దళిత రైతుల దొంతర సేద్యం

  • తీరొక్క పంటలతో లాభసాటిగా వ్యవసాయం
  • భూమి ఎంతున్నా.. రకరకాల పంటల సాగు
  •  సీజన్లవారీగా కూరగాయలు.. పూలమొక్కల పెంపకం 
  • కోళ్లు.. మేకలు.. పాడి అదనం
  •  సమీకృత వ్యవసాయంతో సంతృప్తిగా అన్నదాతలు
  •  ఆదర్శ వ్యవసాయ గ్రామంగా కరీంనగర్‍ శివారు మల్లన్నపల్లి‘


ఒక్క పంటను నమ్ముకుంటే నట్టేట మునుగుతం.. కాలమెట్లయిన సరే.. మనం బతికే మందం పైసలుండాలె.. ఒక్కటే పంటేసి అది పోయిందని గత్తర కావొద్దు.. ఒకటిపోతే.. ఇంకోటి మన చెయ్యికి అందాలె. పండో, ఫలమో, కోళ్లో, పాలో అమ్మేటట్టుండాలి.’ ఎనకట ఊళ్లల్లో తాతలు.. అయ్యలు చెప్పిన మాటలివి.కరీంనగర్‍కు కూతవేటుదూరంలోని ఓ కుగ్రామం.. అక్కడి దళిత రైతులకు బతుకు బాధలేదు. ఎనకటి తాత, అయ్యలు చెప్పిన మాటలే వాళ్లకు సద్దెన్నం మూటలైనయి. ఉన్న భూమిలోనే తీరొక్క పంటలు.. ఒకటి పోతే ఇంకోటి.. అదీపోతే.. కూర గాయలు.. లేకుంటే.. కోళ్లు, మేకలు, ఒకటికాకుంటే మరొకటి.. బుగులుపడాల్సిన పనిలేదు.. ఏ దినానికి ఆ దినంమందం పైస లెల్లంగ.. నెలకు 15 వేలు మిగుల్తయి..


కరీంనగర్‍ జిల్లా కేంద్రానికి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలోని మల్లన్నపల్లి గ్రామం.. ఇక్కడ ఉన్న ది వంద దళిత కుటుంబాలు. అందరూ రైతులే.. ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత భూమి ఉన్నది. నిన్నమొన్నటి వరకు వీళ్లు అందరిలాగే వ్యవసాయం చేశారు. పత్తి లేదా మిర్చి వేసి కాలం కలిసిరాక ఆగమైనవాళ్లే.. ఇట్లాంటప్పుడే సమీకృత వ్యవసాయం వారికి అం డగా నిలిచింది. ఒక్కొక్కరి కష్టాలు క్రమంగా పోయినయి. ప్రతి ఒక్కరికీ నాలుగు కాసులు సంపాదించే స్థాయి రావడం ఈ గ్రామం సాధించిన విజయం. వ్యవసాయంలో రావాల్సిన మార్పు అనివార్యతను ఈ గ్రామం చాటిచెప్తున్నది. దశాబ్దాల తరబడి ఆగమైన జీవితాలనుంచి మంచి ఆదాయం పొందడానికి మల్లన్నపల్లి రైతులు తమ ఆలోచనా ధోరణినే మార్చారు. కాలం కలిసిరాక, వరుణుడు కరుణించక, పురుగుతోనో.. అకాల వర్షంతోనో ఒక పంటపోతే.. మరో పంట చేతికి వచ్చేలా ప్రణాళిక వేసుకొన్నారు.


