ప్రకృతి మానవ ధాష్టీకాన్ని భరించలేకపోతుంది : డాక్టర్‍ కలపాలా బాబురావు

విశ్రాంత సీనియర్‍ శాస్త్రవేత్త డాక్టర్‍ కలపాలా బాబురావుగారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

గ్రామీణ భారతదేశానికి సమాచార మార్పులతో వాతావరణ వ్యతిరేక మార్పులపై పోరాటం చేస్తున్న విశ్రాంత సీనియర్‍ శాస్త్రవేత్త డాక్టర్‍ కలపాలా బాబురావు ‘దక్కన్‍ న్యూస్‍ ఛానెల్‍’కు ఏప్రిల్‍ నెలలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.


ఇటువంటి విపత్కర స్థితికి కారణాలేమిటి?
ఇది ముందు నుంచి ఊహించిందే. ఇటువంటి ప్రమాదాలు వస్తాయని హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. 2009లో డబ్ల్యూహెచ్‍ఓ కూడా యిక ముందు విషమహమ్మారులు పాండమిక్స్ వచ్చే అవకాశాలున్నాయని, ప్రభుత్వాలు ఎలర్ట్గా వుండాలనీ చెప్పింది. తరువాత చాలా మంది సైన్సు పరిశోధకులు, రచయితలు కూడా హెచ్చరించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాలు గుర్తించలేదు. కాని ముందే స్పష్టంగా తెలుసు. ఎందుకంటే మనం ప్రకృతిని పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నాం. జీవులకు వాటి సహజ వాతావరణం లేకుండా, వాటి సహజ నెలవులు లేకుండా చేసి, వాటి ఆవాసాలను ఆక్రమించుకుంటూ పోతున్నాం. అడవులను విపరీతంగా నాశనం చేసాం. ఈ విపత్కర స్థితి ప్రకృతి వైపరీత్యం కాదు. ప్రకృతి విధ్వంసం వల్ల, సమతుల్యతను చెడగొట్టటం వల్ల వచ్చింది. ప్రకృతి విధ్వంసం కొనసాగినంత కాలం ఇవి వుంటాయి. ప్రకృతి మానవ ధాష్టీకాన్ని భరించ లేకపోతుంది.
ప్రజలు, ప్రభుత్వాలు ఈస్థితిని ఎలా తట్టుకుంటున్నాయి?
ఇంతకు ముందు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్పానిష్‍ ప్లూ అనే మహమ్మారి వచ్చింది. 5 కోట్ల మంది ప్రాణాలు పోయాయి. కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థను, రవాణా వ్యవస్థను నిలిపి వేయగలిగింది. రానున్న కాలానికి ప్రకృతి చేస్తున్న హెచ్చరిక యిది. మారకపోతే మానవ జాతికి భవిష్యత్తులేదు. అనేది ప్రకృతి మనకు చేస్తున్న సూచనగా, హెచ్చరికగా తీసుకోవాలి.
వైద్య, విద్యారంగాలలో ప్రపంచదేశాలు, ప్రభుత్వాలు అనుసరించవలసిన విధానమేమిటి? కృషి ఏమిటి?
వైద్య, విద్యారంగాలు ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండూ లాభాపేక్ష ఆర్థిక వ్యవస్థలుగా నడుస్తున్న సందర్భంలో మనమున్నాం. ఈ రెండూ ప్రజా రంగంగా నడపడం లేదు. విద్యను, వైద్యాన్ని వ్యాపార రంగంగా మార్చారు. లాభాలు సంపాదించే పెట్టే రంగాలుగా మార్చారు. విద్యారంగంలో జరిగే పరిశోధనలు సామాన్య ప్రజలకు మేలు చేసే విషయాలపై కాక మిలటరీ యుద్ధరంగానికి సంబంధించిన అంశాలపై జరుగుతున్నాయి. అత్యధిక పెట్టుబడులు ఈ రంగంలోనే పెడుతున్నారు. మీరు చూడండి అతి సంపన్నమైన అమెరికా ఈ కరోనా సందర్భంలో వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి, అవసరమైన పీపీఈ, ఫేస్‍ మాస్క్ల వంటి చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చలేక పోతుంది. ఎందువల్ల? మొత్తం వున్న సంపదను దేనికోసం ఖర్చు పెడుతున్నాం. గమనించండి. ప్రజా వైద్యానికీ, ప్రజా విద్యకూ మనం ఎలాంటి ప్రాముఖ్యత యివ్వడం లేదు. అందుకే కరోనా యింత ప్రమాదంగా మారింది. చిన్న చిన్న దేశాలు క్యూబా, వియత్నాం లాంటివి చాలా సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంటే యూరప్‍ అమెరికా వంటి సంపన్న దేశాలు ఎందుకు తట్టుకోలేక పోతున్నాయి. అందుకు అవి ఎంచుకున్న ప్రయారిటీస్‍ కారణం. ప్రయారిటీ, ప్రాముఖ్యత అన్నదే అసలు సమస్య. కరోనా కట్టడి ఒక్క వైద్యరంగానికి చెందింది కాదు. యిది విధానరంగానికి సంబంధించినది. వాతావరణ మార్పు (క్లైమేట్‍ ఛేంజ్‍) గురించి కూడా పట్టించుకోవాలి. ఈ రెంటికీ సంబంధించి పరిష్కారం కలిపి చూడాలి.
వైరస్‍ పరిణామం చెందుతూ కొత్త కొత్త రూపాల్లో వస్తున్నాయి. ప్రపంచ మేధావుల అంచనా ప్రకారం కోటికోటి కోటి కోట్ల వేల వైరస్‍లున్నాయి. ఏది ముందు వస్తుందో ఆలోచించి మందు తయారు చేయడం కుదరదు. వైరస్‍ ముందుకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే… ఇందాకే చెప్పినట్లు యిది కేవలం వైద్య, శాస్త్రరంగాలకు మాత్రమే చెందినది కాదు. ఇది విధానరంగ సమస్య కూడా. వాతావరణ మార్పు (క్లైమేట్‍ ఛేంజ్‍) అనే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఇలాంటి కొత్త కొత్త రోగాలు రావడమనేది సహజమని, వస్తూనే ఉంటాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. క్లైమేట్‍ మార్పును ఆపటానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికీ ఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. 25 సంవత్సరాలుగా అంతర్జాతీయ సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నీ మధ్య 2019 డిసెంబర్‍లో స్పెయిన్‍లో జరిగిన సదస్సులోనూ కార్బన్‍ ఉత్పాదకాలు తగ్గించే చర్యలపై ప్రపంచ దేశాలు ఒక అంగీకారానికి రాలేక పోయాయి. అలాంటి దేశాలు ఓవర్‍నైట్‍ 24 గంటల్లో రవాణా వ్యవస్థని పూర్తిగా స్థంభింపచేశారు. లాక్‍డౌన్‍ ప్రకటించారు. అన్ని చర్యలు తీసుకున్నారు. ఒక్క రోజుల్లో ఈ చర్య సాధ్యమైనప్పుడు ప్రపంచం ఇంతటి విపత్కర స్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రాలేదు. అసలు మన ఆలోచనా విధానంలోనే లోపాలున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
పర్యావరణాన్ని ప్రాణదాతగా చూడటంలేదు. ఇవాళ మనం బతికున్నామంటే మనం క్షణం క్షణం పీల్చే గాలిని, నీటిని అందించేది ప్రకృతే. అయితే దానిపట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాం ప్రకృతిని ఒక వ్యాపార వస్తువుగా చూస్తున్నాం. గాలి, నీరు, ప్రకృతి సకల మానవాళి, జీవరాశుల ఉమ్మడి సొత్తు. దానిపై ఏ ఒక్కరికీ అధికారం ఉండటానికి వీలులేదు. లాభం కోసం ప్రకృతిని నాశనం చేసే హక్కు లేదని తెలిసి కూడా ప్రభుత్వాలు వ్యాపారానికి అనుమతులు యిస్తున్నాయి.

కరోనా యింత ప్రమాదంగా మారిన సమయంలో కూడా ప్రభుత్వాలు తీసుకునే విధానాలు పర్యావరణానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అడవులు నాశనం చేయడానికి, గాలిని, నీటిని కాలుష్యం చేసే పరిశ్రమలకి అనుమతులు యిచ్చేసింది. మొన్నీ మధ్య అది కూడా వీడియో కాన్ఫరెన్సులు పెట్టి మరీ అనుమతులిచ్చింది. అడవుల రక్షణ, జీవరాసుల ప్రొటెక్షన్‍ యాక్ట్ను దృష్టిలోకి తీసుకోవడం లేదు. ఈ విధానాలు మానకపోతే పర్యావరణ పరిరక్షణ సాధ్యం కాదు. ప్రివెన్షెన్‍ చేయగలమే కాని నివారణలేదు.


వలస కార్మికుల దుస్థితికి కారణాలేమిటి? ప్రభుత్వాలు వాటిని ఎలా పరిష్కరించాలి?
మనకి రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో డిజాస్టర్‍ మేనేజ్‍మెంట్‍ సంస్థలు న్నాయి. ఇన్నేళ్ళ నుంచి యిలాంటి సంస్థలుండగా విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి సమాచారం ముఖ్యమో ఆ సమాచారం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది. మన దగ్గర లేదా? లాక్‍డౌన్‍ ప్రకటించడానికి ముందు మన దగ్గర వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు. ఎక్కడెక్కడ వున్నారు. వాళ్ళకేం చేయాలనే ఆలోచన ప్రభుత్వా లకి, అధికారులకి ఎందుకు రాలేదు. ఈ ప్రమాదం మార్చిలోనే తెలిసిందా. నిర్దిష్ట సమయంలో, నిర్దిస్ఠ చర్యలు తీసుకున్నారా? ఇవాళ కోట్లమంది వలస కార్మికులు 1500 వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తున్నారు. వాహనాలను యిచ్చి వాళ్ళను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రభుత్వాలకి వీలు పడకుండా ఉంది.
లాక్‍డౌన్‍ పిరియడ్‍లో కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
రేపటి ప్రపంచం నిన్నటి ప్రపంచంలా ఉండబోవడం లేదు. పెద్దమార్పులొస్తాయి. ప్రజల మధ్య సంబంధాలలో తేడాలొస్తాయి. విద్యగురించి, ఉపాధి గురించి, ఉద్యోగాల గురించి ఆలోచనల్లో తీవ్ర మార్పులొస్తాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలి పోతున్నాయి. తిరిగి వాటిని యధాస్థితికి తేవాలంటే మళ్ళీ ప్రకృతి విధ్వంసం వైపు వెళ్ళితే ఈ ప్రమాదాలు మరింత ఎక్కువ అవుతాయి. అప్పుడు అరికట్టడం సాధ్యం కూడా కాదు. నూతన విధానాలతోనూ, ప్రకృతికి ప్రియమైన, హాని కలిగించని విధానాలతోను మాత్రమే అందరూ స్వతంత్రులుగా, గౌరవంగా, డిగ్నిటీతో తమ బతుకుల్ని బతక గలుగుతారు.
టూరిజం పరిస్థితి ఎలా ఉండబోతుంది?
అసలు టూరిజం అవసరమా! కొంతమంది దగ్గర డిస్పోజల్‍ ఇన్‍కమ్‍ ఉండే సరికి ఏం చేయాలో తెలియక ప్రపంచం చుట్టి వద్దామని బయలు దేరుతున్నారు. ఎకోటూరిజం పేరుతో అడవుల్లోకి వెళ్లడం అక్కడ డిస్ట్రబ్‍ చేయడం. జంతువులు సహజంగా బతకడానికి వీల్లేకుండా చేయడం. కార్లు రావడం కోసం అడవులు నరికి రోడ్లు వేయడం. టూరిజం పెను ప్రమాదంగా, వ్యాపారంగా మారింది. ఇంతమంది యిన్ని విమానాల్లో, వాహనాల్లో తిరగాల్సిన అవసరం లేదు. ఇంత ఇంధనం ఖర్చు చేస్తున్నారు. టన్నుల కొద్దీ కార్బన్‍ డయాక్సైడ్‍కి కారణమవుతున్నారు. భారత దేశంలో సగటు కార్బన్‍ ఉత్పాదకాలు 1.8 టన్నులు సంవత్సరానికి. అందులో సామాన్య ప్రజలు 0.1 లేదా 0.2 టన్నులకు కారణం. సగటు ఎందుకింతైంది. పది మంది సంపన్నులు చేసి వీళ్ళమీదికి తోశారు కనుక 1.8 అయింది. సగటు భారతీయులు కార్బన్‍ ఉత్పాదనకి కారకులుకారు. కార్బన్‍ వల్ల క్లైమేట్‍లో మార్పు పెరిగిందంటే మళ్లీ మొట్టమొదటి బాధితులు ఈ పేదవాళ్ళే. ఎవరు సమస్యలకు కారణం కాదో వారే ప్రధమ బాధితులవుతున్నారు. ఇక్కడ ఎన్విరాన్‍మెంటల్‍ ఇన్‍ జస్టిస్‍ జరుగుతుంది. టూరిజాన్ని తొలగించాలి.


రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థ ఎలా ఉండోబోతుంది?
రవాణా వ్యవస్థ అంటే ఇవాళ రోడ్డు రవాణా వ్యవస్థకే ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల కూడా పెద్ద నష్టాలే ఉన్నాయి. అడవుల మధ్య నుంచి రోడ్లు వేయడం, నదులమీద రకరకాల వంతెనలు కట్టడం, పెబ్‍డాస్‍ను డిస్ట్రబ్‍ చేయడం జరుగుతుంది. ఈ రోడ్లన్నీ ఎవరికోసం. దేనికోసం? వేలవేల కార్లు ప్రయాణించడానికి. ఈ కార్లు యిచ్చే కాలుష్యం ఎంత? ఉదాహరణకి ఢిల్లీని పరిశీలిస్తే అక్కడి కాలుష్యానికి రవాణ వ్యవస్థ ప్రధాన కారణాల్లో ఒకటి. రోడ్లమీద ప్రయాణించే వారిలో పాదచారులే ఎక్కువ. వారి సౌకర్యాల కోసం ఏం చేస్తున్నాం. వాళ్ళకి నడిచే హక్కులేదా! వాళ్ళూ ట్యాక్స్ కడుతున్న పౌరులే. హైదరాబాద్‍ తీసుకుందాం. ఎన్ని ప్లై ఓవర్లు కట్టినా, ఏమేమి కట్టినా యివన్నీ కార్లలో ప్రయాణించే వారికోసమే. సామాన్యులకోసం మున్సిపాలిటీలు, ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి.
రైల్వే వ్యవస్థలో వచ్చే మార్పులు ఏమిటి?
రైల్వే వ్యవస్థ ఒక్కటే కాదు. అన్ని వ్యవస్థలలోనూ తేడాలొస్తాయి. కరోనా ఉన్నంత వరకు రైల్వే వ్యవస్థలోకి వెళ్ళడం ప్రమాదమే. రైలు, బస్సుల వంటి ఇండోర్లలో వున్న పదిమందిలో రోగలక్షణాలు కనిపించని వ్యక్తి ఎవరైనా వుంటే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. కరోనాని పూర్తిగా కట్టడి చేసామని నిర్ధారణ అయ్యేవరకు రైలు, బస్‍ ప్రయాణాలు ప్రమాదమే.
విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
మనదేశంలో అందరికీ విద్య అందించేందుకు కుదరడంలేదు. ఎలిమెంటరీ విద్యకు కూడా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులున్నాయి. ఈ ప్రపంచాన్ని ఎలా, జీవిత సమస్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి. ఎలా పరిష్కరించు కోవాలనే అవగాహన మన విద్య యివ్వడం లేదు. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా, పారిశ్రామిక దేశమైనా అందరికీ ఉద్యోగాలు యివ్వలేదు. అమెరికాలోను నిరుద్యోగ సమస్య ఉంది. విద్య గురించి సమూలంగా పునరాలోచించు కోవాల్సిన సమయం వచ్చింది. చదువు అసలెందుకు? చదువు ఏ మేరకు కావాలి. చదివి ఏం చేయాలి. ఉద్యోగ కల్పన కోసమే విద్య అంటే జరగదు. ప్రకృతి వనరులన్నీ క్షీణించి పోయాయి. సైన్స్ ఏం చెబుతుందంటే ఇండస్ట్రియల్‍ సివిలైజేషన్‍కి ముగింపు సమయం వచ్చిందని. మార్పుల కనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి.
ఈ కరోనా పరిస్థితులలో ప్రైవేట్‍, ప్రభుత్వ తరగతి గదుల్లో చదువుకునే స్థితిలో మార్పులెలా ఉంటాయి?
ప్రాక్టికల్‍గా సాధ్యం కాదు. ఎందుకంటే గదుల సైజెంత? వెంటిలేషన్‍ సౌకర్యం ఎంత ఉంది. ఎంత మందిని సామాజిక దూరం పాటించి కూర్చోబెట్ట గలుగుతారు. అంతమంది ఇన్‍డోర్‍లో ఉన్నప్పుడు అంతమంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నప్పుడు ఒకవేళ ఆ రూమ్‍లో కరోనా బాధితులు వుంటే స్ప్రెడ్‍ అవకుండా ఆపడం సాధ్యంకాదు. అపార్ట్మెంట్లలో, కమర్షియల్‍ కాంప్లెక్స్లో, ఇరుకిరుకు గదుల్లో క్లాసులు జరుగుతున్నాయి. కనీసం మూత్రశాలలు కూడా ఉండవు. వీటిని పర్యవేక్షించే వ్యవస్థలున్నాయా? ఇది అందరూ కూర్చొని ఆలోచించాలి. ప్రజలందరినీ ఇన్‍వాల్వ్ చేసి విద్యావిధానం గురించి గ్రాస్‍ రూట్స్కి వెళ్ళి ఆలోచించాలి.


మున్ముందు మానవ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?
మానవ సంబంధాలంటే ప్రజల మధ్య ఎప్పుడు ద్వేషం ఉండదు. ఒకరిపట్ల ఒకరికి ద్వేషం ఉండాల్సిన అవసరమేముంది. అవి రాజకీయాల్నించి పెంపొందే ద్వేషాలు మాత్రమే. అత్యధిక ప్రజలు కార్మికులు, కూలీలు ఇవాళ ఎలా గడుస్తుందనే ఆలోచన తప్ప ద్వేషమూ, కక్షలు ఉండవు. వాళ్ళ జీవితాల్లో మెరుగులు పెంచు కోవడానికి అడుగులు వేసే అవకాశం వచ్చింది.
ప్రపంచ ఆర్థికరంగం, మనదేశ ఆర్థిక రంగం ఎలా ఉండబోతున్నాయి?
భారతదేశ ఆర్థిక రంగం ప్రపంచ ఆర్థికరంగంతో విడివిడిలేదు. ఈ ప్రమాదం యింత తీవ్రంగా విస్తరించడానికి ప్రపంచీకరణ కారణం. 24 గంటలూ ప్రపంచంలో ఏమూల నుంచైనా ఏమూలకైనా ప్రయాణం చేసే అవకాశాల వల్ల యిది వచ్చింది. వైరస్‍ మనిషిని వాడుకొని ఒకచోట నుంచి మరో చోటుకి విస్తరించింది. లేకపోతే వైరస్‍కి ఆశక్తి ఎక్కడిది. మనం వాహకంగా పని చేసాం. ప్రపంచంలో 250 దేశాలకి విస్తరించ డానికి మనమే కారణం. చైనాలో లాక్‍డౌన్‍ పెట్టిన్నాడే విమానయానాలను ప్రపంచమంతా కట్టడి చేసినట్లయితే, ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళను పరీక్ష చేయడం ఆనాడే మొదలు పెట్టినట్లయితే ప్రమాదం ఈ స్థాయికి వచ్చేది కాదు. జాతీయ స్థాయిలో సరిగ్గా వ్యాప్తిని ఆపలేదు. క్లైమేట్‍ ఛేంజ్‍కి, కరోనాకి సంబంధం ఉంది. ఈ రెండింటిని సమన్వయం పరచి చర్యలు తీసుకోవాలి.
ఫెడరల్‍ వ్యవస్థ ఎలా ఉండబోతుంది?
ఇక్కడ ఫెడరల్‍ వ్యవస్థ ఉందా. నిజమైన ప్రజా స్వామ్యం ఉందా మన దగ్గర. ఈ సమస్యలు ఉండనే ఉన్నాయి. కానీ యిప్పుడున్న సామాజిక వ్యవస్థలు సమస్యల్ని పరిష్కరించలేవు. ఇప్పుడు సామాజిక వ్యవస్థలు మారాలి.    (సచిన్‍, మల్లేష్‍ – దక్కన్‍ ఛానల్‍ ఇంటర్వ్యూ ఆధారంగా)


జుగాష్‍ విలి, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *