుకుని వెక్కివెక్కి ఏడ్చారు. మూడు సంవత్సరాల క్రితమే (1908) నగరంలో వరదలు వచ్చినపుడు, నగరం పీనుగుల పెంట అయినపుడు భోరున కురుస్తున్న వర్షంలో నవాబుగారు చత్రీ క్రింద నడుస్తూ, తడుస్తూ తమలో ఒకడిగా తమ మధ్య తిరుగుతూ, తమకు ధైర్యం చెబుతూ, అన్నపానీయాల సరఫరాలకు అధికారులకు ఆదేశాలిస్తూ, బాధితులు తల దాచు కోటానికి తన పురానీ హవేలీ తలుపుల్ని బార్లాగా తెరిచిన తమ ప్రియతమ ‘‘పాషా’’ను జ్ఞాపకం చేసుకుంటూ సామాన్య ప్రజలు దుఃఖావేశంతో తమ తలలు బాదుకుని దుస్తులు చింపుకున్నారు. స్త్రీలు తమ గాజుల్ని గోడకేసి కొట్టుకుని పగులకొట్టుకున్నారు. రెండు చేతులతో తమ తలలు ఎదలు బాదుకుంటూ ‘‘ఇక ఈ భూమ్మీదికి ఇటువంటి మహాప్రభువు రాడని’’ సుదీర్ఘంగా శోకించారు.
దివంగత రాజుగారి మృత దేహాన్ని ఫలక్‍నుమా ప్యాలెస్ నుండి చౌమహల్లా ప్యాలెస్‍కు తీసుకువెళ్లే ఊరేగింపు ప్రారంభమైంది. ఆ శవపేటిక వాహనం జహానుమా, అలియాబాద్, లాల్‍దర్వాజా చౌరాస్తా, శాలిబండా, చార్మినార్, లాడ్ బజార్ వీధుల నుండి తరలిస్తుంటే ప్రజలు అలలు అలలుగా కదిలి వచ్చి తమ శ్రద్దాంజలిని ఘటిస్తూ ఆ వాహనం అంచుల్ని ముట్టుకుని, ముద్దుపెట్టుకుని భోరున విలపించారు. తను ప్రియతమ ప్రభువుని చివరిసారిగా కండ్లారా చూసుకున్నారు. ఆ వాహనం చార్మినార్ దగ్గరికి రాగానే నగరంలో జళప్రళయం వచ్చినప్పుడు రాజుగారు నీళ్లల్లో మోకాళ్లలోతుల్లోకి దిగి హారతి పళ్లెం పట్టుకుని వేద మంత్రాలతో ముచికుందా నది మాతను పూజచేసి నదీ, వరదనీరు ఎలా వెనుకకు తగ్గినదీ, జ్ఞాపకం వచ్చి హిందువులు వెక్కివెక్కి దుఃఖించారు. ఎందరో ముసలమ్మలు అయ్యోబిడ్డా అయ్యో కొడుకా అంటూ తమ స్వంత కొడుకు చనిపోయినట్లు ఏడ్చారు.
ఎంతో మంది ముస్లిం స్త్రీలు తాము బురఖాలు ధరించలేదన్న సంగతి మరిచి ‘‘యా అల్లా యా అల్లా’’ అంటూ పార్థీవ దేహాన్ని తీసుకెళ్లుతున్న వాహనంపై తమచేతి గాజుల్ని బద్దలుకొట్టుకుని పగిలిన ఆ ముక్కలను చెల్లాచెదురుగా గాలిలోకి విసిరేసారు. మగవారంతా తండ్రిని కోల్పోయిన కొడుకుల్లా విలపించారు.
శవపేటిక వాహనం చౌమహల్లాకు చేరుకుంది. ఆ పార్థీవదేహాన్ని దర్బారు హాలులో పెట్టారు. రాజుగారిని ఆఖరిసారిగా సర్వాంగ శోభితంగా జిలుగువెలుగు దుస్తులలో బంగారు నగలు, ముత్యాల హారాలతో అలంకరించారు. ఆ తర్వాత ఆఖ్రీ సలాములు ప్రారంభమైనాయి. ముందు కుటుంబ సభ్యులు, తర్వాత పాయగా నవాబులు, ఉమ్రా ఏ ఉజ్జిం ఉన్నత వంశాల వారు, వివిధ ఉన్నతాధి కారులు వారి సిబ్బంది నివాళులు అర్పించారు. ఆ తర్వాత అందర్నీ పంపించి ఆఖరి స్నానం చేయించే కార్యక్రమం అయ్యింది. అప్పుడు అక్కడ రాజుగారి కుటుంబ సభ్యులు, దివాన్‍గారు, పాయగా వంశపు వృద్దులు మాత్రము ఉన్నారు. సాంప్రదాయిక స్నానం దైవ ప్రార్థనలు ముగియగానే ఆ పార్థీవశరీరాన్ని పవిత్రమైన పట్టుబట్టలలో చుట్టారు.
శవయాత్ర రాజనివాసం ప్రధాన ద్వారం నుండి వెళ్లటం సాంప్రదాయకంగా నిషేధం కావున చౌమహల్లా వెనుక భాగాన మక్కామసీదు వైపున్న గోడను పగులగొట్టి దారిని ఏర్పరిచారు. అలా మహాభి నిష్క్రమణం మొదలయ్యింది. రాజ పరివారం తమ ప్రియతమ ప్రభువుని బుజాలపైకి ఎత్తుకుని అంతిమయాత్రగా బయలు దేరారు. మక్కామసీదుకు చేరుకున్నారు. భక్తి ప్రపత్తులతో సాయంకాలం ప్రార్థనలు పూర్తయినాయి.
మక్కామసీదు జనసమూహాలతో శోకసముద్రంలా మారిపోయింది. మసీదు ప్రాంగణం సరిపోక అటుఇటూ రెండు వైపుల ప్రధానరోడ్డుమీద కనుచూపుమేరా అశ్రుసిక్త జనవాహినులు.రాత్రి పదకొండు గంటలకు అంత్యక్రియలకు సంబం ధించిన నమాజులు పూర్తయినాయి. ఆ పవిత్ర మక్కామసీదు ఆవరణలోనే అనంతశయనంగా పెనువిశ్రాంతిలో ఉన్న తనపూర్వీకుల ఒడిలోకి, తన తాత తండ్రుల ఒడిలోకి ఆయన కూడా నెమ్మదిగా జారుకున్నారు. ఆసఫ్‍జా వంశానికి చెందిన ఆరవ నిజాం నవాబ్ సర్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహద్దూర్ ఫతేజంగ్ 1911లో చివరి మజిలీకి చేరుకున్నారు. అప్పటికి అతని వయస్సు 45 సంవత్సరాలు.
అల్లా అతనిని క్షమించుగాక! (షహర్ నామా (హైద్రాబాద్ వీధులు – గాథలు పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847