ఈ పల్లెలో 15 మంది రైతులు ఒక్కొక్కరు 20కి పైగా మేకలను పెంచి వాటిని సమీకృత వ్యవసాయంలో భాగం చేసుకొన్నారు. ప్రతి ఇంటికీ రెండుకు తక్కువకాకుండా పాడి ఆవులున్నాయి. సీజన్‍లో 300 లీటర్లకు పైగా పాలు ఈ గ్రామరైతులు అమ్ముతారు. రోజుకు తొమ్మిదివేల రూపాయలవరకు పాల విక్రయంద్వారానే వస్తుంది. దీన్నుంచి ఒక్కోరైతు సగటున రూ.90 నుంచి రూ.100 వరకు పాడి ఆదాయం వస్తున్నది. ఇక నాటుకోళ్లకు ఈ పల్లె కేరాఫ్‍గా మారింది. పండుగలు.. పెండ్లిళ్ల సీజన్లలో వీటికుండే గిరాకీ అంతాఇంతాకాదు.


తీరొక్క పంటలతో వ్యవసాయం
గ్రామంలో వందమంది రైతులు 307 ఎకరాల్లో తీరొక్క పంటలను సాగుచేస్తారు. బావులపైనే వీరి సాగు. వంద ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. మరో 80 నుంచి వంద ఎకరాల్లో వరి పండిస్తారు. సుమారు వంద ఎకరాల్లో రకరకాల కాయగూరలు పండిస్తారు. అరెకరమున్న రైతు కూడా నాలుగైదు రకాల మార్గాల్లో జీవనోపాధి పొందుతున్నాడు. మామిడి తోటలో బీర, మక్కలో కంది వంటి అంతర్‍పంటలుంటాయి. బెండ, కాకర, వంకాయ, సొరకాయ, టమాటా, మిర్చి, పాలకూర, గంగవాయిలి కూర, కొత్తిమీర, పుదీన, గొంగూర, మెంతి వంటివి ఇక్కడ విరివిగా ఉంటాయి. చుట్టుపక్కల మార్కెట్లకు తీసుకెళ్లి వారే స్వయంగా అమ్ముతారు. దీనివల్ల రోజుకు ఒక్కో రైతు.. తక్కువలో తక్కువగా నాలుగు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఆదాయం పొందుతున్నారు. ఇక పెద్ద బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలొచ్చినప్పుడు పూల తోటలు పెడుతారు.


వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి తీసుకెళ్తారు. ఇటీవల కాలంలో రైతులే నేరుగా మార్కెట్‍కు వెళ్లి అమ్ముతున్నారు. ప్రతి ఇంటికీ కనీసం పది గుంటలకు తక్కువ కాకుండా పూల తోటలు పెడుతారు. కిలోకు రూ.50 నుంచి 200 వరకు విక్రయిస్తారు. ఒక్కో రైతు సీజన్‍లో అన్ని ఖర్చులు పోను రూ.30 వేలకు తక్కువ కాకుండా సంపాదిస్తున్నారు. మామిడితోటల రాబడి, ధాన్యం పంటలు వీటికి అదనం. ఖర్చులు పోనూ నికరంగా ఒక్కో కుటుంబం సుమారు రూ.15 వేలవరకు ఆదాయాన్ని పొందుతున్నారు. రైతుబంధు పథకం వీరికి అదనపు ఆదాయం.


నాబార్డ్ అండ
జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు.. అంబరిల్లా పోగ్రామ్‍ ఇన్‍ న్యాచురల్‍ రిసోర్స్ మేనేజిమెంట్‍ (యూపీఎన్నారెమ్‍) కింద సమీకృత వ్యవసాయ ఫలాలను ఈ పల్లె రైతులకు అందించింది. జిల్లా సహకార బ్యాంకు నుంచి రైతులకు రుణం లభిస్తున్నది. అధికార యంత్రాంగమూ రైతులకు సహకరిస్తున్నది. జిల్లాలోని కృషి విజ్ఞానకేంద్రం కూడా ఒక్కో కుటుంబానికి ఉచితంగా రూ4వేల విలువచేసే, కోళ్లను, కుట్టుమిషన్లను లేదా ఇతర వ్యవసాయఅధారిత పరికరాలను ఇవ్వడానికి ముందుకొచ్చింది.


మాదగ్గర అన్నీ దొరుకుతయి

నాకు 4 ఎకరాలుంది. రెండెకరాలల్ల పొలం జేసిన. ఎకరం మామిడితోట వెట్టిన. ఇంకో ఎకరంల కాయగూరలు పెట్టిన. ఐదు గుంటలంత టమాట, ఆరు గుంటలంత అల్చెంత, నాలుగు గుంటలంత వంకాయ, పది గుంటలంత బెండకాయ, గుంటంత కాకరకాయ, రెండు గంటలంత పెసరు, కొంత బీరకాయ, ఇంత మక్క పెట్టిన సారు. ఓటివోతే ఒకటి చేతికొత్తది. మార్కె ట్లో అమ్మితే నాలుగుపైసలత్తయ్‍. 15 నాటుకోళ్లు పెంచుతున్న. రెండు సూడి ఆవులున్నయ్‍. చిన్నంగ మెల్లంగ రెండుమూడు మ్యాకలున్నయ్‍. సద్దుల బతుకమ్మ, దీపావళి సమయంల పూలతోట పెడ్త. అన్ని వోంగా ఏడాదికో లచ్చన్నర నుంచి రెండు లచ్చలు మిగులుతున్నయ్‍. మా పల్లెంతా ఇంతే. ఒక్క ఎవుసం ఎవ్వరూ జెయ్యరు. మా తాన పాలు, కూరగాయలు, పండ్లు కోళ్లు, పూలు అన్ని దొరుకతయ్‍.    – దుర్గం మల్లయ్య, రైతు


గుంట భూమిలో 35వేలు అచ్చినయ్‍..
సారు నాకు ఏడెకరాల జాగ ఉన్నది. బాయి ఉన్నది. కొంత పొలం జేత్త. నిజంగా జూత్తే పొలం కన్నా కాయగూరల బ్యారమే మంచిగున్నది. ఎట్లంటే ఒక్క మాట జెప్పుత సారూ.. మొన్న గుంటలో కొత్మీర పోసిన. ముప్పైయిదు రోజులకు పీకిన. అమ్మితే ముప్పైవేలు వచ్చినయ్‍. గందుకే నేను ఆకుకూరలు ఎక్కువ వెడుత. గోంగూర, కొత్మీర, పాలకూర, గంగావయిలి కూర ఇత్తులు అలుకుత. నెల, నెలన్నర రోజుల్లోనే మనం పీకి అమ్మచ్చు. సద్దుల బతుకమ్మ, దీపావళి, దసరా పండుగులకు రెండు నెల్ల ముందుగానే పూల తోటలు పెడుత. ఇట్ల జెయ్యవట్టి అన్ని ఖర్సులు వోనూ నాకు ఏడాదికో రెండు లక్షలు మిగిలుతయ్‍. రెండెకారలంత మామిడితోట ఉన్నది. రెండెకరాలంత పొలం వేసిన. ఇతర పంటలే అన్నం పెడుతున్నయ్‍.     -భక్తు లక్ష్మయ్య, రైతు


కాయగూర చెట్లు వెట్టిన
నాకు నాలుగు ఎకరాలుండె. నా కొడుకులకు, బిడ్డలకు పంచంగా ఇరవై గుంటలు మిగిలింది. అందులోనే కాయగూర చెట్లు వెట్టిన. ఇండ్లనే కొన్ని మామిడి చెట్లున్నయ్‍. బబ్బెర, పెసర, అల్చెంత, నువ్వులు, జామచెట్టు, బీర, బెండ వెట్టిన. అట్లనే ఇన్ని నాటు కోళ్లున్నయ్‍. కాయగూరలను నేనే మార్కట్‍లో అమ్ముత. అన్ని ఖర్సులు వోనూ ఏడాదికి అరవై, డబ్బువేలు మిగులుతయ్‍.  -భక్తు రాజయ్య, రైతు


నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *